అవలోకనం
మన దేశంలో మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లో అందరికీ ప్రవేశం ఉంటుంది. హిందూ శాస్త్రాలు విదేశీయులకు, ఇతర మతస్తులకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించినట్టు లేదు. నిషేధించి ఉంటే, అన్ని దేవాలయాల్లోనూ అదే నిబంధన ఉండేది. కానీ లేదు. అయినా ముఖ్య దేవాలయాలు నానాటికీ మరింత ఎక్కువగా విదేశస్తులకు, హిందూయేతరులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయి.
ఒరియా ప్రజల్లో దుర్యోధన పేరు సర్వసాధారణం. అలాగే దుశ్శాసన పేరు కూడా. భువనేశ్వర్, పూరీలను సందర్శించేంత వరకు అది నాకూ తెలీదు. పూరీ లోని సుప్రసిద్ధ జగన్నాథ ఆలయాన్ని చూడటానికి ఈ వారం అక్కడికి వెళ్లాను. ఇలాంటి ప్రదేశాల చరిత్ర, అద్భుత నిర్మాణ కౌశలాల కారణంగా సాధారణంగా వాటిని నేను సందర్శిస్తుంటాను. బయటకు చూడటానికి భారత సంస్కృతి దేశం అంతటా ఒక్కటిగా కనిపించినా, అలా ఉండదనే విషయాన్ని గుర్తించడానికి కూడా అవి తోడ్పడతాయి. తండ్రి తన కొడుక్కి మహా భారతంలోని విలన్‌గా మనకు తెలిసిన దుశ్సాసనుని పేరు పెట్టడం దేశంలో మరెక్కడైనా దిగ్భ్రాంతిని కలుగజేస్తుంది. ఒరియా ప్రజలు ఆసక్తికరమైన వారు, కుర్చీ ఉద్యోగస్తులకు లోతుగా వేళ్లూనుకున్న వారి సంస్కృతి కొరుకుడు పడటం కష్టమే.
జగన్నాథ ఆలయం బయట హిందువులకు మాత్రమే ప్రవేశమని పలు భాషలలో రాసి ఉన్న బోర్డు కనిపించింది. దీని వెనుక ఉన్న తర్కం ఏమిటో నాకు అర్థం కాలేదు, ఒప్పుకుంటాను. నేను చూసిన ^è ర్చిలు వేటిలో, వాటికన్‌లోని అతి సుప్రసిద్ధ చర్చిలో సైతం ఇలాంటి నిబంధనేదీ లేదు. వాటికన్‌లో, అక్కడి పురాతత్వ వస్తువులను సగర్వంగా మనకు చూపుతారు. సౌదీలు ముస్లిమేతరులను మక్కాకు అనుమతించరు. అయితే చాలా ఏళ్ల క్రితం గురునానక్ మక్కా యాత్ర చేశారని చెప్పారు. కొన్నేళ్ల క్రితం నేను, స్థానిక మిత్రులతో కలసి లాహోర్‌లోని గురు అర్జున్‌సింగ్ గురుద్వారాను సందర్శించాను. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్టినది కావచ్చు అక్కడ ‘ముస్లింలకు ప్రవేశం నిషిద్ధం’ అనే బోర్డు ఉంది. దాన్ని పట్టించుకోకుండా మేం లోపలికి వెళ్లాం. గురుద్వారా సంరక్షకులు నాతో పాటూ వచ్చినవారు ఎవరని అడిగితే అబద్ధం చెప్పలేదు.
స్థానిక మిత్రులలో ఒకరి కుమారుడి పేరు అర్జున్ అని తెలిసి ఆ సిక్కులు పిల్లాడితో ఆడుకుంటామని, అతడ్ని తమతో వదిలి మిగతావారు గురుద్వారా అంతా చూసిరండని పట్టుబట్టారు. మన దేశంలో మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లో అందరికీ ప్రవేశం ఉంటుంది. స్థానిక మసీదులోకి వెళ్లి చూసి రమ్మని హిందువులకు చెబుతుంటాను. వారికి అక్కడ స్వాగతం పలుకుతారు. ఇస్లాం మతంలో ఆసక్తి ఉన్నా లేకున్నా మసీదు సందర్శన ఉపయోగకరమనే అనిపిస్తుంది. మన మతంలో పుట్టకపోయినా దాని పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆలయ సందర్శన అనుభవాన్ని ఎందుకు నిరాకరిస్తున్నట్టు? హిందూ శాస్త్రాలు అలాంటి నిషేధాన్ని శాసించడం అందుకు కారణం కాజాలదు. అదే నిజమైతే అన్ని దేవాలయాల్లోనూ ఆ నిబంధన ఉండేది. కానీ లేదు. అయితే ప్రధాన దేవాలయాలు నానాటికీ మరింత ఎక్కువగా విదేశస్తులకు, హిందూయేతరులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరిస్తుండటం కనిపిస్తుంది.
క్రైస్తవునిగా జన్మించిన గొప్ప గాయకుడు జేసుదాస్, భజన గీతాలను ఆలపించాలని కోరుకుంటున్న గురువాయూర్ వంటి ఆలయాల్లోకి ఆయనకు ప్రవేశాన్ని నిరాకరిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 30న ఆయన, తనకు హిందూ కట్టుబాట్లలో విశ్వాసం ఉన్నదని అఫిడవిట్‌ను సమర్పించిన తర్వాతనే ఆ ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ ఆలయాలు ఎప్పడూ కొందరు ప్రజలకు, ప్రత్యేకించి ఇతర హిందువులకు ప్రవేశాన్ని నిరాకరిస్తూనే ఉన్నాయి. స్వామినారాయణ్ శాఖీయుల ఆలయాలు (మా పాటీదార్ కులస్తుల నిర్వహణలో ఉంటాయి) దిగువ కులాల ప్రవేశానికి ఇష్టపడవు. 1930లలో గాంధీ ఈ విషయంపైనే నిరాహార దీక్ష చేపట్టారు. అయినా ఆ శాఖవారు దిగువ కులస్తుల ఆలయప్రవేశాన్ని అనుమతించ లేదు, పైగా తాము హిందూయేతర మైనారిటీ అని కోర్టులో వాదించారు. కుల çస్వచ్ఛత అనే దురభిమానమే ఆలయాల ప్రవేశాన్ని అందరికీ అనుమతించకపోవడానికి కారణం కావచ్చా? కాదనే అనుకుంటున్నా.
ఇందిరా గాంధీ హిందువుగా పుట్టారు, ఆమెకు హిందూ దహన సంస్కారాలే జరిగాయి. జగన్నాథ ఆలయ పాండాలు ఆమెకు ప్రవేశాన్ని నిరాకరించారు. 2012లో వాళ్లు ‘సనాతన హిందువులకు మాత్రమే ప్రవేశం’ అనే బోర్డును పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ బోర్డు నాకైతే కనబడలేదుగానీ, ఇప్పటికీ నాకు అది అంతుబట్టడం లేదు. సనాతన హిందూమతం పూర్తిగా వర్ణ వ్యవస్థకు సంబంధించినదే. దాన్ని పాటించడాన్ని రాజ్యాంగంలోని 14 నుంచి 17 వరకు గల అధికరణలు నిషేధించాయి. వర్ణాశ్రమ ధర్మాలను (అంటరానితనాన్ని పాటించడం. శూద్రులు వేదాధ్యయనానికి తగరని అంగీకరించడం అని అర్థం) పాటించే వారే సనాతన హిందువులు. మరిక పాండాలు ఎవరినీ ఆలయంలోకి అనుమతించేట్టు? ఒరియా మహిళను పెళ్లి చేసుకున్న అమెరికన్ ఒకరు రథయాత్రలో పాల్గొన యత్నించగా పాండాలు చితకబాదారు. ఆ ఘటన తదుపరి ఈ బోర్డును పెట్టారు. శిల్పి బోరాల్ అనే ఆ మహిళ ‘‘ఇది అన్యాయం. జగన్నా«థుణ్ణి విశ్వానికంతటికీ అధినాధునిగా పరిగణిస్తుండగా నా భర్తకు ఎవరైనా గానీ అనుమతిని ఎలా నిరాకరిస్తారు?’’ అన్నట్టు వార్తలు తెలిపాయి. ఆమె లేవనెత్తిన అంశం అర్థం అవుతూనే ఉంది. పూరీ ఆలయంతోపాటూ ఇతర ఆలయాలన్నీ ప్రజలకు ప్రవేశాన్ని ఎందుకు నిరాకరిస్తున్నాయో వివరించాలి.
జగన్నాథ ఆలయం నిర్మాణకౌశలంలాగే, దేవతామూర్తులు కూడా విశిష్టమైనవి. సర్వగుణశోభితమైన మానవాకృతుల రూపంలోని దేవతలకు భిన్నంగా ప్రత్యేకంగా ఉంటాయి. అంతిమ హారతి సమయంలో వెళ్లాం కాబట్టి భక్తులు కొందరే ఉన్నారు. దేవతా మూర్తిని చూశాక, నేను ఆ సమూహాన్ని చూడటానికి వెనక్కు తిరిగాను. దైవారాధనలో హిందువులు చేతులు పైకి చాచి దండం పెడుతూ, సాష్టాంగపడి, పొర్లుతూ ఇతర మతస్తులకంటే ఎక్కువ ప్రదర్శనాత్మకంగా ఉంటారు. మనం చేసే ప్రార్థన, చర్చి, మసీదు, గురుద్వారాల్లోలా మతపరమైనది కాదు, వ్యక్తిగతమైనది. దేవతా ‘విగ్రహం’ మనల్ని చూసిందని రూఢి చేసుకోవడం అవసరం. కాబట్టి ప్రత్యేకంగా కనబడటం కోసం ఏదో ఒకటి చేస్తాం.
వచ్చినవారిలో చాలా మంది మొహాలు బాగా పేదవి, నిజమైన భక్తి, ఉద్వేగం, విశ్వాసం నిండి కనిపించాయి. వారిని చూసి నేను చలించిపోయాను. అలాంటి క్షణాలను అనుభూతి చెందడానికి మనం మరింత మందిని అనుమతించాలని ఆశిస్తాను. హిందూ భక్తిలోని ఉద్వేగం, పారవశ్యం చూసేవారికి కనువిందు చేస్తాయి.
ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
ఈ-మెయిల్ : aakar.patel@icloud.com