Avalokanam
-
దేశాన్ని ప్రేమించడానికి 10 పద్ధతులు
అవలోకనం దేశాన్ని ప్రేమించడమంటే దేశ ప్రజల పట్ల సహానుభూతిని ప్రదర్శించడమే. నిర్లక్ష్యానికిగురైన, బలహీనుల బాధను మీరు అనుభవించగలగాలి. దళితులు గాయపడితే మీకు బాధ కలగాలి. ఆదివాసులు అవమానానికి గురైతే మీకు అవమానమనిపించాలి. దేశంలో తరచుగా జరుగుతున్నట్టు ముస్లింలపై హింసాకాండ జరిగితే అందుకు మీరు సిగ్గుపడాలి. ఇంతటి విశాల ప్రజానీకంపై ఏకత్వాన్ని రుద్దడం మొత్తంగా ఈ దేశాన్ని ప్రేమించడం కాదు. భాష, మతం లేదా మరి దేనికి చెందినదైనా ఆ ఏకత్వం నా దష్టిలో దేశాన్ని ప్రేమించడం కాదు. 1) మొదటిది మౌలికంగా మీరు భారతీయులై ఉండటం. అంటే మీకు భారత పాస్ పోర్ట్ ఉండటం అని నా భావన. నాకు సంబంధించి నాకు మూడు పాస్పోర్ట్ట్లున్నాయి. భారతీయులు ముందస్తుగానే వీసాలు పొంది ఉండటం చాలా దేశాల్లో అవసరం. నేనేమో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాను. కాబట్టి దీర్ఘకాలిక చెల్లుబాటున్న వీసాల కోసం కాలం చెల్లిన రెండు పాస్‌పోర్టులను కూడా నేను వెంట పట్టుకుపోవాల్సి వస్తుంది. నిజానికి నేను విదేశాల్లో పని చేసింది తక్కువే. అయితే పనిచేయగలిగినంత కాలమూ విదేశాల్లోనే గడిపేసినా భారత పాస్‌పోర్టు లను తమతోనే ఉంచుకున్న కొందరు భారతీయులను నేను ఎరుగుదును. సంగీత దర్శకుడు జుబిన్ మెహతా అలాంటి వారిలో ఒకరు. లండన్‌లోని ఆమ్నెస్టీ ఇంట ర్నేషనల్ సెక్రటరీ జనరల్ సలీల్ శెట్టీ మరొకరు. మెహతా చాలా ఏళ్లపాటూ న్యూయార్క్ ఫిల్హార్మోనిక్కు నేతత్వం వహించారు. ఆ బందంలో ఆయన ఒక్కరే వీసా కోసం క్యూలో నిలబడాల్సివచ్చేది. అయినా ఆయన భారత పాస్ పోర్ట్‌ను ఉంచుకోవాలనే కోరుకున్నారు. 2) ఇక రెండవది, భారతీయులను ప్రేమించడం ద్వారా దేశాన్ని ప్రేమించగల గడం. భారతీయులందరినీ, మీ మతానికి చెందినవారినే కాదు, ఇతర మతస్తు లను, ఇతర కులస్తులను, ఇతర భాషల వారినందరినీ అని నా అర్థం. మీతో అంగీకరించేవారిని, విభేదించేవారినీ, ఎలాంటి మాంసాన్నయినాగానీ తినేవారిని, తినని వారినీ అందరినీ ప్రేమించడం. భారతీయులందరినీ ప్రేమించడమే నిజంగా భారతదేశాన్ని ప్రేమించడం. 3) దేశాన్ని ప్రేమించడానికి ఉన్న మూడో పద్ధతి, సాధ్యమైనన్ని దేశ భాషలను నేర్చుకోవడం. భారతీయులంతా తప్పనిసరిగా దేవనాగరి, పర్షియన్ అరబిక్ లిపులు రెండిటిలోనూ హిందుస్థానీ భాషను నేర్చుకోవాలని గాంధీ చెప్పారు. నేనలా చేశానుగానీ, అందరూ హిందుస్థానీ నేర్చుకోవాలంటే అంగీకరించను. 4) భారతదేశాన్ని ప్రేమించడానికి ఉన్న నాలుగో మార్గం శాస్త్రీయ సంగీతాన్ని, కవిత్వాన్ని అర్థం చేసుకోవడం. ఎక్కువగా ఇది పెద్దయ్యాక చేసే పని. ఎందుకంటే హిందుస్థానీ సంగీతం పరిణతి చెందినది. అది ఒలికించేది ఆనందాన్ని కాదు విషాదాన్ని. ఖాయ, కర్ణాటక సంగీతాలను అర్థంచేసుకోకుండా, గాయకులు కళ్లు మూసుకుని వాటిని అలాగే ఎందుకు నిర్వహిస్తారో అర్థం చేసుకోకుండా ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలను నిజంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. షెల్లీ ఓజీమండీయస్లాగే నాకు పలు పద్యాలు కంఠస్తా వచ్చు. నరేష్ మెహతా (గాంధీకి ఇష్టమైన వైష్ణవ జన్ గీత రచయిత) రాసిన నాగ్ దమన్‌ను చదివిన లేదా విన్న ప్రతిసారీ అది నన్ను బాగా కదిలించేస్తుంది. అది, బాల కష్ణుడు కాళీయు డనే సర్పాన్ని వధించకుండా, దానితో పోరాడటం గురించినది. ఆ పద్యాన్ని విన్నప్పుడు, ప్రత్యేకించి దానికి మంద్ర సంగీతాన్ని జోడించి వినిపిస్తే తరచుగా కన్నీరు పెట్టేంతగా చలించిపోతుంటానని చెప్పుకోడానికి నేనేమీ సిగ్గు పడను. 5) ఇక దేశాన్ని ప్రేమించడానికి ఉన్న ఐదో పద్ధతి దేశీయ ఆహారాన్ని ప్రేమించ డమే. అలా అని ఇతరుల ఆహారాన్ని మనం ద్వేషించి తీరాలని అర్థం కాదు. ఈ విషయంలో నాది విశాల దష్టి. కొన్నేళ్ల క్రితం నేను వియత్నాం వెళ్లాను. హనా య్‌లో ఒకే రోజున పాము, కుక్క మాంసాలను తిన్నాను. జపాన్ వంటకాలంటే నాకు మహా మక్కువ. అయినా భారతీయ భోజనాన్నే కోరుకుంటాను. అన్నిటికీ మించి రైతు పాటిదార్ల మందపాటి జొన్న రొట్టెతోపాటూ ఓ కాయగూర, వెల్లుల్లి పచ్చడి అంటే నాకు మహా ఇష్టం. మ«ధ్యాహ్న భోజనంగా ఎక్కువగా అదే తీసుకుంటాను. ఇక జీవితాంతం ప్రతి రోజూ అదే తినమన్నా తినగలను. 6) ఇక దేశ రాజ్యాంగాన్ని చదవడం, తెలుసుకోవడం మీరు మీ దేశాన్ని ప్రేమిం చగల ఆరో మార్గం. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగాలలో ఒకటి. దాన్ని అర్థం చేసుకోవడమంటే దాని తొలి మాటలను, అవతారికను, దాని ప్రాధాన్యాన్ని, అది వాగ్దానం చేసిన ప్రాథమిక హక్కులకు నిజమైన అర్థం ఏమిటి అని తెలుసుకోవడమనే. మనలో చాలామంది దాన్ని వంట బట్టించుకోవాలి. 7) దేశా నికి సేవలందించిన వారిని గౌరవించడం ఏడో మార్గం. క్రీడాకారుల కంటే ఉపా ధ్యాయులే ఎక్కువ ప్రాముఖ్యత గలవారని నా అభిప్రాయం. క్రీడాపరమైన విజయం జాతీయవాదాన్ని పెంపొందింపజేస్తుంది గానీ, అది ఉత్త డొల్ల. 8) భారత్‌ను ప్రేమించడానికి ఉన్న ఎనిమిదో మార్గం, నేను కట్టాల్సి ఉన్న పన్నులను చెల్లించడమే. దీంట్లో గర్వపడాల్సిందేమీలేదు, చేయాల్సినది చేస్తున్నా నంతే. కానీ మనలో చాలామంది ఆదాయపు పన్ను చెల్లించరు. వారిలో చాలా మంది పేదలో లేక మినహాయింపు పొందినవారో కాబట్టి చెల్లించాల్సిన అవసరం లేనివారు. నేను వారి గురించి చెప్పడం లేదు. పన్నుల చెల్లింపులో మోసాలకు పాల్పడే ఉన్నత, మధ్య తరగతులకు చెందిన వారిని.. మీరు దేశాన్ని ప్రేమిస్తు న్నారా? అని ప్రశ్నిస్తున్నాను. మీరు అవును అంటారు. నేను కాదు అంటాను. 9) దేశాన్ని ప్రేమించడానికి ఉన్న తొమ్మిదోమార్గం దేశ ప్రజల పట్ల సహాను భూతిని ప్రదర్శించడమే. నిర్లక్ష్యానికి గురైన, బలహీనుల బాధను మీరు అనుభ వించగలగాలి. దళితులు గాయపడితే మీకు బాధ కలగాలి. ఆదివాసులు అవ మానానికి గురైతే మీకు అవమానమనిపించాలి. దేశంలో తరచుగా జరుగుతు న్నట్టూ ముస్లింలపై హింసాకాండ జరిగితే అందుకు మీరు సిగ్గుపడాలి. దేశాన్ని ప్రేమించ డమనే భావన, ఈ సహానుభూతి ఒక్కటే. 10) ఇక దేశాన్ని ప్రేమించడానికి ఉన్న చివరి మార్గం.. దేశంలో ఉన్న వైరుధ్యాలు, విభేదాల పట్ల విశాల దష్టితో ఉండటం. ఇంతటి విశాల ప్రజానీకంపై ఏకత్వాన్ని రుద్దడం అంటే మొత్తంగా ఈ దేశాన్ని ప్రేమించడం కాదు. ఆ ఏకత్వం భాష, మతం లేదా ప్రత్యేక శిక్షాస్మతికి చెందినదైనా, ఆహారపరమైన, సంగీతపరమైన ప్రాధాన్యానికి సంబంధించినదైనా నా దష్టిలో దేశాన్ని ప్రేమించడం కాదు. నా అభిప్రాయాలతో మీరు విభేదించవచ్చు, అయిష్టపడవచ్చు, నన్ను ద్వేషిం చవచ్చు కూడా. అయినా నేను మిమ్మల్ని ఎప్పటిలాగే ప్రేమిస్తాను. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఆ వి‘చిత్రసీమ’లో అతడే ఒక మూవీ
అవలోకనం సల్మాన్‌కు శిక్ష పట్ల బాలీవుడ్ తటస్థంగా లేదా అంటీముట్టనట్లుగా ఉంటుందని మనం భావించకూడదు. లేదా సల్మాన్, సంజయ్‌దత్ వంటి స్టార్ల పట్ల వారు చెబుతున్నదాన్ని మనం సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ హీరోలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే అత్యంత శక్తిమంతులు. ఈ స్టార్ల ప్రాపకం ఉన్నంత వరకే నటీనటులు, ఇతరుల సంబంధాలు ఉనికిలో ఉంటాయి. ఇది మొఘల్ చక్రవర్తి తన సేవకులపై దయతల్చడం లాంటిదే. నాలాగే సంవత్సరాల తరబడి ముంబై శివారులోని బాంద్రాలో జీవిస్తున్న పలువురికి సల్మాన్‌ఖాన్ పలుకుబడితో బాగానే పరిచయముంది. బాలీవుడ్‌కి చెందిన సుప్రసిద్ధ ఖాన్ త్రయం బాంద్రాలోనే నివసిస్తున్నారు కాని వీరిలో సల్మాన్‌ఖాన్ విభిన్నమైన వ్యక్తి. షారుక్‌ఖాన్ బంగ్లా మన్నాట్ చాలా పెద్దది. ప్రధాన రహదారి మీదే అతడి బంగ్లా గేట్ కనిపిస్తుంది. ఆతడి అభిమానులు సాధారణంగా ఆ ఇంటి గేటు ముందే తచ్చాడుతుంటారు. ఆమిర్‌ఖాన్ ఇంటి ముందు చాలా తక్కువ మందే కనిపిస్తుంటారు. ఎందుకంటే అతను ఇతరుల కంటే మరీ గోప్యత పాటించేవాడు మరి. అదే సల్మాన్ విషయానికి వస్తే ఆయన ఇంటికి ఎదురుగా సెలవురోజుల్లో కానీ, పండుగ దినాల్లో కానీ లేదా పనిదినాల్లో కానీ ఎల్లప్పుడూ పెద్ద గుంపు కనిపిస్తూంటుంది. నిజమైన అర్థంలో అతడు స్టార్ పవర్ కలిగినవాడే. నా ఈ పరిశీలనను బాంద్రా పోస్టాఫీసు కూడా బలపరుస్తుంది. సల్మాన్ ఖాన్‌కు వచ్చే ఉత్తరాలు తక్కిన ఇద్దరు ఖాన్‌లతో పోలిస్తే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేవని గతంలో నేను పనిచేసిన దినపత్రిక నివేదించింది. నాకు గుర్తున్నంతవరకు షారుఖ్‌ఖాన్, ఆమిర్‌ఖాన్ ఇద్దరికీ వచ్చే ఉత్తరాలు, కానుకల కంటే కనీసం నాలుగైదు రెట్లు ఎక్కువగా సల్మాన్ఖాన్కే వచ్చేవి. ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడడానికి కారణమైన ఆ ప్రమాదం జరగడానికి సంవత్సరం ముందు ఐశ్వర్యారాయ్ తండ్రి మా పత్రిక కార్యాలయానికి వచ్చారు. ఐశ్వర్య గురించి ఆయన అప్పట్లో ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లని పించింది. సల్మాన్‌తో సంబంధం కంటే ఆమెతో అతడి ప్రవర్తన ఆ ముసలాయనను ఎక్కువగా భయపెట్టింది. సల్మాన్ అర్థరాత్రి వారి ఇంటికి వచ్చేవాడు. తలుపు తెరవకపోతే దాన్ని బద్దలు కొట్టడానికి కూడా సిద్ధపడేవాడని ఆయన చెప్పాడు. తమ ఇద్దరి మధ్య వ్యవహారం నుంచి బయటపడాలని ఐశ్వర్యారాయ్, ఆమెను వదిలేయడానికి సల్మాన్ సుతరామూ ఇష్టపడని కాలమది. షారుఖ్‌ఖాన్, ఐశ్వర్యారాయ్‌లతో అజీజ్ మీర్జా నిర్మిస్తున్న చిత్రం సెట్స్‌పై ఉన్నప్పుడు, ఒకరోజు సల్మాన్ రోడ్డుమీది కొచ్చి, షూటింగ్ జరగకుండా అడ్డుకున్నాడు. షారుఖ్‌ను ఇది తీవ్రంగా చికాకుపర్చింది. తర్వాత ఇద్దరిమధ్యా మరింత విరోధం ఏర్పడింది. అదే సమయంలో ముంబై సమీపంలో ఉన్న సల్మాన్‌ఖాన్ ఫాంహౌస్‌లో వన్యప్రాణులను చట్టవిరుద్ధంగా నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి. సల్మాన్‌ను దోషిగా తేల్చిన కృష్ణ జింక వేట ఘటనకు కొద్ది సంవత్సరాలకు ముందే ఇది జరిగింది. అంటే చాలా కాలం నుంచి సల్మాన్ వివాదాలు సృష్టిస్తున్నాడనీ, తనకు కౌన్సిలింగ్ ఇవ్వక తప్పదన్న విషయం సుస్పష్టమే. నిజానికి బాలీవుడ్లో పలువురు వ్యక్తులు సల్మాన్‌ను ప్రోత్సహిస్తూ, మద్దతిస్తూ వచ్చారు. ఇప్పుడు తనకు హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పడ్డాక, గాయకుడు అభిజిత్ వంటి ఇన్సైడర్లు రోడ్ల మీద నిద్రించినందుకు బాధితులనే తప్పుపట్టారు. కాబట్టే వారు చావును కొనితెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఆ ఘటనలో వారేమీ రోడ్డుపై నిద్రించలేదు. ఎలాంటి ఘటన జరిగినా సరే సల్మాన్‌ఖాన్‌కు మద్దతివ్వడాన్ని ఇలాంటి వారు కొనసాగిస్తూనే ఉంటారు. ప్రపంచంలోని మూడు అత్యంత విజయ వంతమైన చిత్రపరిశ్రమల్లో బాలీవుడ్ ఒకటి. తక్కినవి హాంకాంగ్, హాలీవుడ్. వీటన్నిటిలోనూ స్టార్ సిస్టమ్ ఉంది. కానీ బాలీవుడ్ ఈ విషయంలో చాలా చిన్నది. ఇక్కడ నలుగురు లేక అయిదుగురు హీరోలు మాత్రమే ఓపెనింగ్ వసూళ్లకు గ్యారంటీ ఇచ్చే స్థాయిలో ఉంటున్నారు. ఓపెనింగ్ వసూళ్లంటే చిత్రం విడుదలైన తొలి కొద్ది రోజుల్లోనే అది సాధించగలిగిన డబ్బు. ఈ ఓపెనింగ్ రోజులే ఏ సినిమానయినా హిట్ లేదా ఫట్ చేయగలవు. ఈ హీరోలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే అత్యంత శక్తివంతులు. కానీ ఆ శక్తిని వారు తమ ప్రతిభ ద్వారానే సాధించుకున్నారనే చెప్పాలి. అమితాబ్ బచ్చన్ తన కుమారుడిని ఏ స్థాయిలో ప్రోత్సహించినప్పటికీ, ఖాన్లు సాధిస్తున్న విజయాల బాటలోకి అతడిని మలచలేకపోయారు. ఎందుకంటే సల్మాన్, షారుఖ్, ఆమిర్ మాదిరి జనం అభిషేక్‌ను ఆమోదించకపోవడమే కారణం. అయితే ఇక్కడ మరొక అంతర్గత విషయం ఉంది. బాలీవుడ్లో దర్శకులు, గాయకులు, మేకప్ వృత్తినిపుణులు వంటివారు ఎంత ప్రతిభావంతులైనా సరే, ఈ ముగ్గురు హీరోల్లో ఎవరో ఒకరితో ముడివేసుకున్నవారే లేదా ఇతరులతో చిన్న చిన్న సినిమాలతో సరిపెట్టుకునేవారే. దీనికి కొన్ని మినహాయింపులున్నాయి. ఉదాహరణకు గుల్జార్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి వారు. కాని వీరిదేమంత పెద్ద సంఖ్య కాదు. ఈ కథానాయకుల కక్ష్యలో ఉన్న చాలామంది వ్యక్తుల సంబంధబాంధవ్యాలు పరాన్న స్వభావంతో ఉంటాయి. వారి ప్రాపకం ఉన్నంత వరకే ఈ సంబంధాలు ఉనికిలో ఉంటాయి. ఇది మొఘల్ చక్రవర్తి దయతల్చడం లాంటిదే. అయితే అలాంటి ప్రాపకం పొందినవారు పరిపూర్ణమైన, బేషరతు విశ్వాసం ప్రదర్శిం చాలనుకోండి. తనతో ఎవరు పనిచేయాలో హీరోనే నిర్ణయిస్తాడు. హాలీవుడ్‌లా కాకుండా ఇక్కడ మరెన్నో విషయాలు ప్రభావితం చేస్తుంటాయి కూడా. ఉదాహరణకు సల్మాన్ కుటుంబం కూడా అతడి ప్రాజెక్టుల్లోకి నిత్యం చొరబడుతుంటుంది. ఎందుకంటే స్టార్ ఇక్కడ సినిమాకు ముఖ్యమైనవాడే కాదు. అతడే ఒక మూవీ మరి. దశాబ్దం క్రితం హిందూస్తాన్ టైమ్స్ పత్రికను ముంబైలో ప్రారంభించిన ప్పుడు, దాని తొలి ప్రధాన కథనం సల్మాన్‌కి సంబంధించిందే. తనకున్న అండర్ వరల్డ్ సంబంధాలతో ఆమె అంతు చూస్తానంటూ సల్మాన్.. ఐశ్వర్యారాయ్‌ను బెదిరిస్తున్న టెలిఫోన్ సంభాషణలే ఆ కథనం. ఈ టెలిఫోన్ సంభాషణపై పోలీసులు రికార్డు చేసిన రాతప్రతే ఆ కథనానికి మూలం. సల్మాన్ ఫోన్‌ను చట్టవిరుద్ధంగా ట్రాప్ చేసిన పోలీసులు తర్వాత ఆ రికార్డింగుల నుంచి దూరం జరిగారు కానీ, ఆ కథనం మాత్రం నిజమైనదేనంటూ పత్రిక క్రైమ్ రిపోర్టర్ జె.డే (తర్వాత కాల్పుల్లో చనిపోయాడు) కూర్చి పంపారు. సల్మాన్ చేసిన ఆ సంభాషణలోనే ప్రీతి జింటా గురించి అతడు చేసిన అసభ్య వ్యాఖ్యలను కూడా మా పత్రిక అప్పట్లో మళ్లీ ప్రచురించింది. విచిత్రమేమిటంటే, ఆ వ్యాఖ్యలు చేసిన సల్మాన్‌పై కాకుండా వాటిని ప్రచురించిన పత్రికపై ఆమె కేసు పెట్టింది. నిజానికి ఈ వారం తనను కోర్టు దోషిగా ప్రకటించాక, సల్మాన్‌కు తన మద్దతును తెలుపడం కోసం ఆమె బెంగళూరులో తన ఐపీఎల్ క్రికెట్ జట్టు ఆడుతున్న మ్యాచ్‌కు కూడా డుమ్మా కొట్టేసింది. దీంట్లో ఆశ్చర్యపడాల్సిన విషయమేదీ నాకు కనిపించలేదు. సల్మాన్ పట్ల బాలీవుడ్ తటస్థంగా లేదా అంటీముట్టనట్లుగా ఉంటుందని మనం భావించకూడదు. లేదా సల్మాన్, సంజయ్‌దత్ వంటి స్టార్ల పట్ల వారు చెబుతున్నదాన్ని మనం సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం కూడా లేదు. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత, aakar.patel@icloud.com) -
ఆ ఆర్థిక అద్భుతం ఇక్కడ అసాధ్యం!
అవలోకనం చరిత్రలో అతి కొద్ది దేశాలు మాత్రమే సింగపూర్ తరహా శరవేగ పురోగతిని సాధించగలిగాయి. కానీ లీ కాన్ యూ వంటి ఒక దృఢమైన నేతకు అధికారం అప్పగించడం అనేది భారత్ వంటి దేశాల స్థితిని మార్చలేదు. కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన సింగపూర్ నిర్మాత లీ కాన్ యూను అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ ప్రశంసిస్తూ ఆర్థిక రంగంలో ఆయన సాధించిన విజయాన్ని ఎత్తిచూపారు. ‘‘1965లో స్వాతంత్య్రం పొందినప్పుడు 500 డాలర్ల మేరకు ఉన్న సింగపూర్ జనాభా వార్షిక తలసరి ఆదాయాన్ని లీ ఆయన సహచరులు నేటికి 55,000 డాలర్లకు పెంచారు. ఒక తరం గడిచేసరికి సింగపూర్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా, ఆగ్నేయాసియాలో అతి ప్రధానమైన మేధో మహానగరంగా, ఆ ప్రాంతంలోనే అతి పెద్ద ఆసుపత్రుల నిలయంగా, అంతర్జాతీయ వ్యవ హారాలపై నిత్యం సదస్సులు జరిపేందుకు అత్యంత అనుకూల ప్రాంతంగా మారిపోయింది.’’ ఏ రకంగా చూసినా ఇది అసాధారణ విజ యం. చరిత్రలో అతి కొద్ది దేశాలు మాత్రమే ఇంత టి శరవేగ పురోగతిని సాధించగలిగాయి. అయితే సింగపూర్ కొన్ని ముందస్తు అనుకూలతలతో లీ చేతుల్లోకి వచ్చిందన్న విషయాన్ని మరువరాదు. శతాబ్దం పాటు అది బ్రిటిష్ పాలనలో ఉండేది. దానికి చక్కగా అభివృద్ధి చెందిన నౌకాశ్రయం ఉం డేది. పైగా, స్వాతంత్య్రం సిద్ధించేనాటికి ఈ నగరం వాణిజ్య కేంద్రంగా కూడా ఏర్పడి ఉంది. ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే, 1965లో భారతీయుల తలసరి ఆదాయం 100 డాలర్లు మాత్రమే ఉండేది. సింగపూర్‌తో పోలిస్తే భారత్ ఆర్థికంగా మరింత అసమానతలతో కూడిన సమాజం. సింగపూర్‌కు మరో అనుకూలత కూడా ఉంది. అది అతి తక్కువ జనాభా ఉన్న అతి చిన్న దేశం. సింగపూర్‌లో మూడింట రెండొంతులు లేదా అంతకంటే ఎక్కువమంది ప్రజలు చైనా నుంచి వలస వచ్చిన వ్యాపార వర్గాలతో కూడినవారు. నియంతృత్వ పాలనకు తలొగ్గి ఉండే కన్ఫ్యూసి యస్ సంస్కృతిని వీరు జీర్ణించుకుని ఉండేవారు. క్రమశిక్షణ, నిజాయితీ ప్రాతిపదికగా లీ పాలనా యంత్రాంగం ఈ అనుకూలతలను అద్భు తంగా ఉపయోగించుకుంది. దీని మూలంగానే ఆయన ఒక నిజమైన విశ్వ నగరాన్ని నిర్మించగలి గారు. సింగపూర్ సందర్శించిన ఎవరైనా సరే.. దాని సౌందర్యాన్ని, చక్కదనాన్ని ప్రశంసించకుండా ఉం డలేరు. అది అత్యంత సంపద్వంతమైనదీ, పరిశు భ్రమైనది మాత్రమే కాకుండా, జపాన్, యూరప్‌కు మధ్య ఉన్న ఏ నగరంకంటే కూడా ఉత్తమంగా అల రారుతూ వస్తోంది. దీన్ని సందేహించవలిసిన అవ సరం లేదు. ‘‘లీ దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడు. నాయకులలో ఆయన సింహం లాంటివారు. లీ కాన్ యూ జీవితం ఎవరికైనా అమూల్య పాఠా లను బోధిస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ సింగ పూర్ నిర్మాతను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. మరి ఆ పాఠాలు ఏమిటి? భారత్ వంటి దేశాలకు వాటిని వర్తించవచ్చా? మోదీ వంటి దృఢమైన నేతలు (నిజమైన ప్రజాస్వామిక శక్తి లేని కిసింజర్ వంటి దృఢమైన నేతలు కూడా) లీని ప్రేమించటం సహజమే. ఎం దుకంటే సింగపూర్ నిర్మాణక్రమంలో లీ పొందిన అధికారం సంపూర్ణమైనది, నిరపేక్షమైనది. మరి అవధుల్లేని ఈ అధికారంలోని అనుకూలతలు ఏవి? సింగపూర్ ప్రధాన పత్రిక స్ట్రెయిట్స్ టైమ్స్‌లో 2012లో ఒక కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తున్న లీ కెక్ చిన్ అనే 46 ఏళ్ల వయసున్న పాఠకుడు రాసిన ఒక ఉత్తరాన్ని చూద్దాం. ఆ పత్రికలో అచ్చయిన ‘రెండు పార్టీల వ్యవస్థ ఇక్కడ పనిచేయదు’ అనే శీర్షికతో వచ్చిన కథనంపై ఆ పాఠకుడు ఇలా స్పందించారు. ‘‘ప్రస్తుత సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్ రెండు మంచి రాజకీయ పార్టీల వ్యవస్థను నెలకొల్పడానికి సింగపూర్‌లో తగినంత సమర్థులు లేరని భావిస్తుంటారు. అయితే దీన్ని మరింత విశా ల దృష్టితో చూడాలి. ఏక పార్టీ వ్యవస్థ ఉన్న దేశంతో బహుళ పార్టీలవ్యవస్థ ఉన్న దేశాన్ని పోల్చి చూద్దాం. ఇండియా, చైనాలనే పరిశీలిద్దాం. ఈ రెండు దేశాలు అత్యంత భారీ జనాభాను, ఏకజాతీయ సంస్కృతిని కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండు దేశాలూ ఆర్థికంగా బాగానే అభివృద్ధి చెందుతున్నాయి. వీటి లో చైనానే ఉత్తమంగా పనిచేస్తోందనటం వాస్తవం. చైనాలో అమలవుతున్న ఏక పార్టీ ప్రభుత్వమే (ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కమ్యూనిస్టు ప్రభు త్వం) దీనికి కారణమని నేను భావిస్తున్నాను. ఒకే పార్టీ ఉనికిలో ఉన్నందున చైనా నేతలకు మొత్తం దేశాన్ని ఒకే దిశలో నడిపే వీలు చిక్కింది. మరోవై పున రెండు పార్టీలు లేదా బహుళ పార్టీల వ్యవస్థలో ప్రతి పార్టీ కూడా తమ ప్రయోజనాల కోసమే పోరా డతాయి కొన్ని సార్లు ఇవి దేశ పురోగతిని కూడా ఫణంగా పెడతాయి. ఉదాహరణకు, మౌలిక వస తుల కల్పనను వృద్ధి చేస్తే మొత్తం జాతి ప్రయోజ నం పొందుతుంది. కాని ఒక మంచి ప్రణాళికను కూడా ప్రతిపక్షం తన పార్టీ ప్రయోజనాల కోసం అడ్డుకోవచ్చు. దీని వల్ల ఒక దేశం ఆర్థికాభివృద్ధి విష యంలో మరోవైపుకు కొట్టుకుపోయి కృశించిపో వచ్చు. ఉదాహరణకు అమెరికానే తీసుకుందాం. ఒక రాజకీయపార్టీ మరొక రాజకీయ పార్టీని అధిగ మించాలని చేస్తున్న ప్రయత్నాల వల్ల గత దశాబ్దం పొడవునా అమెరికాలో ప్రగతి స్తంభించిపోయింది. మరోవైపున ఆసియా టైగర్లుగా పేరొందిన హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల ఆర్థిక వ్యవస్థలు సహజ వనరుల లేమి ఉన్న ప్పటికీ ముందడుగు వేస్తున్నాయి. కానీ సింగపూర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది తాజా ద్రవ్య సంక్షోభం నుంచి కూడా సాపేక్షికంగా తేరుకుని బతికి బట్ట కట్టింది. మన వ్యవస్థలోని ఏక పార్టీ ప్రభుత్వం దేశాన్ని ఒకే దిశగా నడిపించడమే దీనికి కారణమని నా విశ్వాసం. రెండు పార్టీలు లేదా బహుళ పార్టీ లను కలిగి ఉన్న పెద్ద దేశాలు తప్పులు చేసి కూడా బయటపడగలవు. కానీ సింగపూర్ వంటి చిన్న దేశానికి అలాంటి సందర్భంలో రెండో అవకాశానికి ఏమాత్రం వీలుండదు.’’ లీ ఎందుకు విజయం సాధించగలిగారో చెప్ప డానికి ఇదొక ప్రామాణిక వాదన. సింగపూర్‌పై ఆయన నియంతృత్వమే ఇందుకు కారణమని ఈ వాదన తేల్చి చెబుతుంది. జనాభాలో ప్రతిభ అపా రంగా ఉండటం, దేశం పరిమాణం చాలా చిన్నదై ఉండటంతో ఇక్కడి నియంతృత్వం పెద్దగా ప్రపం చం దృష్టిలో పడలేదు. అత్యున్నత ఆర్థిక పురోగతి సాధించడానికి ప్రభుత్వం అన్ని రంగాల్లో సమర్థవం తంగా చొచ్చుకుపోవలసి ఉంటుందనడంలో వివా దం లేదు. అయితే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ చేయిపెట్టి చొరబడటం (పౌరులు స్వచ్చందంగా అత్యవసర సేవలపై పన్ను విధింపునకు, తీర్పుల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి లోబడి ఉండటం) అనేది అతి పెద్దవీ, వనరుల కోసం కొట్టుమిట్టాడుతున్న భారత్ వంటి దేశాలకు సులభ పరిష్కారం కాదు. ఒక దృఢమైన నేతకు అధికారం అప్పగించడం అనేది భారత్ వంటి దేశాలను మార్చలేదు. బహు శా ఈ వాదనను లీ సమర్థిస్తారని నేననుకోవడం లేదు. తాను సాధించిన అద్భుత విజయం ఇండి యా లాంటి దేశాల్లో ఎందుకు సాధ్యపడలేదని లీ తరచుగా ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. సింగపూర్‌లోని నియంతృత్వ పాలనకు వస్తు న్న చెడ్డపేరును ఎవరూ పెద్దగా పరిగణించడం లేదు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన నా సింగపూర్ ఫ్రెండ్ పీటర్ ఓంగ్.. తన పౌరులపై సింగపూర్ విధించిన ఏకత్వంలో దాగిన క్రూరత్వంపై తీవ్ర అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. లీ నిరంకుశత్వం, విప రీత ధోరణులతో కూడిన పాలన (ఉదాహరణకు చూయింగ్ గమ్‌పై నిషేధం విధించడం, కొరడా లతో కొట్టడం వంటి తీవ్రమైన శిక్షలు) సింగపూర్ ప్రతిష్టకు ఎలాంటి విలువను ఆపాదించడానికి బదు లుగా నష్టం కలిగించాయని చెప్పక తప్పదు. అయితే 1965లో భారత్‌తో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువగా ఉన్న సింగపూర్ తలసరి ఆదా యాన్ని 2015 నాటికి 30 రెట్లు అధిక స్థాయికి తీసు కుపోవడంలో లీ సాధించిన విజయం అద్భుతమని నేను మళ్లీ చెబుతున్నాను. కానీ, లీ సింగపూర్ మన కు ఒక ఆదర్శం అని చెప్పడం తప్పు. పైగా లీ కానీ, లేదా ఆయన వంటి మరొక ప్రవక్త కానీ భారత్ వంటి దేశాల్లో ఈ ఆర్థిక అద్భుతాన్ని సాధిస్తారని భావించడం తప్పు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్:aakar.patel@icloud.com -
ఆ ఓటమికి కుట్ర కారణమనడం సబబేనా?
అవలోకనం ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ మూడు రంగాల్లోనూ భారత్ జట్టు అసాధారణమైన ఆటతీరును కనబర్చింది. బంగ్లాదేశ్‌తో ముగిసిన క్వార్టర్ ఫైనల్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను నోబాల్‌గా ప్రకటించడంలో కుట్ర జరిగిందన్న ఆరోపణ కాస్త అతిగా ఉందనే చెప్పాలి. కామన్వెల్త్ దేశాలు అసాధారణంగా వ్యవ హరిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద విషయాల్లో మనం మన వైఫల్యా లను, ఓటములను అల వోకగా అంగీకరిస్తుం టాం. మన సమాజాలు పేదవి, నిరక్షరాస్యతతో కూడుకున్నవనీ, చాలావరకు ఇవి అనాగరికమై నవనీ, తరచుగా అప్రజాస్వామికంగా ఉంటాయని అంగీకరించడంలో భారతీయులు, పాకిస్తానీయు లు, బంగ్లాదేశీయులూ మొదటివరుసలో ఉంటారు. అయితే ఎక్కడో ఒకచోట మనం దీన్ని అతిక్రమిస్తుం టాం. సాధారణంగా క్రికెట్ విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. క్రికెట్‌కి సంబంధించి మనం కొన్ని సందర్భాల్లో అవలంబించే వైఖరి ఆమోద నీయం కాదు. శ్రీలంక టెస్ట్ క్రికెట్ ఆడే దేశంగా ఆవిర్భవించి, భారత్‌తో తన తొలి మ్యాచ్ ఆడటం నాకు గుర్తుంది. భారత్‌తో పోలిస్తే రమేష్ రత్నా యకే, అశాంతె డి మెల్ వంటి ఫాస్ట్ బౌలర్లతో, కొద్ది మంది గొప్ప బ్యాట్స్మెన్లతో వారు గట్టి జట్టుగా కనిపించేవారు. దాదాపు 30 ఏళ్లకు ముందు శ్రీలంకలో జరిగిన తొలిటెస్టు పర్యటనలో (నేను పొరపడనట్లయితే, కపిల్‌దేవ్ సంధించిన తొలి బంతిని అరవింద డిసి ల్వా సిక్స్‌గా మలచినట్లు గుర్తు) కపిల్‌దేవ్ అంపై రింగ్‌పై ఎంత ఆగ్రహం వ్యక్తపరిచాడంటే, లంకే యులు తమ దేశం వెలుపల ఎన్నటికీ విజయం సాధించలేరని ప్రకటించాడు. అయితే తన ప్రకటన తప్పు అని తెలుసుకోవడానికి కపిల్‌కు అట్టే సమ యం పట్టలేదు. కానీ ఆక్షణంలో మాత్రం తన నాయకత్వంలోని బలమైన భారత్ జట్టును అంగుష్ట మాత్రపు పొరుగుదేశం ఓడించవచ్చన్న వాస్తవాన్ని కపిల్ అంగీకరించలేకపోయాడు. మనం ప్రస్తుత ప్రపంచ కప్ విషయానికి వద్దాం. పూర్తిగా ఏకపక్షంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో, బ్యాటింగ్‌తో పోలిస్తే పేలవంగా కనిపించే భారతీయ బౌలింగ్ అసాధార ణమైన ఆటతీరుతో మెప్పించింది. అటు ఫీల్డింగ్ లోనూ, అటు బ్యాటింగ్‌లోనూ ప్రత్యర్థి జట్టుపై మొత్తం నూరు ఓవర్లలో ఆధిక్యత చూపడంలో మన బౌలర్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. క్వార్టర్ ఫైనల్లోనూ ఇదే జరిగింది. భారతీయ ఇన్నింగ్స్ మధ్యలో వికెట్లు కోల్పోనప్పటికీ రన్ రేట్ ఒక్కసారిగా పడిపోవడం మినహాయిస్తే, భారత్ ఆట మొత్తంలో ఆధిక్యత కనబర్చింది. కానీ ఆట ముగిశాక బంగ్లాదేశ్ పత్రికలను చూసినట్లయితే, వారి జట్టుకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని అవి రాశాయి. ’బంగ్లాదేశ్ సెమీస్ ఆశల్ని ఘోరంగా దెబ్బతీసిన వివాదాస్పదమైన అం పైరింగ్’ ఇది బంగ్లాదేశ్ అతిపెద్ద జాతీయ వార్తా పత్రిక డైలీ స్టార్ పెట్టిన ప్రధాన శీర్షిక. రోహిత్ శర్మ 91 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు రుబెల్ హుసేన్ ఫుల్ టాస్ బంతితో లభించిన క్యాచ్‌ని అంపైర్ నోబాల్‌గా ప్రకటించడం మ్యాచ్‌ని మలుపు తిప్పిం దని బంగ్లా పత్రిక వ్యాఖ్యానించింది. అంపైర్ నిర్ణయంతో బతికిపోయిన రోహిత్ మరో 46 పరు గులు చేయగలిగాడు. భారత్ జట్టు బ్యాటింగ్ ఆ దశలో ఉన్న తీరును పరిశీలిస్తే ఈ అంపైరింగ్ లోపం వల్ల బంగ్లాకు పెద్దగా ఒనగూరేదేమీ లేదు. రీప్లేని చూపించినప్పుడు, అంపైర్ ఇయాన్ గౌల్డ్ తప్పు నిర్ణయం చాలా స్పష్టంగా కనిపించింది. బ్యాట్స్‌మన్ బ్యాట్‌తో బంతిని తాకినప్పుడు అది తక్కువ ఎత్తులో ఉండటం పదేపదే రీప్లేలో కనిపిం చింది. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా లెగ్ ఎంపైర్ నిర్ణయం వెలువరించాల్సి ఉండగా, ఆ స్థానంలో ఉన్న అలీమ్ దార్ మౌనంగా ఉండిపో వడం బంగ్లా జట్టు అభిమానులకు మిస్టరీగా కనబడింది. ఇతరులు సైతం దీన్ని తప్పుగానే భావించారు. భారత్ మాజీ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్ సైతం దీనిపై ట్వీట్ చేస్తూ, ‘గౌల్డ్ది తప్పు నిర్ణయం. బంతి ఆ సమయంలో ఖచ్చితంగా నడుము పైభాగంలో ఎగరలేదు. రోహిత్ నిజంగానే ఊపిరి పీల్చుకున్నట్ల యింది. అదనంగా 20 పరుగులు రావడానికి ఇది దోహదం చేస్తుంది’ అని పేర్కొన్నాడు. అంపైర్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటారన్నది వాస్తవం. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, ఉమేష్ యాదవ్ వేసిన మొట్టమొదటి ఓవర్ నాలు గో బంతికే ఇమ్రుల్ కేస్ కాట్ బిహైండ్ రూపంలో ఔటయ్యాడు. స్నికోమీటర్ దాన్ని స్పష్టంగా చూపిం చింది కూడా. కాని అప్పీల్‌కు అంపైర్ స్పందిం చలేదు. అంపైరింగ్ లోపాల గురించి విషం కక్కు తున్నప్పుడు బంగ్లాదేశీ పత్రికలకు ఈ విషయం గుర్తుకు రాకపోవడం సహజమే. నిజానికి ఈ విషయంలో గౌల్డ్ తప్పు లేకపో వచ్చు. పైగా అది నో బాల్ అని ప్రకటించింది కూడా తను కాదు. స్క్వేర్ లెగ్‌లో ఉన్న అంపైర్ దార్ వెనువెంటనే నో బాల్ అని సంకేతమిచ్చాడు (అప్పటికి రోహిత్ షాట్ ఇంకా క్యాచ్ కాలేదు). ఆ బంతి నడుముకు పైభాగంలో వచ్చిందని దార్ తప్పుగా భావించి ఉండవచ్చు. (వాస్తవానికి అది నడుముకు కొన్ని అంగుళాల కిందే వచ్చింది), కానీ దీనిలో కుట్రకు అవకాశమే లేదు. ఏదేమైనా నేను తొలి పేరాలోనే చెప్పినట్లు ఇది క్రికెట్. బంగ్లాదేశీ యులు మైదానంలోని స్టాండ్లలో ఒక బ్యానర్‌ను ప్రదర్శించేశారు. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అని ఆ బ్యానర్ చూపించింది. అయితే ఇలాంటి సూత్రీకరణ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా నుండి రావడం గమనార్హం. ‘వెల్డన్ ఐసీసీ (ఇండియన్ క్రికెట్ కౌన్సిల్), మీరు పూర్తిగా అమ్ముడుపోయారు!!’ అంపైర్ నిర్ణయం మిస్టరీగా ఉందన్న ప్రాతి పదికనే రమీజ్ అమ్ముడుపోవడం అనే పదాన్ని వాడారు. అతనొక్కడే కాదు. షోయబ్ అక్తర్ కూడా ఇలాగే ట్వీట్ చేశాడు. ‘పాపం, బంగ్లాదేశ్ బాగా ఆడింది. ఈ మ్యాచ్‌లో వంచన జరిగింది. కానీ ఈసారి...’ కానీ మోసం చేసిందెవరు? దీన్ని మా త్రం ఎవరూ చెప్పడం లేదు. తాను కొంత అతిగా వ్యవహరించినట్లు రమీజ్ తర్వాత గుర్తించాడు కాబోలు... (లేదా భారత్ ట్వీటర్ సేన నుంచి వెల్లు వెత్తిన విమర్శల ప్రభావం వల్ల కూడా కావచ్చు) తర్వాత ఇలా ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన ఆట. అద్భుత ప్రదర్శన. 7 వరుస విజయాలు సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు’ కానీ బంగ్లాదేశ్‌లో తాము గెలవాల్సిన చోట మోసపోయామన్న భావం ఇప్పటికీ బలంగా వినిపి స్తోంది. ఐసీసీ వివాదాస్పదమైన అంపైరింగ్‌పై బం గ్లాదేశ్ అప్పీల్‌కు సిద్ధం అనీ, యుద్ధనేరాలకు గాను ఐసీసీని విచారించాలి అనీ బంగ్లాదేశ్ పత్రికలు అనేక పతాక శీర్షికలలో ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నా యి. ఇది కాస్త అతిగా ఉందని నా అభిప్రాయం. ఆ నిర్దిష్ట కథనాన్ని నేను చదివినప్పుడు అది అంతర్జా తీయ క్రిమినల్ కోర్టుకు వెళ్లాలని సూచిస్తోంది. నేను మెల్లగా ఆ పేజీని తిరగేశాను. బంగ్లాదేశ్ అభిమానులు కూడా అలాగే చేయడం మంచిది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్:aakar.patel@icloud.com -
మోదీ ప్రాభవానికి ఇదో పరీక్ష!
అవలోకనం ప్రజల్లో రాక్ స్టార్‌గా, అన్ని సమస్యలనూ పరిష్కరించే పరిరక్షకుడిగా అభిమానుల గుర్తింపు పొందిన మోదీ, ఇటీవల కాలంలో తన గురించి విస్తృతంగా జరిగిన ప్రచారాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. తన పద్నాలుగేళ్ల రాజకీయ జీవితంలో మొట్ట మొదటిసారిగా నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10న జరిగిన ఒక ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అంగుష్టమాత్రంగా కనిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది. మోదీ 2001లో పూర్తికాలం రాజకీయ నేత అయ్యారు. ఆ సంవత్సరం ఆయన గుజరాత్ సీఎం పదవిలోకి దూసుకొచ్చారు. ఆ రాష్ట్రంలో అప్పటికే బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. 1995 నుంచే గుజరాత్లో బీజేపీ ఆధిక్యతలో ఉండేది. సీఎం కేశూబాయ్ పటేల్‌ను అంతర్గత సంక్షోభం కారణంగా తప్పించవలసినప్పుడు మోడీ ముందు పీఠికి వచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే గుజరాత్లో తీవ్రస్థాయిలో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. టీవీలో సమగ్ర ప్రచారం కారణంగా ఈ దాడులు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ హింసాత్మక ఘటన జరిగిన కొద్ది నెలలకే, అంటే 2002 చివర్లో మోదీ ఎన్నికల్లో తన మొదటి విజయాన్ని కైవసం చేసుకున్నారు. గుజరాత్లో బీజేపీకి అది మూడో విజయం. 2007, 2012 సంవ త్సరాలలో కూడా మోదీ గుజరాత్ శాసనసభ ఎన్ని కల్లో భారీ మెజారిటీతో అధికారం సాధించి పెట్టా రు. బీజేపీకి గుజరాత్ తన మద్దతును కొనసాగిస్తూ వచ్చిందన్న వాస్తవాన్ని పక్కనబెట్టి, అభివృద్ధిపై తాను దృష్టి పెట్టడం, తన ప్రజాకర్షణ, మొత్తంమీద తన రాజకీయ మేధ వల్లే గుజరాత్లో విజయం సాధిస్తున్నామనే ఆలోచన మోదీ మనస్సులో ప్రవే శించింది. ప్రత్యేకించి జాతీయ మీడియాలోని మోదీ ఆరాధకులు దీన్ని మరింత వ్యాప్తి లోకి తీసుకొచ్చా రు. మీడియాలోని చాలామంది ఆకర్షణీయమైన వక్తగా మోదీ సమర్థత ప్రాతిపదికనే కాకుండా, మిగతా రాజకీయనేతల కంటే భిన్నంగా ఆలోచిస్తూ, తన దార్శనికతను ఫలింపచేసుకునే వ్యక్తిగా కూడా తనలో ఓ విశిష్టత ఉందని భావించారు. ఈ ఆకర్ష ణను జాతీయస్థాయిలో, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించిన కారణంగానే 2014 సార్వ త్రిక ఎన్నికల్లో మోదీ అద్భుత విజయానికి దారి ఏర్పడింది. ఢిల్లీలో ప్రస్తుత పరాజయం మోదీకి తొలి ఓట మి మాత్రమే కాదు. ఈ పద్నాలుగేళ్ల కాలంలో తొలి సారిగా తనకు తానుగా తిరస్కరణకు గురయ్యారనే చెప్పాలి. ప్రజల్లో రాక్ స్టార్‌గా గుర్తింపుపొందిన మోదీ, అన్ని సమస్యలనూ పరిష్కరించే పరిరక్షకు డిగా అభిమానులు భావించిన మోదీ, ఇటీవల కాలంలో తన గురించి విస్తృతంగా జరిగిన ప్రచా రాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమ య్యారు. గోధ్రా అల్లర్ల కవరేజి జరిగినప్పటినుంచి భారత మీడియా ఆయన్ని బజారు వర్తకుడిగా భావించేది. కానీ విదేశీ మీడియా తన గురించి ఏమనుకుంటోందన్న అంశం పట్లే మోడీ ఎక్కువగా ఆకర్షితుడవుతూ వచ్చారు. బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ మోదీ ప్రస్తుత పరాజయంపై పతాక శీర్షికలో ఒక వ్యంగ్య వ్యాఖ్య ను ప్రచురించింది. అతి శక్తివంతుడైన భారత ప్రధా నమంత్రి ఒక నిలువుచారల జాకెట్ కారణంగా ఓడి పోయాడా? అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయినప్పుడు ఢిల్లీలో మోదీ ధరించిన పది లక్షల రూపాయల ఖరీదైన సూట్ గురించే ఈ ప్రస్తావన. పైనుంచి కిందివరకు తన పేరును ముద్రించిన ఆ మోటు సూటును ధరించినప్పుడు మోదీని అంతవ రకూ ఆరాధిస్తూ వచ్చిన కొంతమంది ప్రజలు వెన క్కుతగ్గారు. అయితే 2001 నుంచి మోదీని అనుసరి స్తూ వచ్చిన వారు మోదీ స్వభావ సిద్ధంగానే అలా వ్యవహరించారని సమర్థించారు. అహ్మదాబాద్‌లో పదేళ్ల క్రితం నేను ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఒక ఫొటోగ్రాఫ్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని మూడు డజన్లకుపైగా అత్యంత సీనియర్ ఉన్నతాధికారులతో కూడిన తన మొత్తం సెక్రటేరియట్‌తో మోదీ కలసి దిగిన ఫొటో అది. కచ్ రాణా ప్రాంతంలో జరుగుతున్న సమావేశం మధ్యలో ఆ ఫొటో దిగారు. నేపథ్యంలో మిరిమిట్లు గొలిపే సుందర ఛాయాచిత్రాలను ప్రదర్శించడా నికి తప్పితే దీనికి మరే ప్రాధాన్యతా లేదు. కౌబాయ్ టోపీ, జాకెట్, సన్‌గ్లాసెస్ ధరించి సరికొత్త రూపం లో మోదీ ఆ సమావేశాన్ని నిర్వహించారు. మొన్న ఒబామాతో సమావేశంలో ఆ విలాసవంతమైన సూట్‌ను ధరించాలన్న పేలవమైన నిర్ణయం ప్రభా వాన్ని మోదీ ఏమాత్రం గుర్తించలేకపోయారు. ఇలాంటి వాటిపై మోదీ ఎవరి సలహా అయినా తీసు కుని ఉంటారని ఆయన చంచాలు తప్ప మరెవరైనా ఊహించి ఉండరు. దురదృష్టవశాత్తూ మోదీ తన్ను తాను మంచి శ్రోతగా ఇతరులు చెప్పే ప్రతిదాన్ని ఆలకించే వ్యక్తిగా మలచుకుంటున్నారనడానికి నాకెలాంటి తటపటాయింపూ లేదు. మోదీని అంచ నాలకు భిన్నమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్న వారికే ఆ సూట్‌ని ఇచ్చి ఉంటే బాగుండేది. మోదీని ఒక ఫ్యాషన్ ్రపతిరూపంగా అభివర్ణిస్తూ బరాక్ ఒబామా చమత్కారయుతంగా చేసిన వ్యాఖ్యను ప్రధాని సరిగా గ్రహించారా అన్నది నా సందేహం. నిలువెల్లా తన పేరును ముద్రించిన ఆ అసభ్యకర మైన సూట్‌ను గుజరాత్లో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే ధరిస్తారు. గతనెలలో ఒక గుజరాతీ వాలా వజ్రాలు పొదిగిన చెప్పులను గర్వంగా చూపిస్తున్న వార్తను కూడా మనం చూశాం. వీటన్నింటికీ పరా కాష్టగా అభిమానులు మోదీ విగ్రహాన్ని ఉంచిన ఆలయాన్ని ఒక గుజరాతీ మంత్రి ప్రారంభించ నున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈలోగా ప్రసిద్ధ పత్రిక ఎకనమిస్ట్ ఇలా రాసిం ది: ‘ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో తన పార్టీ వైఫల్యానికి మోదీయే ప్రధాన బాధ్యత వహించాలన్న వాస్త వాన్ని అంగీకరించడం అసౌకర్యంగానే కనిపించ వచ్చు’. ‘మనం దేన్నయినా సాధించగలమని, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప జేయగలమని, పనిచేసే ప్రభుత్వాన్ని అందించగలమని, కోట్లాదిమందిని దారిద్య్రం నుంచి బయటపడవేయగలమనీ నమ్మ కాన్ని కలిగించిన నేతగా మోదీ దేశంలోనూ, విదేశా ల్లోనూ భావోద్వేగాలను ప్రేరేపించారు. కాని వాస్త వంగా ఈ వైపుగా చాలా కొద్ది మార్పులే జరిగాయి. ఢిల్లీ ఎన్నికలు సూచించినట్లుగా ప్రజల్లో నిరాశా నిస్పృహలు పెరిగిపోతున్నాయి’ అని ది న్యూయా ర్క్ టైమ్స్ పేర్కొంది. బీజేపీ సహచర మంత్రులు, దాని పార్లమెంటు సభ్యులూ ఉపయోగిస్తున్న ప్రజలను విడదీసే భాషను అడ్డుకోవడంలో మోదీ వైఫల్యం చెందడమే ఈ పరాజయానికి కారణమని విదేశీ వార్తా సంస్థల కథనాలు అంచనా వేశాయి. ఈ వాదనను నేను పాక్షికంగా మాత్రమే అంగీ కరిస్తాను. గత కొద్ది నెలలుగా బీజేపీ, వీహెచ్‌పీలు చేస్తున్న చేష్టలతో చాలామంది ప్రజలు విసిగిపో యారన్నది వాస్తవం. అయితే చాలావరకు గమ నిస్తే, ఆమ్ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లలో చాలావరకు సానుకూలమైనవే ఉన్నాయని బోధపడుతుంది. అవి బీజేపీకి వ్యతిరేకమైనవిగా కనిపించడం లేదు. నా అవగాహన మేరకు చూస్తే, భావజాలం, లేదా కులం వంటి పలు కారణాలతో బీజేపీవైపు మొగ్గు చూపుతున్న ఓటర్లు ఇప్పటికీ ఆ పార్టీవైపే ఉన్నారు. ఇంత పరాభవంలో కూడా దాని ఓటు షేరు 32 శాతానికి తగ్గకపోవడం దీన్నే సూచిస్తోంది. ఇంత మద్దతుతో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అవలీలగా గెలిచే పరిస్థితి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ వైపు మళ్లిన 20 శాతం ఓట్లే బీజేపీని ఓడించాయి. దేశవ్యాప్తంగా భారీగా, తక్షణ మార్పును తీసుకువస్తానంటూ మోదీ చేసిన వాగ్దా నాన్ని ఢిల్లీ విషయంలో చేశారు కాబట్టే అరవింద్ కేజ్రీవాల్‌కు అఖండ విజయం సిద్ధించింది. అయితే భవిష్యత్తులో మోదీ ఈ స్థాయిలో ఓట ర్లను కోల్పోతారని నేను ఊహించడంలేదు. తన ప్రవర్తన విషయంలో కొన్ని తప్పులు చేసి ఉంటాడ న్నది నిజమే అయినప్పటికీ, తన రాజకీయాలకు ఢిల్లీ తీర్పు తిరస్కరణ వంటిదని మోదీ భావించడం లేదు. మోదీ దేశ రక్షకుడు అనే భావం దేశ ప్రజల్లో నేటికీ సజీవంగానే ఉంది. నిజానికి ‘ఆబ్ కీ బార్ మోదీ సర్కార్’ స్థాయిలోనే ‘పాంచ్ సాల్ కేజ్రీవాల్’ నినాదం కూడా అదే రీతిలో గుబాళిస్తోంది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) Aakar.patel@icloud.com -
కాలపరీక్షకు నిలిచిన స్వచ్ఛ పరిమళం
అవలోకనం గాంధీ బోధనల్లో, ఆచరణలో అర్థం కానివి ఏవీ లేవు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీర్తి నేటికీ చెక్కు చెదరకుండా నిలిచే ఉంది. రాజకీయవేత్తకు ఉండవలసిన నిరాడంబరత విషయంలో తన వెనుక ఆయన ఎంత స్వచ్ఛమైన పరిమళాన్ని వదిలిపెట్టి వెళ్లారో కదా! ఈ నెలలో భారత దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధ వ్యక్తి హంతకుడి 67వ వర్ధంతిని మనం గుర్తుంచుకోబోతున్నాం. అయితే గాంధీ ని గాడ్సే ఆనాడు ఎందుకు చంపినట్లు? అన్నదే కీలకం. అరెస్టయ్యాక గాడ్సేని నాటి హిందుస్తాన్ టైమ్స్ పత్రిక సంపాదకుడు, గాంధీ కుమారుడు దేవదాస్ కలుసుకున్నారు. వీరిద్దరూ కలుసుకున్న ఘటనను నాథూరాం గాడ్సే సోదరుడు, గాంధీ హత్యానేరంలో సహ భాగస్వామి, సహ దోషి అయిన గోపాల్ గాడ్సే (జైలు పాలయ్యాడు కానీ ఉరికెక్కలేదు) రాసిన ‘గాంధీజీస్ మర్డర్ అండ్ ఆఫ్టర్’ పుస్తకంలో వర్ణించారు. తన తండ్రి హంతకుడిని చూసేందుకు గాంధీ తనయుడు పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఎలాంటి నమ్రతాలేని, రక్తపిపాసిని తాను కలుసుకుంటున్నట్లు దేవదాస్ భావించి ఉంటాడని గోపాల్ గాడ్సే ఆ పుస్తకంలో రాశాడు. అయితే అత ను ఊహించినదానికీ, నాథూరాం మృదు సంభాష ణలు, ప్రశాంత చిత్తానికీ, ఏమాత్రం పోలిక లేకుం డాపోయిందని గోపాల్ పేర్కొన్నాడు. వారిద్దరి కలయిక ఇలాగే