aakarpatel
-
హిందూ దేవతలు అందరివారూ కారా?
అవలోకనం మన దేశంలో మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లో అందరికీ ప్రవేశం ఉంటుంది. హిందూ శాస్త్రాలు విదేశీయులకు, ఇతర మతస్తులకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించినట్టు లేదు. నిషేధించి ఉంటే, అన్ని దేవాలయాల్లోనూ అదే నిబంధన ఉండేది. కానీ లేదు. అయినా ముఖ్య దేవాలయాలు నానాటికీ మరింత ఎక్కువగా విదేశస్తులకు, హిందూయేతరులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయి. ఒరియా ప్రజల్లో దుర్యోధన పేరు సర్వసాధారణం. అలాగే దుశ్శాసన పేరు కూడా. భువనేశ్వర్, పూరీలను సందర్శించేంత వరకు అది నాకూ తెలీదు. పూరీ లోని సుప్రసిద్ధ జగన్నాథ ఆలయాన్ని చూడటానికి ఈ వారం అక్కడికి వెళ్లాను. ఇలాంటి ప్రదేశాల చరిత్ర, అద్భుత నిర్మాణ కౌశలాల కారణంగా సాధారణంగా వాటిని నేను సందర్శిస్తుంటాను. బయటకు చూడటానికి భారత సంస్కృతి దేశం అంతటా ఒక్కటిగా కనిపించినా, అలా ఉండదనే విషయాన్ని గుర్తించడానికి కూడా అవి తోడ్పడతాయి. తండ్రి తన కొడుక్కి మహా భారతంలోని విలన్‌గా మనకు తెలిసిన దుశ్సాసనుని పేరు పెట్టడం దేశంలో మరెక్కడైనా దిగ్భ్రాంతిని కలుగజేస్తుంది. ఒరియా ప్రజలు ఆసక్తికరమైన వారు, కుర్చీ ఉద్యోగస్తులకు లోతుగా వేళ్లూనుకున్న వారి సంస్కృతి కొరుకుడు పడటం కష్టమే. జగన్నాథ ఆలయం బయట హిందువులకు మాత్రమే ప్రవేశమని పలు భాషలలో రాసి ఉన్న బోర్డు కనిపించింది. దీని వెనుక ఉన్న తర్కం ఏమిటో నాకు అర్థం కాలేదు, ఒప్పుకుంటాను. నేను చూసిన ^è ర్చిలు వేటిలో, వాటికన్లోని అతి సుప్రసిద్ధ చర్చిలో సైతం ఇలాంటి నిబంధనేదీ లేదు. వాటికన్లో, అక్కడి పురాతత్వ వస్తువులను సగర్వంగా మనకు చూపుతారు. సౌదీలు ముస్లిమేతరులను మక్కాకు అనుమతించరు. అయితే చాలా ఏళ్ల క్రితం గురునానక్ మక్కా యాత్ర చేశారని చెప్పారు. కొన్నేళ్ల క్రితం నేను, స్థానిక మిత్రులతో కలసి లాహోర్‌లోని గురు అర్జున్‌సింగ్ గురుద్వారాను సందర్శించాను. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్టినది కావచ్చు అక్కడ ‘ముస్లింలకు ప్రవేశం నిషిద్ధం’ అనే బోర్డు ఉంది. దాన్ని పట్టించుకోకుండా మేం లోపలికి వెళ్లాం. గురుద్వారా సంరక్షకులు నాతో పాటూ వచ్చినవారు ఎవరని అడిగితే అబద్ధం చెప్పలేదు. స్థానిక మిత్రులలో ఒకరి కుమారుడి పేరు అర్జున్ అని తెలిసి ఆ సిక్కులు పిల్లాడితో ఆడుకుంటామని, అతడ్ని తమతో వదిలి మిగతావారు గురుద్వారా అంతా చూసిరండని పట్టుబట్టారు. మన దేశంలో మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లో అందరికీ ప్రవేశం ఉంటుంది. స్థానిక మసీదులోకి వెళ్లి చూసి రమ్మని హిందువులకు చెబుతుంటాను. వారికి అక్కడ స్వాగతం పలుకుతారు. ఇస్లాం మతంలో ఆసక్తి ఉన్నా లేకున్నా మసీదు సందర్శన ఉపయోగకరమనే అనిపిస్తుంది. మన మతంలో పుట్టకపోయినా దాని పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆలయ సందర్శన అనుభవాన్ని ఎందుకు నిరాకరిస్తున్నట్టు? హిందూ శాస్త్రాలు అలాంటి నిషేధాన్ని శాసించడం అందుకు కారణం కాజాలదు. అదే నిజమైతే అన్ని దేవాలయాల్లోనూ ఆ నిబంధన ఉండేది. కానీ లేదు. అయితే ప్రధాన దేవాలయాలు నానాటికీ మరింత ఎక్కువగా విదేశస్తులకు, హిందూయేతరులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరిస్తుండటం కనిపిస్తుంది. క్రైస్తవునిగా జన్మించిన గొప్ప గాయకుడు జేసుదాస్, భజన గీతాలను ఆలపించాలని కోరుకుంటున్న గురువాయూర్ వంటి ఆలయాల్లోకి ఆయనకు ప్రవేశాన్ని నిరాకరిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 30న ఆయన, తనకు హిందూ కట్టుబాట్లలో విశ్వాసం ఉన్నదని అఫిడవిట్‌ను సమర్పించిన తర్వాతనే ఆ ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ ఆలయాలు ఎప్పడూ కొందరు ప్రజలకు, ప్రత్యేకించి ఇతర హిందువులకు ప్రవేశాన్ని నిరాకరిస్తూనే ఉన్నాయి. స్వామినారాయణ్ శాఖీయుల ఆలయాలు (మా పాటీదార్ కులస్తుల నిర్వహణలో ఉంటాయి) దిగువ కులాల ప్రవేశానికి ఇష్టపడవు. 1930లలో గాంధీ ఈ విషయంపైనే నిరాహార దీక్ష చేపట్టారు. అయినా ఆ శాఖవారు దిగువ కులస్తుల ఆలయప్రవేశాన్ని అనుమతించ లేదు, పైగా తాము హిందూయేతర మైనారిటీ అని కోర్టులో వాదించారు. కుల çస్వచ్ఛత అనే దురభిమానమే ఆలయాల ప్రవేశాన్ని అందరికీ అనుమతించకపోవడానికి కారణం కావచ్చా? కాదనే అనుకుంటున్నా. ఇందిరా గాంధీ హిందువుగా పుట్టారు, ఆమెకు హిందూ దహన సంస్కారాలే జరిగాయి. జగన్నాథ ఆలయ పాండాలు ఆమెకు ప్రవేశాన్ని నిరాకరించారు. 2012లో వాళ్లు ‘సనాతన హిందువులకు మాత్రమే ప్రవేశం’ అనే బోర్డును పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ బోర్డు నాకైతే కనబడలేదుగానీ, ఇప్పటికీ నాకు అది అంతుబట్టడం లేదు. సనాతన హిందూమతం పూర్తిగా వర్ణ వ్యవస్థకు సంబంధించినదే. దాన్ని పాటించడాన్ని రాజ్యాంగంలోని 14 నుంచి 17 వరకు గల అధికరణలు నిషేధించాయి. వర్ణాశ్రమ ధర్మాలను (అంటరానితనాన్ని పాటించడం. శూద్రులు వేదాధ్యయనానికి తగరని అంగీకరించడం అని అర్థం) పాటించే వారే సనాతన హిందువులు. మరిక పాండాలు ఎవరినీ ఆలయంలోకి అనుమతించేట్టు? ఒరియా మహిళను పెళ్లి చేసుకున్న అమెరికన్ ఒకరు రథయాత్రలో పాల్గొన యత్నించగా పాండాలు చితకబాదారు. ఆ ఘటన తదుపరి ఈ బోర్డును పెట్టారు. శిల్పి బోరాల్ అనే ఆ మహిళ ‘‘ఇది అన్యాయం. జగన్నా«థుణ్ణి విశ్వానికంతటికీ అధినాధునిగా పరిగణిస్తుండగా నా భర్తకు ఎవరైనా గానీ అనుమతిని ఎలా నిరాకరిస్తారు?’’ అన్నట్టు వార్తలు తెలిపాయి. ఆమె లేవనెత్తిన అంశం అర్థం అవుతూనే ఉంది. పూరీ ఆలయంతోపాటూ ఇతర ఆలయాలన్నీ ప్రజలకు ప్రవేశాన్ని ఎందుకు నిరాకరిస్తున్నాయో వివరించాలి. జగన్నాథ ఆలయం నిర్మాణకౌశలంలాగే, దేవతామూర్తులు కూడా విశిష్టమైనవి. సర్వగుణశోభితమైన మానవాకృతుల రూపంలోని దేవతలకు భిన్నంగా ప్రత్యేకంగా ఉంటాయి. అంతిమ హారతి సమయంలో వెళ్లాం కాబట్టి భక్తులు కొందరే ఉన్నారు. దేవతా మూర్తిని చూశాక, నేను ఆ సమూహాన్ని చూడటానికి వెనక్కు తిరిగాను. దైవారాధనలో హిందువులు చేతులు పైకి చాచి దండం పెడుతూ, సాష్టాంగపడి, పొర్లుతూ ఇతర మతస్తులకంటే ఎక్కువ ప్రదర్శనాత్మకంగా ఉంటారు. మనం చేసే ప్రార్థన, చర్చి, మసీదు, గురుద్వారాల్లోలా మతపరమైనది కాదు, వ్యక్తిగతమైనది. దేవతా ‘విగ్రహం’ మనల్ని చూసిందని రూఢి చేసుకోవడం అవసరం. కాబట్టి ప్రత్యేకంగా కనబడటం కోసం ఏదో ఒకటి చేస్తాం. వచ్చినవారిలో చాలా మంది మొహాలు బాగా పేదవి, నిజమైన భక్తి, ఉద్వేగం, విశ్వాసం నిండి కనిపించాయి. వారిని చూసి నేను చలించిపోయాను. అలాంటి క్షణాలను అనుభూతి చెందడానికి మనం మరింత మందిని అనుమతించాలని ఆశిస్తాను. హిందూ భక్తిలోని ఉద్వేగం, పారవశ్యం చూసేవారికి కనువిందు చేస్తాయి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఈ-మెయిల్ : aakar.patel@icloud.com -
ఎదురు గాలిగా మారని ప్రభుత్వ వైఫల్యాలు
