India-Africa Summit
-
Vice President Jagdeep Dhankhar: పరస్పర సహకారం మరింతగా పెరగాలి
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా మధ్య మౌలిక సదుపాయాలు, స్పేస్, వ్యవసాయం, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పరస్పర సహకారం మరింతగా పెరగాలని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ఆకాంక్షించారు. ఇండియా–ఆఫ్రికా సదస్సులో మాట్లాడుతూ డ్యూటీ–ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ (డీఎఫ్టీపీ) స్కీముతో ఇరు దేశాలు అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పుష్కలంగా సహజ వనరులు, ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా పెరుగుతున్న ఆర్థిక సమగ్రత తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు ఆఫ్రికా ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంటోందని ధన్కడ్ చెప్పారు. అలాగే, కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలు, అంతరిక్ష రంగంలాంటి విషయాల్లో భారత్తో ఆఫ్రికా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చన్నారు. సీఐఐ ఇండియా–ఆఫ్రికా బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ధన్కడ్ ఈ విషయాలు వివరించారు. 43 ఆఫ్రికా దేశాల్లో 203 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై భారత్ 12.37 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. 85 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఆఫ్రికాకు భారత్ నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటోందని వివరించారు. స్వచ్ఛ సాంకేతికత, వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలవగలిగే సాగు విధానాలు, తీర ప్రాంత గస్తీ, కనెక్టివిటీ వంటి విభాగాల్లో భారత్, ఆఫ్రికా కలిసి పని చేయొచ్చని ధన్కడ్ చెప్పారు. -
ఆఫ్రికా వైపు దేశీ ఇన్ఫ్రా కంపెనీల చూపు..
న్యూఢిల్లీ: దేశీ ఇన్ఫ్రా కంపెనీలు తాజాగా ఆఫ్రికాలో పెట్టుబడుల అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఏటా 130–176 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాయి. భారత్–ఆఫ్రికా అభివృద్ధిలో భాగస్వామ్యం అంశంపై జరిగిన 18వ సీఐఐ–ఎగ్జిమ్ బ్యాంక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆఫ్కాన్స్ ఎండీ ఎస్ పరమశివన్ ఈ విషయాలు తెలిపారు. ఆఫ్రికాలో ఇన్ఫ్రా అభివృద్ధి నిధులకు సంబంధించి 60–160 బిలియన్ డాలర్ల మేర లోటు ఉందని ఆయన చెప్పారు. వివిధ విభాగాల్లో మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. గత దశాబ్దకాలంలో ఆఫ్రికా ఏటా సగటున 80 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించింది, ఈ పెట్టుబడుల రేటు అత్యధికమని పరమశివన్ చెప్పారు. ఇంధన రంగంలో అత్యధికంగా పెట్టుబడులు రాగా, రవాణా .. ఇన్ఫ్రా రెండో స్థానంలో, జల మౌలిక సదుపాయాలు మూడో స్థానంలో ఉన్నాయని వివరించారు. ఆఫ్రికాలో రవాణాపరమైన మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు 50 శాతం నుంచి 175 శాతం మేర పెరిగిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా మార్కెట్లో ఆఫ్రికన్ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, పోటీపడే పరిస్థితి ఉండటం లేదని పరమశివన్ చెప్పారు. 3 కోట్ల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న ఆఫ్రికాలో 84,000 కి.మీ. మేర మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయన్నారు. ఆఫ్రికాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత కొన్నేళ్లలో ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ 11 బిలియన్ డాలర్ల ఇవ్వగా, పలు కంపెనీలు తోడ్పాటు అందిస్తున్నాయని ఆయన చెప్పారు. -
అబ్దెల్కు మోదీ ఆహ్వానం
న్యూఢిల్లీ: వచ్చే అక్టోబర్ నెలలో జరగనున్న ఇండియా ఆఫ్రికా సమ్మిట్-2015కు హాజరుకావాల్సిందిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసిని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ కోరారు. బుధవారం ఆయన కైరోలో అబ్దెల్ను కలిశారు. అక్టోబర్లో జరిగే సమావేశాల్లో తమను కలిసేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఉత్సుకతో ఎదురుచూస్తున్నారని అబ్దెల్కు గడ్కరీ తెలియజేశారు. ఈజిప్టుతో మంచి సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నామని, దౌత్య విషయాల్లో కలిసి సాగాలని కోరుకుంటున్నామని చెప్పారు. కైరోలో జరుగుతున్న న్యూ సూయజ్ కెనాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత్ తరుపున ప్రతినిధిగా గడ్కరీ వెళ్లారు. ఈ కార్యక్రమం గురువారం జరగనుండగా అదే రోజు ప్రధాని ఆహ్వాన పత్రాన్ని అబ్దెల్కు అందజేయనున్నారు.