ప్రాథమిక సదుపాయాలే మహాభాగ్యం
అవలోకనం
గుజరాతీలు బుల్లెట్ ట్రైన్ కావాలని కోరడం లేదు. సాధారణ ట్రాఫిక్ రద్దీని తట్టుకునే ఫ్లై ఓవర్‌లున్న జాతీయ రహదారులు వారికి కావాలి. నిర్మించడానికి ముందే కూలిపోకుండా ఉండే, రెండేళ్ల పాటూ బాగు చేయకుండా వదిలేయని మౌలిక నగర సదుపాయాలు కావాలి. ప్రాథమిక సదుపాయాలన్నీ సక్రమంగా ఉండేలా చూసే విసుగెత్తించే నాయకత్వమే వారికి అవసరం. అంతేగానీ బుల్లెట్ ట్రైన్‌ల గురించి కలలు కనగల అద్భుత మేధో నాయకత్వం కాదు.
నేనీ కాలమ్‌ను నా కుటుంబ స్వస్థలమైన సూరత్ నుంచి రాస్తున్నాను. దేశంలోని అతి పురాతనమైన, పెద్ద నగరాలలో సూరత్ ఒకటి. ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీల లాగా ఇది బ్రిటిష్ వాళ్లు నిర్మించినది కాదు. భారతీయులే నిర్మించిన ఈ నగరానికి అనేక శతాబ్దాల లిఖిత చరిత్ర ఉంది.
ఢిల్లీ సుల్తానుల కాలానికే ఉన్న ఈ నగరం మొగల్ చక్రవర్తులకు ఉప ఖండంలోనే అత్యధిక రాబడి.నిచ్చిన నగరం. జహంగీర్ కాలంలో ప్రముఖ ఓడ రేవుగా, పెద్ద వాణిజ్య కేంద్రంగా సూరత్ విలసిల్లుతుండగా... 1608లో బ్రిటిష్ వారు మొదటిసారిగా ఇక్కడ దిగారు. మూడు శతాబ్దాల తర్వాత ఓడ రేవును ముంబైకి తరలించినా ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేటంత పెద్దది గానే ఉండేది. లియో టాల్‌స్టాయ్ ‘సూరత్ కాఫీ హౌస్’ అనే ఓ చిన్న కథను కూడా రాశారు.
నేటి సూరత్ ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల నగిషీ కేంద్రం. (ప్రపంచ వ్యాప్తంగా లభించే మొత్తం వజ్రాలలో ముడింట రెండు వంతులు సూరత్‌కు వచ్చి వెళ్లాల్సిందే). ఇంచుమించుగా లండన్ నగరం అంత జనాభా కలిగిన ఈ నగరం ప్రపంచంలోని అతి పెద్ద వస్త్ర ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి. భారత్‌లోని మరే ఇతర నగరం కన్నా తలసరి ఆదాయం ఇక్కడే ఎక్కువ.
అయినా నా స్వస్థలమైన ఈ నగరానికి చేరుకోవడం నాకు దాదాపుగా అసాధ్యమైంది కాబట్టే ఇదంతా చెబుతున్నాను. నేనిప్పుడు నివాసం ఉంటున్న బెంగళూరు నుంచి ఇక్కడికి నేరుగా వచ్చే విమాన సర్వీసు లేదు. ఎందుకంటే సూరత్‌లో ఉన్న ఒక్క విమానాశ్రాయం పనిచేయడం లేదు. ప్రైవేటు విమాన సంస్థలేవీ సూరత్‌కు విమాన సర్వీసులను నడపవు. మోదీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన కొద్ది కాలానికే ఒక గేదె సూరత్ విమానాశ్రయంలోకి దూసుకురాగా ఒక విమానం దాన్ని ఢీకొంది. ఆ విమానం జెట్ ఇంజన్ దెబ్బతింది. దీంతో సూరత్-ముంబై-బెంగళూరులను కలుపుతూ ఉన్న ఈ ఒక్క ప్రైవేటు విమాన సర్వీసునూ రద్దు చేశారు.
విమానాశ్రయం చుట్టూ ఉన్న కంచెలో ఉన్న సందుగుండా గేదె లోపలికి చొరబడిందని, గోడను నిర్మించడానికి ఆదేశించామని నరేంద్ర మోదీ కేబినెట్‌లోని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఏ మాత్రం నమ్మకాన్నీ కలిగించకపోవడంతో ఆ విమాన సంస్థ గత రెండేళ్లుగా సూరత్ సర్వీసు ఊసెత్తడం లేదు. ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా నేను విమానంలో ముంబై చేరి, అక్కడి నుంచి ఐదు గంటలు రోడ్డు మార్గాన ప్రయాణించాలి. ఈ 300 కిలోమీటర్ల దూరం ముంబై, ఢిల్లీలను కలిపే రహదారి. అది మన దేశంలోనే అత్యుత్తమ రహదారి వ్యవస్థయైన గోల్డెన్ క్వాడ్రిలేటరల్‌లో (చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలను కలుపుతుంది) భాగం.
అయినా ఈ ప్రయా ణానికి ఐదు గంటలు ఎందుకు పట్టినట్టు? ముంబైకు వెలుపల ఫౌంటెన్ హోటల్ అనే ప్రాంతానికి సమీపంలోని ఒక ఫ్లై ఓవర్ పగలడమో లేదా బీట్లు పడటమో జరిగింది. దీంతో ఆ వంతెనపై నుంచి ఒకేసారి ఇరు వైపులకూ వాహనాలను అనుమతించడం ప్రమాదకరంగా మారింది. కాబట్టి ఒక వైపు నుంచి వాహనాలను వదిలినప్పడు రెండో వైపున ఉన్నవి తరచుగా గంట సేపు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది బాగా రద్దీగా ఉండే రహదారి, బహుశా దేశంలోనే అతి రద్దీగా ఉండే మార్గం. కాబట్టి అలా ఆగిపోయే కార్లు, ట్రక్కుల బారు చాలా కిలో మీటర్ల దూరం ఉంటుంది.
ఈ పరిస్థితి ఇలా ఎంత కాలం నుంచి ఉన్నదని డ్రైవర్‌ను అడిగితే కనీసం నాలుగు నెలలవుతుందని తెలిసింది. అయినా దాన్ని బాగు చేసే పనులు ఇంకా మొదలు కాలేదు. సూరత్ చేరేసరికి క్రితం సారి నేనక్కడికి వచ్చేటప్పటికి... కూలి పోయి 11 మంది ప్రాణాలను బలిగొన్న ఫ్లై ఓవర్‌ను ఇంకా పునర్నిర్మించలేదు. అది సరికొత్త ఫ్లైఓవర్, దానిలో ఒక భాగం కింద దన్నుగా నిలిపిన పరంజాను తొలగించడంతోనే కుప్పుకూలిపోయింది. రెండేళ్ల నుంచి ఆ చిన్న భాగాన్ని బాగు చేయలేకపోవడంతో సూరత్‌లోని అతి ముఖ్యమైన రహదారి అత్వాలైన్స్‌పై ఉన్న ఆ ఫ్లై ఓవర్ నిరుపయోగంగా మారింది.
నేను చెప్పదలుచుకున్న అంశాన్ని ఇదైనా మీకు స్ఫురింపజేస్తుంది. భారత దేశపు బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయబోయే మార్గం ఇదే. ఆ అతి వేగపు రైలు వ్యవస్థ అహ్మదాబాద్‌లో మొదలై సూరత్‌కు చేరుతుంది. అంటే ఇంచుమించుగా అహ్మదాబాద్-ముంబైలకు మధ్యన ఉంటుంది.
బుల్లెట్ ట్రైన్ కావాలని గుజ రాతీలు కోరడం లేదు. వారికి కావాల్సింది జంతువులు తిరగకుండా ఉండే, సక్రమంగా పనిచేసే విమానాశ్రయాలు. సాధారణ ట్రాఫిక్ రద్దీని తట్టుకునే ఫ్లై ఓవర్‌లున్న జాతీయ రహదారులు వారికి కావాలి. నిర్మించడానికి ముందే కూలిపోకుండా ఉండి, రెండేళ్ల పాటూ బాగు చేయకుండా వదిలేయని మౌలిక నగర సదుపాయాలు వారికి కావాలి. వారికి అవసరమైనది ప్రాథమిక సదుపాయాలన్నీ సక్రమంగా ఉండేలా చూసే విసు గెత్తించే నాయకత్వమే తప్ప, బుల్లెట్ ట్రైన్‌ల గురించి కలలు కనగల అద్భుత మేధో నాయకత్వం కాదు.
లండన్ నగరం అంత ఉండే ఈ చారిత్రక నగరం అభివృద్ధిపట్ల చూపుతున్న ఈ యథాలాప ధోరణి ఆశ్చర్యకరం. అది దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం (2008లో కుటుంబానికి సగటున రూ. 4.5 లక్షలకుపైగా). బెంగళూరు నుంచి అలాంటి సుప్రసిద్ధ నగరాన్ని చేరుకోవడం అంటే నాకు లండన్‌కు వెళ్లడం కంటే కూడా కష్టం.
ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
ఈ-మెయిల్ : aakar.patel@icloud.com