భవిత నిరుద్యోగమయం, అశాంతి నిలయం
అవలోకనం
దేశం జనాభాపరమైన అనుకూలతా స్థాయికి చేరువవుతోంది. కానీ ఇముడ్చుకోలేని వాతావరణంలోకి అతి పెద్ద శ్రామికశక్తి ప్రవేశిస్తోంది. జనాభాపరమైన అనుకూలత నుంచి మనం లాభాన్ని పొందగలగడం కష్టమనిపిస్తుంది. అంతర్గతంగా, బహిర్గతంగా పెను మార్పేమైనా వస్తే తప్ప... నిరుద్యోగం, సామాజిక అశాంతి ప్రబలే కాలం రాక తప్పదనిపిస్తుంది.
నాలుగేళ్లలో భారత్ ప్రపంచంలోకెల్లా అత్యధిక శ్రామిక జనాభా ఉన్న దేశంగా మారుతుంది. దాదాపు జనాభాలో 87 శాతం పనిచేయగలవారై ఉంటారు. దేశాల శ్రామిక జనాభా అలాంటి అత్యధిక నిష్పత్తికి చేరినప్పుడు ఆ దేశాలు జనాభా పరమైన అనుకూలతను సంపాదిస్తుందని ఆశిస్తారు. అత్యధిక శాతం పౌరులు పనిచేస్తున్నవారు కావడం వల్ల ఆర్థిక వృద్ధి పెరగడమే అందుకు కారణమనేది స్పష్టంగానే కనిపిస్తుంది. త్వరలోనే భారత్ అలాంటి స్థానానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు, ఆశిస్తున్నారు. అయితే, ఈ అంశంపై రెండో అభిప్రాయం కూడా ఉంది. ‘ఇండియాస్పెండ్’ అనే గణాంకాలపై (డేటా) అధారపడిన ఒక పాత్రికేయ సంస్థ ఈ ఉద్యోగితా పరిస్థితిని పరిశీలించి తాము గమనించిన ఆరు వాస్తవాలను తన నివేదికలో పేర్కొంది. అవి:
1. ‘‘2015లో ఎనిమిది ముఖ్య భారత పరిశ్రమలలోని పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు సంఘటిత రంగంలో గత ఏడేళ్లలోనే అతి తక్కువగా అదనపు ఉద్యో గాలను సృష్టించాయి. 2. రివాజుగా నెలసరి వేతనంగానీ లేదా సామాజిక భద్రతా పరమైన ప్రయోజనాలుగానీ లేని అసంఘటిత రంగంలోని ఉద్యోగాల నిష్పత్తి 2017లో 93 శాతానికి చేరనుంది. 3. 47 శాతం ఉపాధిని కల్పించేదిగా ఉన్న వ్యవసాయరంగవృద్ధి 2014–15లో 0.2 శాతంగా, 2015–16లో 1 శాతంగా నమో దైంది. దీంతో గ్రామీణ వేతనాలు గత దశాబ్దంలోకెల్లా అతి తక్కువకు పడిపో యాయి. 4. ఉపాధి దొరికిన వారిలో కూడా ఇంచుమించు 60 శాతానికి ఏడాది పొడవునా ఉపాధి లభించడం లేదు. అంటే పాక్షిక నిరుద్యోగం, తాత్కాలిక ఉద్యో గాల సమస్య విస్తృతంగా వ్యాపించి ఉన్నదని అర్థం. 5. కంపెనీల ఏర్పాటు మంద గించిపోయి, 2009 స్థాయిలకు పడిపోయింది. ప్రస్తుతం ఉన్న కంపెనీలలో వృద్ధి గత ఐదేళ్లలోనే కనిష్టంగా, 2 శాతంగా ఉంది. 6. సుసంఘటితమైన భారీ కంపెనీలే ఉపాధి కల్పనకు కీలకంగా ఉన్న పరిస్థితుల్లో... భారీ కార్పొరేషన్లు, బ్యాంకులు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నందున కంపెనీల సగటు పరిమాణం తగ్గు తున్నది.’’ తమను ఇముడ్చుకోగల సామర్థ్యం లేని వాతావరణంలోకి అతి పెద్ద శ్రామిక శక్తి ప్రవేశిస్తోందని ఇది సూచిస్తోంది.
1991 తర్వాత భారత్ అత్యధిక వృద్ధిని నమోదు చేసినా, జనాభాలో సగం కంటే తక్కువే పూర్తి ఉపాధిని పొందినవారనే వాస్తవాన్ని ఆ నివేదిక ఎత్తి చూపింది. దీనితో పోలిస్తే చైనాలో ‘‘1991–2013 మధ్య ఉద్యోగాల సంఖ్య 62.8 కోట్ల నుంచి 77.2 కోట్లకు పెరిగింది. 14.4 కోట్ల ఉద్యోగాలు అదనంగా ఏర్పడ్డాయి. అయితే పనిచేసే వయస్కుల సంఖ్య 24.1 కోట్లకు పెరిగింది’’ అని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ నివేదిక తెలిపింది.
