
భారతదేశంలో త్రిభాషా సూత్రంపై మరొక సారి విస్తృతమైన చర్చ జరుగుతోంది. దక్షిణ భారత రాష్ట్రాలు భాషా అస్తిత్వాలపరంగా తమ ఉనికిని చాటుకోవటానికి ఎప్పటినుండో పోరాటం చేస్తున్నాయి. ప్రపంచంలోనే దక్షిణ భారత భాషలకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రావిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధిచెందాయి: బ్రాహుయీ, మాల్తో, కూడుఖ్, గోండి, కొండ, కూయి, మండ, పర్జి, గదబ, కోలామీ, పెంగో, నాయకీ, కువి, తెలుగు, తుళు, కన్నడం, కొడగు, టోడా, కోత, మలయాళం, తమిళం. మధ్య ద్రావిడ భాషల్లో తెలుగు ఉంది. దక్షిణ ద్రావిడ భాషల్లో తమిళం ఉంది.
వాఙ్మయ దృష్టితో కాకుండా భాషా చారిత్రక దృష్టితో చూస్తే మధ్య ద్రావిడ భాషల్లో గోండి, కొండ, కూయి; దక్షిణ ద్రావిడ భాషల్లో తుళు, టోడా ప్రాచీనమైనవి. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్స రాల నాడు మూల ద్రావిడ భాష నుంచి ఈ భాషలు ఒకటొకటి స్వతంత్రతను సంతరించుకున్నాయని భాషా చరిత్రకారులు చెబు తుంటారు. ఒకటొకటి స్వతంత్ర భాషగా రూపొందడానికివెయ్యేండ్లు పట్టింది. ఈ భాషల మూలాలు దక్షిణాది జీవన వ్యవస్థల నుండి ఆవిర్భవించాయి. అంబేడ్కర్ తన ‘రాష్ట్రాలు – అల్పసంఖ్యాక వర్గాలు’ పుస్తకంలో వీటి అస్తిత్వాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఏ మూడు భాషలు?
దేశ పాఠశాలల్లో బాలలకు మూడు భాషలు బోధించాలన్న విధానం అధికారికంగా త్రిభాషా సూత్రంగా ప్రసిద్ధమయింది. 1968లో ఈ సూత్రానికి సర్వజనామోదం లభించింది. ఈ ప్రకారం పాఠశాల బాలలకు, హిందీ భాషా రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్, ఆధు నిక భారతీయ భాష (ఏదైనా ఒక దక్షిణాది భాష)ను బోధించాలి. హిందీయేతర రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషను బోధించాలి. దక్షిణ భారతావనిలో హిందీ వ్యతిరేక నిరసనలు వెల్లు వెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ త్రిభాషా సూత్రం ఆమోదం పొందింది.
తొలుత రాధాకృష్ణన్ కమిషన్ (1948) ప్రతిపాదించిన ఈ త్రిభాషా సూత్రాన్ని విద్యావేత్త కొఠారి నేతృత్వంలోని తొలి విద్యా కమిషన్ అంగీకరించింది. దరిమిలా 1960లో, 1980ల్లో కేంద్రం రూపొందించిన ప్రథమ, ద్వితీయ జాతీయ విద్యా విధానాలలో ఈ సూత్రం భాగమైంది. అయితే నేర్పవలసిన త్రిభాషలు ఏవి అనేది ఆయా భాషా రాష్ట్రాల పాలకులు నిర్ణయించుకోవాల్సి వుంది.అందుకే హిందీని రెండవ భాషగానో, మూడవ భాషగానోఅంగీకరించకపోతే ‘సర్వ శిక్షా అభియాన్’ కింద పంపే నిధులు పంప మని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
కేంద్ర పాలకులు భాషా అస్తిత్వాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తు న్నారు. రాజ్యాంగంలో రాష్ట్రాల అస్తిత్వం గురించి ఇలా చెప్పారు: భారత రాష్ట్రాలు కలిసి శాసన, కార్యనిర్వాహక, పరిపాలనా అవస రాల కోసం భారత సంయుక్త రాష్ట్రాలు అనే పేరు మీద ఒక రాజకీయ రూపాన్ని తీసుకోవటానికి ఆదేశించుకుంటున్నాయి. ఈ స్ఫూర్తితో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ నాడుపై హిందీని బలవంతంగా రుద్దకపోతే డీఎంకే దానిని వ్యతిరేకించదన్నారు. ‘డీఎంకే ఇప్పటికీ హిందీని ఎందుకు వ్యతిరేకిస్తుందని అడిగే వారికి, మీలో ఒకరిగా నా వినయపూర్వక సమాధానం ఏమి టంటే... మీరు రుద్దకపోతే మేము వ్యతిరేకించం.
తమిళనాడులో హిందీ పదాలను నలుపు రంగులోకి మార్చం. ఆత్మగౌరవం అనేది తమిళుల ప్రత్యేక లక్షణం. ఎవరైనా దానితో ఆడుకోవడానికి మేము అనుమతించం’ అన్నారు. రాష్ట్రంలో భాషా వివాదం చెలరేగు తున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన డీఎంకే శ్రేణులకు లేఖ రాశారు.
భాషల కోసం పోరాటం
స్టాలిన్ వాదనలో ఒక సత్యం ఉంది. మాతృభాష ప్రతి రాష్ట్రంలోని విద్యార్థికి అత్యవసరం. దక్షిణాదిలో ఉన్న భాషా మూలాలను బట్టి వారికి రెండవ భాషగా దక్షిణాది భాష త్వరగా వస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లిష్ అన్ని రాష్ట్రాల విద్యార్థులు నేర్చుకోవడం వల్ల ఏ దేశంలోనైనా ఉపాధిని సంపాదించుకోవచ్చు. తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ కాలంలోనే తమిళ భాషా అస్తిత్వం కోసం పోరాడిన చరిత్ర ఉంది.
అలాగే తెలుగువారు కూడా తమ భాషా అస్తిత్వాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. నిజానికిఆంధ్రులు అనేక భాషల వారితో బాధింపబడినా తమ అస్తిత్వ పోరా టాల్ని బలంగా చేశారు. శాతవాహనుల కాలం నుండి సంస్కృత భాషలో, ప్రాకృత భాషలో పాలకులు ఉన్నప్పుడు, తెలంగాణలో ఉర్దూ భాష పాలకులు ఉన్నప్పుడు కూడా తెలుగువారు తమ లిఖిత భాషా సంప్రదాయాన్ని కొనసాగించారు.
తమిళనాడును ఎంతో కాలం పాలించిన కరుణానిధి ప్రెస్‌మీట్‌లో కూడా తమిళంలోనే మాట్లాడి దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత విలేఖరులకు ఉందని చెప్పడం ఒక ఆత్మాభిమాన ప్రకటన!క్రీ.శ.1901లో శ్రీ కృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయం కొమర్రాజు లక్ష్మణరావు పంతులు ప్రోత్సాహంతో స్థాపించబడిన తరువాత తెలుగులో భాషోద్యమంతో పాటు, గ్రంథాలయాల ప్రాధా న్యత పెరిగింది. 1906వ సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి ప్రారంభంతో సాహిత్య ప్రచురణకు కూడా ఉత్సాహం వచ్చింది.
తెలుగు భాషాభివృద్ధికి అన్ని ప్రాంతాల మేధావులు కృషి చేశారు. ఏ భాషోద్యమమైనా ఆ భాషా ప్రజల చరిత్రకు, పరిణామాలకు మూల శక్తి అవుతుంది. భాషను విస్మరించిన రాష్ట్రాలు తమ ఉనికిని కోల్పో తాయి. తెలుగు భాష గ్రంథస్తం కాకపోవడానికి వీరికి రాజ భాషగా సంస్కృత, ప్రాకృతాలు 900 యేండ్లు వ్యవహరించడం. అయినా తట్టుకొని నిలబడటమే గొప్ప అంటారు బి.ఎన్.శాస్త్రి. ‘‘ఆంధ్ర దేశ మున రాజభాషగా ప్రాకృతము క్రీ.పూ. 300 నుండి క్రీ.శ. 300 వరకు వర్ధిల్లినది.
అటు పిమ్మట క్రీ.శ. 300–600 వరకు సంస్కృతము రాజ భాషయైనది.... గాథాసప్తశతి, బృహత్కథ, లీలావతి వంటి ప్రాకృత గ్రంథములందు అనేక తెలుగు పదములున్నవి. ప్రాకృత, సంస్కృత భాషల కన్న భిన్నమైన దేశభాష అనగా తెలుగు వాడుకలోనున్నట్లు శర్వవర్మ–గుణాఢ్యుల సంవాద గాథ తెలుపుచున్నది.’’
ఉత్తరాదివారూ నేర్చుకోవాలి!
వాస్తవానికి మోదీ సర్కార్ జాతీయ విద్యా విధానంలో హిందీని ప్రస్తావించకపోవడం ద్వారా త్రిభాషా సూత్రాన్ని అస్పష్టపరిచింది. ఈ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం తాను ఎంపిక చేసిన ఏ మూడు భాషలనైనా బోధించవచ్చు. అయితే ఆ మూడు భాషలలో రెండు తప్పనిసరిగా దేశీయ భాషలు అయివుండాలి. ఈ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కోరుకుంటే, తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో ఒకదాన్ని, ఆంగ్ల భాషను బోధించవచ్చు. నిజానికి ఉత్తరాదికి దక్షిణాదివారు, దక్షిణాదికి ఉత్తరాదివారు ప్రయాణం చేస్తున్న కాలం ఇది.
దక్షిణాది భాషలు ఉత్తరాదిలో ఎగ తాళికి గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇంగ్లిష్‌ను ఎటూ ప్రపంచ భాషగా చదువుతున్నారు. ఉత్తరాది వారికి దక్షిణాది చరిత్ర, దక్షిణాది వారికి ఉత్తరాది చరిత్ర తెలియాలి. ఒకరి భాషా ఒకరికి, ఒకరి వస్తువుల పేర్లు మరొకరికి, ఒకరి తినుబండారాల పేర్లు మరొకరికి అర్థం కావాలంటే ఉత్తరాది వారు కూడా దక్షిణాది భాషల్లో ఒక భాషను నేర్చుకోవాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది.
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నీ భారతీయ భాషలే, అన్నింటికీ సమ ప్రాధాన్యత ఉండాలని నొక్కి చెప్పారు. ఫెడరల్ సూత్రాలను ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. ఉత్తరాది సంప్రదాయశీలమైంది, దక్షి ణాది పురోగమన శీలమైంది. ప్రతి రాష్ట్రానికి ఇచ్చిన హక్కుల్ని కాపాడటం కేంద్ర ప్రభుత్వ విధి.
» పాఠశాలల్లో బాలలకు మూడు భాషలు బోధించా లన్న విధానం అధికారికంగా త్రిభాషా సూత్రంగాప్రసిద్ధం. 1968లో దీనికి ఆమోదం లభించింది.
» హిందీని బలవంతంగా రుద్దకపోతే దానిని వ్యతిరేకించం అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.
» త్రిభాషా సూత్రం ప్రకారం, హిందీ భాషా రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ఒక ఆధునిక భారతీయభాష (ఏదైనా దక్షిణాది భాష)ను బోధించాలి. కానీ ఇది విస్మరణకు గురైంది.
-వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695
-డా‘‘ కత్తి పద్మారావు
Comments
Please login to add a commentAdd a comment