ఎదురు గాలిగా మారని ప్రభుత్వ వైఫల్యాలు
అవలోకనం
పెద్ద నోట్ల రద్దుపై ఆర్‌బీఐ తాజా నివేదిక, అర్థిక వ్యవస్థ క్షీణతలను ప్రభుత్వ వ్యతిరేక పవనాలుగా మార్చవచ్చని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ అల్ప ఆర్థిక వృద్ధి రేట్లతోనే విస్తృత జనాదరణను కలిగివుండి, పలుమార్లు విజయాలను సాధించారు. కాబట్టి కనీసం రాబోయే కొన్ని మాసాలపాటైనా మోదీ నిశ్చింతగా ఉండవచ్చు.
గత వారం నేను బెంగళూరులో ఒక కళాశాలలోని పెద్ద హాలులో వెయ్యి మంది విద్యార్థుల బృందంతో మాట్లాడాను. వారిలో ఎక్కువ మంది ఆర్థికశాస్త్ర విద్యార్థులు. నాతో పాటూ ఇద్దరు పార్లమెంటు సభ్యులు కూడా వేదికపై ఉన్నారు. ‘‘యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్ల సగటు వృద్ధి కంటే గత మూడేళ్లలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వేగంగా వృద్ధి చెందిందని మీలో ఎంత మంది అనుకుంటున్నారు?’’అని శ్రోతలను ప్రశ్నించాను. జీడీపీ నేడు ఎక్కువ వేగంగా వృద్ధి చెందుతుందనుకునే వారిని చేతులెత్తమన్నాను. దాదాపుగా విద్యార్థులంతా చేతులెత్తారు. కానీ, యూపీఏ హయాంలో జీడీపీ సగటు వార్షిక వృద్ధి ఏడాదికి 8 శాతం. కాగా, ఆ తర్వాత గత మూడేళ్ల ఎన్‌డీఏ పాలనలో ఏ ఒక్క ఏడాదీ ఆ వృద్ధి రేటును అందుకోలేదనేది వాస్తవం. ముందే చెప్పినట్టుగా వాళ్లలో చాలా మంది ఆర్థికశాస్త్ర విద్యార్థులు కాబట్టి వారికి ఈ విషయం బాగా తెలిసి ఉండాల్సింది. కానీ, గణాం కాలను రాజకీయాల ఆధారంగా చర్చించడం, ప్రత్యేకించి మన దేశంలో కష్టం.
ఇటీవలి కాలంలోని రెండు ఘటనలను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన గాలిగా మార్చడానికి ఉపయోగించుకోవచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కాబట్టే నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. ఒకటి, పెద్ద నోట్ల రద్దు విఫలమైందనే వార్త. దాదాపుగా రూ. 1,000, రూ.500 నోట్లన్నిటినీ రూ. 2,000, రూ. 500 నోట్లుగా మార్చేసుకున్నారు. అంటే నల్లధనం తెల్లధనంగా మారిపోయిందని అర్థం. బ్యాంకులలో డిపాజిట్ కాని కొన్ని లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వదుల్చుకోగలమని ప్రభుత్వం భావించి ఉండినట్టయితే, అది జరగలేదు. ఇక ఇప్పుడు నల్లధనం సమస్య పరిష్కారానికి ఉన్న దారి నోటీసులు జారీ చేయడం, పన్నులను తిరిగి రాబట్టడమే. మన దేశంలో ఇది అంత సులువూ కాదు, త్వరగా జరిగిందీ కాదు.
రెండు, పెద్ద నోట్ల రద్దు ఉగ్రవాదాన్ని లేదా భారత్‌లో ఉగ్రవాదంగా నిర్వచించేదాన్ని అణచడంలోను విఫలం కావడం. దేశంలోని సంఘర్షణాత్మకమైన మూడు ప్రాంతాలకు వెలుపల ఉగ్రవాద హింస వాస్తవానికి చాలా స్వల్పం. ఈ ఏడాది ఉగ్రవాదం వల్ల ఒకరు మృతి చెందితే, ముందటి ఏడాది 11 మంది, అంతకు ముందటి ఏడాది 13 మంది, ఇంకా ముందటి ఏడాది నలుగురు మాత్రమే మరణించారు. కానీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుకు, ఉగ్రవాదానికి మధ్య సంబంధం గురించి ప్రస్తావించినప్పుడు.. అది మాట్లాడేది జమ్మూకశ్మీర్‌లోని హింస గురించి. నోట్ల రద్దు కశ్మీర్‌లో హింసను తగ్గించిందని రక్షణమంత్రి చెప్పుకుంటున్నారు. అది జరిగిందా? లేదు. గత ఏడాది అక్కడ 267 మంది మరణించారు. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 239 మంది మరణించారు. అంటే ప్రభుత్వం చెబుతున్నట్టు నోట్ల రద్దు ఉగ్రవాదంపై ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు.
