దేశాన్ని ప్రేమించడానికి 10 పద్ధతులు | Aakaar patel guest column avalokanam | Sakshi
Sakshi News home page

దేశాన్ని ప్రేమించడానికి 10 పద్ధతులు

Published Sun, Aug 21 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

దేశాన్ని ప్రేమించడానికి 10 పద్ధతులు

దేశాన్ని ప్రేమించడానికి 10 పద్ధతులు

అవలోకనం
దేశాన్ని ప్రేమించడమంటే దేశ ప్రజల పట్ల సహానుభూతిని ప్రదర్శించడమే. నిర్లక్ష్యానికిగురైన, బలహీనుల బాధను మీరు అనుభవించగలగాలి. దళితులు గాయపడితే మీకు బాధ కలగాలి. ఆదివాసులు అవమానానికి గురైతే మీకు అవమానమనిపించాలి. దేశంలో తరచుగా జరుగుతున్నట్టు ముస్లింలపై హింసాకాండ జరిగితే అందుకు మీరు సిగ్గుపడాలి. ఇంతటి విశాల ప్రజానీకంపై ఏకత్వాన్ని రుద్దడం మొత్తంగా ఈ దేశాన్ని ప్రేమించడం కాదు. భాష, మతం లేదా మరి దేనికి చెందినదైనా ఆ ఏకత్వం నా దష్టిలో దేశాన్ని ప్రేమించడం కాదు.

1) మొదటిది మౌలికంగా మీరు భారతీయులై ఉండటం. అంటే మీకు భారత పాస్‌ పోర్ట్‌ ఉండటం అని నా భావన. నాకు సంబంధించి నాకు మూడు పాస్‌పోర్ట్ట్‌లున్నాయి. భారతీయులు ముందస్తుగానే వీసాలు పొంది ఉండటం చాలా దేశాల్లో అవసరం. నేనేమో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాను. కాబట్టి దీర్ఘకాలిక చెల్లుబాటున్న వీసాల కోసం కాలం చెల్లిన రెండు పాస్‌పోర్టులను కూడా నేను వెంట పట్టుకుపోవాల్సి వస్తుంది. నిజానికి నేను విదేశాల్లో పని చేసింది తక్కువే. అయితే  పనిచేయగలిగినంత కాలమూ విదేశాల్లోనే గడిపేసినా భారత పాస్‌పోర్టు లను తమతోనే ఉంచుకున్న కొందరు భారతీయులను నేను ఎరుగుదును. సంగీత దర్శకుడు జుబిన్‌ మెహతా అలాంటి వారిలో ఒకరు. లండన్‌లోని ఆమ్నెస్టీ ఇంట ర్నేషనల్‌ సెక్రటరీ జనరల్‌ సలీల్‌ శెట్టీ మరొకరు. మెహతా చాలా ఏళ్లపాటూ న్యూయార్క్‌ ఫిల్‌హార్మోనిక్‌కు నేతత్వం వహించారు. ఆ బందంలో ఆయన ఒక్కరే వీసా కోసం క్యూలో నిలబడాల్సివచ్చేది. అయినా ఆయన భారత పాస్‌ పోర్ట్‌ను ఉంచుకోవాలనే కోరుకున్నారు.

2) ఇక రెండవది, భారతీయులను ప్రేమించడం ద్వారా దేశాన్ని ప్రేమించగల గడం. భారతీయులందరినీ, మీ మతానికి చెందినవారినే కాదు, ఇతర మతస్తు లను, ఇతర కులస్తులను, ఇతర భాషల వారినందరినీ అని నా అర్థం. మీతో అంగీకరించేవారిని, విభేదించేవారినీ, ఎలాంటి మాంసాన్నయినాగానీ తినేవారిని, తినని వారినీ అందరినీ ప్రేమించడం. భారతీయులందరినీ ప్రేమించడమే నిజంగా భారతదేశాన్ని ప్రేమించడం.

3) దేశాన్ని ప్రేమించడానికి ఉన్న మూడో పద్ధతి, సాధ్యమైనన్ని దేశ భాషలను నేర్చుకోవడం. భారతీయులంతా తప్పనిసరిగా దేవనాగరి, పర్షియన్‌ అరబిక్‌ లిపులు రెండిటిలోనూ హిందుస్థానీ భాషను నేర్చుకోవాలని గాంధీ చెప్పారు. నేనలా చేశానుగానీ, అందరూ హిందుస్థానీ నేర్చుకోవాలంటే అంగీకరించను.

4) భారతదేశాన్ని ప్రేమించడానికి ఉన్న నాలుగో మార్గం శాస్త్రీయ సంగీతాన్ని, కవిత్వాన్ని అర్థం చేసుకోవడం. ఎక్కువగా ఇది పెద్దయ్యాక చేసే పని. ఎందుకంటే హిందుస్థానీ సంగీతం పరిణతి చెందినది. అది ఒలికించేది ఆనందాన్ని కాదు విషాదాన్ని. ఖాయ, కర్ణాటక సంగీతాలను అర్థంచేసుకోకుండా, గాయకులు కళ్లు మూసుకుని వాటిని అలాగే ఎందుకు నిర్వహిస్తారో అర్థం చేసుకోకుండా ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలను నిజంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. షెల్లీ ఓజీమండీయస్‌లాగే నాకు పలు పద్యాలు కంఠస్తా వచ్చు. నరేష్‌ మెహతా (గాంధీకి ఇష్టమైన వైష్ణవ జన్‌ గీత రచయిత) రాసిన నాగ్‌ దమన్‌ను చదివిన లేదా విన్న ప్రతిసారీ అది నన్ను బాగా కదిలించేస్తుంది. అది, బాల కష్ణుడు  కాళీయు డనే సర్పాన్ని వధించకుండా, దానితో పోరాడటం గురించినది. ఆ పద్యాన్ని విన్నప్పుడు, ప్రత్యేకించి దానికి మంద్ర సంగీతాన్ని జోడించి వినిపిస్తే తరచుగా కన్నీరు పెట్టేంతగా చలించిపోతుంటానని చెప్పుకోడానికి నేనేమీ సిగ్గు పడను.

5) ఇక దేశాన్ని ప్రేమించడానికి ఉన్న ఐదో పద్ధతి దేశీయ ఆహారాన్ని ప్రేమించ డమే. అలా అని ఇతరుల ఆహారాన్ని మనం ద్వేషించి తీరాలని అర్థం కాదు. ఈ విషయంలో నాది విశాల దష్టి. కొన్నేళ్ల క్రితం నేను వియత్నాం వెళ్లాను. హనా య్‌లో ఒకే రోజున పాము, కుక్క మాంసాలను తిన్నాను. జపాన్‌ వంటకాలంటే నాకు మహా మక్కువ. అయినా భారతీయ భోజనాన్నే కోరుకుంటాను. అన్నిటికీ మించి రైతు పాటిదార్‌ల మందపాటి జొన్న రొట్టెతోపాటూ ఓ కాయగూర, వెల్లుల్లి పచ్చడి అంటే నాకు మహా ఇష్టం. మ«ధ్యాహ్న భోజనంగా ఎక్కువగా అదే తీసుకుంటాను. ఇక జీవితాంతం ప్రతి రోజూ అదే తినమన్నా తినగలను.

6) ఇక దేశ రాజ్యాంగాన్ని చదవడం, తెలుసుకోవడం మీరు మీ దేశాన్ని ప్రేమిం చగల ఆరో మార్గం. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగాలలో ఒకటి. దాన్ని అర్థం చేసుకోవడమంటే దాని తొలి మాటలను, అవతారికను,  దాని ప్రాధాన్యాన్ని, అది వాగ్దానం చేసిన ప్రాథమిక హక్కులకు నిజమైన అర్థం ఏమిటి అని తెలుసుకోవడమనే. మనలో చాలామంది దాన్ని వంట బట్టించుకోవాలి.

7) దేశా నికి సేవలందించిన వారిని గౌరవించడం ఏడో మార్గం. క్రీడాకారుల  కంటే ఉపా ధ్యాయులే ఎక్కువ ప్రాముఖ్యత గలవారని నా అభిప్రాయం. క్రీడాపరమైన విజయం జాతీయవాదాన్ని పెంపొందింపజేస్తుంది గానీ, అది ఉత్త డొల్ల.

8) భారత్‌ను ప్రేమించడానికి ఉన్న ఎనిమిదో మార్గం, నేను కట్టాల్సి ఉన్న పన్నులను చెల్లించడమే. దీంట్లో గర్వపడాల్సిందేమీలేదు, చేయాల్సినది చేస్తున్నా నంతే. కానీ మనలో చాలామంది ఆదాయపు పన్ను చెల్లించరు. వారిలో చాలా మంది పేదలో లేక మినహాయింపు పొందినవారో కాబట్టి చెల్లించాల్సిన అవసరం లేనివారు. నేను వారి గురించి చెప్పడం లేదు. పన్నుల చెల్లింపులో మోసాలకు పాల్పడే ఉన్నత, మధ్య తరగతులకు చెందిన వారిని.. మీరు దేశాన్ని ప్రేమిస్తు న్నారా? అని ప్రశ్నిస్తున్నాను. మీరు అవును అంటారు. నేను కాదు అంటాను.

9) దేశాన్ని ప్రేమించడానికి ఉన్న తొమ్మిదోమార్గం దేశ ప్రజల పట్ల సహాను భూతిని ప్రదర్శించడమే. నిర్లక్ష్యానికి గురైన, బలహీనుల బాధను మీరు అనుభ వించగలగాలి. దళితులు గాయపడితే మీకు బాధ కలగాలి. ఆదివాసులు అవ మానానికి గురైతే మీకు అవమానమనిపించాలి. దేశంలో తరచుగా జరుగుతు న్నట్టూ ముస్లింలపై హింసాకాండ జరిగితే అందుకు మీరు సిగ్గుపడాలి. దేశాన్ని ప్రేమించ డమనే భావన, ఈ సహానుభూతి ఒక్కటే.

10) ఇక దేశాన్ని ప్రేమించడానికి ఉన్న చివరి మార్గం.. దేశంలో ఉన్న వైరుధ్యాలు, విభేదాల పట్ల విశాల దష్టితో ఉండటం. ఇంతటి విశాల ప్రజానీకంపై ఏకత్వాన్ని రుద్దడం అంటే మొత్తంగా ఈ దేశాన్ని ప్రేమించడం కాదు. ఆ ఏకత్వం భాష, మతం లేదా ప్రత్యేక శిక్షాస్మతికి చెందినదైనా, ఆహారపరమైన, సంగీతపరమైన ప్రాధాన్యానికి సంబంధించినదైనా నా దష్టిలో దేశాన్ని ప్రేమించడం కాదు. నా అభిప్రాయాలతో మీరు విభేదించవచ్చు, అయిష్టపడవచ్చు, నన్ను ద్వేషిం చవచ్చు కూడా. అయినా నేను మిమ్మల్ని ఎప్పటిలాగే ప్రేమిస్తాను.

- ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement