
మహా విషాదంగా ముగుస్తుందా?
మోదీ తాను ఫైళ్లను చదవనని చెప్పారు. పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోవాలనే ఆత్రం ఉండి, ఎంతో నిర్ణయాత్మకంగా ఉండే వ్యక్తికి తాను..
లేక మంచి రోజులను తేనుందా?
అవలోకనం
గత సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ముందు, 2014 ఏప్రిల్‌లో కాబోయే ప్రధాని నరేంద్ర మోదీని కార్యకర్త, రచయిత్రి మధు కిష్వర్ ఇంటర్వ్యూ చేశారు. అప్పట్లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ టీవీ ఇంటర్వ్యూలో ఆయన తన గురించి, తన పని శైలి గురించి చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తికరమైనవిగా అనిపించాయి. ఆ ఇంటర్వ్యూను చూస్తూ ఆయన చెప్పిన కొన్ని విషయాలను నోట్స్‌గా రాసుకున్నాను. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం పని సంస్కృతిని మార్చారు. ఆయనకు ముందటి ముఖ్యమంత్రులంతా 12 గంటలకు కార్యాలయానికి వచ్చేవారు. సమయ పాలన విషయంలో ఎçప్పుడూ నిక్కచ్చిగా ఉండే మోదీ సరిగ్గా ఉదయం 9.45కు కార్యాలయానికి వచ్చేవారు. సమయాన్ని పాటించడం పట్ల ఆయన చాలా పట్టింపుతో ఉండేవారని నాకూ తెలుసు. ఆయనను నేను కలుసుకున్న ప్రతిసారీ కచ్చితంగా నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన నిముషంలోనే కలుసుకునేవాడిని.
నిజంగా ఆయన ఎలా పనిచేసేవారు అనేది ఆయన వెల్లడించిన మరో విషయం. మోదీ తాను ఫైళ్లను చదవనని చెప్పారు. పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోవాలనే ఆత్రం ఉండి, ఎంతో నిర్ణయాత్మకంగా ఉండే వ్యక్తికి తాను నిర్ణయం తీసుకోబోయే విషయంపై పూర్తి పట్టు ఉండటం అవసరం. అయితే మోదీ మాత్రం ‘అకడమిక్ (విద్యావిషయ సంబంధమైనవిగా ఉండే) అధ్యయనాల’ ద్వారా తాను పాలన సాగించలేనని, అందుకు బదులుగా అన్ని విషయాలను క్లుప్త సారాంశంగా నోటి మాటలతో తనకు చెప్పమని తన అధికారులను కోరుతానని చెప్పారు. వారే ఆ ఫైలును చదివి, ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘‘అందులో మసాలా (సారం) ఏమైనా ఉన్నదేమో’’ ఆయనకు చెప్పాల్సి ఉంటుంది. వాస్తవంగా తాను వాటిని చదవకుండానే ఆయా సమస్యలకు సంబంధించిన సూక్ష్మ అంశాలను సైతం తాను తెలుసుకోగలనని ఆయన చెప్పారు. ఎందుకంటే ‘‘నాకు అంతటి గ్రహణశక్తి ఉంది’’ అన్నారు. తాను ‘‘మంచి శ్రోతను’’ అనీ, తనకు ఏమి చెప్పినా దాన్ని గ్రహించి, గుర్తుంచుకోగలనని మోదీ తెలిపారు.
ఈ విషయాన్ని వింటున్నప్పుడు ఆయన తనకు నమ్మకమున్న కొందరు అధికారులపై ఆధారపడుతున్నారని అనిపించింది. కాబట్టి ఆ అధికారులు ఏ విషయమైనా ఆయనకు ఎంత తెలిస్తే చాలని తాము అనుకుంటే అంత ఎక్కువగా లేదా తక్కువగా చెప్పవచ్చు. ఇలా అధికారులపై ఆధారపడటమే ఆయనలోని బలహీనమైన అంశంగా పరిణమించగలదని అనిపించింది. మోదీ వర్ణించిన ఈ పని శైలితో పదుల కొద్దీ లేదా బహుశా వందల కొద్దీ పేజీలుండే సంక్లిష్ట విషయాలను సైతం మాటల్లో చెప్పేంత సంక్షిప్త సారాంశంగా కుదించేయడం జరుగుతుంది. సమయం లేనప్పుడు అలా జరగడం సాధ్యం. కానీ సమస్య అత్యంత సంక్లిష్టమైనది అయినప్పుడు నోటి మాటగా చెప్పే సంక్షిప్త సారాంశం ఆ విషయాన్ని అతిగా సరళీకరించడం, అవుతుంది.
ఈ సారాంశంపై ఆధారపడే మోదీ నిర్ణయాలను తీసుకుంటారు, వాటిని పాలనా యంత్రాంగం అమలుచేస్తుంది. 12 ఏళ్ల పాటూ మోదీ మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటూ గుజరాత్‌ను నడిపారు. కాబట్టి ఈ పని శైలి బాగానే పని చేసినట్టు అనిపించింది. అయితే, నిర్ణయాలను తీసుకునేటప్పుడు తత్సంబంధమైన విషయాలను ఇలా సారాంశం రూపంలో తెలుసుకునే మోదీ పని శైలి గురించి ఇటీవలి కాలంలో పునరాలోచనలో పడ్డాను.
పెద్ద నోట్ల రద్దు విధానం అమలవుతున్న తీరుకు సంబంధించి సుప్రీం కోర్టు కొన్ని కీలక ప్రశ్నలను సంధించింది. నవంబర్ 8న మోదీ రూ. 500, 1,000 నోట్లను రద్దు చేసినప్పటికే ఈ విధానానికి సక్రమమైన ప్రణాళికను రూపొం దించారో, లేక ‘‘యథాలాపంగా’’ తీసుకున్న నిర్ణయమో తెలపాలని కోరింది. నిర్దేశించిన నగదును బ్యాంకులు పౌరులకు ఇవ్వలేకపోతున్నాగానీ ప్రభుత్వం నగదు ఉపసంహరణకు పరిమితులను ఎందుకు ప్రకటిస్తోందని అడిగింది. పరిస్థితులను చూస్తుంటే ప్రభుత్వం ఈ విషయంపై లోతుగా ఆలోచించినట్టు లేదని ఎందుకు అనిపిస్తోంది? అని ప్రశ్నించింది.
ప్రభుత్వం తన స్వతంత్రతను బలంగా చాటుకోవడం కోసం వీటిని బలంగా తోసి పారేసింది. ద్రవ్య విధానాన్ని కోర్టులు నిర్ణయించజాలవని చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వ వాదన సరైనదే అనుకుంటున్నాను. ఈ వివాదం ప్రభుత్వానికి అనుకూలంగానే పరిష్కారమౌతుందని ఆశిస్తున్నాను.
అసలు విషయానికి తిరిగి వస్తే, మోదీ పనిశైలిలో కొన్ని సానుకూలతలు ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు, త్వరత్వరగా నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చినçప్పుడు లేదా సమస్యలు జటిలమైనవి కానప్పుడు ఆ శైలి తగినది కావచ్చు. ఏది ఆకట్టుకునేలా ఉంటుందో గ్రహించగల శక్తి మోదీకి బాగా ఉంది. అద్భుతంగా ఉన్న మేక్ ఇన్ ఇండియా లోగో వంటివి ఎంపిక కావడానికి కారణం మోదీ వాటిని వ్యక్తిగతంగా ఆమోదించడమేనని నా అనుమానం.
కానీ నిర్ణయం తీసుకునే విషయం విస్తారమైనది, సంక్లిష్టమైనది, చివరికి జవాబుదారీ వహించాల్సివచ్చే నిర్ణయాన్ని తీసుకునే వ్యక్తే స్వయంగా అధ్యయనం చేయాల్సినది అయినప్పుడు ఏం జరుగుతుంది? అలాంటçప్పుడు ఈ పని శైలివల్ల పరిస్థితి మరింత సమస్యాత్మకంగా మారుతుందని నా అనుమానం. ప్రతిదాన్నీ నోటి మాటగా చెప్పే సంక్షిప్త సారంగా కుదించలేం.
విద్యావంతునికి తగ్గట్టుగానే అన్ని వివరాలను తెలుసుకోగోరే మన్మో హన్Sసింగ్ పని శైలికి çసరిగ్గా విరుద్ధమైనది మోదీ శైలి. రానున్న కొన్ని నెలల్లో పెద్ద నోట్ల రద్దు మహా విషాదంగా ముగుస్తుందని మన్మోహన్ చెప్పారు. జనవరిలో మనం మరింత మెరుగైన, విభిన్నమైన ప్రపంచంలోకి అడుగు పెడతామని మోదీ అన్నారు. ఇద్దరు చెప్పిందీ సరైనదే అయ్యే అవకాశం లేదు. ఎవరు చెప్పింది తప్పో చాలా త్వరలోనే తేలుతుంది.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com