మూడవది, చివరిది ప్రధాని అవినీతిని అరికట్టడానికి నోట్ల రద్దు సమర్థవంతమైన మార్గమని చెప్పారు. అది అత్యున్నత స్థానాలలోని అవినీతికి సంబంధించినది కాదు. ఇప్పటికే ఆయన అందుకు హామీని కల్పించారు. నగదు కొరత, ఇతర చోట్ల అవినీతిని అరికడుతుందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి నా వద్ద గణాంక సమాచారం లేదు కాబట్టి, పాఠకులే అది జరిగిందో లేదో నిర్ణయించాలి.
ఇక ప్రతిçపక్షానికి ఉత్సాహాన్ని కలుగజేసిన మరో అంశం, ఆర్థిక వ్యవస్థ క్షీణి స్తున్నదనేది. దీనికి సంబంధించి మనవద్ద గణాంక సమాచారం ఉంది కాబట్టి, దీన్ని కచ్చితంగా చెప్పగలం. గత ఐదు త్రైమాసికల కాలంలోని ప్రతి త్రైమాసికానికీ మన ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. అంటే 15 నెలలుగా అది మందగిస్తూ ఉందని అర్థం. ఏప్రిల్, జూన్ మధ్య ఆర్థిక వ్యవస్థ 5.7 శాతం మాత్రమే వృద్ధి చెందిందని ప్రభుత్వ గణాంక సమాచారం తెలుపుతోంది. మీరు గనుక ప్రభుత్వ మద్దతుదార్లయితే, వస్తు సేవల పన్ను, సరుకుల నిల్వలను తగ్గించుకోవడం ఇందుకు కారణమని చెబుతారు. అంటే జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఉత్పత్తుల ధరలను నిర్ణయించేదెలాగో కంపెనీలకు కచ్చితంగా తెలియక జూన్‌లో వారు వస్తూత్పత్తిని నిలిపివేశారని, జూలై 1న జీఎస్‌టీని ప్రకటించాక గోదాములను ఖాళీ చేశారని అర్థం.
మీరు ప్రభుత్వ ప్రత్యర్థులైతే ఈ క్షీణతకు కారణం జీఎస్‌టీ, నోట్ల రద్దు రెండింటి మిశ్రమ ఫలితమని అంటారు. న్యాయవాది అరుణ్ జైట్లీకి, రాజకీయశాస్త్రంలో కరస్పాండెన్స్ కోర్స్ డిగ్రీని పొందిన నరేంద్ర మోదీకి భిన్నంగా ఆర్థికశాస్త్రవేత్త అయిన మునుపటి ప్రధాని మన్మోహన్‌సింగ్... నోట్ల రద్దు వల్ల దేశ జీడీపీకి 2 శాతం పాయింట్ల మేరకు హాని కలుగుతుందని చెప్పారని, ఆయన అంచనా సరైందని రుజువైందని అంటారు. బహుశా ఆయన సరిగ్గానే చెప్పి ఉండొచ్చు. అయితే, ఆ పక్షానికి, ఈ పక్షానికి చెందని మన బోటి వాళ్లకు... ఆర్థిక వ్యవస్థ ఐదు త్రైమాసికల పాటూ వరుసగా మందగిస్తున్నదంటే అది ఏ ఒక్క దాని ఫలితమో కాదని స్పష్టమే. ఈ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు సంబంధించి మౌలికంగానే ఏదో లోపం ఉంది.
కాబట్టి ప్రతిపక్షం ఈ వాస్తవాలు, గణాంకాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఒక మూలకు నెట్టేసి దెబ్బతీయగలమని, అందువలన తమకు సానుకూలత ఉంటుందని అనుకోగలదా? లేదు, అనే నా సమాధానం. చాలా తక్కువ ఆర్థిక వృద్ధిని మాత్రమే అందించినా, అత్యంత జనాదరణ కలిగిన నేతలుగా ఉన్నవారు మనకు ఉన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ 5 శాతం కంటే తక్కువ వృద్ధితోనే పలుమార్లు విజయాలు సాధించారు.
నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు కథనాన్నే మార్చివేశారనేది రెండో అంశం. ఆయన చెప్పిన విషయాలన్నిటినీ మరచిపోయారు. ఆయన ఇప్పుడు డిజిటల్, నగదు రహిత చెల్లింపుల వంటి ఇతర విషయాలపైకి మళ్లారు. ఆయనపైన మీరు ఎన్ని ఆరోపణలనైనా చేయవచ్చుగానీ, రాజకీయంగా తప్పులు చేస్తున్నారని మాత్రం అనలేదు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా తమ జీవితాలు భౌతికంగా మారాయని ఎందరు భావిస్తున్నారని నేను ఆ వెయ్యిమంది విద్యార్థులను అడిగాను. దాదాపుగా అంతా చేతులు పైకెత్తారు. అది జరుగుతున్నంత కాలమూ, కనీసం రాబోయే కొన్ని నెలల పాటైనా నరేంద్ర మోదీ నిశ్చింతగా ఉండవచ్చు.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్
ఈ–మెయిల్: aakar.patel@icloud.com