ఆకార్ పటేల్
అవలోకనం
మన దేశంలో ఏ ప్రచురణ సంస్థ అయినాగానీ, కోట్లాది మంది మనోభావాలను గాయపరుస్తుందని తెలిసి తెలిసీ అలాంటి కార్టూన్‌ను ప్రచురిస్తుందని ఊహించడం కష్టం. సాహసిక సంపాదకులెవరైనా అందుకు మొగ్గినా అది కొని తెచ్చిపెట్టే సమస్యలకు జంకుతారు. హింస, బెదిరింపులు మాత్రమే కాదు చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి.
నాకు గుర్తున్నంత వర కు ఒకప్పటి నా బాస్ ఎమ్‌జే అక్బర్‌కు పత్రికా రచనకు సంబంధించి భగవదాజ్ఞలాంటి ఒకే ఒక్క నియమం ఉం డేది. అది నా మాటల్లో చెప్పాలంటే, నీకు ఇష్ట మొచ్చింది ఏదైనా, ఏ విషయంపైన అయినా రాయి. కానీ మతాన్ని మాత్రం ఎన్నడూ పరిహసించవద్దు. ఆయన అలా చెప్పింది పత్రికలు మతం పట్ల గౌరవం చూపాలనో లేక మతాన్ని అపహాస్యం చేయడం వల్ల సాధార ణంగా మన దేశంలో వచ్చి పడే సమస్యల నుండి తప్పించుకోవాలనో నాకు తెలియదు. బహుశా ఆయనకు ఆ రెండు ఉద్దేశాలూ ఉండి ఉండవచ్చు.
ఫ్రెంచి వార పత్రిక ‘చార్లీ హెబ్డో’పై జరిగిన దాడి గురించి ‘బిజినెస్ డైలీ’లో టీఎన్ నైనన్ ఇలా రాశారు: చాలా సమాజాలు, ప్రత్యేకించి పాశ్చాత్య సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగమైన సమాజాలు ఇతరులను నొప్పించే హక్కుతో సహా వాక్ స్వాతంత్య్రంపై ఎలాంటి పరిమితులనూ అంగీకరిం చవు లేదా అతి తక్కువగా మాత్రమే అంగీకరి స్తాయి. ఫ్రెంచి విప్లవ కాలంనాటి మానవ హక్కుల ప్రకటనలోని వాక్ స్వాతంత్య్రాన్ని అవి మానవుని అత్యంత విలువైన హక్కుగా భావిస్తాయి.
అయితే సకల మతాల సమానత్వం (సర్వ ధర్మ సమభావ్) అనే విశాల సంప్రదాయం గల మన దేశంలో ఏ ప్రచురణ సంస్థ అయినాగానీ, కోట్లాది మంది మనోభావాలను గాయపరుస్తుందని తెలిసి తెలిసీ అలాంటి కార్టూన్‌ను (మొహమ్మద్ ప్రవక్తపైన) ప్రచురిస్తుందని ఊహించడం కష్టమని కూడా నైనన్ అన్నారు. అవును, సాహసిక సంపాదకులెవరైనా అందుకు మొగ్గినా అది కొని తెచ్చిపెట్టే సమస్యలకు జంకుతారు. హింస, బెదిరిం పులు మాత్రమే కాదు, చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి.
వాక్ స్వాతంత్య్రం విషయంలో సమస్యలను ఎదుర్కొన్న అనుభవం మన దేశానికి ఉంది. జవహర్‌లాల్ నెహ్రూ అంతటి గొప్పవాడే ఈ ప్రాథమిక హక్కుతో ఎలా వ్యవహరించాలనే విషయంలో సందిగ్ధంతో ఉండేవారు. 1950 జనవరి 26న రాజ్యాంగంలోని 19 (1)(ఎ) పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రానికి హామీని ఇచ్చింది. పదిహేను నెలల తర్వాత, నెహ్రూ ఆ హామీ నుండి వెనక్కు తగ్గి, ఆంక్షలను విధించారు. దేశంలో వాక్ స్వాతం త్య్రాన్ని పరిమితం చేసే అరడజను చట్టాలున్నాయి. వాటిలో పలు చట్టాలు వింతగా ఉంటాయి. అయితే అలాంటి పరిమితుల విషయంలో మనదే అత్యంత సున్నితమైన వైఖరి అని, వాక్ స్వాతంత్య్రం ప్రాథ మిక హక్కేగానీ, నిరపేక్షమైనది కాదు అని నీనన్ తన వ్యాసంలో అన్నారు. ప్రజా భద్రత, సభ్యత, నైతికతల కారణంగా దాన్ని రాజ్యాంగం పరిమితం చేసింది. అయితే ఇవన్నీ వ్యాకోచత్వం కలిగిన భావనలు. మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బ తీసే రాతలపై సైతం నిషేధం ఉంది. అది సూత్రానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఏవి మిత్ర దేశాలు, ఏవి కావు అనే విషయంలో ఆమోదం పొందిన జాబితా లేదనే సమస్యా ఉంది.
మత హింసలను రెచ్చగొట్టడం, వైషమ్యాలను పెంపొందింపజేయడం, ఒక మతాన్ని అవమానించ డం, మత భావనలను గాయపరచడం వంటి అంశాలకు ప్రత్యేక చట్టాలున్నాయి. అవీ కొత్తవేమీ కాదు.
వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలను విధించే మన చట్టాలు 1837లో రూపొందించినవి. 33 ఏళ్ల వయస్సులోనే థామస్ మెకాలే భారత శిక్షాస్మృతిని తయారుచేయడం ప్రారంభించాడు. 175 ఏళ్లుగా అది ఇంచుమించుగా అలాగే ఉంది. మనం ఆధుని కత అలంకారాలతో బతుకుతున్నా, మన సంస్కృతి ఎంతగా మార్పు లేకుండా నిలిచి పోయిందో ఇది తెలియజేస్తోంది. ఆనాటి శిక్షా స్మృతి, వలసవాద చట్టాలు స్వతంత్ర భారతంలో కూడా అమలవు తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లిషువాళ్లు మనల్ని కచ్చితంగా అంచనా కట్టారు. మన ప్రవర్తనను, బాహ్య ప్రేరణలకు మన ప్రతిస్పం దనను సరిగ్గా ఊహించి ముందుగా చెప్పగలిగారు. అది మెకాలేను చాలా గొప్పవాడిని చేసింది. 1984లో, 1993లో, 2002లో మనలో ఎందరు పాశవికంగా మారుతారో ఆత్మవిశ్వాసంతో 1837 లోనే ఆయన చెప్పగలిగాడు. రాజ్యాంగం ఎన్నో గొప్ప, విశ్వజనీన వాగ్దానాలను చేసింది. అయితే మత హింస అనే మన దేశ వాస్తవికతకు అది లొంగిపోయింది.
వాక్ స్వాతంత్య్రంపై చర్చలో ముందు వరు సన నిలిచే పాత్రికేయులు ఈ సమస్యకు ఉన్న మంచి, చెడు అనే రెండు పార్శ్వాలను చూడటం తేలికేం కాదు. చార్లీ హెబ్డో యూదు వ్యతిరేకత కార ణంగా తమ పాత్రికేయుల్లో ఏ ఒక్కరిని తొలగిం చడం నేను ఎరుగను. ఇస్లాంపై దాడి చేయడంలో ఆ పత్రిక చూపే ఉత్సాహాన్ని చూసి, అలాంటి ఉదం తం జరిగిందని తెలిసి ఆశ్చర్యపోయాను.
‘సినె’ కలం పేరుతో పని చేసే సైన్ మారిస్ సినె (80) అనే పాత్రికేయుడు 2009 జూలైలో చార్లీ హెబ్డో అనే ఆ వ్యంగ్య పత్రికలో రాసిన ఒక కాల మ్‌కు గానూ యూదు వ్యతిరేక విద్వేషాన్ని రెచ్చ గొట్టిన ఆరోపణలను ఎదుర్కొంటున్నట్టు ‘డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక అప్పట్లోనే తెలిపింది. ఆ రచన పారిస్ మేధావి వర్గంలో అత్యంత ఆగ్రహావేశ భరిత మైన చర్చను రగిల్చింది. సినెను ఆ పత్రిక నుండి తొలగించడంతో అది ముగిసింది.
ఆ వివాదాస్పద కాలమ్‌లో సినె 22 ఏళ్ల సర్కో జీకి, ఒక ఎలక్ట్రానిక్స్ గూడ్స్ చెయిన్ వారసురాలు, యూదు జాతీయురాలు అయిన జెస్సీకా సెబావన్ దోర్తీతో నిశ్చితార్థం వార్త ఆధారంగా... నాటి అధ్య క్షుని కుమారుడు యూదు మతంలోకి మారడానికి రంగం సిద్ధం చేసుకున్నాడనే నిరాధారమైన పుకారు పుట్టింది. దానిపై సినె వ్యాఖ్యానిస్తూ, ఆ పిల్లాడు భవిష్యత్తులో బాగా పైకి వస్తాడంటూ పరిహాసోక్తిని విసిరాడు.
యూదులకు, సామాజికంగా విజయవంతం కావడానికి ముడిపెట్టి ఆ కాలమ్ పక్షపాత వైఖరిని ప్రదర్శించిందంటూ అత్యున్నతస్థాయి రాజకీయ వ్యాఖ్యాత ఒకరు ఘాటుగా దుయ్యబట్టాడు. చార్లీ హెబ్డో సంపాదకుడు ఫిలిప్పె వాల్ క్షమాపణ చెప్పా లని సినెను కోరాడు. కానీ అతగాడు తిరస్కరించి, అంతకంటే తన మర్మావయాలను కత్తిరించుకుం టానని కేకలేశాడు.
సినెను తొలిగించాలన్న వాల్ నిర్ణయాన్ని తత్వవేత్త బెర్నార్డ్ హెన్రీ లెవీ సహా సుప్రసిద్ధ మేధావులంతా సమర్థించారు. కొందరు వామపక్ష వ్యక్తి స్వేచ్ఛావాదులు మాత్రమే వాక్ స్వాతంత్య్రం పౌరుల హక్కు అంటూ సినెను సమర్థించారు. వారిదీ కపటత్వమే కావచ్చు. అయితే మనం దరిలాగే చార్లీ హెబ్డోకు కూడా వాక్ స్వతంత్రంపై సందేహాలున్నాయి.
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
Aakar.patel@icloud.com