మనవాళ్లనే కాపాడలేం.. ఆఫ్రికన్ల మాటెందుకు? | aakar patel writes on racism in india against africans | Sakshi
Sakshi News home page

మనవాళ్లనే కాపాడలేం.. ఆఫ్రికన్ల మాటెందుకు?

Published Sun, Apr 9 2017 1:45 AM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM

మనవాళ్లనే కాపాడలేం.. ఆఫ్రికన్ల మాటెందుకు? - Sakshi

మనవాళ్లనే కాపాడలేం.. ఆఫ్రికన్ల మాటెందుకు?

అవలోకనం

మాలో జాతి వివక్ష ఉన్నట్లయితే మేం దక్షిణ భారతీయులతో కలిసి ఎందుకు జీవిస్తాం అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన తరుణ్‌ విజయ్‌ మొరటుగా వ్యాఖ్యానించారు. ఒక నేరపూరిత చర్యను జాత్యహంకారంగా తప్పుగా పేర్కొంటున్నారని ప్రభుత్వం సైతం మొరటు ప్రకటన  చేసింది. కొద్దిమంది నేరస్తుల అస్వాభావిక చర్యపట్ల వ్యవహరించేంత దృఢంగా భారతీయ నిఘా వ్యవస్థలు ఉన్నాయని మన విదేశీ శాఖ పేర్కొంది. కానీ ఇది అబద్ధం. మూక దాడుల నుంచి భారతీయులనే మన చట్టాలు కాపాడలేవు. ఇక ఆఫ్రికన్లను ఎలా కాపాడతాయి?


మానవుల్లో కొందరు తెల్లగా మరికొందరు నల్లగా ఎందుకుంటారు? మన పరిసరాలకు తగిన అత్యత్తమ సాధనాలను ప్రకృతి పరిణామక్రమం మనకు ఇచ్చిందన్నదే దీనికి సమాధానం. వేడి  వాతావరణ పరిస్థితుల్లో నివసిస్తున్న మన శరీరాలు స్వేద గ్రంథులు ఎక్కువగానూ, చర్మంపై వెంట్రుకలు తక్కువగానూ ఉండేలా రూపొందుతూ వచ్చాయి. దీంతో మన శరీరం త్వరగా చల్లబడుతుంది.

మన శరీరం మీద వెంట్రుకలు తక్కువగా ఉన్నందువల్ల కేన్సర్‌ను కలిగించే అతినీల లోహిత కిరణాల నుంచి మన చర్మానికి కాస్త రక్షణ అవసరమవుతుంది. ఈ రక్షణ మనకు గోధుమరంగులో ఉండే మెలనిన్‌ రూపంలో కలుగుతుంది. మనలో ప్రతి ఒక్కరిలోనూ వేర్వేరు పరిణామాల్లో ఉండే మెలనిన్‌ ఒక ప్రకృతి సహజ సన్‌స్క్రీన్‌ అన్నమాట. అత్యంత వేడి వాతావరణంలో ఉన్న వారి శరీరాల్లో ఇది అధికంగా తయారవుతుంది. ఇలాంటి వారి శరీరాలు నల్లగా ఉంటాయి.

ఉష్ణ ప్రాంతాల్లో నివసించే కొందరు ఇతరుల కంటే నల్లగా ఎందుకుంటారు అనే ప్రశ్నకు ఇదే సమాధానం. మరి మనలో కొందరు తెల్లగా ఎందుకుంటారు? శరీరంలోని ఎముకలు కాల్షియంను సంగ్రహించడానికి విటమిన్‌ డి ని ఉపయోగించుకోవాలంటే చర్మంలోనికి కొంత స్థాయిలో అతినీల లోహిత కిరణాలు ప్రవేశించాల్సి ఉంటుంది. ఉత్తర భారతదేశం వంటి ఎండ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే మనుషులకు తెల్లటి చర్మం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో లభ్యమయ్యే సూర్యకాంతిని వీరి చర్మం సమర్థవంతంగా సంగ్రహిస్తుంది.

కాబట్టే మిగతా కారణాలకంటే భూగోళ శాస్త్రమే మన చర్మపు రంగును ప్రధానంగా నిర్దేశిస్తుంటుంది. దీంతోనే మనం జాతులుగా అభివృద్ధి చెందుతూ వచ్చాం. భారతదేశంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి పర్యటించేటప్పుడు మన చర్మం రంగు మారటం మనం చూస్తుంటాం. ఇదే విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన తరుణ్‌ విజయ్‌ ఈ వారం మరింత మొరటురూపంలో వ్యక్తీకరించారు. భారతీయులు జాతి వివక్షా వాదులు కాదన్నారు. దానికి సమర్థనగా ఆయన ‘మాలో జాతి వివక్ష ఉన్నట్లయితే దక్షిణ భారతీయులతో కలిసి ఎందుకు జీవిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు దక్షిణాది రాష్ట్రాలను చాలా మొరటుగా ప్రస్తావిస్తూ మా చుట్టూ కూడా నల్లజాతి ప్రజలు ఉన్నారనే వ్యాఖ్యను జోడించారు.

భారత్‌లో ఆఫ్రికన్లపై జరిగే దాడులకు, వారిపై హింసకు జాతి కారణమంటూ వచ్చిన వార్తకు ప్రతిస్పందనగా తరుణ్‌ అలా వ్యాఖ్యానించారు. వారిపై దాడులకు జాతి వివక్ష కారణమన్న వాదనను ఆయన సవాలు చేశారు. కానీ తన ప్రకటన మీడియాలో వచ్చాక.. దానినే సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారత్‌లో ఆఫ్రికన్లపై దాడులకు వ్యతిరేకంగా ఆఫ్రికా దేశాల రాయబారులు ఉమ్మడిగా చేసిన ఘాటు ప్రకటనలో ఆసక్తికరమైన అంశాన్ని నేను చూశాను. మన దేశంలో ఆఫ్రికన్లపై గతంలో  జరిగిన డాడులను వారు సమీక్షిస్తూ వాటిపై భారత ప్రభుత్వం తగిన స్పష్టమైన నిరోధక చర్యలను చేపట్టలేకపోయిందని ఆరోపిం చారు. ఇలాంటి ఘటనలపై భారతీయ అధికారులు తగిన రీతిలో ఖండించలేదని వారు భావించారు. ఆఫ్రికన్లపై దాడులు జరిపిన వారు విదేశీయుల పట్ల విముఖత చూపేవారని, జాత్యహంకారులని వారి సమావేశం ఏకగ్రీవంగా ప్రకటించింది.

ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. దీనిపై భారత ప్రభుత్వం కూడా తరుణ్‌ విజయ్‌లాగే వ్యవహరించింది. ఒక నేరపూరిత చర్యను జాతిపట్ల విముఖత తెలుపడంగా, జాత్యహంకారంగా తప్పుగా పేర్కొంటున్నారని ప్రభుత్వం సైతం మొరటు ప్రకటన విడుదల చేసింది. కొద్దిమంది నేరస్తుల అస్వాభావిక చర్యపట్ల వ్యవహరించడానికి దృఢమైన భారతీయ వ్యవస్థలు ఉన్నాయని మన విదేశీ  మంత్రిత్వ శాఖ పేర్కొంది. కానీ ఇది అబద్ధం. మూక దాడుల నుంచి భారతీయులనే మన భారతీయ శాసన వ్యవస్థలు కాపాడలేవు. మరి ఇవి విదేశీయులను ఎలా కాపాడతాయి? కానీ ఆఫ్రికన్‌ రాయబారుల ఆరోపణలలో నిజమెంత?

పాతికేళ్ల క్రితం భారత్‌లో ఒక పత్రిక ఓ రహస్య చర్యను నిర్వహించింది. స్టింగ్‌ ఆపరేషన్లు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి ఆ రహస్య కార్యక్రమాన్ని వీడియో తీయలేదు. కొన్ని  ఫొటోలు, రిపోర్టర్‌ వ్యాఖ్య మాత్రమే వచ్చింది. ఆ మ్యాగజైన్‌ ఒక శ్వేతజాతీయుడిని, ఒక నల్లజాతీయుడిని పొడవాటి క్యూను ఛేదించే కార్యక్రమం కోసం ఎంచుకుంది. అది ఒక రైల్వేస్టేషన్‌ టికెట్‌ కౌంటర్‌. నల్లజాతీయుడు పొడవాటి క్యూను అతిక్రమించి కౌంటర్‌కు దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు క్యూలో ఉన్న జనం పెద్దగా కేకలు  వేస్తూ అతడిని మొరటుగా అడ్డుకున్నారు. కానీ తెల్లజాతీయుడు అదే పనికి పూనుకున్నప్పుడు అదే జనం అతడిని సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరి వ్యక్తులపట్ల వ్యవహరించే విషయంలో భారతీయుల తీరు తేడాగా ఉంటోందని ఆ పత్రిక తన కథనాన్ని ముగించింది.

తగినంత డేటా లేని కారణంగా భారతీయులు జాత్యహంకారులా కాదా అని నేను కచ్చితంగా అయితే చెప్పలేను. అయితే నేను జాతి వివక్షాపరుడిని కానని మాత్రం చెప్పగలను. కానీ, ఢిల్లీలో లేదా బెంగళూరులోని ఆఫ్రికన్‌ని నేనే అయివున్నట్లయితే, వందలాదిమంది భారతీయులు నాతో ఎలా వ్యవహరిస్తారు అనే ప్రాతిపదికన నేను ఒక నిర్ధారణకు రాగలిగి ఉంటాను. చాలామంది భారతీయులు జాత్యహంకారులా, శరీరంలోని ఒక రంగుపట్ల వారు వ్యతిరేకంగా స్పందిస్తారా అని తెలుసుకోవడానికి, భారత్‌లోని ఆ్రíఫికన్‌లను వారి అనుభవం గురించి మనం అడగాలి. మనలో చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే ఉంటుంది.

ఢిల్లీలోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో పనిచేసిన నా మిత్రురాలు ఒకరు కొంతకాలం మరొక సంస్థలో పనిచేశారు. ఆమె ఆఫ్రికా జాతీయురాలు. కానీ ఆమె చర్మం కానీ, ముఖ లక్షణాలు కానీ  భారతీయ ముఖంతో పోలిస్తే ఏమంత తేడాగా ఉండేవి కాదు. భారతీయురాలిగా తాను వీధిలో సులభంగా నడవగలుగుతున్నానని ఆమె చెప్పారు. అయితే తర్వాత కొద్దికాలానికే ఆమె ఆఫ్రికన్‌ దుస్తులను ధరిం చడం, జుత్తు (కాస్త వంకీలు తిరిగి ఉండేది) వదులుగా ఉంచుకోవడం ప్రారంభిం చారు. జాతి కోణంలో ప్రజలను చూసే పౌరులున్న దేశంలో తన సొంత ఉనికిని దాచుకోవాలని తాను భావించడం లేదని ఆమె కారణం చెప్పారు.

ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement