
మాటలలో తప్ప చేతలలో కానరాని దేశప్రేమ
ప్రపంచ మంతా తిరిగి చూసినా భారతీయులు తప్ప మరెవరూ ఉయోగించని కొన్ని పదాలు ఉన్నట్టు నేను గమనించాను. ‘నాన్-వెజిటేరియన్’ (శాకాహా రులు కానివారు) అనే పదం ఒక్క అగ్రకులాల, మధ్యతరగతి భారతీయులు మాత్రమే వాడే పదం. మరే ఇతర దేశస్తులకూ ‘నాన్-వెజ్’ అనే పదం తెలియనే తెలియదు. ఒక్క భారత విమానాల్లో తప్ప మరే విమానాల సిబ్బంది ‘వెజ్’ ఆహారం కావాలో, ‘నాన్-వెజ్’ ఆహారం కావాలో ఎంచుకోమని అడగరు. మిగతావారంతా ‘మాంసం’, లేదా ‘చేప’, లేదా ‘చికెన్’ మాత్రమే ఉన్నాయంటారు. అవే ప్రామాణిక భోజన పదార్థాలు. శాకాహారం కావాలంటే ప్రత్యేకంగా కోరవలసి ఉంటుంది.
అలాగే, ‘జాతి వ్యతిరేక’ అనే పదం యూరప్ లేదా అమెరికాలో ఎక్కడా వినిపించదు. ఆ పదానికి వ్యతిరేకార్థమిచ్చే ‘జాతీయవాదం’ అనే పదానికి వారి భాషల్లోని అర్థం మంచిది కాకపోవడమే అందుకు కారణం. యూరప్‌లో రెండు గొప్ప యుద్ధాలకు కారణమైనది జాతీయవాదమే. జాతీయవాద స్వభావం కలిగినవారుగా గుర్తింపు పొందడమంటే ప్రతికూల ముద్రను వేయించు కోవడంగానే అక్కడ చూస్తారు. జాతీయవాదం అనే పదాన్ని మనం ఎంతో సులువుగా ప్రయోగించేస్తుంటాం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలా ఆ పదాన్ని పార్టీ పేర్లలోనూ పెట్టుకుంటారు. కానీ ఏ ఒక్క యూరోపియన్ రాజకీయ పార్టీ జాతీయవాదమనే పదాన్ని ఉపయోగిస్తుందని అనుకోలేను.
హిందీ, గుజరాతీలలో జాతీయవాదానికి సమానార్థక పదం ‘రాష్ట్రవాది’. అది కాస్త సౌకర్యవంతమైన పదం. ‘రాష్ట్ర’ అనేది వ్యక్తిలో కోరుకోదగిన పదం. అందుకు భిన్నంగా ‘జాతి’ అనే పదం తటస్థమైనది. ‘జాతీయవాదం’కు ఉర్దూలోనైతే కచ్చితమైన సమానార్థకాన్నిచ్చే ‘కవామ్ పరస్తి’ అనే పదం ఉంది. ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీ జాతీయవాదాన్ని ‘ఇతర దేశాలకన్నా ఆధిక్యతను వ్యక్తంచేసే తీవ్ర దేశభక్తి రూపం’గా నిర్వచించింది. మరియం-వెబ్‌స్టర్ డిక్షనరీ దాన్ని ‘ఒక జాతిని మిగతా వారందరి కంటే ఎక్కువ చేసి మాట్లాడుతూ, మిగతా జాతుల, జాతీయాతీత శక్తుల సంస్కృతికి, ప్రయోజనాలకు విరుద్ధంగా తన సంస్కృతిని, ప్రయోజనాలను పెంపొందింపజేసేలా ప్రథమ ప్రాధాన్యా న్నిచ్చేట్టు చేసే’ గుణం.
ఈ నిర్వచనం, భారత జాతీయవాదాన్ని కచ్చితంగా అభివర్ణిస్తుందని అనిపిస్తుంది. జాతీయవాద రక్షణ కోసం భారతీయులు ఎంతగా ఉద్వేగ భరితులవుతారో గత కొన్ని రోజులుగా మనం చూశాం. భరతమాత పట్ల మన దృష్టితో విభేదించే నినాదాల పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపాం. హింసకు దారితీయనంత వరకు ఈ అభ్యంతరంతో నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. దురదృష్టవశాత్తూ, ఈసారి కూడా చాలా సార్లు జరిగినట్టే అది హింసకు దారి తీయడం నన్ను ఆశ్చర్యపరచలేదు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వ్యవహారంపై రెండు రోజులు వరుసగా న్యాయవాదులు కోర్టులో ప్రవర్తించిన తీరు మన సంస్కృతికి పూర్తిగా అనుగుణంగానే ఉంది.
అయితే నేను మరో విషయం గురించి రాయదల్చుకున్నాను. కాబట్టి ‘జాతీయవాదం’కే తిరిగి వస్తే, భారతీయులు ఇంకా ఏ ఏ ఇతర రూపాల్లో దాన్ని ప్రదర్శిస్తుంటారు? టెలివిజన్ చర్చలను బట్టి చూస్తే, నినాదాలను వ్యతిరేకించడంలోనూ, దేశ ఐక్యత, సమగ్రతల పరిరక్షణ విషయంలోనూ మన మధ్యతరగతిలోని అత్యధికులు జాతీయవాదులనేది స్పష్టమే.