జరిగిందా అనేది మనకయితే తెలీదు. కానీ, గోపాల్ గాడ్సే ప్రకారం ‘నేను నాథూరాం వినాయక్ గాడ్సేని, హిందూ రాష్ట్ర దినపత్రిక సంపాదకుడి’ని అని నాథూరాం తనను కలవడానికి వచ్చిన దేవదాస్ గాంధీకి చెప్పాడట. ‘ఈ రోజు మీ తండ్రిని కోల్పోయారు. ఆ విషాదానికి నేనే కారణం. మీకూ మీ కుటుంబానికి కలిగిన ఈ వియోగానికి నేను చాలా చింతిస్తున్నా. దయచేసి నన్ను నమ్మండి. మీ పట్ల ఎలాంటి వ్యక్తిగత ద్వేషం తోనో, కక్షతోనో లేక దురుద్దేశంతోనో నేనీ కార్యాన్ని తలపెట్టలేదు’ అని నాథూరాం అన్నాడు. అలాంట ప్పుడు ఇలా ఎందుకు చేశావని దేవదాస్ అడిగారు. కేవలం రాజకీయ అంశమే దీనికి కారణమని నాథూరాం చెప్పాడు. తన చర్యను వివరించడానికి కాస్త సమయం కావాలని నాథూరాం కోరాడు. కానీ పోలీసులు అనుమతించలేదు. న్యాయస్థానంలో కూడా నాథూరాం తన చర్య గురించి ఒక ప్రకట నలో వివరించాడు. అయితే కోర్టు దాన్ని నిషేధిం చింది. నాథూరాం వీలునామాను తర్వాత గోపాల్ గాడ్సే తన పుస్తకానికి అనుబంధంగా పునర్ముద్రిం చాడు. ఆ వీలునామాలోని చివరి వాక్యం ఇలా సాగుతుంది. ‘న్యాయస్థానంలో నేను చేసిన ప్రకట నపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తి వేసినట్లయితే, దాన్ని ప్రచురించడానికి నీకు అధికారమి స్తున్నాను.’ ఇంతకూ ఆ ప్రకటనలో ఏముంది? దాంట్లో గాడ్సే కింది అంశాలను పొందుపర్చాడు. గాంధీ అంటే తనకెంతో గౌరవమని చెప్పుకున్నాడు. ‘‘అన్నిటికంటే మించి వీర సావర్కర్, గాంధీ రాసి న, మాట్లాడిన ప్రతిదాన్నీ నేను క్షుణ్ణంగా చది వాను. నాకు తెలిసినంతవరకు.. గత ముప్పై సంవ త్సరాల కాలంలో ఏ ఇతర అంశం కంటే, భారతీ యుల ఆలోచనలను, కార్యాచరణను మలచడంలో ఈ ఇద్దరు సిద్ధాంతవేత్తలదే అధికపాత్ర. ముప్పై రెండు సంవత్సరాలుగా గాంధీపై పేరుకుపోతూ వస్తున్న ఆగ్రహం, ప్రకోపం, ఇటీవల ఆయన చేప ట్టిన ముస్లిం అనుకూల నిరాహారదీక్షతో చరమ స్థాయికి చేరుకుంది. దీంతోటే గాంధీ అనే వ్యక్తి ఉనికిని తక్షణమే ముగించాల్సిన అవసరముందని నేను భావించాను. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడి భారతీయుల హక్కులు, వారి శ్రేయస్సును పరిరక్షించడానికి గాంధీ చాలా బాగా పనిచేశారు. కానీ, అక్కడి నుంచి భారత్‌కు తిరిగొచ్చినప్పుడు ఆయన ఒక స్వీయాత్మక మనస్తత్వాన్ని పెంపొం దించుకున్నారు. దీంట్లోంచే ఏది తప్పు, ఏది సరై నది అని తేల్చడంలో తాను మాత్రమే అంతిమ న్యాయమూర్తి అనే అభిప్రాయాన్ని పెంచుకున్నారు. దేశం తన నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లయితే, తన లోపరాహిత్యాన్ని, అమోఘమత్వాన్ని యావ ద్దేశం ఆమోదించవలసి ఉంటుంది. అలా జరగనట్ల యితే కాంగ్రెస్‌కు దూరంగా జరిగి తన సొంత మార్గాన్ని కొనసాగిస్తారు.’’ ఈ ఆలోచనే గాంధీకి వ్యతిరేకంగా తీవ్ర చర్య కు పురికొల్పింది. ఎందుకంటే నాథూరాం దృష్టిలో గాంధీ ఆలోచనలకు వ్యతిరేక వైఖరి అవలంబించా లంటే అడ్డదారులు పనికిరావు. కాంగ్రెస్ తన ఇచ్ఛను గాంధీ పాదాక్రాంతం చేయాలి. ఆయన విపరీత మనస్తత్వానికి, చాపల్యానికి, అధిభౌతికత త్వానికి, ఆదిమ దార్శనికతకు తాళం వాయించడా నికే అది కట్టుబడాలి. లేదా గాంధీ లేకుండానే కాంగ్రెస్ కొనసాగాలి. నాథూరాం మరొక ఆరోపణ ఏమంటే, గాంధీ పాకిస్తాన్‌ను సృష్టించారు. ‘గాంధీ సమ్మతితో కాం గ్రెస్ అగ్రనేతలు దేశాన్ని విభజించి, చీల్చి వేస్తున్న పుడు, (దేశం పట్ల మేం అప్పటికే ఒక ఆరాధనా భావాన్ని పెంచుకుని ఉన్నాం) నా మనస్సు ఆగ్ర హంతో దహించుకుపోయింది. నాకు వ్యక్తిగతంగా ఏ ఒక్కరిమీదా దురుద్దేశం లేదు కానీ ముస్లింల పట్ల అన్యాయంగా సానుకూల విధానంతో వ్యవహరిస్తు న్న ప్రస్తుత ప్రభుత్వం పట్ల నా కెలాంటి గౌరవ భావం లేదని చెబుతున్నాను. అదే సమయంలో ఈ ప్రభుత్వ విధానం మొత్తంగా గాంధీ ఉనికితోటే సాధ్యమవుతోందని నేను స్పష్టంగా గ్రహించాను’. అయితే గాడ్సే వాదనలో ఒక సమస్య ఉంది. అదేమిటంటే, గాంధీ విపరీత మనస్తత్వం కలవా రని గాడ్సే ఆలోచించడమే. గాంధీ పట్ల యావత్ ప్రపంచం దీనికి వ్యతిరేకంగానే ఆలోచిస్తోంది. పైగా గాడ్సే ప్రకారం గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఒక నియం త. తన దృక్పథాన్ని కాంగ్రెస్ ఆచరించేలా చేసేం దుకోసం గాంధీ నిరాహార దీక్ష చేపట్టారని కూడా గాడ్సే అన్నాడు. ఒక నియంతకు ఆదేశించడం తప్ప మరే చర్యకైనా పూనుకోవలసిన అవసరం ఏముం ది? గాంధీ చివరి నిరాహారదీక్షను (పాకిస్తాన్‌కు నిధులు విడుదల చేయకూడదన్న భారత్ నిర్ణయా నికి వ్యతిరేకంగా) నాథూరాం వ్యతిరేకిస్తున్నాడు. అయితే భారత్ గతంలో ఈ అంశంలో చేసిన వాగ్దానం నుంచి వెనక్కి పోయినప్పుడు మాత్రమే ఇలా జరిగింది. వాస్తవానికి ఈ వ్యవహారంలో భారత్ హుందాతో, సరైన దారిలో వెళ్లేటట్టు చేసింది గాంధీ మాత్రమే. నాథూరాం చెప్పిందాంట్లో ఏ కొంచెం కూడా తర్కబద్ధంగా లేదు. తన చర్యకు ఏది కారణం అనే అంశంపై గతంలో తను చేసిన ప్రకటనకు ఇది భిన్నంగా ఉంది. గాంధీ లౌకిక భావజాలం పట్ల నాథూరాం ద్వేషం పెంచుకున్నాడు. ఈ లౌకిక భావ జాలమే నిజమైన హిందూ స్ఫూర్తి. ఆరెస్సెస్ ప్రభా వంతో సంపూర్ణంగా కలుషితమైన ఆలోచనతో అతడు ఈ స్ఫూర్తినే అంతిమంగా వ్యతిరేకించే స్థాయికి వెళ్లిపోయాడు. వాస్తవమేమిటంటే గాంధీ బోధనల్లో కాని, ఆయన ఆచరణలో కాని అర్థం కాని వి, ఆక్షేపణీయ మైనవి ఏవీలేవు. అందుకే రాజకీయ వేత్తగా గాంధీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీర్తి దశా బ్దాలు గడిచినా చెక్కు చెదరకుండా నిలిచే ఉంది. సుప్రసిద్ధ రచయిత జార్జి ఆర్వెల్ 1949లో గాంధీ గురించి రాస్తూ ఇలా అన్నారు. ‘నాలాగే గాం ధీ పట్ల ఎవరైనా ఒక సౌందర్యాత్మక అప్రీతిని, అయి ష్టతను కలిగి ఉండవచ్చు. ఆయనకు ఆపాదించిన రుషిత్వ భావనను ఎవరైనా తిరస్కరించవచ్చు (గాంధీ ఎన్నడూ ఏ రకంగానూ తనను రుషిలా భావించుకోలేదు), రుషిత్వాన్ని ఒక ఆదర్శభావ నగా ఎవరైనా తోసిపుచ్చి, గాంధీ ప్రాథమిక లక్ష్యా లు మానవ వ్యతిరేకమని, ప్రతీఘాతుకతత్వంతో కూడినవని ప్రకటించవచ్చు. కాని రాజకీయవేత్తకు ఉండవలసిన నిరాడంబరత విషయంలో, మన కాలపు ఇతర ప్రధాన రాజకీయ ప్రముఖులతో పోల్చి చూసినప్పుడు, తన వెనుక ఆయన ఎంత స్వచ్ఛమైన పరిమళాన్ని వదిలిపెట్టి వెళ్లారో కదా!’ నాథూరాం ఆరోపణలు కాల పరీక్షకు నిలబ డని సమయంలో ఈ 2015లో కూడా ఇదెంత వాస్త వమో కదా! (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) Aakar.patel@icloud.com) -
ఆంక్షలులేని అపరిమిత స్వేచ్ఛ సాధ్యమేనా?
అవలోకనం మన దేశంలో ఏ ప్రచురణ సంస్థ అయినాగానీ, కోట్లాది మంది మనోభావాలను గాయపరుస్తుందని తెలిసి తెలిసీ అలాంటి కార్టూన్‌ను ప్రచురిస్తుందని ఊహించడం కష్టం. సాహసిక సంపాదకులెవరైనా అందుకు మొగ్గినా అది కొని తెచ్చిపెట్టే సమస్యలకు జంకుతారు. హింస, బెదిరింపులు మాత్రమే కాదు చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. నాకు గుర్తున్నంత వర కు ఒకప్పటి నా బాస్ ఎమ్జే అక్బర్‌కు పత్రికా రచనకు సంబంధించి భగవదాజ్ఞలాంటి ఒకే ఒక్క నియమం ఉం డేది. అది నా మాటల్లో చెప్పాలంటే, నీకు ఇష్ట మొచ్చింది ఏదైనా, ఏ విషయంపైన అయినా రాయి. కానీ మతాన్ని మాత్రం ఎన్నడూ పరిహసించవద్దు. ఆయన అలా చెప్పింది పత్రికలు మతం పట్ల గౌరవం చూపాలనో లేక మతాన్ని అపహాస్యం చేయడం వల్ల సాధార ణంగా మన దేశంలో వచ్చి పడే సమస్యల నుండి తప్పించుకోవాలనో నాకు తెలియదు. బహుశా ఆయనకు ఆ రెండు ఉద్దేశాలూ ఉండి ఉండవచ్చు. ఫ్రెంచి వార పత్రిక ‘చార్లీ హెబ్డో’పై జరిగిన దాడి గురించి ‘బిజినెస్ డైలీ’లో టీఎన్ నైనన్ ఇలా రాశారు: చాలా సమాజాలు, ప్రత్యేకించి పాశ్చాత్య సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగమైన సమాజాలు ఇతరులను నొప్పించే హక్కుతో సహా వాక్ స్వాతంత్య్రంపై ఎలాంటి పరిమితులనూ అంగీకరిం చవు లేదా అతి తక్కువగా మాత్రమే అంగీకరి స్తాయి. ఫ్రెంచి విప్లవ కాలంనాటి మానవ హక్కుల ప్రకటనలోని వాక్ స్వాతంత్య్రాన్ని అవి మానవుని అత్యంత విలువైన హక్కుగా భావిస్తాయి. అయితే సకల మతాల సమానత్వం (సర్వ ధర్మ సమభావ్) అనే విశాల సంప్రదాయం గల మన దేశంలో ఏ ప్రచురణ సంస్థ అయినాగానీ, కోట్లాది మంది మనోభావాలను గాయపరుస్తుందని తెలిసి తెలిసీ అలాంటి కార్టూన్‌ను (మొహమ్మద్ ప్రవక్తపైన) ప్రచురిస్తుందని ఊహించడం కష్టమని కూడా నైనన్ అన్నారు. అవును, సాహసిక సంపాదకులెవరైనా అందుకు మొగ్గినా అది కొని తెచ్చిపెట్టే సమస్యలకు జంకుతారు. హింస, బెదిరిం పులు మాత్రమే కాదు, చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. వాక్ స్వాతంత్య్రం విషయంలో సమస్యలను ఎదుర్కొన్న అనుభవం మన దేశానికి ఉంది. జవహర్లాల్ నెహ్రూ అంతటి గొప్పవాడే ఈ ప్రాథమిక హక్కుతో ఎలా వ్యవహరించాలనే విషయంలో సందిగ్ధంతో ఉండేవారు. 1950 జనవరి 26న రాజ్యాంగంలోని 19 (1)(ఎ) పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రానికి హామీని ఇచ్చింది. పదిహేను నెలల తర్వాత, నెహ్రూ ఆ హామీ నుండి వెనక్కు తగ్గి, ఆంక్షలను విధించారు. దేశంలో వాక్ స్వాతం త్య్రాన్ని పరిమితం చేసే అరడజను చట్టాలున్నాయి. వాటిలో పలు చట్టాలు వింతగా ఉంటాయి. అయితే అలాంటి పరిమితుల విషయంలో మనదే అత్యంత సున్నితమైన వైఖరి అని, వాక్ స్వాతంత్య్రం ప్రాథ మిక హక్కేగానీ, నిరపేక్షమైనది కాదు అని నీనన్ తన వ్యాసంలో అన్నారు. ప్రజా భద్రత, సభ్యత, నైతికతల కారణంగా దాన్ని రాజ్యాంగం పరిమితం చేసింది. అయితే ఇవన్నీ వ్యాకోచత్వం కలిగిన భావనలు. మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బ తీసే రాతలపై సైతం నిషేధం ఉంది. అది సూత్రానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఏవి మిత్ర దేశాలు, ఏవి కావు అనే విషయంలో ఆమోదం పొందిన జాబితా లేదనే సమస్యా ఉంది. మత హింసలను రెచ్చగొట్టడం, వైషమ్యాలను పెంపొందింపజేయడం, ఒక మతాన్ని అవమానించ డం, మత భావనలను గాయపరచడం వంటి అంశాలకు ప్రత్యేక చట్టాలున్నాయి. అవీ కొత్తవేమీ కాదు. వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలను విధించే మన చట్టాలు 1837లో రూపొందించినవి. 33 ఏళ్ల వయస్సులోనే థామస్ మెకాలే భారత శిక్షాస్మృతిని తయారుచేయడం ప్రారంభించాడు. 175 ఏళ్లుగా అది ఇంచుమించుగా అలాగే ఉంది. మనం ఆధుని కత అలంకారాలతో బతుకుతున్నా, మన సంస్కృతి ఎంతగా మార్పు లేకుండా నిలిచి పోయిందో ఇది తెలియజేస్తోంది. ఆనాటి శిక్షా స్మృతి, వలసవాద చట్టాలు స్వతంత్ర భారతంలో కూడా అమలవు తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లిషువాళ్లు మనల్ని కచ్చితంగా అంచనా కట్టారు. మన ప్రవర్తనను, బాహ్య ప్రేరణలకు మన ప్రతిస్పం దనను సరిగ్గా ఊహించి ముందుగా చెప్పగలిగారు. అది మెకాలేను చాలా గొప్పవాడిని చేసింది. 1984లో, 1993లో, 2002లో మనలో ఎందరు పాశవికంగా మారుతారో ఆత్మవిశ్వాసంతో 1837 లోనే ఆయన చెప్పగలిగాడు. రాజ్యాంగం ఎన్నో గొప్ప, విశ్వజనీన వాగ్దానాలను చేసింది. అయితే మత హింస అనే మన దేశ వాస్తవికతకు అది లొంగిపోయింది. వాక్ స్వాతంత్య్రంపై చర్చలో ముందు వరు సన నిలిచే పాత్రికేయులు ఈ సమస్యకు ఉన్న మంచి, చెడు అనే రెండు పార్శ్వాలను చూడటం తేలికేం కాదు. చార్లీ హెబ్డో యూదు వ్యతిరేకత కార ణంగా తమ పాత్రికేయుల్లో ఏ ఒక్కరిని తొలగిం చడం నేను ఎరుగను. ఇస్లాంపై దాడి చేయడంలో ఆ పత్రిక చూపే ఉత్సాహాన్ని చూసి, అలాంటి ఉదం తం జరిగిందని తెలిసి ఆశ్చర్యపోయాను. ‘సినె’ కలం పేరుతో పని చేసే సైన్ మారిస్ సినె (80) అనే పాత్రికేయుడు 2009 జూలైలో చార్లీ హెబ్డో అనే ఆ వ్యంగ్య పత్రికలో రాసిన ఒక కాల మ్కు గానూ యూదు వ్యతిరేక విద్వేషాన్ని రెచ్చ గొట్టిన ఆరోపణలను ఎదుర్కొంటున్నట్టు ‘డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక అప్పట్లోనే తెలిపింది. ఆ రచన పారిస్ మేధావి వర్గంలో అత్యంత ఆగ్రహావేశ భరిత మైన చర్చను రగిల్చింది. సినెను ఆ పత్రిక నుండి తొలగించడంతో అది ముగిసింది. ఆ వివాదాస్పద కాలమ్‌లో సినె 22 ఏళ్ల సర్కో జీకి, ఒక ఎలక్ట్రానిక్స్ గూడ్స్ చెయిన్ వారసురాలు, యూదు జాతీయురాలు అయిన జెస్సీకా సెబావన్ దోర్తీతో నిశ్చితార్థం వార్త ఆధారంగా... నాటి అధ్య క్షుని కుమారుడు యూదు మతంలోకి మారడానికి రంగం సిద్ధం చేసుకున్నాడనే నిరాధారమైన పుకారు పుట్టింది. దానిపై సినె వ్యాఖ్యానిస్తూ, ఆ పిల్లాడు భవిష్యత్తులో బాగా పైకి వస్తాడంటూ పరిహాసోక్తిని విసిరాడు. యూదులకు, సామాజికంగా విజయవంతం కావడానికి ముడిపెట్టి ఆ కాలమ్ పక్షపాత వైఖరిని ప్రదర్శించిందంటూ అత్యున్నతస్థాయి రాజకీయ వ్యాఖ్యాత ఒకరు ఘాటుగా దుయ్యబట్టాడు. చార్లీ హెబ్డో సంపాదకుడు ఫిలిప్పె వాల్ క్షమాపణ చెప్పా లని సినెను కోరాడు. కానీ అతగాడు తిరస్కరించి, అంతకంటే తన మర్మావయాలను కత్తిరించుకుం టానని కేకలేశాడు. సినెను తొలిగించాలన్న వాల్ నిర్ణయాన్ని తత్వవేత్త బెర్నార్డ్ హెన్రీ లెవీ సహా సుప్రసిద్ధ మేధావులంతా సమర్థించారు. కొందరు వామపక్ష వ్యక్తి స్వేచ్ఛావాదులు మాత్రమే వాక్ స్వాతంత్య్రం పౌరుల హక్కు అంటూ సినెను సమర్థించారు. వారిదీ కపటత్వమే కావచ్చు. అయితే మనం దరిలాగే చార్లీ హెబ్డోకు కూడా వాక్ స్వతంత్రంపై సందేహాలున్నాయి. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) Aakar.patel@icloud.com