‘‘రెండు దేశాల మధ్య ఇంత పెద్ద అంతరం ఉండటం మన ఉపాధి కల్పనా సామర్థ్యం చైనా కంటే కూడా తక్కువని సూచిస్తోంది. రాబోయే 35 ఏళ్లలో మన శ్రామికశక్తి విస్తరణ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇది తీవ్రమైన సవాలు.’’ గత 25 ఏళ్ల పరిస్థితే కొనసాగడం గాక మన ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పు ఏమైనా వస్తే తప్ప వీరందరికీ ఉద్యోగాలు సమకూరవు. దుస్తుల ఎగుమతులు వంటి అల్ప స్థాయి వస్తుతయారీ, ఆ తదుపరి ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఉన్నత స్థాయి ఉత్పత్తులకు బదిలీ కావడం అభివృద్ధి చెందడానికి దేశాలు అను సరించిన సాంప్రదాయక మార్గం.
భారత్‌లో ఈ రంగాలన్నీ ఉన్నాయి. కానీ ఏదీ భారీ స్థాయిలో లేదు. ఉదా హరణకు, దుస్తుల ఎగుమతులనే చూస్తే మనం బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక వంటి దేశాలతో పోటీ పడాల్సి వస్తోంది. మనకంటే మరింత సమర్థవంతంగా, చౌకగా ఉత్పత్తి చేసే ఆ దేశాల చేతిలో తరచుగా మన ం ఆ పోటీలో ఓడిపోవడమూ జరుగుతోంది. గత ఏడేళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిందంటేనే ఉప యోగించుకోగలిగిన భారీ బహిర్గత డిమాండు లేదని అర్థం.
సాంప్రదాయక మార్గం భారత్‌కు తెరచి ఉన్నట్టయితే జనాభాపరమైన అను కూలత వల్ల మనం ఎలా లాభపడగలం? ఇది వెంటనే మనం సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్న, అందుకు పెద్దగా సమయమేమీ లేదు. ఈ సమస్యను పూర్తిగా లేదా చాలా వరకు ప్రభుత్వమే పరిష్కరించగలదని ఆశించడం తప్పు అనుకుం టాను. మౌలిక సదుపాయాలు, అనుసంధానత కొరవడటం పెద్ద ఎత్తున మదు పులు సమకూరకపోవడానికి ఒక కారణం. ఈ సమస్యకు సంబంధించి పెట్టుబడి మదుపులు, ప్రాధాన్యాల రీత్యా కేంద్రం పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది.
అర్హతగలిగిన మానవశక్తి కొరవడటం కూడా అంతే పెద్ద సమస్య. పట్టణ ఉన్నత తరగతి భారతీయులకు సమంజసమైనంత మంచి విద్య అందుతోంది. కాబట్టి వారికి సాపేక్షికంగా సులువుగానే ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి ఇదో పెద్ద సమస్యంటే వారికి ఆశ్చర్యం కలగవచ్చు. అయితే అత్యధిక భారత ప్రజా నీకానికి అలాంటి విద్యా వనరు అందుబాటులో లేదు. కాబట్టి వారు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పనిచేయడానికి సన్నద్ధులై లేరు. అసెంబ్లీ లైన్ (విడి భాగాల కూర్పు) వంటి మౌలిక స్థాయి నైపుణ్యం అవసరమైన బ్లూ కాలర్ (నిపుణ శ్రమ) విధుల విషయంలో సైతం ఇది నిజం. యాంత్రీకరణ మొత్తం కొత్త ఉద్యోగాల సంఖ్యను ఏటికేడాది తగ్గించేస్తున్న వాతావరణంలో ఫిలిప్పీన్స్ వంటి దేశాలు మన బ్యాక్‌ఎండ్ సేవల (బీపీఓ సేవల) ఉద్యోగాలలో సైతం కొంత వాటాను దక్కిం చుకుంటున్నాయి.
ప్రధాని ఈ సమస్యను గుర్తించి, లక్షలాది మంది ప్రజలకు మౌలికమైన నిపుణ శ్రామికులను తయారుచేసే నైపుణ్యాలను అందించడం కోసం ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన దేశంలోని ప్రాథమిక విద్య నాణ్యత అధ్వానంగా ఉండటం వల్ల ఈ విషయంలో సైతం ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఆలోచించే కొద్దీ భారత్ జనాభాపరమైన అనుకూలత నుంచి లాభాన్ని పొందగలగడం మరింత కష్టమనిపిస్తుంది. అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కూడా పెను మార్పేమైనా వస్తే తప్ప... భారీ నిరుద్యోగం, సామాజిక అశాంతి ప్రబలే కాలం ముందున్నదని అనిపిస్తుంది. అలాంటి మార్పేమీ కనుచూపు మేరలో లేదు.
ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘aakar.patel@icloud.com