Exim Bank
-
ఎగుమతుల్లో ఏపీ పైపైకి..
సాక్షి, అమరావతి: 2017–18 నుంచి 2022–23 మధ్య దేశ ఎగుమతులు సగటున 8.2 శాతం వృధ్ధి చెందగా అదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు 8.9 శాతం వృద్ధితో రూ. 1.59 లక్షల కోట్లకు చేరాయని ఎగ్జిమ్ బ్యాంక్ అధ్యయన నివేదికలో పేర్కొంది. రాష్ట్రం నుంచి ఎగుమతులకు ఇంకా అపారమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు దృష్టి పెట్టని మార్కెట్లను కూడా అందిపుచ్చుకోగలిగితే ఎగుమతులు మరింత వేగంగా విస్తరిస్తాయని తెలిపింది. అవకాశం ఉన్నా, ఇప్పటివరకు అందిపుచ్చుకోని మార్కెట్ విలువ రూ. 88,800 కోట్లు వరకు ఉందని అంచనా వేసింది. ఈ మార్కెట్ పైనా దృష్టి పెడితే రాష్ట్ర ఎగుమతుల విలువ రూ. 2.43 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొంది. ఎగ్జిమ్ బ్యాంక్ మధ్యంతర అంచనాల ప్రకారం 2027–28 నాటికి రాష్ట్ర ఎగుమతులు రూ. 4.80 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇందులో వాణిజ్య ఉత్పత్తుల విలువ రూ. 4 లక్షల కోట్లుగా, సేవల రంగం వాటా రూ. 80 వేల కోట్లు ఉండనుంది. ప్రభుత్వంతో కలిసి ప్రోత్సాహక చర్యలు రాష్ట్రంలో ఎగుమతుల ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్టు ఎగ్జిమ్ బ్యాంక్ ఎండీ హర్ష బంగారి ‘సాక్షి’ కి తెలిపారు. ఇందుకోసం ఎగుమతిదారులకు రుణాలు ఇవ్వడంతో పాటు జిల్లాలవారీగా అవకాశాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇంతవరకు అవకాశాలు అందిపుచ్చుకోని రంగాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా అధిక విలువ ఉన్న రిఫైన్డ్ షుగర్‌ను బంగ్లాదేశ్‌కు, పేపర్ వోచర్ కార్డులను ఇథియోపియాకు ఎగుమతి చేసేలా ఎగ్జిమ్ బ్యాంక్ రెండు కంపెనీలను ప్రోత్సహించిందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఆరు ప్రధాన ఎగుమతి జిల్లాలైన తూర్పు, పశి్చమ గోదావరి, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేసి అక్కడి ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. -
ఆఫ్రికా వైపు దేశీ ఇన్ఫ్రా కంపెనీల చూపు..
న్యూఢిల్లీ: దేశీ ఇన్ఫ్రా కంపెనీలు తాజాగా ఆఫ్రికాలో పెట్టుబడుల అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఏటా 130–176 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాయి. భారత్–ఆఫ్రికా అభివృద్ధిలో భాగస్వామ్యం అంశంపై జరిగిన 18వ సీఐఐ–ఎగ్జిమ్ బ్యాంక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆఫ్కాన్స్ ఎండీ ఎస్ పరమశివన్ ఈ విషయాలు తెలిపారు. ఆఫ్రికాలో ఇన్ఫ్రా అభివృద్ధి నిధులకు సంబంధించి 60–160 బిలియన్ డాలర్ల మేర లోటు ఉందని ఆయన చెప్పారు. వివిధ విభాగాల్లో మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. గత దశాబ్దకాలంలో ఆఫ్రికా ఏటా సగటున 80 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించింది, ఈ పెట్టుబడుల రేటు అత్యధికమని పరమశివన్ చెప్పారు. ఇంధన రంగంలో అత్యధికంగా పెట్టుబడులు రాగా, రవాణా .. ఇన్ఫ్రా రెండో స్థానంలో, జల మౌలిక సదుపాయాలు మూడో స్థానంలో ఉన్నాయని వివరించారు. ఆఫ్రికాలో రవాణాపరమైన మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు 50 శాతం నుంచి 175 శాతం మేర పెరిగిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా మార్కెట్లో ఆఫ్రికన్ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, పోటీపడే పరిస్థితి ఉండటం లేదని పరమశివన్ చెప్పారు. 3 కోట్ల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న ఆఫ్రికాలో 84,000 కి.మీ. మేర మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయన్నారు. ఆఫ్రికాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత కొన్నేళ్లలో ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ 11 బిలియన్ డాలర్ల ఇవ్వగా, పలు కంపెనీలు తోడ్పాటు అందిస్తున్నాయని ఆయన చెప్పారు. -