అయినాగానీ కేవలం 3 శాతం భారతీయులు మాత్రమే ఆదాయం పన్ను చెల్లిస్తారు. ప్రత్యేకించి ఈ విషయంలో ‘జాతీయవాదం’ బలంగా కనబడదు. అలాగే, పన్నులు చెల్లించేవారిలో అధికులు జీతాలు పుచ్చుకునే వ్యక్తులే. వారి పన్నును యాజమాన్యమే జీతంలోంచి మినహాయించేస్తుంది. తద్వారా పన్నుల దొంగతనానికి పాల్పడే అవకాశం వారికి లేకుండా చేస్తారు. ఈ వేతన మధ్యతరగతి వారు సైతం తమ ‘సాలరీ బ్రేక్-అప్’తో (జీతాన్ని వివిధ విభాగాలుగా చూపడం) పలు జిత్తులను ప్రయోగిస్తుంటారు. కానీ అ విషయాలను చర్చించే సందర్భం కాదిది.
టీడీఎస్ అనేది కూడా భారతీయులకే ప్రత్యేకమైన పదబంధం. అది మధ్యతరగతి భారతీయులకే తెలుసు. ‘ఆదాయపు పన్నును మూలం నుంచే మినహాయించుకోవడం’ అని దానర్థం. నాకు తెలిసి మరే దేశంలోనూ ఇలాంటిది ఉన్నట్టు ఎరుగను. పౌరులు కొంత మేరకు దొంగతనం చేస్తారని ప్రభుత్వం ముందస్తుగా ఊహించి, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ముందే ఆదాయం పన్నును మినహాయించేసుకుంటుంది. అలా మినహాయించుకున్న డబ్బులో మీకు వాపసు ఇవ్వాల్సిన దాన్ని రాబట్టుకో వడం సులువేమీ కాదు. అయితే అది కూడా ఇక్కడ చర్చనీయాంశం కాదు.
నినాదాలు చేసిన వారిపై ఆగ్రహంగా వ్యక్తమైన ఉద్వేగభరితమైన మన దేశ ప్రేమ, ఇతర విధాలుగా దేశం పట్ల శ్రద్ధ చూపడానికి విస్తరించదు. ఈ భూమండలం మీదే మనం అత్యంత మురికి జీవులం. మన పరమ పవిత్ర నది గంగను సుప్రీం కోర్టు ఆదేశిస్తే మాత్రమే శుభ్రం చేయగలం, అది కూడా ఎంతో కష్టంతో. పౌరులు స్వచ్ఛందంగా దేశం మీద తమ ప్రేమను చూపరు. దేశ చట్టాలను అలవోకగా ఉల్లంఘించడం కూడా భారతీయుల ప్రత్యేకతే. ‘చట్ట విరుద్ధ నిర్మాణం’, ‘దురాక్రమణ’ అనే పదాలే అందుకు ఉదాహరణ. 30 ఏళ్లుగా అమెరికా, యూరప్‌లకు ప్రయాణాలు సాగిస్తున్నాను. అయినాగానీ అలాంటి పనులు చేసే వ్యక్తులెవరూ నాకు తారసపడలేదు. ఇక్కడయితే ఆ పనులు చేయడం నినాదాల మీద అగ్రహం వెలిబుచ్చడమంత సర్వ సాధారణం.
చూడబోతే మన జాతీయవాదం పరిమితమైనదిలా కనిపిస్తోంది. జేఎన్‌యూ సమస్యకు ప్రభుత్వ ప్రతిస్పందనగా మన విశ్వవిద్యాలయాలన్నీ జాతీయ జెండాను ఎగురవేయాలని శాసించారు. ఇదేమైనా సరైన ప్రభావాన్ని కలుగజేస్తుందా? భరతమాత పట్ల మన భావోద్వేగం సుదృఢమైనది. అయితే అది మన నిజ ఆచరణలో, ప్రవర్తనలో వ్యక్తం కావడం లేదు. మన సెంటి మెంట్లలోనే వ్యక్తమౌతోంది. ఇతరుల చర్యలకు మన ప్రతిచర్యగా మాత్రమే ఆ భావన ఎంత బలమైనదో తెలుస్తుందే తప్ప మన సొంత చర్యల ద్వారా మాత్రం కాదు.
మన భారతీయుల విషయంలో జాతీయవాదానికి ఇంగ్లిషు నిర్వచనమే చాలా కచ్చితమైనదని అనుకుంటాను. ‘ఇతరులపై మన ఆధిక్యత’ గురించే ప్రధానంగా మనకు పట్టింపు ఎక్కువ. ‘ఇతరుల సంస్కృతికి, ప్రయోజనాలకు విరుద్ధంగా మన సంస్కృతిని, ప్రయోజనాలను పెంపొందింపజేయడా’నికే మన ప్రాధాన్యం. దేశం కోసం ఏమైనా చేయడం ద్వారానూ, త్యాగాల రూపంలోనూ వ్యక్తమయ్యే నిజమైన దేశ ప్రేమ మనలో లోపించిందని అనిపిస్తుంది. అరుపులు, ఆగ్రహం మాత్రమే మనం ప్రదర్శించేది.
ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com