ఆకార్ పటేల్
అవలోకనం
సల్మాన్‌కు శిక్ష పట్ల బాలీవుడ్ తటస్థంగా లేదా అంటీముట్టనట్లుగా ఉంటుందని మనం భావించకూడదు. లేదా సల్మాన్, సంజయ్‌దత్ వంటి స్టార్ల పట్ల వారు చెబుతున్నదాన్ని మనం సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ హీరోలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే అత్యంత శక్తిమంతులు. ఈ స్టార్ల ప్రాపకం ఉన్నంత వరకే నటీనటులు, ఇతరుల సంబంధాలు ఉనికిలో ఉంటాయి. ఇది మొఘల్ చక్రవర్తి తన సేవకులపై దయతల్చడం లాంటిదే.
నాలాగే సంవత్సరాల తరబడి ముంబై శివారులోని బాంద్రాలో జీవిస్తున్న పలువురికి సల్మాన్‌ఖాన్ పలుకుబడితో బాగానే పరిచయముంది. బాలీవుడ్‌కి చెందిన సుప్రసిద్ధ ఖాన్ త్రయం బాంద్రాలోనే నివసిస్తున్నారు కాని వీరిలో సల్మాన్‌ఖాన్ విభిన్నమైన వ్యక్తి. షారుక్‌ఖాన్ బంగ్లా మన్నాట్ చాలా పెద్దది. ప్రధాన రహదారి మీదే అతడి బంగ్లా గేట్ కనిపిస్తుంది. ఆతడి అభిమానులు సాధారణంగా ఆ ఇంటి గేటు ముందే తచ్చాడుతుంటారు. ఆమిర్‌ఖాన్ ఇంటి ముందు చాలా తక్కువ మందే కనిపిస్తుంటారు. ఎందుకంటే అతను ఇతరుల కంటే మరీ గోప్యత పాటించేవాడు మరి. అదే సల్మాన్ విషయానికి వస్తే ఆయన ఇంటికి ఎదురుగా సెలవురోజుల్లో కానీ, పండుగ దినాల్లో కానీ లేదా పనిదినాల్లో కానీ ఎల్లప్పుడూ పెద్ద గుంపు కనిపిస్తూంటుంది. నిజమైన అర్థంలో అతడు స్టార్ పవర్ కలిగినవాడే.
నా ఈ పరిశీలనను బాంద్రా పోస్టాఫీసు కూడా బలపరుస్తుంది. సల్మాన్ ఖాన్‌కు వచ్చే ఉత్తరాలు తక్కిన ఇద్దరు ఖాన్‌లతో పోలిస్తే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేవని గతంలో నేను పనిచేసిన దినపత్రిక నివేదించింది. నాకు గుర్తున్నంతవరకు షారుఖ్‌ఖాన్, ఆమిర్‌ఖాన్ ఇద్దరికీ వచ్చే ఉత్తరాలు, కానుకల కంటే కనీసం నాలుగైదు రెట్లు ఎక్కువగా సల్మాన్‌ఖాన్‌కే వచ్చేవి.
ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడడానికి కారణమైన ఆ ప్రమాదం జరగడానికి సంవత్సరం ముందు ఐశ్వర్యారాయ్ తండ్రి మా పత్రిక కార్యాలయానికి వచ్చారు. ఐశ్వర్య గురించి ఆయన అప్పట్లో ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లని పించింది. సల్మాన్‌తో సంబంధం కంటే ఆమెతో అతడి ప్రవర్తన ఆ ముసలాయనను ఎక్కువగా భయపెట్టింది. సల్మాన్ అర్థరాత్రి వారి ఇంటికి వచ్చేవాడు. తలుపు తెరవకపోతే దాన్ని బద్దలు కొట్టడానికి కూడా సిద్ధపడేవాడని ఆయన చెప్పాడు. తమ ఇద్దరి మధ్య వ్యవహారం నుంచి బయటపడాలని ఐశ్వర్యారాయ్, ఆమెను వదిలేయడానికి సల్మాన్ సుతరామూ ఇష్టపడని కాలమది.
షారుఖ్‌ఖాన్, ఐశ్వర్యారాయ్‌లతో అజీజ్ మీర్జా నిర్మిస్తున్న చిత్రం సెట్స్‌పై ఉన్నప్పుడు, ఒకరోజు సల్మాన్ రోడ్డుమీది కొచ్చి, షూటింగ్ జరగకుండా అడ్డుకున్నాడు. షారుఖ్‌ను ఇది తీవ్రంగా చికాకుపర్చింది. తర్వాత ఇద్దరిమధ్యా మరింత విరోధం ఏర్పడింది. అదే సమయంలో ముంబై సమీపంలో ఉన్న సల్మాన్‌ఖాన్ ఫాంహౌస్‌లో వన్యప్రాణులను చట్టవిరుద్ధంగా నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి. సల్మాన్‌ను దోషిగా తేల్చిన కృష్ణ జింక వేట ఘటనకు కొద్ది సంవత్సరాలకు ముందే ఇది జరిగింది. అంటే చాలా కాలం నుంచి సల్మాన్ వివాదాలు సృష్టిస్తున్నాడనీ, తనకు కౌన్సిలింగ్ ఇవ్వక తప్పదన్న విషయం సుస్పష్టమే. నిజానికి బాలీవుడ్‌లో పలువురు వ్యక్తులు సల్మాన్‌ను ప్రోత్సహిస్తూ, మద్దతిస్తూ వచ్చారు. ఇప్పుడు తనకు హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పడ్డాక, గాయకుడు అభిజిత్ వంటి ఇన్‌సైడర్లు రోడ్ల మీద నిద్రించినందుకు బాధితులనే తప్పుపట్టారు. కాబట్టే వారు చావును కొనితెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఆ ఘటనలో వారేమీ రోడ్డుపై నిద్రించలేదు.
ఎలాంటి ఘటన జరిగినా సరే సల్మాన్‌ఖాన్‌కు మద్దతివ్వడాన్ని ఇలాంటి వారు కొనసాగిస్తూనే ఉంటారు. ప్రపంచంలోని మూడు అత్యంత విజయ వంతమైన చిత్రపరిశ్రమల్లో బాలీవుడ్ ఒకటి. తక్కినవి హాంకాంగ్, హాలీవుడ్. వీటన్నిటిలోనూ స్టార్ సిస్టమ్ ఉంది. కానీ బాలీవుడ్ ఈ విషయంలో చాలా చిన్నది. ఇక్కడ నలుగురు లేక అయిదుగురు హీరోలు మాత్రమే ఓపెనింగ్ వసూళ్లకు గ్యారంటీ ఇచ్చే స్థాయిలో ఉంటున్నారు. ఓపెనింగ్ వసూళ్లంటే చిత్రం విడుదలైన తొలి కొద్ది రోజుల్లోనే అది సాధించగలిగిన డబ్బు. ఈ ఓపెనింగ్ రోజులే ఏ సినిమానయినా హిట్ లేదా ఫట్ చేయగలవు.
ఈ హీరోలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే అత్యంత శక్తివంతులు. కానీ ఆ శక్తిని వారు తమ ప్రతిభ ద్వారానే సాధించుకున్నారనే చెప్పాలి. అమితాబ్ బచ్చన్ తన కుమారుడిని ఏ స్థాయిలో ప్రోత్సహించినప్పటికీ, ఖాన్‌లు సాధిస్తున్న విజయాల బాటలోకి అతడిని మలచలేకపోయారు. ఎందుకంటే సల్మాన్, షారుఖ్, ఆమిర్ మాదిరి జనం అభిషేక్‌ను ఆమోదించకపోవడమే కారణం. అయితే ఇక్కడ మరొక అంతర్గత విషయం ఉంది. బాలీవుడ్‌లో దర్శకులు, గాయకులు, మేకప్ వృత్తినిపుణులు వంటివారు ఎంత ప్రతిభావంతులైనా సరే, ఈ ముగ్గురు హీరోల్లో ఎవరో ఒకరితో ముడివేసుకున్నవారే లేదా ఇతరులతో చిన్న చిన్న సినిమాలతో సరిపెట్టుకునేవారే.
దీనికి కొన్ని మినహాయింపులున్నాయి. ఉదాహరణకు గుల్జార్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి వారు. కాని వీరిదేమంత పెద్ద సంఖ్య కాదు. ఈ కథానాయకుల కక్ష్యలో ఉన్న చాలామంది వ్యక్తుల సంబంధబాంధవ్యాలు పరాన్న స్వభావంతో ఉంటాయి. వారి ప్రాపకం ఉన్నంత వరకే ఈ సంబంధాలు ఉనికిలో ఉంటాయి. ఇది మొఘల్ చక్రవర్తి దయతల్చడం లాంటిదే. అయితే అలాంటి ప్రాపకం పొందినవారు పరిపూర్ణమైన, బేషరతు విశ్వాసం ప్రదర్శిం చాలనుకోండి.
తనతో ఎవరు పనిచేయాలో హీరోనే నిర్ణయిస్తాడు. హాలీవుడ్‌లా కాకుండా ఇక్కడ మరెన్నో విషయాలు ప్రభావితం చేస్తుంటాయి కూడా. ఉదాహరణకు సల్మాన్ కుటుంబం కూడా అతడి ప్రాజెక్టుల్లోకి నిత్యం చొరబడుతుంటుంది. ఎందుకంటే స్టార్ ఇక్కడ సినిమాకు ముఖ్యమైనవాడే కాదు. అతడే ఒక మూవీ మరి.
దశాబ్దం క్రితం హిందూస్తాన్ టైమ్స్ పత్రికను ముంబైలో ప్రారంభించిన ప్పుడు, దాని తొలి ప్రధాన కథనం సల్మాన్‌కి సంబంధించిందే. తనకున్న అండర్ వరల్డ్ సంబంధాలతో ఆమె అంతు చూస్తానంటూ సల్మాన్.. ఐశ్వర్యారాయ్‌ను బెదిరిస్తున్న టెలిఫోన్ సంభాషణలే ఆ కథనం. ఈ టెలిఫోన్ సంభాషణపై పోలీసులు రికార్డు చేసిన రాతప్రతే ఆ కథనానికి మూలం.
సల్మాన్ ఫోన్‌ను చట్టవిరుద్ధంగా ట్రాప్ చేసిన పోలీసులు తర్వాత ఆ రికార్డింగుల నుంచి దూరం జరిగారు కానీ, ఆ కథనం మాత్రం నిజమైనదేనంటూ పత్రిక క్రైమ్ రిపోర్టర్ జె.డే (తర్వాత కాల్పుల్లో చనిపోయాడు) కూర్చి పంపారు. సల్మాన్ చేసిన ఆ సంభాషణలోనే ప్రీతి జింటా గురించి అతడు చేసిన అసభ్య వ్యాఖ్యలను కూడా మా పత్రిక అప్పట్లో మళ్లీ ప్రచురించింది. విచిత్రమేమిటంటే, ఆ వ్యాఖ్యలు చేసిన సల్మాన్‌పై కాకుండా వాటిని ప్రచురించిన పత్రికపై ఆమె కేసు పెట్టింది. నిజానికి ఈ వారం తనను కోర్టు దోషిగా ప్రకటించాక, సల్మాన్‌కు తన మద్దతును తెలుపడం కోసం ఆమె బెంగళూరులో తన ఐపీఎల్ క్రికెట్ జట్టు ఆడుతున్న మ్యాచ్‌కు కూడా డుమ్మా కొట్టేసింది. దీంట్లో ఆశ్చర్యపడాల్సిన విషయమేదీ నాకు కనిపించలేదు.
సల్మాన్ పట్ల బాలీవుడ్ తటస్థంగా లేదా అంటీముట్టనట్లుగా ఉంటుందని మనం భావించకూడదు. లేదా సల్మాన్, సంజయ్‌దత్ వంటి స్టార్ల పట్ల వారు చెబుతున్నదాన్ని మనం సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం కూడా లేదు.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత, aakar.patel@icloud.com)