అబ్దెల్కు మోదీ ఆహ్వానం
న్యూఢిల్లీ: వచ్చే అక్టోబర్ నెలలో జరగనున్న ఇండియా ఆఫ్రికా సమ్మిట్-2015కు హాజరుకావాల్సిందిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసిని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ కోరారు. బుధవారం ఆయన కైరోలో అబ్దెల్ను కలిశారు. అక్టోబర్లో జరిగే సమావేశాల్లో తమను కలిసేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఉత్సుకతో ఎదురుచూస్తున్నారని అబ్దెల్కు గడ్కరీ తెలియజేశారు.
ఈజిప్టుతో మంచి సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నామని, దౌత్య విషయాల్లో కలిసి సాగాలని కోరుకుంటున్నామని చెప్పారు. కైరోలో జరుగుతున్న న్యూ సూయజ్ కెనాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత్ తరుపున ప్రతినిధిగా గడ్కరీ వెళ్లారు. ఈ కార్యక్రమం గురువారం జరగనుండగా అదే రోజు ప్రధాని ఆహ్వాన పత్రాన్ని అబ్దెల్కు అందజేయనున్నారు.