ఆ సత్తా భారత్‌కే ఉంది: ఎగ్జిమ్ బ్యాంక్ నివేదిక
జోహన్నస్బర్గ్: ఆఫ్రికా దేశాలు తమ నౌకా, వైమానిక, రక్షణ ఉపకరణాలు సమకూర్చుకునేందుకు భారత్‌పైనే ఆధారపడ్డాయని ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ‘రీఇన్విరోగేటింగ్ ఇండియాస్ ఎకనమిక్ ఎంగేజ్మెంట్స్ విత్ సదరన్ ఆఫ్రికా’ నివేదికలో స్పష్టంచేసింది. ‘ 2017–2021 కాలంలో మారిషస్, మొజాంబిక్, సీషెల్స్ వంటి ఆఫ్రికా దేశాల కీలక రక్షణ అవసరాలు తీర్చడంలో భారత్ పెద్దదిక్కుగా మారింది. భారత ఆయుధాలను ఈ దేశాలు భారీమొత్తంలో కొన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెంపు, మానవతా సాయం, వేరే దేశ సైన్యానికి శిక్షణ అంశాలపైనా భారత్ దృష్టిసారించాలి. అప్పుడే 2025 కల్లా 5 బిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్య లక్ష్యాన్ని భారత్ సాకారం చేసుకోగలదు. ఇందులో రక్షణ ఉత్పత్తుల తయారీసంస్థలైన టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వంతు భాగస్వామ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇక, కొత్త తరం స్వదేశీ సాంకేతికతల సాయంతో నావికారంగంలో మానవరహిత జలాంతర్గత వ్యవస్థలు, డ్రోన్లను అభివృద్ధిచేయాలి’ అని నివేదిక పేర్కొంది. జోహన్నస్‌బర్గ్‌లో భారత్–దక్షిణాఫ్రికా దేశాల అభివృద్ధి భాగస్వామ్యం కోసం సీఐఐ–ఎగ్జిమ్ బ్యాంక్ ప్రాంతీయ సదస్సును నిర్వహించాయి. సదస్సులో ఈ నివేదికను ఆవిష్కరించారు. హిందూ సముద్ర ప్రాంత భద్రత, రక్షణలో భారత్, ఆఫ్రికా దేశాల పాత్ర కీలకమైనదని నివేదిక శ్లాఘించింది. సైబర్ సెక్యూరిటీలోనూ దేశాల పరస్పర సహకారం ప్రధానమని సూచించింది. ఈ సదస్సులో పలు ప్రభుత్వాల ఉన్నతాధికారులు, పరిశ్రమల, వ్యాపార సంస్థల అధినేతలు పాల్గొని ఏఏ అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పటిష్టంచేసుకోవాలో చర్చించారు. -
కోవిడ్ టీకాలకు.. రూ.750 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 టీకాలు, తత్సంబంధ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దేశీ సంస్థలకు దాదాపు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 750 కోట్లు) మేర రుణాలు సమకూరుస్తున్నట్లు ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) డిప్యుటీ ఎండీ ఎన్ రమేష్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు ఆరు సంస్థలకు వీటిని అందిస్తున్నట్లు శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. హబ్‌గా హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ హబ్‌గా ఎదిగిందని రమేష్ ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి దశలో ఉన్న కొన్ని సంస్థలను గుర్తించి, నిర్దిష్ట పథకం కింద వాటికి కావాల్సిన తోడ్పాటు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే మూడు సంస్థలకు సుమారు రూ. 70–100 కోట్ల దాకా సమకూరుస్తున్నట్లు రమేష్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సంస్థలు మరో పదింటిని పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉభర్తే సితారే పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద దేశవ్యాప్తంగా 30 సంస్థలకు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సుమారు 100 కంపెనీలకు తోడ్పాటు అందించనున్నట్లు రమేష్ చెప్పారు. ప్రస్తుతం ఎగ్జిమ్ బ్యాంక్ రుణ పోర్ట్‌ఫోలియో దాదాపు రూ. 1.1 లక్ష కోట్లుగా (ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి) ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 శాతం వృద్ధి నమోదు కాగలదని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అందిన నిధుల ఊతంతో వచ్చే అయిదేళ్లలో దాదాపు 7 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగు మతి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని నిర్దేశించుకున్నట్లు రమేష్ వివరించారు. -
వేలానికి రజనీకాంత్ ఆస్తులు!
సాక్షి, చెన్నై: ‘కొచ్చాడియాన్’ సినిమా నిర్మాణం కోసం తీసుకున్న అప్పు తీర్చని కారణంగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆస్తులను బ్యాంక్ వేలం వేయబోతోందనే వార్త తమిళ సినీ పరిశ్రమలో హల్చల్ చేస్తోంది. సినిమా నిర్మాణం కోసం ‘మీడియావన్ గ్లోబల్ ఎంటటైన్మెంట్’లో భాగస్వామి అయిన రజనీకాంత్ భార్య లతారజనీకాంత్ ముంబైలోని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి దాదాపు రూ.20 కోట్లు అప్పు తీసుకున్నారు. తమిళనాడులోని కంచీపురం జిల్లాలో ఉన్న దాదాపు 2.13 ఎకరాల్లో ఉన్న ఆస్తులను అప్పు సమయంలో షూరిటీగా పెట్టారు. తీసుకున్న అప్పుకు గడువు ఈ ఏడాది జూలై 17న ముగిసిందని, వడ్డీతో కలిపి మొత్తం రూ.22కోట్లు దాటడంతో ఆస్తులను వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. దీనిపై లతారజనీకాంత్ మాట్లాడుతూ బ్యాంక్‌కు త్వరలోనే అప్పు చెల్లిస్తామన్నారు. తన భర్తకు ఈ నోటీసుల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మార్చి 31లోగా అప్పు తీర్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు మీడియావన్ సంస్థ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపింది. -
రజనీకాంత్ ఆస్తుల వేలానికి ప్రకటన
-
షిప్ బిల్డింగ్‌కు రూ. 1,500 కోట్ల ప్రత్యేక ఫండ్
ముంబై: నౌకానిర్మాణ (షిప్ బిల్డింగ్) పరిశ్రమకు నిధులు అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లతో ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ తద్వారా ఈ రంగానికి కనీసం రూ. 15,000 కోట్ల వరకూ నిధుల లభ్యతకు అవకాశముంటుందని భావిస్తోంది. ఎగ్జిమ్ బ్యాంక్‌తో కలసి నౌకారంగానికే ప్రత్యేకించిన ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ అత్యున్నత అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు ఎగ్జిమ్ బ్యాంక్ చైర్మన్ యదువేంద్ర మాథుర్ తెలిపారు. ఫండ్ ద్వారా నౌకల నిర్మాణం, తిరిగి నిర్మించడం, మరమ్మతులు వంటి కార్యకలాపాలకు ఫైనాన్సింగ్ లభిస్తుందని వివరించారు. ప్రభుత్వం ఈక్విటీ రూపేణా రూ. 1,500 కోట్లను ఇన్వెస్ట్‌చేస్తుందని, వీటిని ఎగ్జిమ్ బ్యాంక్‌కు అనుసంధానించడం ద్వారా 10 రెట్లు అధికంగా రూ. 15,000 కోట్లవరకూ నిధులు అందించేందుకు వీలుచిక్కుతుందని తెలియజేశారు.