జోహన్నస్‌బర్గ్: ఆఫ్రికా దేశాలు తమ నౌకా, వైమానిక, రక్షణ ఉపకరణాలు సమకూర్చుకునేందుకు భారత్‌పైనే ఆధారపడ్డాయని ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ‘రీఇన్విరోగేటింగ్ ఇండియాస్ ఎకనమిక్ ఎంగేజ్‌మెంట్స్ విత్ సదరన్ ఆఫ్రికా’ నివేదికలో స్పష్టంచేసింది. ‘ 2017–2021 కాలంలో మారిషస్, మొజాంబిక్, సీషెల్స్ వంటి ఆఫ్రికా దేశాల కీలక రక్షణ అవసరాలు తీర్చడంలో భారత్ పెద్దదిక్కుగా మారింది.
భారత ఆయుధాలను ఈ దేశాలు భారీమొత్తంలో కొన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెంపు, మానవతా సాయం, వేరే దేశ సైన్యానికి శిక్షణ అంశాలపైనా భారత్ దృష్టిసారించాలి. అప్పుడే 2025 కల్లా 5 బిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్య లక్ష్యాన్ని భారత్ సాకారం చేసుకోగలదు. ఇందులో రక్షణ ఉత్పత్తుల తయారీసంస్థలైన టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వంతు భాగస్వామ్య పాత్ర పోషిస్తున్నాయి.
ఇక, కొత్త తరం స్వదేశీ సాంకేతికతల సాయంతో నావికారంగంలో మానవరహిత జలాంతర్గత వ్యవస్థలు, డ్రోన్లను అభివృద్ధిచేయాలి’ అని నివేదిక పేర్కొంది. జోహన్నస్‌బర్గ్‌లో భారత్–దక్షిణాఫ్రికా దేశాల అభివృద్ధి భాగస్వామ్యం కోసం సీఐఐ–ఎగ్జిమ్ బ్యాంక్ ప్రాంతీయ సదస్సును నిర్వహించాయి. సదస్సులో ఈ నివేదికను ఆవిష్కరించారు. హిందూ సముద్ర ప్రాంత భద్రత, రక్షణలో భారత్, ఆఫ్రికా దేశాల పాత్ర కీలకమైనదని నివేదిక శ్లాఘించింది. సైబర్ సెక్యూరిటీలోనూ దేశాల పరస్పర సహకారం ప్రధానమని సూచించింది. ఈ సదస్సులో పలు ప్రభుత్వాల ఉన్నతాధికారులు, పరిశ్రమల, వ్యాపార సంస్థల అధినేతలు పాల్గొని ఏఏ అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పటిష్టంచేసుకోవాలో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment