న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసుల్లో విచారణ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమితాధికారాలు కట్టబెట్టారని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. లేదంటే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుందన్నారు. దేశంలో ఎవరికీ భద్రత కూడా ఉండబోదన్నారు.
ఎం3ఎం రియల్టీ గ్రూప్ డైరెక్టర్లు బన్సల్ బ్రదర్స్ అరెస్టు కేసులో మంగళవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఏఎస్ బొపన్న, ఎంఎం సుందరేశ్ ధర్మాసనం ముందు ఆయన వాదనలు విని్పంచారు. విచారణకు డైరెక్టర్లు అన్నివిధాలా సహకరిస్తున్నా ఈడీ నిరంకుశ పద్ధతిలో అరెస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ముందస్తు బెయిల్ నిబంధనల్లో ఒక్కదానికి కూడా విరుద్ధంగా నడుచుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.
అందుకు జస్టిస్ సుందరేశ్ సరదాగా స్పందించారు. ‘‘మీరన్నది నిజమే. ఇది పిల్లీ ఎలుకా చెలగాటం. వాళ్లు చట్టాలను ఉపయోగిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. బన్సల్ సోదరులను ఈడీ జూన్ 14న అరెస్టు చేసింది. హరియాణాలోని పంచకుల కోర్టు విధించిన ఐదు రోజుల కస్టడీని వాళ్లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు విజ్ఞప్తి మేరకు విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment