షిప్ బిల్డింగ్‌కు రూ. 1,500 కోట్ల ప్రత్యేక ఫండ్
ముంబై: నౌకానిర్మాణ (షిప్ బిల్డింగ్) పరిశ్రమకు నిధులు అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లతో ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ తద్వారా ఈ రంగానికి కనీసం రూ. 15,000 కోట్ల వరకూ నిధుల లభ్యతకు అవకాశముంటుందని భావిస్తోంది. ఎగ్జిమ్ బ్యాంక్‌తో కలసి నౌకారంగానికే ప్రత్యేకించిన ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ అత్యున్నత అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు ఎగ్జిమ్ బ్యాంక్ చైర్మన్ యదువేంద్ర మాథుర్ తెలిపారు. ఫండ్ ద్వారా నౌకల నిర్మాణం, తిరిగి నిర్మించడం, మరమ్మతులు వంటి కార్యకలాపాలకు ఫైనాన్సింగ్ లభిస్తుందని వివరించారు. ప్రభుత్వం ఈక్విటీ రూపేణా రూ. 1,500 కోట్లను ఇన్వెస్ట్‌చేస్తుందని, వీటిని ఎగ్జిమ్ బ్యాంక్‌కు అనుసంధానించడం ద్వారా 10 రెట్లు అధికంగా రూ. 15,000 కోట్లవరకూ నిధులు అందించేందుకు వీలుచిక్కుతుందని తెలియజేశారు.