అవలోకనం పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ తాజా నివేదిక, అర్థిక వ్యవస్థ క్షీణతలను ప్రభుత్వ వ్యతిరేక పవనాలుగా మార్చవచ్చని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ అల్ప ఆర్థిక వృద్ధి రేట్లతోనే విస్తృత జనాదరణను కలిగివుండి, పలుమార్లు విజయాలను సాధించారు. కాబట్టి కనీసం రాబోయే కొన్ని మాసాలపాటైనా మోదీ నిశ్చింతగా ఉండవచ్చు. గత వారం నేను బెంగళూరులో ఒక కళాశాలలోని పెద్ద హాలులో వెయ్యి మంది విద్యార్థుల బృందంతో మాట్లాడాను. వారిలో ఎక్కువ మంది ఆర్థికశాస్త్ర విద్యార్థులు. నాతో పాటూ ఇద్దరు పార్లమెంటు సభ్యులు కూడా వేదికపై ఉన్నారు. ‘‘యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్ల సగటు వృద్ధి కంటే గత మూడేళ్లలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వేగంగా వృద్ధి చెందిందని మీలో ఎంత మంది అనుకుంటున్నారు?’’అని శ్రోతలను ప్రశ్నించాను. జీడీపీ నేడు ఎక్కువ వేగంగా వృద్ధి చెందుతుందనుకునే వారిని చేతులెత్తమన్నాను. దాదాపుగా విద్యార్థులంతా చేతులెత్తారు. కానీ, యూపీఏ హయాంలో జీడీపీ సగటు వార్షిక వృద్ధి ఏడాదికి 8 శాతం. కాగా, ఆ తర్వాత గత మూడేళ్ల ఎన్డీఏ పాలనలో ఏ ఒక్క ఏడాదీ ఆ వృద్ధి రేటును అందుకోలేదనేది వాస్తవం. ముందే చెప్పినట్టుగా వాళ్లలో చాలా మంది ఆర్థికశాస్త్ర విద్యార్థులు కాబట్టి వారికి ఈ విషయం బాగా తెలిసి ఉండాల్సింది. కానీ, గణాం కాలను రాజకీయాల ఆధారంగా చర్చించడం, ప్రత్యేకించి మన దేశంలో కష్టం. ఇటీవలి కాలంలోని రెండు ఘటనలను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన గాలిగా మార్చడానికి ఉపయోగించుకోవచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కాబట్టే నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. ఒకటి, పెద్ద నోట్ల రద్దు విఫలమైందనే వార్త. దాదాపుగా రూ. 1,000, రూ.500 నోట్లన్నిటినీ రూ. 2,000, రూ. 500 నోట్లుగా మార్చేసుకున్నారు. అంటే నల్లధనం తెల్లధనంగా మారిపోయిందని అర్థం. బ్యాంకులలో డిపాజిట్ కాని కొన్ని లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వదుల్చుకోగలమని ప్రభుత్వం భావించి ఉండినట్టయితే, అది జరగలేదు. ఇక ఇప్పుడు నల్లధనం సమస్య పరిష్కారానికి ఉన్న దారి నోటీసులు జారీ చేయడం, పన్నులను తిరిగి రాబట్టడమే. మన దేశంలో ఇది అంత సులువూ కాదు, త్వరగా జరిగిందీ కాదు. రెండు, పెద్ద నోట్ల రద్దు ఉగ్రవాదాన్ని లేదా భారత్‌లో ఉగ్రవాదంగా నిర్వచించేదాన్ని అణచడంలోను విఫలం కావడం. దేశంలోని సంఘర్షణాత్మకమైన మూడు ప్రాంతాలకు వెలుపల ఉగ్రవాద హింస వాస్తవానికి చాలా స్వల్పం. ఈ ఏడాది ఉగ్రవాదం వల్ల ఒకరు మృతి చెందితే, ముందటి ఏడాది 11 మంది, అంతకు ముందటి ఏడాది 13 మంది, ఇంకా ముందటి ఏడాది నలుగురు మాత్రమే మరణించారు. కానీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుకు, ఉగ్రవాదానికి మధ్య సంబంధం గురించి ప్రస్తావించినప్పుడు.. అది మాట్లాడేది జమ్మూకశ్మీర్‌లోని హింస గురించి. నోట్ల రద్దు కశ్మీర్లో హింసను తగ్గించిందని రక్షణమంత్రి చెప్పుకుంటున్నారు. అది జరిగిందా? లేదు. గత ఏడాది అక్కడ 267 మంది మరణించారు. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 239 మంది మరణించారు. అంటే ప్రభుత్వం చెబుతున్నట్టు నోట్ల రద్దు ఉగ్రవాదంపై ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు. మూడవది, చివరిది ప్రధాని అవినీతిని అరికట్టడానికి నోట్ల రద్దు సమర్థవంతమైన మార్గమని చెప్పారు. అది అత్యున్నత స్థానాలలోని అవినీతికి సంబంధించినది కాదు. ఇప్పటికే ఆయన అందుకు హామీని కల్పించారు. నగదు కొరత, ఇతర చోట్ల అవినీతిని అరికడుతుందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి నా వద్ద గణాంక సమాచారం లేదు కాబట్టి, పాఠకులే అది జరిగిందో లేదో నిర్ణయించాలి. ఇక ప్రతిçపక్షానికి ఉత్సాహాన్ని కలుగజేసిన మరో అంశం, ఆర్థిక వ్యవస్థ క్షీణి స్తున్నదనేది. దీనికి సంబంధించి మనవద్ద గణాంక సమాచారం ఉంది కాబట్టి, దీన్ని కచ్చితంగా చెప్పగలం. గత ఐదు త్రైమాసికల కాలంలోని ప్రతి త్రైమాసికానికీ మన ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. అంటే 15 నెలలుగా అది మందగిస్తూ ఉందని అర్థం. ఏప్రిల్, జూన్ మధ్య ఆర్థిక వ్యవస్థ 5.7 శాతం మాత్రమే వృద్ధి చెందిందని ప్రభుత్వ గణాంక సమాచారం తెలుపుతోంది. మీరు గనుక ప్రభుత్వ మద్దతుదార్లయితే, వస్తు సేవల పన్ను, సరుకుల నిల్వలను తగ్గించుకోవడం ఇందుకు కారణమని చెబుతారు. అంటే జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఉత్పత్తుల ధరలను నిర్ణయించేదెలాగో కంపెనీలకు కచ్చితంగా తెలియక జూన్‌లో వారు వస్తూత్పత్తిని నిలిపివేశారని, జూలై 1న జీఎస్టీని ప్రకటించాక గోదాములను ఖాళీ చేశారని అర్థం. మీరు ప్రభుత్వ ప్రత్యర్థులైతే ఈ క్షీణతకు కారణం జీఎస్టీ, నోట్ల రద్దు రెండింటి మిశ్రమ ఫలితమని అంటారు. న్యాయవాది అరుణ్ జైట్లీకి, రాజకీయశాస్త్రంలో కరస్పాండెన్స్ కోర్స్ డిగ్రీని పొందిన నరేంద్ర మోదీకి భిన్నంగా ఆర్థికశాస్త్రవేత్త అయిన మునుపటి ప్రధాని మన్మోహన్సింగ్... నోట్ల రద్దు వల్ల దేశ జీడీపీకి 2 శాతం పాయింట్ల మేరకు హాని కలుగుతుందని చెప్పారని, ఆయన అంచనా సరైందని రుజువైందని అంటారు. బహుశా ఆయన సరిగ్గానే చెప్పి ఉండొచ్చు. అయితే, ఆ పక్షానికి, ఈ పక్షానికి చెందని మన బోటి వాళ్లకు... ఆర్థిక వ్యవస్థ ఐదు త్రైమాసికల పాటూ వరుసగా మందగిస్తున్నదంటే అది ఏ ఒక్క దాని ఫలితమో కాదని స్పష్టమే. ఈ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు సంబంధించి మౌలికంగానే ఏదో లోపం ఉంది. కాబట్టి ప్రతిపక్షం ఈ వాస్తవాలు, గణాంకాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఒక మూలకు నెట్టేసి దెబ్బతీయగలమని, అందువలన తమకు సానుకూలత ఉంటుందని అనుకోగలదా? లేదు, అనే నా సమాధానం. చాలా తక్కువ ఆర్థిక వృద్ధిని మాత్రమే అందించినా, అత్యంత జనాదరణ కలిగిన నేతలుగా ఉన్నవారు మనకు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ 5 శాతం కంటే తక్కువ వృద్ధితోనే పలుమార్లు విజయాలు సాధించారు. నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు కథనాన్నే మార్చివేశారనేది రెండో అంశం. ఆయన చెప్పిన విషయాలన్నిటినీ మరచిపోయారు. ఆయన ఇప్పుడు డిజిటల్, నగదు రహిత చెల్లింపుల వంటి ఇతర విషయాలపైకి మళ్లారు. ఆయనపైన మీరు ఎన్ని ఆరోపణలనైనా చేయవచ్చుగానీ, రాజకీయంగా తప్పులు చేస్తున్నారని మాత్రం అనలేదు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా తమ జీవితాలు భౌతికంగా మారాయని ఎందరు భావిస్తున్నారని నేను ఆ వెయ్యిమంది విద్యార్థులను అడిగాను. దాదాపుగా అంతా చేతులు పైకెత్తారు. అది జరుగుతున్నంత కాలమూ, కనీసం రాబోయే కొన్ని నెలల పాటైనా నరేంద్ర మోదీ నిశ్చింతగా ఉండవచ్చు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ ఈ–మెయిల్: aakar.patel@icloud.com -
సంస్కరణ మిథ్య.. హిందుత్వ ఎజెండా సత్యం?
అవలోకనం ద ఎకానమిస్ట్ మోదీపై చెప్పిన తీర్పు నిజమైతే, మనం మనకున్న కొద్దిపాటి ఆర్థిక సానుకూలతలను కోల్పోయిన తరుణంలో ఉన్నాం. ఆ పత్రిక వేలెత్తి చూపిన సమస్యలలో కొన్నింటి విషయంలోనైనా ప్రభుత్వం తన తప్పులను కాకున్నా, బలహీనతలనైనా అంగీకరించడం సహాయకరంగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ అది జరుగుతున్నట్టుగా కనబడటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళుతున్న ఈ వారంలో ‘ద ఎకానమిస్ట్’ పత్రిక ఆయనకు రుచించని ప్రతి కూలమైన ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. అది, వ్యాపార వర్గాలకు అనుకూలమైన, మితవాద వార పత్రిక. అందువలన ఆ కథనానికి ప్రాముఖ్యత ఉంది. ఆర్థిక వ్యవ హారాలకు సంబంధించి ప్రపంచ నేతలు ఆ పత్రికను ప్రామాణికమైనదిగా చూస్తారు, తొందరపడి నిర్ధారణలు చేయదని భావిస్తుంటారు. కాబట్టి దాని వ్యాఖ్యలు, ప్రత్యే కించి మోదీపై చేసిననవి ఆయనకు నష్టాన్ని కలిగించేవి. ఆ కథనానికి వేసిన ముఖ చిత్రం కొంత అసమంజ సమైనదనీ, మోదీ, భారత్‌ల పట్ల మరీ కటువుగా ఉన్నదని నా అభిప్రాయం. ముఖ చిత్ర పుటపై కాగితపు పులిపై స్వారీ చేస్తున్న మోదీ చిత్రం, దానిమీద ‘‘మోదీ భారతం: భ్రమా త్మక సంస్కరణ’’ అనే శీర్షిక ఉంది. ఆ కథనంలో చాలా ఆరో పణలు ఉన్నాయి. సంస్కర్తకాగల సామర్థ్యం మోదీకి లేదని దానికి నమ్మకం ఏర్పడటం అన్నిట్లోకీ బాగా చెరుపు చేసేది. ‘‘ఆర్థిక వ్యవస్థకు పగ్గాలు వేసి ఉంచుతున్న మౌలిక సమ స్యల పరిష్కారం కోసం ఒక క్రమపద్ధతిలో కృషి చేయడా నికి సంబంధించి (మోదీ) పనితీరు ఏమంత బాగా లేదు’’ అని ఆయన రికార్డు చెబుతోందని అది భావిస్తోంది. క్రమ పద్ధతికి బదులుగా ‘‘వ్యాపార సంస్థలను వాటి సమస్యల నుంచి గట్టెక్కించడం.. ఫలానా ఫ్యాక్టరీకి భూమిని వెతికి పెట్టడం, లేదా ఓ విద్యుత్ కేంద్ర నిర్మాణం వేగంగా జరి గేలా చూడటం వంటి పనులే వ్యాపారానికి అనుకూలునిగా ఆయనకున్న ప్రతిష్టంతటికీ మూలం.’’ ప్రస్తుతం ఆయన, తన పాలన నాలుగో ఏట అమలు లోకి తెస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి భావనలు చాలా వరకు మునుపటి ప్రభుత్వల కృషి ఫలితాలే తప్ప, ఆయన సొంతం కావనేదాన్ని అది అందుకు నిదర్శనంగా చూపింది. మోదీ శక్తిమంతమైన వారని ఆ పత్రిక అంగీ కరిస్తోంది గానీ, ‘‘వస్తు తయారీ నుంచి మరుగుదొడ్ల నిర్మాణం వరకు ప్రతిదాని గురించి ఆర్భాటపు పథకాలను ప్రారంభించడం’’లో ఆయన తలమునకలై ఉన్నారు. ధైర్య వంతుడే అయినా దిశంటూ లేని వారు. పెద్ద నోట్ల రద్దు ‘‘ధైర్యం’’తో కూడిన చర్యేగానీ, ‘‘ఆరోగ్యకరమైన ఆర్థిక విధానం’’ కాదు, ఆ విషయంలో ‘‘ప్రణాళిక లోపించడం, అస్పష్టమైన లక్ష్యాలు అంటే ఆ చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిందనే అర్థం. ‘‘ప్రభుత్వం ‘ఏదో చేస్తున్నట్టు’ రుజువు చేసుకోవాలనే లక్ష్యాలతో మరిన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకోవచ్చు’’ అని ఆ పత్రిక భయాలు వ్యక్తం చేసింది. దృష్టి కేంద్రీకరణ, వ్యూహం కొరవడటం అంటే మూడేళ్ల క్రితం కంటే ఆర్థిక వ్యవస్థ తక్కువ వేగంగా వృద్ధి చెందుతోందని అర్థం. ‘‘క్లుప్తంగా చెప్పాలంటే మోదీ సువర్ణా వకాశాన్ని చేజార్చుకోవడం’’ వల్ల చమురు ధరలు తక్కు వగా ఉండటం, యువ జనాభా ఉండటం అనే అనుకూలత లను మనం కోల్పోయాం.ప్రభుత్వ రికార్డుకు సంబంధించి తీవ్ర నిరాశామయ పరిస్థితుల్లో ఆశలురేపే అంశాలు పెద్దగా లేవు. మోదీ ‘‘ఆర్థిక సంస్కర్త ముసుగులోని హిందూ మత త్వవాదా లేక హిందూ మతతత్వవాది ముసుగులోని ఆర్థిక సంస్కర్తా’’అనే ప్రశ్నకు సమాధానం దొరికిందని ‘ద ఎకా నమిస్ట్’ నిర్ధారణకు వచ్చేసింది. ‘‘ఆయన ఆర్థిక నిపుణునిగా కంటే ఎక్కువగా (మత) దురహంకారి’’ అని విశ్వసిస్తోంది. ప్రభుత్వం ‘‘వేగంగా వృద్ధి చెందుతున్న గొడ్డు మాంసం ఎగుమతుల వ్యాపారంలో ఉపద్రవాన్ని సృష్టించడం’’ను అది అందుకు నిదర్శనంగా చూపింది. ఆ తర్వాత అది ప్రత్యేకించి గట్టి భాషను ప్రయోగిం చింది. అది ప్రభుత్వంలోని పలువురికి, దాని మద్దతుదార్లకు ఆందోళన కలిగించేది. ‘‘మోదీ పాలనలో, ప్రభుత్వ విధానం పైన, ప్రత్యేకించి మత సంబంధాలపైన చర్చ క్షీణించి పోయింది. హిందూ జాతీయవాద మూకలు.. ప్రభుత్వం తన లౌకివాద సంప్రదాయం నుంచి వైదొలగినందుకు మందలించేవారిని, లేదా కశ్మీర్ నిరసనలపై తక్కువ అణచి వేత చర్యలను సూచించే వారిని వేధింపులకు గురి చేçస్తు న్నారు.’’ ఇక మోదీ తానే స్వయంగా ‘‘ప్రశంసలను కోరే వ్యక్తి పూజా సంస్కృతికి కేంద్రంగా మారారు. ’’ ఇటీవలి వివాదాలను గమనిస్తే మత అసహనానికి సంబంధించి అది చేసిన ఇతర నిర్ధారణలు ఆశ్చర్యం కలిగించవు. మోదీని, ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికి ఆ కథనం ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఆ తీర్పే నిజమైతే, మనం మనకున్న కొద్దిపాటి ఆర్థిక సానుకూలతలను కోల్పో యిన తరుణంలో ఉన్నాం, మనం దృష్టిని నిలపాల్సింది దానిపైనే తప్ప, వేలెత్తి చూపడంపై కాదు. ఈ సమస్యలలో కొన్నింటి విషయంలో ప్రభుత్వం తన తప్పులను కాకపో యినా బలహీనతలనైనా అంగీకరించడం సహాయకరంగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ మోదీ తన పదవీ కాలంలోని చివరి రెండేళ్లలోకి అడుగిడుతుండగా కూడా అది జరుగు తున్నట్టు కనబడటం లేదు. కొసమెరుపు: అసహనానికి సంబంధించిన సమస్య లలో చాలా వాటికి కాంగ్రెస్ కారణమని రెండు వారాల క్రితం ఈ కాలమ్‌లోనే రాశాను. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) గురించి నేడు చిదంబరం ఏమి చేయాలంటున్నారో వాటిని అధికారంలో ఉండగా సరి దిద్దగలిగేవారు అన్నాను. దానిపట్ల నిరుత్సాహంతో ఆయన సందేశాన్ని పంపారు. ‘‘ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని, కనీసం దానిలోని తీవ్ర నిబంధనలను సరించడమైనా చేయా లని నేను కోరాను. ఇది మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. జాతీయ భద్రత సలహాదారు, నేను సవరణల ముసాయిదాను తయారుచేశాం. ప్రధాని మద్దతు తెలిపినా, రక్షణ మంత్రిని ఒప్పించడంలో నేను విఫలమయ్యాను.. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఏఎఫ్ఎస్పీఏను ఎత్తివేయాలనే ప్రతిపాదన గురించి నేను, ఒమర్ అబ్దుల్లా కలసి సైన్యంతో పలుమార్లు చర్చించాం. రక్షణ బలగాలు, రక్షణ శాఖ ఒప్పు కోలేదు. ఇదంతా బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారమే. మీ దృష్టికి రానట్టుంది.’’ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ ఈ–మెయిల్ :aakar.patel@icloud.com -
మనిషిని అధిగమించిపోనున్న కృత్రిమ మేధస్సు
