న్యూఢిల్లీ: దేశీ ఇన్‌ఫ్రా కంపెనీలు తాజాగా ఆఫ్రికాలో పెట్టుబడుల అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఏటా 130–176 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాయి. భారత్–ఆఫ్రికా అభివృద్ధిలో భాగస్వామ్యం అంశంపై జరిగిన 18వ సీఐఐ–ఎగ్జిమ్ బ్యాంక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆఫ్కాన్స్ ఎండీ ఎస్ పరమశివన్ ఈ విషయాలు తెలిపారు. ఆఫ్రికాలో ఇన్‌ఫ్రా అభివృద్ధి నిధులకు సంబంధించి 60–160 బిలియన్ డాలర్ల మేర లోటు ఉందని ఆయన చెప్పారు.
వివిధ విభాగాల్లో మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. గత దశాబ్దకాలంలో ఆఫ్రికా ఏటా సగటున 80 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించింది, ఈ పెట్టుబడుల రేటు అత్యధికమని పరమశివన్ చెప్పారు. ఇంధన రంగంలో అత్యధికంగా పెట్టుబడులు రాగా, రవాణా .. ఇన్‌ఫ్రా రెండో స్థానంలో, జల మౌలిక సదుపాయాలు మూడో స్థానంలో ఉన్నాయని వివరించారు.
ఆఫ్రికాలో రవాణాపరమైన మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు 50 శాతం నుంచి 175 శాతం మేర పెరిగిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా మార్కెట్లో ఆఫ్రికన్ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, పోటీపడే పరిస్థితి ఉండటం లేదని పరమశివన్ చెప్పారు. 3 కోట్ల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న ఆఫ్రికాలో 84,000 కి.మీ. మేర మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయన్నారు. ఆఫ్రికాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత కొన్నేళ్లలో ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ 11 బిలియన్ డాలర్ల ఇవ్వగా, పలు కంపెనీలు తోడ్పాటు అందిస్తున్నాయని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment