
ఐపీఎల్ సంపద.. ఎవరికి ఎంత?
అవలోకనం
ఐపీఎల్ క్రీడాకారులలో చాలా మంది సామాన్య ఉద్యోగస్తులు, ఆర్థిక స్తోమతలేని ఆటో రిక్షా డ్రైవర్లు తదితరుల పిల్లలు. అలాంటి నేపథ్యాల నుంచి వచ్చిన యువకులకు సంపద, కీర్తి అనుభవంలోకి రావడమూ, వారు దేశ, విదేశాలకు చెందిన గొప్ప క్రికెట్ దిగ్గజాలతో కలసి ఆడటం చాలా మంచి విషయం. అలాగే, పలు అనుకూలతలున్న ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులకు, ప్రతికూల పరిస్థితుల నేపథ్యాల నుంచి వచ్చిన తోటి జట్టు సభ్యులతో ఇప్పుడు ఏర్పడే తప్పనిసరి పరిచయం కూడా అంతే మంచి విషయం.
పలు ఇతర దేశాల క్రీడాకారులకు ఐపీఎల్ మ్యాచ్‌లు నిజంగానే డబ్బు చేసు కోగల పోటీలుగా మారాయి. అతి గొప్ప క్రీడాకారుడు సనత్ జయసూర్య గురిం చిన ఈ కథ నాకు గుర్తుంది. రెండు దశాబ్దాల క్రితం ఆయన తన ఓపెనింగ్ పార్ట్ నర్ కలువితరణతో కలసి ఒన్ డే క్రికెట్ ఆట తీరునే మార్చిపారేశారు. ఫీల్డ్ రిస్ట్రి క్షన్స్ సానుకూలతను ఉపయోగించుకుని ఆ శ్రీలంక క్రీడాకారులిద్దరూ తమ దేశం 1996 ప్రపంచ కప్‌ను సాధించడానికి తోడ్పడ్డారు. ఆ పోటీలు ముందుకు సాగు తున్నకొద్దీ లంక ప్రభుత్వం తమ క్రీడాకారులకు మరింత డబ్బును వాగ్దానం చేస్తూ వచ్చింది.
ఒక దశలో జయసూర్య... తన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇంకా రూ. 1.75 లక్షలు అవసరమని చెప్పారు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో తను సెంచరీ కొట్టి నప్పుడల్లా తన తండ్రి పది రూపాయలు ఇస్తుండేవారనీ, దీని వల్ల ఒక నెలలో తమ కుటుంబ బడ్జెట్‌కు చిల్లుపడిందని సునీల్ గవాస్కర్ తన ఆత్మ కథలో రాశారు. కొన్ని వారాల పనికి క్రికెటర్లు కోట్లు సంపాదిస్తున్న నేటి రోజులతో పోలిస్తే ఆ చిన్న మొత్తాల గురించి నేడు ఆలోచించడం విశేషమే. పలువురు భార తీయ క్రీడాకారులు ఏడాదికి రూ. 100 కోట్లకు పైగా కూడా సంపాదిస్తున్నారు. వారింత భారీగా డబ్బును సంపాదిస్తున్నందుకు నాకు వారిపై అక్కసు లేదు. పైగా దీనికి సంబంధించిన ఒక అంశం నాకు సంతోషం కలిగిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ పోటీలు మళ్లీ మొదలయ్యాయి. ఈ పదవ సీజన్ పోటీల వీక్షకుల సంఖ్య మునుపటి కంటే మరింత పెరిగేటట్లు అనిపి స్తోంది. ఈ పోటీల పట్ల ఎప్పుడూ నాలో కలిగేవి మిశ్రమ స్పందనలే. అవి సాఫీగా జరిగిపోయే పోటీలే. కాకపోతే బీసీసీఐ తనlవిశ్వసనీయతను పోగొట్టు కునేంత లోతుగా నైతిక ప్రమాణాలకు తిలోదకాలిచ్చేసింది. బీసీసీఐ ప్రధానంగా అత్యంత అవినీతి, బంధుప్రీతితో కూడిన వ్యవస్థ. భారత్‌లో కోర్టులు అతిగా జోక్యం చేసుకుంటాయని వాదించవచ్చు. అది నిజమే. కానీ ఈ జోక్యం ఐపీఎల్ విశ్వసనీయతను పునరుద్ధరించి ఉండవచ్చు. ఐపీఎల్ చాలా మంది యువ క్రీడా కారులకు డబ్బు చేసుకోవడానికి, తమ క్రీడా కౌశలాన్ని ప్రదర్శించడానికి అవకా శాన్ని కల్పిస్తోంది. దశాబ్ది క్రితం ఐపీఎల్ లేనప్పటి పరిస్థితి ఇది కాదు.
ఎనిమిది జట్లున్నా, ఒక్కొక్కదానిలో నలుగురికి మించి విదేశీ క్రీడాకారులు ఉండరాదనే ఆంక్ష ఉండటంతో 56 మంది భారత క్రీడాకారులకు ప్రతి మ్యాచ్ లోనూ తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. యువ భారత క్రికెటర్లకు మునుపెన్నడూ ఇలాంటి అవకాశం లభించలేదు. రంజీ ట్రోఫీవంటి పోటీల్లో తలపడే స్థానిక జట్లు ఒకప్పుడూ ఉండేవి, ఇప్పుడూ ఉన్నాయి. కానీ, ఆ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తే తప్ప, ఈ పోటీల్లో ఆడినంత మాత్రాన కీర్తిప్రతిష్టలు లభించేవి కావు. భారత్ ప్రపంచ క్రికెట్ క్రీడా కేంద్రంగా, ఆర్థిక శక్తిగా మారే క్రమంలో స్థానిక పోటీల్లో ఆడే క్రీడాకారులకు ఇచ్చే పారితోషికం కూడా పెరిగింది. చాలా కాలంపాటూ ఈ పారితోషికం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ పోటీల్లో ఆడే 18జట్ల క్రీడాకారులకు ఇచ్చేదాని కంటే తక్కువే ఉండేది. ఆ కాలంలో ఇంగ్లండ్‌లో ఇచ్చే డబ్బు ఇక్కడ లభించేదానికంటే మెరుగ్గా ఉండేది. మన గత తరం క్రికెట్ క్రీడాకారులంతా (కెంట్ జట్టు తరఫున రాహుల్ ద్రావిడ్, గ్లామర్గాన్ తరఫున సౌరవ్ గంగూలీ, యార్క్‌షైర్ తరఫున సచిన్ టెండూ ల్కర్) కొంత కాలం కౌంటీ క్రికెట్ ఆడిన వారే. భారత్ మరింతగా పురోగ మించింది కాబట్టి ప్రపం చంలో మరే జట్టుకంటే మెరుగైన పారితోషికాలను తమ క్రీడాకారులకు అంది స్తోంది. ఉదాహరణకు విరాట్ కోహ్లీనే తీసుకుంటే, అతను కౌంటీ జట్లకు ఎన్నడూ ఆడలేదు. ఆడమని కోరినా, ఇక్కడే అంతకంటే ఎక్కువ డబ్బు చేసుకోవచ్చు కాబట్టి అతను అందుకు ఆమోదించకపోవచ్చు.
ఐపీఎల్ క్రీడాకారులలో చాలా మంది సామాన్య ఉద్యోగస్తులు, ఆర్థిక స్తోమత లేని ఆటో రిక్షా డ్రైవర్లు తదితరుల పిల్లలు. ఈ క్రీడాకారులు, వారి కుటుంబం నుంచి ఇతర సామాజిక వర్గంలోకి ఎదిగిన మొట్టమొదటివారు. అలాంటి నేపథ్యాల నుంచి వచ్చిన యువకులకు సంపద, కీర్తి అనుభవంలోకి రావడమూ, వారు దేశ, విదేశాలకు చెందిన గొప్ప క్రీడా దిగ్గజాలతో కలసి ఆడటం చాలా మంచి విషయమని నాకు అనిపిస్తుంది. ఇది, వారిని ఎరిగిన వారికి లేదా వారి కీర్తిప్రతిష్టల ద్వారా వారి గురించి తెలుసుకున్న చాలా మంది ఇతరులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. పేదరికంలో పుట్టడంలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అలాగే, చాలా అనుకూలతలు ఉన్న ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకా రులకు, ప్రతికూల పరిస్థితుల నేప«థ్యాల నుంచి వచ్చిన తోటి జట్టు సభ్యులతో ఇప్పుడు తప్పనిసరి పరిచయం కూడా అంత మంచి విషయమేనని భావిస్తాను. ప్రపంచం గురించి వారి ఆలోచనా తీరును అది మారుస్తుంది.
భారతదేశంలోని మధ్యతరగతికి చెందిన మనం బయటి లోకం పట్టని జీవి తాలు గడుపుతుంటాం. బడికి వెళ్లేటప్పటి నుంచి మనం మన సామాజిక వర్గానికి చెందినవారితోనే సంబంధాలను కలిగి ఉంటాం. ట్రాఫిక్ లైట్ వద్ద మన కారు వద్దకు బిచ్చగాడొస్తే, విండో అద్దాన్ని సగం పైకెత్తి నోరు మూసుకోమని అరుస్తాం, బాల కార్మికులు కనబడితే ఏ దిగులూ లేకుండా మనం చూపు మరో వైపు తిప్పు కుంటాం. విదేశీయులకు అలాంటి విషయాలు నిరంతరం అనుభవం లోకి వచ్చేవి కావు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు వారు అవి చూసి దిగ్భ్రాంతికి గురవుతుం టారు. మనకు మాత్రం అవి పెద్దగా ఇబ్బంది కలిగించవు.
విద్యా హక్కు చట్టం ప్రైవేటు స్కూళ్లు 25 శాతం సీట్లను పేద వర్గాల కుటుం బాల పిల్లలకు కేటాయించేలా నిర్బంధిస్తుంది. ఈ చట్టం మంచిదని నేను భావిం చడానికి అది కూడా ఒక కారణం. దురదృష్టవశాత్తూ చక్కటి ఈ సంస్కరణను కూడా నీరుగారుస్తున్నట్టుండటం దురదృష్టకరం. ఇది పేదల పిల్లలకు మరే విధం గానూ కలుగని అనుభవాన్ని నిరాకరిస్తుంది. ఇది, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారి పిల్లలలో దేశ వాస్తవికత పట్ల స్పందించే గుణాన్ని కలిగించే అవకాశాన్ని కూడా నిరాకరిస్తుండవచ్చు.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com