అవలోకనం రాబోయే 25 ఏళ్లలో అన్ని విధాలా మనిషిని మించిన మేధస్సు గల కంప్యూటర్లు ప్రవేశిస్తాయని అంచనా. ప్రస్తుతం, కంప్యూటర్ మేధస్సు మనిషి కంటే వేగంగా తనను తాను మెరుగుపరు చుకుంటోంది. ఆ తర్వాత దాని మెరుగుదల వేగం విస్ఫోటనాత్మకమైనదిగానే ఉంటుంది. ఆవిర్భవించనున్న ఆ మహా మేధస్సు ఏ విధంగా పురోగమిస్తుందో మనకు ఎలాంటి అంచనా లేదు. కాకపోతే అది ఉద్దేశపూర్వకంగా మనకు హాని చేయాలనుకోకపోవచ్చని ఊహిస్తున్నారు. కానీ, తనను తాను మెరుగుపరుచుకునే క్రమంలో అది మనల్ని విస్మరిస్తుంది. అలా జరిగితే ఎలా? ప్రపంచంలోకెల్లా అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా విచిత్రమైన ఒక సమస్య గురించి చర్చిస్తోంది. దాని గురించి పుస్తకాలు రాస్తున్నారు, ఉపన్య సిస్తున్నారు (యూట్యూబ్ ద్వారా అవి అందుబాటులో ఉన్నాయి). కానీ ఆ సమస్యకు సంబంధించి ఎలాంటి చర్యా తీసుకోలేదు. త్వరలోనే తగు చర్యను చేపడతారని ఆశిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మనిషి కంటే తెలివైనదిగా మారుతుండటమే ఆ సమస్య. భారత్‌లోని మనకు అదేమీ అంతగా ఆలోచిం చాల్సిన సమస్య కాదనిపిస్తోంది. మనకు కంప్యూటర్లంటే మన అదుపులో ఉండే ఉపకరణాలు. ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌ఫోన్ మన చేతిలోని పనిముట్టు, మన సేవకుడు. అంతేగానీ అది మన యజమాని కాదు. అయితే అమెరికాలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో కృషిచేస్తున్న అత్యంత బుద్ధిశాలురైన కొందరు మాత్రం... కృత్రిమ మేధస్సు, అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు మానవుని ఆలోచనా శక్తిని అధిగమించిపోతే ఏమి జరుగుతుందని యోచిస్తున్నారు. రెండు కారణాల రీత్యా వారు ఈ సమస్యను గురించి ఆలోచిస్తున్నారు. ఒకటి, ‘మేధస్సు’ అంటే ఏమిటనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది. మనిషి మెదడు పని చేసే తీరుకు సంబంధించి అంతుబట్టనిది ఏదీ లేదు. శాస్త్రీయ, జీవ శాస్త్ర సంబంధ పదజాలంతో ఆలోచనను అతి కచ్చితంగా వివరించవచ్చు. మేధస్సు అంటే సమాచారమూ, దానితో ఏమి చేయగలమో తెలుసుకోగల శక్తి. గత 20 ఏళ్లలో, ప్రత్యేకించి గత మూడేళ్లలో మేధస్సు విషయంలో కంప్యూటర్లు బాగా మెరుగుపడ్డాయి. అమెరికాలోని స్వయం చోదక కార్లను అందుకు అత్యంత ప్రాథమిక స్థాయి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పూర్తి స్వతంత్రమైన కారు ఆవిష్కరణకు రెండేళ్లకు మించి పట్టకపోవచ్చని అంచనా. అంటే, కార్లో కూర్చున్నాక మీరు హాయిగా నిద్రపోవచ్చు లేదా పేపర్ చదువుకోవచ్చు. కారే మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది. మనం చేయగల అన్ని పనులను... ఇంజన్‌ను స్టార్ట్ చేయడం, గేర్లను మార్చడం, అవసరమైతే బ్రేక్ వేయడం, వేగం పెంచడం అదే చేసేస్తుంది. అంతే కాదు, మనం చేయలేని పనులను కూడా చేస్తుంది. మానవులకు సాధ్యంకాని స్థాయిలో అది ముందు, వెనుక, పక్కల ఉన్న ముప్పులను కనిపెట్టగలుగుతుంది. ఇంధన వినియోగం అత్యుత్తమంగా ఉండేలా కారు వేగాన్ని అభిలషణీయంగా నియంత్రించగలుగుతుంది. ఇతర కార్లతో అనుసంధానం కావడం ద్వారా రోడ్డుకు వందల కిలోమీటర్ల ముందూ, వెనుకా ఉన్న రహదారి పరిస్థితులను అది తెలుసు కోగలుగుతుంది. ఇది నేను ముందే చెప్పినట్టుగా అత్యంత ప్రాథమిక స్థాయిలోని కంప్యూటర్ మేధ ఇప్పటికే చేయగలుగుతున్న పనులకు ఉదాహరణ. కృత్రిమ మేధస్సు మెరుగుపడుతూనే ఉంటుంది, మరింత వేగంగా మెరుగు పడుతుంది. ఎందుకు? మనషులమైన మనకు చాలా సమస్యలను పరిష్కరించ డానికి సాంకేతికత అవసరం. వ్యాధులకు చికిత్సను కనిపెట్టడం నుంచి వ్యాపార వ్యవస్థల అభివృద్ధి వరకు సాంకేతికత సహాయం మనకు అవసరం. ఆధునిక ప్రపంచంలో ప్రతి దానికీ కంప్యూటర్ మేధస్సును ఉపయోగించడం అవసరమౌ తోంది. ఈ పరిస్థితి మారబోవడమూ లేదు. ఈ కంప్యూటర్ మేధో విస్పోటన వేగంతో సమానంగా మానవ మే«ధ విక సించలేకపోతుందని అంగీకరించడం మొదలైంది. ఎందువల్ల? మన మెదడు పరి మాణం స్థిరమైనది, మనకు గుర్తుంచుకునే, ఆలోచించే శక్తినిచ్చే మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్, సహాయక పదార్ధాలు పరిమిత మొత్తంలోనే ఉంటాయి. కృత్రిమ మేధస్సుకు అలాంటి పరిమితులేవీ లేవు. పెద్ద భవనం అంతటి కంప్యూటర్ మేధస్సును నిర్మించడం సాధ్యమే. కాకపోతే దానివల్ల మనం వూహిం చని ప్రమాదాలు ముంచుకు రావచ్చని భావిస్తున్నారు. అలాంటి అంత పెద్ద లేదా శక్తివంతమైన కంప్యూటర్ను ఎవరైనా ఎందుకు నిర్మిస్తారనేదే ప్రశ్న. సాంకేతిక పురోగతి విషయంలోనే కంపెనీలు, సైన్యాలు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతు న్నాయి అనేదే అందుకు సమాధానం. కొంత కాలం క్రితమే ప్రారంభమైన ఈ పోటీ విరామం లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. మరింత తెలివైన, మరింత శక్తివంతమైన, మరింత మేధోశక్తి కలిగిన కంప్యూటర్లను, కంప్యూటర్ ప్రోగ్రామ్ లను కార్పొరేషన్లు, సైన్యాలు నిర్మిస్తూనే ఉంటాయి. మనిషి ఈ కృత్రిమ మేధ స్సుతో సమానంగా సాగలేడు కాబట్టి దానికి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాల్సి వస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం, ప్రపంచంలోని అత్యుత్తమ చదరంగం క్రీడాకారుడు గారీ కాస్పరోవ్ ఒక కంప్యూటర్ చేతిలో ఓడిపోయాడు. గత రెండు దశాబ్దాలలో కంప్యూటర్లు చాలా చాలా ఎక్కువ రెట్లు తెలివైనవిగా మారాయి. ఇంచుమించు రాబోయే 25 ఏళ్ల కాలంలో అన్ని విధాలా మనిషిని మించిన మేధస్సు గల కంప్యూటర్లు అందుబాటులోకి వస్తాయని అంచనా. ప్రస్తుతం, కంప్యూటర్ మేధస్సు మనిషి కంటే వేగంగా తనను తాను మెరుగుపరచుకుం టోంది. ఆ తర్వాత దాని మెరుగుదల వేగం విస్ఫోటనాత్మకమైనదిగా ఉంటుంది. మానవులకు ఉండే జీవ–రసాయనిక ప్రక్రియల పరమైన పరిమితులు కంçప్యూ టర్లకు లేవు. కాబట్టి అవి మనకంటే వేగంగా సమాచారాన్ని విశ్లేషిస్తాయి. ఆ మహా మేధస్సు ఆవిర్భవించాక అది ఏ విధంగా పురోగమిస్తుందనే విష యంపై మనకు ఎలాంటి అంచనా లేదు. కాకపోతే ఆవిర్భవించనున్న ఆ మహా మేధస్సు దుర్మార్గమైనది కాకపోవచ్చునని ఊహిస్తున్నారు. అంటే అది ఉద్దేశ పూర్వకంగా మనకు హాని చేయాలని కోరుకోకపోవచ్చునని అర్థం. కానీ, తనను తాను మెరుగుపరుచుకునే క్రమంలో అది మనల్ని విస్మరిస్తుంది. అలా జరగడం గురించే అమెరికాలో వాళ్లు ఆలోచిస్తున్నది. అది మనం సైతం ఎంతో కాలం విస్మ రించలేని సమస్య. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
మనవాళ్లనే కాపాడలేం.. ఆఫ్రికన్ల మాటెందుకు?
అవలోకనం మాలో జాతి వివక్ష ఉన్నట్లయితే మేం దక్షిణ భారతీయులతో కలిసి ఎందుకు జీవిస్తాం అంటూ ఆర్ఎస్ఎస్కి చెందిన తరుణ్ విజయ్ మొరటుగా వ్యాఖ్యానించారు. ఒక నేరపూరిత చర్యను జాత్యహంకారంగా తప్పుగా పేర్కొంటున్నారని ప్రభుత్వం సైతం మొరటు ప్రకటన చేసింది. కొద్దిమంది నేరస్తుల అస్వాభావిక చర్యపట్ల వ్యవహరించేంత దృఢంగా భారతీయ నిఘా వ్యవస్థలు ఉన్నాయని మన విదేశీ శాఖ పేర్కొంది. కానీ ఇది అబద్ధం. మూక దాడుల నుంచి భారతీయులనే మన చట్టాలు కాపాడలేవు. ఇక ఆఫ్రికన్లను ఎలా కాపాడతాయి? మానవుల్లో కొందరు తెల్లగా మరికొందరు నల్లగా ఎందుకుంటారు? మన పరిసరాలకు తగిన అత్యత్తమ సాధనాలను ప్రకృతి పరిణామక్రమం మనకు ఇచ్చిందన్నదే దీనికి సమాధానం. వేడి వాతావరణ పరిస్థితుల్లో నివసిస్తున్న మన శరీరాలు స్వేద గ్రంథులు ఎక్కువగానూ, చర్మంపై వెంట్రుకలు తక్కువగానూ ఉండేలా రూపొందుతూ వచ్చాయి. దీంతో మన శరీరం త్వరగా చల్లబడుతుంది. మన శరీరం మీద వెంట్రుకలు తక్కువగా ఉన్నందువల్ల కేన్సర్‌ను కలిగించే అతినీల లోహిత కిరణాల నుంచి మన చర్మానికి కాస్త రక్షణ అవసరమవుతుంది. ఈ రక్షణ మనకు గోధుమరంగులో ఉండే మెలనిన్ రూపంలో కలుగుతుంది. మనలో ప్రతి ఒక్కరిలోనూ వేర్వేరు పరిణామాల్లో ఉండే మెలనిన్ ఒక ప్రకృతి సహజ సన్‌స్క్రీన్ అన్నమాట. అత్యంత వేడి వాతావరణంలో ఉన్న వారి శరీరాల్లో ఇది అధికంగా తయారవుతుంది. ఇలాంటి వారి శరీరాలు నల్లగా ఉంటాయి. ఉష్ణ ప్రాంతాల్లో నివసించే కొందరు ఇతరుల కంటే నల్లగా ఎందుకుంటారు అనే ప్రశ్నకు ఇదే సమాధానం. మరి మనలో కొందరు తెల్లగా ఎందుకుంటారు? శరీరంలోని ఎముకలు కాల్షియంను సంగ్రహించడానికి విటమిన్ డి ని ఉపయోగించుకోవాలంటే చర్మంలోనికి కొంత స్థాయిలో అతినీల లోహిత కిరణాలు ప్రవేశించాల్సి ఉంటుంది. ఉత్తర భారతదేశం వంటి ఎండ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే మనుషులకు తెల్లటి చర్మం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో లభ్యమయ్యే సూర్యకాంతిని వీరి చర్మం సమర్థవంతంగా సంగ్రహిస్తుంది. కాబట్టే మిగతా కారణాలకంటే భూగోళ శాస్త్రమే మన చర్మపు రంగును ప్రధానంగా నిర్దేశిస్తుంటుంది. దీంతోనే మనం జాతులుగా అభివృద్ధి చెందుతూ వచ్చాం. భారతదేశంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి పర్యటించేటప్పుడు మన చర్మం రంగు మారటం మనం చూస్తుంటాం. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్కు చెందిన తరుణ్ విజయ్ ఈ వారం మరింత మొరటురూపంలో వ్యక్తీకరించారు. భారతీయులు జాతి వివక్షా వాదులు కాదన్నారు. దానికి సమర్థనగా ఆయన ‘మాలో జాతి వివక్ష ఉన్నట్లయితే దక్షిణ భారతీయులతో కలిసి ఎందుకు జీవిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు దక్షిణాది రాష్ట్రాలను చాలా మొరటుగా ప్రస్తావిస్తూ మా చుట్టూ కూడా నల్లజాతి ప్రజలు ఉన్నారనే వ్యాఖ్యను జోడించారు. భారత్‌లో ఆఫ్రికన్లపై జరిగే దాడులకు, వారిపై హింసకు జాతి కారణమంటూ వచ్చిన వార్తకు ప్రతిస్పందనగా తరుణ్ అలా వ్యాఖ్యానించారు. వారిపై దాడులకు జాతి వివక్ష కారణమన్న వాదనను ఆయన సవాలు చేశారు. కానీ తన ప్రకటన మీడియాలో వచ్చాక.. దానినే సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌లో ఆఫ్రికన్లపై దాడులకు వ్యతిరేకంగా ఆఫ్రికా దేశాల రాయబారులు ఉమ్మడిగా చేసిన ఘాటు ప్రకటనలో ఆసక్తికరమైన అంశాన్ని నేను చూశాను. మన దేశంలో ఆఫ్రికన్లపై గతంలో జరిగిన డాడులను వారు సమీక్షిస్తూ వాటిపై భారత ప్రభుత్వం తగిన స్పష్టమైన నిరోధక చర్యలను చేపట్టలేకపోయిందని ఆరోపిం చారు. ఇలాంటి ఘటనలపై భారతీయ అధికారులు తగిన రీతిలో ఖండించలేదని వారు భావించారు. ఆఫ్రికన్లపై దాడులు జరిపిన వారు విదేశీయుల పట్ల విముఖత చూపేవారని, జాత్యహంకారులని వారి సమావేశం ఏకగ్రీవంగా ప్రకటించింది. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. దీనిపై భారత ప్రభుత్వం కూడా తరుణ్ విజయ్‌లాగే వ్యవహరించింది. ఒక నేరపూరిత చర్యను జాతిపట్ల విముఖత తెలుపడంగా, జాత్యహంకారంగా తప్పుగా పేర్కొంటున్నారని ప్రభుత్వం సైతం మొరటు ప్రకటన విడుదల చేసింది. కొద్దిమంది నేరస్తుల అస్వాభావిక చర్యపట్ల వ్యవహరించడానికి దృఢమైన భారతీయ వ్యవస్థలు ఉన్నాయని మన విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కానీ ఇది అబద్ధం. మూక దాడుల నుంచి భారతీయులనే మన భారతీయ శాసన వ్యవస్థలు కాపాడలేవు. మరి ఇవి విదేశీయులను ఎలా కాపాడతాయి? కానీ ఆఫ్రికన్ రాయబారుల ఆరోపణలలో నిజమెంత? పాతికేళ్ల క్రితం భారత్‌లో ఒక పత్రిక ఓ రహస్య చర్యను నిర్వహించింది. స్టింగ్ ఆపరేషన్లు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి ఆ రహస్య కార్యక్రమాన్ని వీడియో తీయలేదు. కొన్ని ఫొటోలు, రిపోర్టర్ వ్యాఖ్య మాత్రమే వచ్చింది. ఆ మ్యాగజైన్ ఒక శ్వేతజాతీయుడిని, ఒక నల్లజాతీయుడిని పొడవాటి క్యూను ఛేదించే కార్యక్రమం కోసం ఎంచుకుంది. అది ఒక రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్. నల్లజాతీయుడు పొడవాటి క్యూను అతిక్రమించి కౌంటర్‌కు దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు క్యూలో ఉన్న జనం పెద్దగా కేకలు వేస్తూ అతడిని మొరటుగా అడ్డుకున్నారు. కానీ తెల్లజాతీయుడు అదే పనికి పూనుకున్నప్పుడు అదే జనం అతడిని సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరి వ్యక్తులపట్ల వ్యవహరించే విషయంలో భారతీయుల తీరు తేడాగా ఉంటోందని ఆ పత్రిక తన కథనాన్ని ముగించింది. తగినంత డేటా లేని కారణంగా భారతీయులు జాత్యహంకారులా కాదా అని నేను కచ్చితంగా అయితే చెప్పలేను. అయితే నేను జాతి వివక్షాపరుడిని కానని మాత్రం చెప్పగలను. కానీ, ఢిల్లీలో లేదా బెంగళూరులోని ఆఫ్రికన్‌ని నేనే అయివున్నట్లయితే, వందలాదిమంది భారతీయులు నాతో ఎలా వ్యవహరిస్తారు అనే ప్రాతిపదికన నేను ఒక నిర్ధారణకు రాగలిగి ఉంటాను. చాలామంది భారతీయులు జాత్యహంకారులా, శరీరంలోని ఒక రంగుపట్ల వారు వ్యతిరేకంగా స్పందిస్తారా అని తెలుసుకోవడానికి, భారత్‌లోని ఆ్రíఫికన్లను వారి అనుభవం గురించి మనం అడగాలి. మనలో చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే ఉంటుంది. ఢిల్లీలోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో పనిచేసిన నా మిత్రురాలు ఒకరు కొంతకాలం మరొక సంస్థలో పనిచేశారు. ఆమె ఆఫ్రికా జాతీయురాలు. కానీ ఆమె చర్మం కానీ, ముఖ లక్షణాలు కానీ భారతీయ ముఖంతో పోలిస్తే ఏమంత తేడాగా ఉండేవి కాదు. భారతీయురాలిగా తాను వీధిలో సులభంగా నడవగలుగుతున్నానని ఆమె చెప్పారు. అయితే తర్వాత కొద్దికాలానికే ఆమె ఆఫ్రికన్ దుస్తులను ధరిం చడం, జుత్తు (కాస్త వంకీలు తిరిగి ఉండేది) వదులుగా ఉంచుకోవడం ప్రారంభిం చారు. జాతి కోణంలో ప్రజలను చూసే పౌరులున్న దేశంలో తన సొంత ఉనికిని దాచుకోవాలని తాను భావించడం లేదని ఆమె కారణం చెప్పారు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ప్రాథమిక సదుపాయాలే మహాభాగ్యం
అవలోకనం గుజరాతీలు బుల్లెట్ ట్రైన్ కావాలని కోరడం లేదు. సాధారణ ట్రాఫిక్ రద్దీని తట్టుకునే ఫ్లై ఓవర్లున్న జాతీయ రహదారులు వారికి కావాలి. నిర్మించడానికి ముందే కూలిపోకుండా ఉండే, రెండేళ్ల పాటూ బాగు చేయకుండా వదిలేయని మౌలిక నగర సదుపాయాలు కావాలి. ప్రాథమిక సదుపాయాలన్నీ సక్రమంగా ఉండేలా చూసే విసుగెత్తించే నాయకత్వమే వారికి అవసరం. అంతేగానీ బుల్లెట్ ట్రైన్ల గురించి కలలు కనగల అద్భుత మేధో నాయకత్వం కాదు. నేనీ కాలమ్‌ను నా కుటుంబ స్వస్థలమైన సూరత్ నుంచి రాస్తున్నాను. దేశంలోని అతి పురాతనమైన, పెద్ద నగరాలలో సూరత్ ఒకటి. ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీల లాగా ఇది బ్రిటిష్ వాళ్లు నిర్మించినది కాదు. భారతీయులే నిర్మించిన ఈ నగరానికి అనేక శతాబ్దాల లిఖిత చరిత్ర ఉంది. ఢిల్లీ సుల్తానుల కాలానికే ఉన్న ఈ నగరం మొగల్ చక్రవర్తులకు ఉప ఖండంలోనే అత్యధిక రాబడి.నిచ్చిన నగరం. జహంగీర్ కాలంలో ప్రముఖ ఓడ రేవుగా, పెద్ద వాణిజ్య కేంద్రంగా సూరత్ విలసిల్లుతుండగా... 1608లో బ్రిటిష్ వారు మొదటిసారిగా ఇక్కడ దిగారు. మూడు శతాబ్దాల తర్వాత ఓడ రేవును ముంబైకి తరలించినా ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేటంత పెద్దది గానే ఉండేది. లియో టాల్‌స్టాయ్ ‘సూరత్ కాఫీ హౌస్’ అనే ఓ చిన్న కథను కూడా రాశారు. నేటి సూరత్ ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల నగిషీ కేంద్రం. (ప్రపంచ వ్యాప్తంగా లభించే మొత్తం వజ్రాలలో ముడింట రెండు వంతులు సూరత్‌కు వచ్చి వెళ్లాల్సిందే). ఇంచుమించుగా లండన్ నగరం అంత జనాభా కలిగిన ఈ నగరం ప్రపంచంలోని అతి పెద్ద వస్త్ర ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి. భారత్‌లోని మరే ఇతర నగరం కన్నా తలసరి ఆదాయం ఇక్కడే ఎక్కువ. అయినా నా స్వస్థలమైన ఈ నగరానికి చేరుకోవడం నాకు దాదాపుగా అసాధ్యమైంది కాబట్టే ఇదంతా చెబుతున్నాను. నేనిప్పుడు నివాసం ఉంటున్న బెంగళూరు నుంచి ఇక్కడికి నేరుగా వచ్చే విమాన సర్వీసు లేదు. ఎందుకంటే సూరత్‌లో ఉన్న ఒక్క విమానాశ్రాయం పనిచేయడం లేదు. ప్రైవేటు విమాన సంస్థలేవీ సూరత్‌కు విమాన సర్వీసులను నడపవు. మోదీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన కొద్ది కాలానికే ఒక గేదె సూరత్ విమానాశ్రయంలోకి దూసుకురాగా ఒక విమానం దాన్ని ఢీకొంది. ఆ విమానం జెట్ ఇంజన్ దెబ్బతింది. దీంతో సూరత్-ముంబై-బెంగళూరులను కలుపుతూ ఉన్న ఈ ఒక్క ప్రైవేటు విమాన సర్వీసునూ రద్దు చేశారు. విమానాశ్రయం చుట్టూ ఉన్న కంచెలో ఉన్న సందుగుండా గేదె లోపలికి చొరబడిందని, గోడను నిర్మించడానికి ఆదేశించామని నరేంద్ర మోదీ కేబినెట్లోని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఏ మాత్రం నమ్మకాన్నీ కలిగించకపోవడంతో ఆ విమాన సంస్థ గత రెండేళ్లుగా సూరత్ సర్వీసు ఊసెత్తడం లేదు. ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా నేను విమానంలో ముంబై చేరి, అక్కడి నుంచి ఐదు గంటలు రోడ్డు మార్గాన ప్రయాణించాలి. ఈ 300 కిలోమీటర్ల దూరం ముంబై, ఢిల్లీలను కలిపే రహదారి. అది మన దేశంలోనే అత్యుత్తమ రహదారి వ్యవస్థయైన గోల్డెన్ క్వాడ్రిలేటరల్‌లో (చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలను కలుపుతుంది) భాగం. అయినా ఈ ప్రయా ణానికి ఐదు గంటలు ఎందుకు పట్టినట్టు? ముంబైకు వెలుపల ఫౌంటెన్ హోటల్ అనే ప్రాంతానికి సమీపంలోని ఒక ఫ్లై ఓవర్ పగలడమో లేదా బీట్లు పడటమో జరిగింది. దీంతో ఆ వంతెనపై నుంచి ఒకేసారి ఇరు వైపులకూ వాహనాలను అనుమతించడం ప్రమాదకరంగా మారింది. కాబట్టి ఒక వైపు నుంచి వాహనాలను వదిలినప్పడు రెండో వైపున ఉన్నవి తరచుగా గంట సేపు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది బాగా రద్దీగా ఉండే రహదారి, బహుశా దేశంలోనే అతి రద్దీగా ఉండే మార్గం. కాబట్టి అలా ఆగిపోయే కార్లు, ట్రక్కుల బారు చాలా కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ పరిస్థితి ఇలా ఎంత కాలం నుంచి ఉన్నదని డ్రైవర్‌ను అడిగితే కనీసం నాలుగు నెలలవుతుందని తెలిసింది. అయినా దాన్ని బాగు చేసే పనులు ఇంకా మొదలు కాలేదు. సూరత్ చేరేసరికి క్రితం సారి నేనక్కడికి వచ్చేటప్పటికి... కూలి పోయి 11 మంది ప్రాణాలను బలిగొన్న ఫ్లై ఓవర్‌ను ఇంకా పునర్నిర్మించలేదు. అది సరికొత్త ఫ్లైఓవర్, దానిలో ఒక భాగం కింద దన్నుగా నిలిపిన పరంజాను తొలగించడంతోనే కుప్పుకూలిపోయింది. రెండేళ్ల నుంచి ఆ చిన్న భాగాన్ని బాగు చేయలేకపోవడంతో సూరత్‌లోని అతి ముఖ్యమైన రహదారి అత్వాలైన్స్పై ఉన్న ఆ ఫ్లై ఓవర్ నిరుపయోగంగా మారింది. నేను చెప్పదలుచుకున్న అంశాన్ని ఇదైనా మీకు స్ఫురింపజేస్తుంది. భారత దేశపు బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయబోయే మార్గం ఇదే. ఆ అతి వేగపు రైలు వ్యవస్థ అహ్మదాబాద్‌లో మొదలై సూరత్‌కు చేరుతుంది. అంటే ఇంచుమించుగా అహ్మదాబాద్-ముంబైలకు మధ్యన ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ కావాలని గుజ రాతీలు కోరడం లేదు. వారికి కావాల్సింది జంతువులు తిరగకుండా ఉండే, సక్రమంగా పనిచేసే విమానాశ్రయాలు. సాధారణ ట్రాఫిక్ రద్దీని తట్టుకునే ఫ్లై ఓవర్లున్న జాతీయ రహదారులు వారికి కావాలి. నిర్మించడానికి ముందే కూలిపోకుండా ఉండి, రెండేళ్ల పాటూ బాగు చేయకుండా వదిలేయని మౌలిక నగర సదుపాయాలు వారికి కావాలి. వారికి అవసరమైనది ప్రాథమిక సదుపాయాలన్నీ సక్రమంగా ఉండేలా చూసే విసు గెత్తించే నాయకత్వమే తప్ప, బుల్లెట్ ట్రైన్ల గురించి కలలు కనగల అద్భుత మేధో నాయకత్వం కాదు. లండన్ నగరం అంత ఉండే ఈ చారిత్రక నగరం అభివృద్ధిపట్ల చూపుతున్న ఈ యథాలాప ధోరణి ఆశ్చర్యకరం. అది దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం (2008లో కుటుంబానికి సగటున రూ. 4.5 లక్షలకుపైగా). బెంగళూరు నుంచి అలాంటి సుప్రసిద్ధ నగరాన్ని చేరుకోవడం అంటే నాకు లండన్‌కు వెళ్లడం కంటే కూడా కష్టం. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఈ-మెయిల్ : aakar.patel@icloud.com -
భవిత నిరుద్యోగమయం, అశాంతి నిలయం
అవలోకనం దేశం జనాభాపరమైన అనుకూలతా స్థాయికి చేరువవుతోంది. కానీ ఇముడ్చుకోలేని వాతావరణంలోకి అతి పెద్ద శ్రామికశక్తి ప్రవేశిస్తోంది. జనాభాపరమైన అనుకూలత నుంచి మనం లాభాన్ని పొందగలగడం కష్టమనిపిస్తుంది. అంతర్గతంగా, బహిర్గతంగా పెను మార్పేమైనా వస్తే తప్ప... నిరుద్యోగం, సామాజిక అశాంతి ప్రబలే కాలం రాక తప్పదనిపిస్తుంది. నాలుగేళ్లలో భారత్ ప్రపంచంలోకెల్లా అత్యధిక శ్రామిక జనాభా ఉన్న దేశంగా మారుతుంది. దాదాపు జనాభాలో 87 శాతం పనిచేయగలవారై ఉంటారు. దేశాల శ్రామిక జనాభా అలాంటి అత్యధిక నిష్పత్తికి చేరినప్పుడు ఆ దేశాలు జనాభా పరమైన అనుకూలతను సంపాదిస్తుందని ఆశిస్తారు. అత్యధిక శాతం పౌరులు పనిచేస్తున్నవారు కావడం వల్ల ఆర్థిక వృద్ధి పెరగడమే అందుకు కారణమనేది స్పష్టంగానే కనిపిస్తుంది. త్వరలోనే భారత్ అలాంటి స్థానానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు, ఆశిస్తున్నారు. అయితే, ఈ అంశంపై రెండో అభిప్రాయం కూడా ఉంది. ‘ఇండియాస్పెండ్’ అనే గణాంకాలపై (డేటా) అధారపడిన ఒక పాత్రికేయ సంస్థ ఈ ఉద్యోగితా పరిస్థితిని పరిశీలించి తాము గమనించిన ఆరు వాస్తవాలను తన నివేదికలో పేర్కొంది. అవి: 1. ‘‘2015లో ఎనిమిది ముఖ్య భారత పరిశ్రమలలోని పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు సంఘటిత రంగంలో గత ఏడేళ్లలోనే అతి తక్కువగా అదనపు ఉద్యో గాలను సృష్టించాయి. 2. రివాజుగా నెలసరి వేతనంగానీ లేదా సామాజిక భద్రతా పరమైన ప్రయోజనాలుగానీ లేని అసంఘటిత రంగంలోని ఉద్యోగాల నిష్పత్తి 2017లో 93 శాతానికి చేరనుంది. 3. 47 శాతం ఉపాధిని కల్పించేదిగా ఉన్న వ్యవసాయరంగవృద్ధి 2014–15లో 0.2 శాతంగా, 2015–16లో 1 శాతంగా నమో దైంది. దీంతో గ్రామీణ వేతనాలు గత దశాబ్దంలోకెల్లా అతి తక్కువకు పడిపో యాయి. 4. ఉపాధి దొరికిన వారిలో కూడా ఇంచుమించు 60 శాతానికి ఏడాది పొడవునా ఉపాధి లభించడం లేదు. అంటే పాక్షిక నిరుద్యోగం, తాత్కాలిక ఉద్యో గాల సమస్య విస్తృతంగా వ్యాపించి ఉన్నదని అర్థం. 5. కంపెనీల ఏర్పాటు మంద గించిపోయి, 2009 స్థాయిలకు పడిపోయింది. ప్రస్తుతం ఉన్న కంపెనీలలో వృద్ధి గత ఐదేళ్లలోనే కనిష్టంగా, 2 శాతంగా ఉంది. 6. సుసంఘటితమైన భారీ కంపెనీలే ఉపాధి కల్పనకు కీలకంగా ఉన్న పరిస్థితుల్లో... భారీ కార్పొరేషన్లు, బ్యాంకులు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నందున కంపెనీల సగటు పరిమాణం తగ్గు తున్నది.’’ తమను ఇముడ్చుకోగల సామర్థ్యం లేని వాతావరణంలోకి అతి పెద్ద శ్రామిక శక్తి ప్రవేశిస్తోందని ఇది సూచిస్తోంది. 1991 తర్వాత భారత్ అత్యధిక వృద్ధిని నమోదు చేసినా, జనాభాలో సగం కంటే తక్కువే పూర్తి ఉపాధిని పొందినవారనే వాస్తవాన్ని ఆ నివేదిక ఎత్తి చూపింది. దీనితో పోలిస్తే చైనాలో ‘‘1991–2013 మధ్య ఉద్యోగాల సంఖ్య 62.8 కోట్ల నుంచి 77.2 కోట్లకు పెరిగింది. 14.4 కోట్ల ఉద్యోగాలు అదనంగా ఏర్పడ్డాయి. అయితే పనిచేసే వయస్కుల సంఖ్య 24.1 కోట్లకు పెరిగింది’’ అని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ నివేదిక తెలిపింది. ‘‘రెండు దేశాల మధ్య ఇంత పెద్ద అంతరం ఉండటం మన ఉపాధి కల్పనా సామర్థ్యం చైనా కంటే కూడా తక్కువని సూచిస్తోంది. రాబోయే 35 ఏళ్లలో మన శ్రామికశక్తి విస్తరణ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇది తీవ్రమైన సవాలు.’’ గత 25 ఏళ్ల పరిస్థితే కొనసాగడం గాక మన ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పు ఏమైనా వస్తే తప్ప వీరందరికీ ఉద్యోగాలు సమకూరవు. దుస్తుల ఎగుమతులు వంటి అల్ప స్థాయి వస్తుతయారీ, ఆ తదుపరి ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఉన్నత స్థాయి ఉత్పత్తులకు బదిలీ కావడం అభివృద్ధి చెందడానికి దేశాలు అను సరించిన సాంప్రదాయక మార్గం. భారత్‌లో ఈ రంగాలన్నీ ఉన్నాయి. కానీ ఏదీ భారీ స్థాయిలో లేదు. ఉదా హరణకు, దుస్తుల ఎగుమతులనే చూస్తే మనం బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక వంటి దేశాలతో పోటీ పడాల్సి వస్తోంది. మనకంటే మరింత సమర్థవంతంగా, చౌకగా ఉత్పత్తి చేసే ఆ దేశాల చేతిలో తరచుగా మన ం ఆ పోటీలో ఓడిపోవడమూ జరుగుతోంది. గత ఏడేళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిందంటేనే ఉప యోగించుకోగలిగిన భారీ బహిర్గత డిమాండు లేదని అర్థం. సాంప్రదాయక మార్గం భారత్‌కు తెరచి ఉన్నట్టయితే జనాభాపరమైన అను కూలత వల్ల మనం ఎలా లాభపడగలం? ఇది వెంటనే మనం సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్న, అందుకు పెద్దగా సమయమేమీ లేదు. ఈ సమస్యను పూర్తిగా లేదా చాలా వరకు ప్రభుత్వమే పరిష్కరించగలదని ఆశించడం తప్పు అనుకుం టాను. మౌలిక సదుపాయాలు, అనుసంధానత కొరవడటం పెద్ద ఎత్తున మదు పులు సమకూరకపోవడానికి ఒక కారణం. ఈ సమస్యకు సంబంధించి పెట్టుబడి మదుపులు, ప్రాధాన్యాల రీత్యా కేంద్రం పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. అర్హతగలిగిన మానవశక్తి కొరవడటం కూడా అంతే పెద్ద సమస్య. పట్టణ ఉన్నత తరగతి భారతీయులకు సమంజసమైనంత మంచి విద్య అందుతోంది. కాబట్టి వారికి సాపేక్షికంగా సులువుగానే ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి ఇదో పెద్ద సమస్యంటే వారికి ఆశ్చర్యం కలగవచ్చు. అయితే అత్యధిక భారత ప్రజా నీకానికి అలాంటి విద్యా వనరు అందుబాటులో లేదు. కాబట్టి వారు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పనిచేయడానికి సన్నద్ధులై లేరు. అసెంబ్లీ లైన్ (విడి భాగాల కూర్పు) వంటి మౌలిక స్థాయి నైపుణ్యం అవసరమైన బ్లూ కాలర్ (నిపుణ శ్రమ) విధుల విషయంలో సైతం ఇది నిజం. యాంత్రీకరణ మొత్తం కొత్త ఉద్యోగాల సంఖ్యను ఏటికేడాది తగ్గించేస్తున్న వాతావరణంలో ఫిలిప్పీన్స్ వంటి దేశాలు మన బ్యాక్ఎండ్ సేవల (బీపీఓ సేవల) ఉద్యోగాలలో సైతం కొంత వాటాను దక్కిం చుకుంటున్నాయి. ప్రధాని ఈ సమస్యను గుర్తించి, లక్షలాది మంది ప్రజలకు మౌలికమైన నిపుణ శ్రామికులను తయారుచేసే నైపుణ్యాలను అందించడం కోసం ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన దేశంలోని ప్రాథమిక విద్య నాణ్యత అధ్వానంగా ఉండటం వల్ల ఈ విషయంలో సైతం ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఆలోచించే కొద్దీ భారత్ జనాభాపరమైన అనుకూలత నుంచి లాభాన్ని పొందగలగడం మరింత కష్టమనిపిస్తుంది. అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కూడా పెను మార్పేమైనా వస్తే తప్ప... భారీ నిరుద్యోగం, సామాజిక అశాంతి ప్రబలే కాలం ముందున్నదని అనిపిస్తుంది. అలాంటి మార్పేమీ కనుచూపు మేరలో లేదు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘aakar.patel@icloud.com -
దేశాన్ని ప్రేమించడానికి 10 పద్ధతులు
అవలోకనం దేశాన్ని ప్రేమించడమంటే దేశ ప్రజల పట్ల సహానుభూతిని ప్రదర్శించడమే. నిర్లక్ష్యానికిగురైన, బలహీనుల బాధను మీరు అనుభవించగలగాలి. దళితులు గాయపడితే మీకు బాధ కలగాలి. ఆదివాసులు అవమానానికి గురైతే మీకు అవమానమనిపించాలి. దేశంలో తరచుగా జరుగుతున్నట్టు ముస్లింలపై హింసాకాండ జరిగితే అందుకు మీరు సిగ్గుపడాలి. ఇంతటి విశాల ప్రజానీకంపై ఏకత్వాన్ని రుద్దడం మొత్తంగా ఈ దేశాన్ని ప్రేమించడం కాదు. భాష, మతం లేదా మరి దేనికి చెందినదైనా ఆ ఏకత్వం నా దష్టిలో దేశాన్ని ప్రేమించడం కాదు. 1) మొదటిది మౌలికంగా మీరు భారతీయులై ఉండటం. అంటే మీకు భారత పాస్ పోర్ట్ ఉండటం అని నా భావన. నాకు సంబంధించి నాకు మూడు పాస్పోర్ట్ట్లున్నాయి. భారతీయులు ముందస్తుగానే వీసాలు పొంది ఉండటం చాలా దేశాల్లో అవసరం. నేనేమో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాను. కాబట్టి దీర్ఘకాలిక చెల్లుబాటున్న వీసాల కోసం కాలం చెల్లిన రెండు పాస్‌పోర్టులను కూడా నేను వెంట పట్టుకుపోవాల్సి వస్తుంది. నిజానికి నేను విదేశాల్లో పని చేసింది తక్కువే. అయితే పనిచేయగలిగినంత కాలమూ విదేశాల్లోనే గడిపేసినా భారత పాస్‌పోర్టు లను తమతోనే ఉంచుకున్న కొందరు భారతీయులను నేను ఎరుగుదును. సంగీత దర్శకుడు జుబిన్ మెహతా అలాంటి వారిలో ఒకరు. లండన్‌లోని ఆమ్నెస్టీ ఇంట ర్నేషనల్ సెక్రటరీ జనరల్ సలీల్ శెట్టీ మరొకరు. మెహతా చాలా ఏళ్లపాటూ న్యూయార్క్ ఫిల్హార్మోనిక్కు నేతత్వం వహించారు. ఆ బందంలో ఆయన ఒక్కరే వీసా కోసం క్యూలో నిలబడాల్సివచ్చేది. అయినా ఆయన భారత పాస్ పోర్ట్‌ను ఉంచుకోవాలనే కోరుకున్నారు. 2) ఇక రెండవది, భారతీయులను ప్రేమించడం ద్వారా దేశాన్ని ప్రేమించగల గడం. భారతీయులందరినీ, మీ మతానికి చెందినవారినే కాదు, ఇతర మతస్తు లను, ఇతర కులస్తులను, ఇతర భాషల వారినందరినీ అని నా అర్థం. మీతో అంగీకరించేవారిని, విభేదించేవారినీ, ఎలాంటి మాంసాన్నయినాగానీ తినేవారిని, తినని వారినీ అందరినీ ప్రేమించడం. భారతీయులందరినీ ప్రేమించడమే నిజంగా భారతదేశాన్ని ప్రేమించడం. 3) దేశాన్ని ప్రేమించడానికి ఉన్న మూడో పద్ధతి, సాధ్యమైనన్ని దేశ భాషలను నేర్చుకోవడం. భారతీయులంతా తప్పనిసరిగా దేవనాగరి, పర్షియన్ అరబిక్ లిపులు రెండిటిలోనూ హిందుస్థానీ భాషను నేర్చుకోవాలని గాంధీ చెప్పారు. నేనలా చేశానుగానీ, అందరూ హిందుస్థానీ నేర్చుకోవాలంటే అంగీకరించను. 4) భారతదేశాన్ని ప్రేమించడానికి ఉన్న నాలుగో మార్గం శాస్త్రీయ సంగీతాన్ని, కవిత్వాన్ని అర్థం చేసుకోవడం. ఎక్కువగా ఇది పెద్దయ్యాక చేసే పని. ఎందుకంటే హిందుస్థానీ సంగీతం పరిణతి చెందినది. అది ఒలికించేది ఆనందాన్ని కాదు విషాదాన్ని. ఖాయ, కర్ణాటక సంగీతాలను అర్థంచేసుకోకుండా, గాయకులు కళ్లు మూసుకుని వాటిని అలాగే ఎందుకు నిర్వహిస్తారో అర్థం చేసుకోకుండా ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలను నిజంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. షెల్లీ ఓజీమండీయస్లాగే నాకు పలు పద్యాలు కంఠస్తా వచ్చు. నరేష్ మెహతా (గాంధీకి ఇష్టమైన వైష్ణవ జన్ గీత రచయిత) రాసిన నాగ్ దమన్‌ను చదివిన లేదా విన్న ప్రతిసారీ అది నన్ను బాగా కదిలించేస్తుంది. అది, బాల కష్ణుడు కాళీయు డనే సర్పాన్ని వధించకుండా, దానితో పోరాడటం గురించినది. ఆ పద్యాన్ని విన్నప్పుడు, ప్రత్యేకించి దానికి మంద్ర సంగీతాన్ని జోడించి వినిపిస్తే తరచుగా కన్నీరు పెట్టేంతగా చలించిపోతుంటానని చెప్పుకోడానికి నేనేమీ సిగ్గు పడను. 5) ఇక దేశాన్ని ప్రేమించడానికి ఉన్న ఐదో పద్ధతి దేశీయ ఆహారాన్ని ప్రేమించ డమే. అలా అని ఇతరుల ఆహారాన్ని మనం ద్వేషించి తీరాలని అర్థం కాదు. ఈ విషయంలో నాది విశాల దష్టి. కొన్నేళ్ల క్రితం నేను వియత్నాం వెళ్లాను. హనా య్‌లో ఒకే రోజున పాము, కుక్క మాంసాలను తిన్నాను. జపాన్ వంటకాలంటే నాకు మహా మక్కువ. అయినా భారతీయ భోజనాన్నే కోరుకుంటాను. అన్నిటికీ మించి రైతు పాటిదార్ల మందపాటి జొన్న రొట్టెతోపాటూ ఓ కాయగూర, వెల్లుల్లి పచ్చడి అంటే నాకు మహా ఇష్టం. మ«ధ్యాహ్న భోజనంగా ఎక్కువగా అదే తీసుకుంటాను. ఇక జీవితాంతం ప్రతి రోజూ అదే తినమన్నా తినగలను. 6) ఇక దేశ రాజ్యాంగాన్ని చదవడం, తెలుసుకోవడం మీరు మీ దేశాన్ని ప్రేమిం చగల ఆరో మార్గం. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగాలలో ఒకటి. దాన్ని అర్థం చేసుకోవడమంటే దాని తొలి మాటలను, అవతారికను, దాని ప్రాధాన్యాన్ని, అది వాగ్దానం చేసిన ప్రాథమిక హక్కులకు నిజమైన అర్థం ఏమిటి అని తెలుసుకోవడమనే. మనలో చాలామంది దాన్ని వంట బట్టించుకోవాలి. 7) దేశా నికి సేవలందించిన వారిని గౌరవించడం ఏడో మార్గం. క్రీడాకారుల కంటే ఉపా ధ్యాయులే ఎక్కువ ప్రాముఖ్యత గలవారని నా అభిప్రాయం. క్రీడాపరమైన విజయం జాతీయవాదాన్ని పెంపొందింపజేస్తుంది గానీ, అది ఉత్త డొల్ల. 8) భారత్‌ను ప్రేమించడానికి ఉన్న ఎనిమిదో మార్గం, నేను కట్టాల్సి ఉన్న పన్నులను చెల్లించడమే. దీంట్లో గర్వపడాల్సిందేమీలేదు, చేయాల్సినది చేస్తున్నా నంతే. కానీ మనలో చాలామంది ఆదాయపు పన్ను చెల్లించరు. వారిలో చాలా మంది పేదలో లేక మినహాయింపు పొందినవారో కాబట్టి చెల్లించాల్సిన అవసరం లేనివారు. నేను వారి గురించి చెప్పడం లేదు. పన్నుల చెల్లింపులో మోసాలకు పాల్పడే ఉన్నత, మధ్య తరగతులకు చెందిన వారిని.. మీరు దేశాన్ని ప్రేమిస్తు న్నారా? అని ప్రశ్నిస్తున్నాను. మీరు అవును అంటారు. నేను కాదు అంటాను. 9) దేశాన్ని ప్రేమించడానికి ఉన్న తొమ్మిదోమార్గం దేశ ప్రజల పట్ల సహాను భూతిని ప్రదర్శించడమే. నిర్లక్ష్యానికి గురైన, బలహీనుల బాధను మీరు అనుభ వించగలగాలి. దళితులు గాయపడితే మీకు బాధ కలగాలి. ఆదివాసులు అవ మానానికి గురైతే మీకు అవమానమనిపించాలి. దేశంలో తరచుగా జరుగుతు న్నట్టూ ముస్లింలపై హింసాకాండ జరిగితే అందుకు మీరు సిగ్గుపడాలి. దేశాన్ని ప్రేమించ డమనే భావన, ఈ సహానుభూతి ఒక్కటే. 10) ఇక దేశాన్ని ప్రేమించడానికి ఉన్న చివరి మార్గం.. దేశంలో ఉన్న వైరుధ్యాలు, విభేదాల పట్ల విశాల దష్టితో ఉండటం. ఇంతటి విశాల ప్రజానీకంపై ఏకత్వాన్ని రుద్దడం అంటే మొత్తంగా ఈ దేశాన్ని ప్రేమించడం కాదు. ఆ ఏకత్వం భాష, మతం లేదా ప్రత్యేక శిక్షాస్మతికి చెందినదైనా, ఆహారపరమైన, సంగీతపరమైన ప్రాధాన్యానికి సంబంధించినదైనా నా దష్టిలో దేశాన్ని ప్రేమించడం కాదు. నా అభిప్రాయాలతో మీరు విభేదించవచ్చు, అయిష్టపడవచ్చు, నన్ను ద్వేషిం చవచ్చు కూడా. అయినా నేను మిమ్మల్ని ఎప్పటిలాగే ప్రేమిస్తాను. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
అంతుచిక్కని రియల్ ఎస్టేట్ ధరల చిత్రం
అవలోకనం ప్రపంచంలోని చాలా ఇతర ప్రాంతాల్లోకంటే రవాణా, ఆహారం చాలా చౌకగా ఉండే మన నగరాల్లో ఆస్తుల ధరలు విపరీతంగా ఎక్కువ. ఎందుకు అనేదే అంతుచిక్కని ప్రశ్న. మన దేశంలో ఆదాయపు పన్ను చెల్లించకపోవడం చాలా ఎక్కువ. అయినాగానీ కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి దేశంలోని ప్రతి నగరంలోనూ ఈ ఆస్తులను కొంటున్న వ్యక్తులు ఎవరు అనేదాన్ని అది వివరించదు. ఇంత ఖరీదైన ఈ ఫ్లాట్లను ఎవరు కొంటున్నారు, ఎక్కడి నుంచి ఎలా వారింత డబ్బును సంపాదిస్తున్నారు? కొన్నేళ్ల క్రితం నేను ముంబైలో ఉండగా క్రితం రోజునే కొన్న నా కారును బాంద్రాలోని నా ఇంటి బయట నుంచి ఎవరో దొంగిలించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి నేను పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, సీనియర్ ఇన్స్పెక్టర్ను కలవమని చెప్పారు. ఆ ఇన్స్పెక్టర్ దాదాపు 50 ఏళ్లుండే లావాటి మనిషి . ఆయన తన డెస్క్వద్ద ఒక వార్తా పత్రికలోని వర్గీకృత ప్రకటనలను చూస్తూ సున్నాలు చుడుతున్నాడు. నా కారు దొంగతనానికి గురైన సంగతి చెప్పాక, ఏం చేస్తున్నారని నేను ఆయనను అడిగాను. త్వరలోనే తాను రిటైర్ కాబోతున్నానని, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. భార్య ఇల్లు కొనమని ఒత్తిడి చేస్తోంది, తమకు అందుబాటులో ఉన్న కొన్ని ప్రకటనలకు ఆయన గుర్తులు పెడుతున్నారు. ఏమైనా దొరికాయా? అని అడిగాను. ఆయన నవ్వేస్తూ ‘‘నేను కొనగలిగేవి ఏవీ ఇక్కడ లేవు’’ అన్నాడు. భారత నగరాలకు సంబంధించిన విచిత్రమైన విషయాలలో ఒకటి ఆస్తుల విలువ అతి ఎక్కువగా ఉండటం. నేను తరచుగా ఆఫీసుకి సైకిల్‌పై వెళు తుంటాను. లేదా ఏ వాన వల్లనో సైకిల్‌పై వెళ్లలేకపోతే టాక్సీలో వెళతాను. ఆ ఆరు కిలోమీటర్ల దూరానికి ట్రాఫిక్‌ను బట్టి టాక్సీకి 85 నుంచి 100 రూపాయలు వరకు అవుతుంది. ప్రపంచంలోని ఏ పెద్ద నగరంలోనూ ఇంత తక్కువ ధరకు టాక్సీ దొరకడం అసాధ్యం. లండన్‌లో ఇదే దూరానికి రూ.1,200 అవుతుంది. న్యూయార్క్, టోక్యో, హెల్సెంకి, పారిస్‌ల విషయంలోనూ ఇది నిజం. దుబాయ్, షాంఘైలలో అతికొద్దిగా తక్కువ కావచ్చుగానీ, నేనిప్పుడు ఉంటున్న బెంగళూరు నగరంలోకంటే చౌక మాత్రం కాదు. ఆహారం విషయం లోనూ ఇదే పరిస్థితి. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రూ. 50లకు సమంజస మైనంత మంచి భోజనం దొరుకుతుంది. అయితే నేను పైన పేర్కొన్న నగరాల న్నిటిలోనూ అది అసాధ్యం. లండన్‌లో రూ.50 అంటే అర పౌండు లేదా న్యూయార్క్‌లో దాదాపు 70 సెంట్లు. అంటే చిల్లర మాత్రమే. అదే ఆస్తుల విలువకు వస్తే పరిస్థితి తలకిం దులవుతుంది. నేనుండే భవనానికి పక్కన ఉన్న కొత్త భవనంలో రెండు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి, ధర రూ.7 కోట్లు చెబుతున్నారు. రెండు వందల గజాల దూరంలోని మరో భవనంలో కూడా రెండు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. వాటి ధర కూడా రూ. 5 కోట్లకుపైనే. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కనీసం రెండు డజన్ల ఆస్తుల అమ్మకం ప్రకటనల హోర్డింగులు ఉంటాయి. వాటిలో చాలా వరకు ధరలను పేర్కొంటాయి. ఏదీ రూ.4 కోట్లకు తక్కువ కాదు. ఇవన్నీ నగర శివార్లలోని ఆస్తులే. ప్రాథమికమైన, మధ్యతరగతి ఇళ్ల హోర్డింగులు కూడా కొన్నిసార్లు కన బడుతుంటాయి గానీ అవి కూడా చౌకేమీ కావు. నేను బాంద్రాలో ఉండేటప్పుడు అద్దె ఇళ్లలో ఉండేవాడిని. ఆ ప్రాంతాల్లో నేడు నెలకు అద్దె రూ. 1.5 లక్షల నుంచి, ఫ్లాట్ల ధరలు రూ. 7 కోట్ల నుంచి మొదల వుతాయి. అవేమీ అత్యధునాతనమైన భవనాలూ కావు, ప్రత్యేక సదుపాయాలూ ఉండవు... ప్రాథమికమైన రెండు పడక గదుల అపార్ట్మెంట్లే. ఆ ధరకు మీకు న్యూయార్క్, లండన్లలో నగరం మధ్యనే మంచి ఇల్లు దొరుకుతుంది. రూ. 7 కోట్లు అంటే 10 లక్షల డాలర్లు. ప్రపంచంలోని ఏ నగ రంలోనైనా చక్కటి నివాసం దొరుకుతుంది. మన రియల్ ఎస్టేట్ ఆస్తులను రూపాయి నిజమైన విలువలోకి మార్చి చూస్తే అవి మరింత ఖరీదైనవిగా ఉండటం నిజంగానే విచిత్రం. కొనుగోలుశక్తి సమతుల్యత ఆధారంగా చూస్తే మన ఒక రూపాయి 3 డాలర్లకంటే ఎక్కువ. అంటే ఒక రూపాయి విలువతో అమెరికాలో కొనగలిగేవాటికంటే మూడు రెట్లు భారత్‌లో కొనగలుగుతారు. అదే తర్కాన్ని అన్వయించి చూస్తే రూ.7 కోట్ల ఫ్లాటు ఇప్పుడు రూ.21 కోట్లవుతుంది. కాబట్టే నా రూ.100 టాక్సీ చార్జీ వాస్తవంగా న్యూయార్క్‌లోని రూ.300కు సమానం. కాబట్టి అది మరీ అంత తక్కువ అనిపించదు. అలాగే నా రూ.50 భోజనం రూ. 150 అవుతుంది. అదే తర్కంతో చూస్తే రూ.7 కోట్ల ఫ్లాటు ఇప్పుడు రూ.21 కోట్లవుతుంది. ప్రపంచంలోని చాలా ఇతర ప్రాంతాల్లోకంటే రవాణా, ఆహారం చాలా చౌకగా ఉండే మన నగరాల్లో ఆస్తుల ధరలు విపరీతంగా ఎక్కువ. ఎందుకు అనేదే ప్రశ్న. బ్రిటిష్‌వారు అద్భుతమైన కొన్ని నివాస ప్రాంతాలను నిర్మించి ఇచ్చారు అనేది దీనికి సులువుగా లభించే సమాధానం. ట్యూటియన్ ఢిల్లీ లేదా దక్షిణ ముంబైలో ఆస్తులు అంత ఎక్కువ ఖరీదైనవిగా ఉండటాన్ని అది వివరించవచ్చు. కానీ బెంగళూరులోని ఫ్లాట్లు ఇంత ఖరీదైనవిగా ఎందుకు ఉన్నాయనే విష యాన్ని మాత్రం వివరించలేదు. ఇంత ఖరీదైన ఈ ఫ్లాట్లను ఎవరు కొంటున్నారు, ఎక్కడి నుంచి ఎలా వారింత డబ్బును సంపాదిస్తున్నారు? అనేది మరో విషయం. 5,430 మంది భారతీయులు మాత్రమే రూ. 1 కోటికి మించిన ఆదాయపు పన్నును చెల్లి స్తున్నారు. మన దేశంలో ఆదాయపు పన్ను చెల్లించకపోవడం చాలా ఎక్కువని నాకు తెలుసు. అయినాగానీ కోట్లకు కోట్లు పెట్టి దేశంలోని ప్రతి నగరంలోనూ ఈ ఆస్తులను కొంటున్న వ్యక్తులు ఎవరు అనేదాన్ని అది వివరించదు. కొన్ని వందల మంది కార్పొరేట్ ఉద్యోగుల జీతాలు అత్యధికంగా ఉంటాయి. అలాంటి వారు ప్రధాన కంపెనీల సీఈఓలో లేదా ద్వితీయ, తృతీయ అత్యున్నత అధికారులో అయివుంటారు. అయినా అది, నా చుట్టూ కనిపిస్తున్న వేలాది ఫ్లాట్లు, వందలాది భవనాలను కొంటున్నవారెవరో వివరించలేదు. భారతదేశంలోని రియల్ ఎస్టేట్ ఆస్తుల ధరలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక ప్రాంతంలోనే విలువ సరితూగక పోవడం ఏమిటో ఎవరైనా వివరించే వారుంటే బాగుండని నేను చూస్తున్నాను. ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com