ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా కెనడాకు పేరుంది. గతేడాది ప్రపంచ శాంతి సూచిలో ఆరో ర్యాంకు దక్కింది. నేరాలు, ఘర్షణలూ తక్కువే. రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం. అలాంటి దేశంలో భారతీయులకు భద్రత ఎందుకు లేదు? వారిపై విద్వేష నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? కెనడాలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది...?
కెనడాలో హిందూ, భారత్ వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయి. ఇటీవల అక్కడ హిందూ దేవాలయాలపై వరసగా జరుగుతున్న దాడులు ఆందోళన పెంచుతున్నాయి. టొరంటోలోని స్వామినారాయణ మందిరంపై కొన్నాళ్ల క్రితం కొందరు దుండగులు దాడులు చేస్తూ ఖలిస్తాన్ జిందాబాద్, హిందూస్తాన్ ముర్దాబాద్ అంటూ చేసిన నినాదాలతో భారతీయులు ఉలిక్కిపడ్డారు. జూలైలో గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని రిచ్‌మండ్ హిల్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వీటి వెనక ఖలీస్తాన్ ఉగ్రవాదుల హస్తముందని ఆధారాలున్నా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం భారత్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అధికార లిబరల్ పార్టీ ఎంపీ, ప్రవాస భారతీయుడు చంద్ర ఆర్య వీటిని పార్లమెంటులో లేవనెత్తారు. భారత్‌పై, హిందూ మతంపై విద్వేషం వెళ్లగక్కుతున్నారన్నారు.
ఖలిస్తానీల అడ్డా?
కెనడా కొన్నేళ్లుగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత వ్యతిరేక అజెండాతో పని చేస్తున్న వీరంతా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం కెనడాను వాడుకుంటున్నారు. భారత్ నిషేధించిన సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) సెప్టెంబర్ 18న ఖలిస్తాన్ రిఫరెండాన్ని నిర్వహించింది. దీన్ని నిలిపేయాలని భారత్ కోరినా కెనడా పట్టించుకోలేదు. లౌకిక దేశమైన తాము ప్రజాభిప్రాయ సేకరణలను అడ్డుకోబోమని తేల్చి చెప్పింది.
ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలైన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ వంటివి కెనడా గడ్డ నుంచి భారత్‌లో మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్నాయి. 2018 నుంచి కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. బ్రాంప్టన్‌లో గౌరీశంకర్, జగన్నాథాలయం, మిసిసాపలో హిందూ హెరిటేజ్ సెంటర్‌పై దాడులు జరిగాయి. ఇదంతా కెనడాలో ఉంటూ భారత్‌ను అస్థిరపరిచే కుట్రేనని గతేడాది అక్కడ పర్యటించిన జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది.
కెనడాలో భారతీయం
కెనడాలో మొదట్నుంచి భారతీయుల ప్రాబల్యం ఎక్కువే. ప్రస్తుతం అక్కడ 16 లక్షల మంది (4 శాతం) భారతీయులున్నారు. వీరిలో లక్ష మందికి పైగా శాశ్వత పౌరసత్వముంది. ఎక్కువగా పంజాబీలే కెనడా వెళుతుంటారు. ఆ దేశంలో అత్యధికంగా మాట్లాడే 10 భాషల్లో పంజాబీ కూడా ఉంది. చట్టసభల్లోనూ భారతీయులు సత్తా చాటారు. 2015లో 21 మంది భారత సంతతికి వారు ఎంపీలయ్యారు. 2019లో 23కు పెరిగారు. కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే!
జర భద్రం: కేంద్రం
‘‘కెనడాలో జాతి విద్వేష నేరాలు, వర్గ హింస, భారత్ వ్యతిరేక కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడి భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే ఒట్టావాలోని భారతీయ హైకమిషన్, టొరంటోలో దౌత్య కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. ఇటీవలి నేరాలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment