m3m
-
ఈడీని కట్టడి చేయాల్సిందే
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసుల్లో విచారణ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమితాధికారాలు కట్టబెట్టారని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. లేదంటే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుందన్నారు. దేశంలో ఎవరికీ భద్రత కూడా ఉండబోదన్నారు. ఎం3ఎం రియల్టీ గ్రూప్ డైరెక్టర్లు బన్సల్ బ్రదర్స్ అరెస్టు కేసులో మంగళవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఏఎస్ బొపన్న, ఎంఎం సుందరేశ్ ధర్మాసనం ముందు ఆయన వాదనలు విని్పంచారు. విచారణకు డైరెక్టర్లు అన్నివిధాలా సహకరిస్తున్నా ఈడీ నిరంకుశ పద్ధతిలో అరెస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ముందస్తు బెయిల్ నిబంధనల్లో ఒక్కదానికి కూడా విరుద్ధంగా నడుచుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకు జస్టిస్ సుందరేశ్ సరదాగా స్పందించారు. ‘‘మీరన్నది నిజమే. ఇది పిల్లీ ఎలుకా చెలగాటం. వాళ్లు చట్టాలను ఉపయోగిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. బన్సల్ సోదరులను ఈడీ జూన్ 14న అరెస్టు చేసింది. హరియాణాలోని పంచకుల కోర్టు విధించిన ఐదు రోజుల కస్టడీని వాళ్లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు విజ్ఞప్తి మేరకు విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. -
కుబేరుల్లో ఒకే ఒక్కడు అంబానీ! 23వ స్థానానికి అదానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవహారంతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోవడంతో.. అంతర్జాతీయంగా టాప్ 10 కుబేరుల్లో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. 82 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో నిలవగా 53 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ 23వ స్థానానికి పరిమితమయ్యారు. డాలర్ల మారకంలో సంపదను లెక్కిస్తూ రీసెర్చ్ సంస్థ హురున్, రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎం కలిసి రూపొందించిన ’2023 గ్లోబల్ రిచ్ లిస్ట్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ మూడోసారి టైటిల్ నిలబెట్టుకున్నారు. వ్యాపారవేత్తల దృష్టికోణం నుంచి ప్రస్తుత ప్రపంచ ఎకానమీ పరిస్థితులను ఆవిష్కరించేలా ఈ జాబితా ఉందని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. క్షీణతలో బెజోస్ టాప్.. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. అత్యధికంగా సంపద పోగొట్టుకున్న వారి లిస్టులో టాప్‌లో నిల్చారు. ఆయన సంపద 70 బిలియన్ డాలర్లు పడిపోయి 118 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంబానీ, అదానీ కలిసి పోగొట్టుకున్న సంపద కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం. హురున్ రిపోర్ట్ ప్రకారం ఇలా భారీగా పోగొట్టుకున్న వారి లిస్టులో బెజోస్ అగ్రస్థానంలో ఉండగా.. అదానీ 6, అంబానీ 7వ ర్యాంకుల్లో నిల్చారు. 2022–23లో అదానీ సంపద 35 శాతం పడిపోయింది. 28 బిలియన్ డాలర్ల మేర (రోజుకు రూ. 3,000 కోట్లు చొప్పున) క్షీణించి మార్చి మధ్య నాటికి 53 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంబానీ సంపద కూడా క్షీణించినప్పటికీ తగ్గుదల 20 శాతానికే పరిమితమైంది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తదనంతర పరిణామాలతో గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోయిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 2023 గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో సంపన్నుల సంఖ్య 3,112కు తగ్గింది. గతేడాది ఇది 3,384గా ఉంది. వారి మొత్తం సంపద 10 శాతం తగ్గి 13.7 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. ► గతేడాదితో పోలిస్తే భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 28 తగ్గి 187కి చేరింది. ముంబైలో అత్యధికంగా 66 మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను పరిగణనలోకి తీసుకుంటే బిలియనీర్ల సంఖ్య 217గా ఉంది. మొత్తం కుబేరుల సంపదలో భారత్ వాటా 5 శాతంగా ఉంది. కాగా, అమెరికా వాటా అత్యధికంగా 32 శాతంగా ఉంది. భారత్‌తో పోలిస్తే చైనాలో బిలియనీర్ల సంఖ్య అయిదు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ► భారత్‌లో 10 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారు. సాఫ్ట్వేర్, సర్వీసుల విభాగంలో స్వయంకృషితో బిలియనీరుగా ఎదిగిన వారిలో 4 బిలియన్ డాలర్ల సంపదతో రాధా వెంబు రెండో స్థానంలో నిల్చారు. దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఈసారి కుబేరుల లిస్టులో స్థానం దక్కించుకున్నారు. -
అదానీ జోరు.. ఎలన్‌మస్క్, జెఫ్‌బేజోస్ బేజారు !
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద సృష్టిలో ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలను మించిపోయారు. 2021లో ఏకంగా 49 బిలియన్ డాలర్లు (రూ.3.67 లక్షల కోట్లు) మేర తన సంపద విలువను పెంచుకున్నారు. ప్రపంచంలో టాప్–3 బిలియనీర్లు అయిన ఎలాన్ మస్క్ (టెస్లా), జెఫ్ బెజోస్ (అమెజాన్), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఎల్వీఎంహెచ్) పెంచుకున్న సంపదతో పోలిస్తే.. అదానీ నెట్‌వర్త్ వృద్ధి గతేడాది ఎక్కువగా ఉందని ‘ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022’ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ ముకేశ్ అంబానీ మొత్తం 103 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయునిగా ఈ జాబితాలో కొనసాగారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే జాబితాలో అంబానీకి 9వ స్థానం దక్కింది. వార్షికంగా చూస్తే 2021లో ఆయన సంపద 24 శాతం పెరిగింది. అంబానీ తర్వాత అదానీయే ఐశ్వర్యవంతుడిగా ఉన్నారు. ఆయన సంపద 2021లో 153 శాతం పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరింది. గత పదేళ్లలో అంబానీ నికర విలువ 400 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో అదానీ సంపద 1,830 శాతం ఎగసింది. ప్రపంచ బిలియనీర్లలో అదానీకి 12వ ర్యాంకు లభించింది. హెచ్‌సీఎల్ కంపెనీ ప్రమోటర్ శివ్‌నాడార్ 28 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో (ప్రపంచవ్యాప్తంగా 46వ ర్యాంకు) ఉంటే.. 26 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో సిరమ్ ఇనిస్టిట్యూట్ సైరస్ పూనవాలా, 25 బిలియన్ డాలర్ల విలువతో లక్ష్మీ నివాస్ మిట్టల్ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఐశ్వర్యం గణాంకాలు.. ► గౌతమ్ అదానీ సంపద 2020లో 17 బిలియన్ డాలర్లు ఉంటే.. రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీని లిస్ట్ చేసిన తర్వాత ఆయన సంపద ఐదు రెట్లు పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. ► 2021లో ముకేశ్ అంబానీ సంపద 20 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. సంపదను పెంచుకునే విషయంలో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో ముకేశ్ ఉన్నారు. ► నైకా ప్రమోటర్ ఫాల్గుణి నాయర్ 7.6 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022లోకి కొత్తగా అడుగు పెట్టారు. ► గౌతమ్ అదానీ తర్వాత గతేడాది అత్యధికంగా సంపదను పెంచుకున్న వారిలో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్, లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. ► హెచ్‌సీఎల్ శివ్‌నాడార్ నెట్‌వర్త్ గత పదేళ్లలో 400 శాతం వృద్ధి చెందింది. ► 23 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో డీమార్ట్ అధిపతి రాధాకిషన్ దమానీ, ఇంతే నెట్‌వర్త్‌తో హిందుజా గ్రూపు ప్రమోటర్ ఎస్పీ హిందుజా జాబితాలో టాప్ 100లో నిలిచారు. ► చైనాలో 1,133 బిలియనీర్లు, అమెరికాలో 716 మంది, భారత్‌లో 215 మంది ఉన్నారు. ► ప్రపంచ జనాభాలో 18 శాతం భారత్‌లో ఉండగా, ప్రపంచ బిలియనీర్లలో 8 శాతం మందికి భారత్ కేంద్రంగా ఉంది. ► గత పదేళ్లలో భారత బిలియనీర్లు 700 బిలియన్ డాలర్ల మేర ఉమ్మడిగా సంపదను పెంచుకున్నారు. ఇది స్విట్జర్లాండ్ జీడీపీకి సమానం కాగా, యూఏఈ జీడీపీకి రెండింతలు. ► బిలియనీర్లకు ముంబై నివాస కేంద్రంగా ఉంది. ఇక్కడ 72 మంది ఉంటే, ఢిల్లీలో 51 మంది, బెంగళూరులో 28 మంది ఉన్నారు. ► గత రెండేళ్లలో బైజూ రవీంద్రన్, ఆయన కుటుంబం సంపద పరంగా 916 ర్యాంకులు మెరుగుపరుచుకుని జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 1083వ ర్యాంకు సొంతం చేసుకుంది. వీరి సంపద 3.3 బిలియన్ డాలర్లు. ► భారత్‌లో 40 మంది గతేడాది బిలియన్ డాల ర్లు అంతకుమించి సంపద పెంచుకున్నారు. ► ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022లో మొత్తం 69 దేశాల నుంచి 3,381 బిలియనీర్లకు చోటు లభించింది. అంతక్రితం జాబితా నుంచి చూస్తే 153 మంది కొత్తగా వచ్చి చేరారు. -
ఎం3ఎంకు సహారా భూముల విక్రయం
న్యూఢిల్లీ: నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్న సహారా గ్రూప్ తాజాగా గుడ్‌గావ్‌లోని 185 ఎకరాల భూమిని విక్రయించింది. గుడ్‌గావ్ కే చెందిన రియల్టీ సంస్థ ఎం3ఎంకు రూ. 1,211 కోట్లకు ఈ భూమిని విక్ర యించింది. ఈ బాటలో ముంబైలోని వసాయ్, రాజస్తాన్‌లోని జోధ్పూర్లలో గల భూములను సైతం అమ్మివేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో వసాయ్ భూమి విలువ రూ. 1111 కోట్లుకాగా, జోధ్‌పూర్ భూమి విలువ రూ. 140 కోట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విధంగా పుణేలోని భూమిని సైతం విక్రయించే చర్చల్లో ఉన్నట్లు వెల్లడించాయి.