
అసమర్థ ప్రభుత్వం, అధ్వానపు ప్రతిపక్షం..!
అవలోకనం
ప్రస్తుతం మనం దేశంలో ఒక విచిత్రమైన రాజకీయ దశగుండా వెళుతున్నాం. ఒకవైపేమో, గత రెండున్నరేళ్ల పాలనలో మొదటిసారిగా ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. మరోవైపేమో, ప్రజల మనోభావాలను వ్యక్తపర్చగలిగే సామర్థ్యంగానీ లేదా పరిస్థితిని తనకు అనుకూలంగా మల్చుకునే నైపుణ్యం గానీ ప్రతిపక్షానికి వాస్తవంగానే లోపించినట్లు కూడా కనిపిస్తోంది.
కేంద్రప్రభుత్వం తలపెట్టిన పెద్ద నోట్ల రద్దు ప్రయోగం ప్రారంభమై నలభై రోజులు కావస్తోంది. కానీ బ్యాంకుల నుంచి ద్రవ్య సరఫరా నేటికీ సాపేక్షంగా తక్కువగానే ఉంటోంది. ఏటీఎంలలో ఇప్పటికీ తగినంత నగదు నిల్వ ఉంచడం లేదు. వ్యవస్థ మొత్తంగా తనను ధ్వంసం చేసినటువంటి కార్యాచరణతో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. వ్యవస్థలో ఏర్పడిన అస్థిరత్వాన్ని పరిష్కరించే విష యంలో కనీసస్థాయి నియంత్రణ కూడా ఉన్నట్లు కనపడటం లేదు.
పెద్దనోట్ల రద్దును ప్రకటించిన వారం రోజుల తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవచ్చనే సూచనలు పొడసూపాయి. న్యాయస్థానంలో నోట్ల రద్దుపై తొలి విచారణ ప్రారంభమై, పాత కరెన్సీ చాలావరకు ఇంకా ప్రజల చేతుల్లోనే ఉంటున్నప్పుడు అది సాధ్యమేననిపించింది. కానీ ఆ దశ ముగిసిపోయింది. డబ్బు సైతం దాని భౌతిక రూపంలో అదృశ్యమై ఆర్బీఐ లేదా బ్యాంకుల ఖజానాల్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో వ్యవస్థ ద్వారా కొత్త నోట్లు పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. వ్యవస్థ స్థిరత్వం పొందాలంటే మరొక నెల సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే జనవరి మధ్యవరకు పరిస్థితి ఇలాగే ఉంటుందన్నమాట. డబ్బును ముద్రించినంత మాత్రాన సరిపోదు.. వ్యవస్త మొత్తంలో నగదు పంపిణీ కావాలి. దీనికి ఎంత సమయం పడుతుందన్న వాస్తవ అంచనా ఇంతవరకు లేదు.
పెద్దనోట్ల రద్దు వల్ల రానున్న కాలంలో పెద్దగా బాధ ఉండదని మోదీతో సహా ఇతరులు కూడా నమ్ముతున్నారు. రాజకీయపరంగా ఇదెంత ముఖ్యమైన సమస్య అంటే, ప్రజాస్వామిక పరిధిలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే దీన్ని అనుకూలంగా మల్చుకుంటుంది. ఆర్థిక వ్యవస్థను మందగింపజేసి, కోట్లాదిమంది ప్రజలను నెలరోజులకు పైగా ప్రతి దినం భయంకరమైన అసౌకర్యానికి గురిచేస్తున్న ఈ దూకుడు చర్య ప్రతిపక్షంలోని రాజకీయనేతలకు కలలో కనిపించే లడ్డూలాంటి బహుమతి వంటిది.
వాస్తవానికి ప్రభుత్వం తొలి కొద్ది వారాల్లో పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనాలు పొందింది. మీడియా అత్యంత దృఢంగా పెద్ద నోట్ల రద్దును సమర్థిం చింది. తర్వాత జాతికి మద్దతుగా, నల్లధనానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా క్యూలలో నిలబడుతున్నందుకు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నట్లుగానే కని పించింది. కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దనోట్ల రద్దును సమర్థిస్తూనే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ వైఖరి ఆ పార్టీ ఆత్మవిశ్వాస లేమిని ప్రదర్శించింది. పైగా పెద్దనోట్ల రద్దు సారాంశం పట్ల అవగాహనా లేమిని అది సూచించింది. పెద్దనోట్ల రద్దు పరిణామాలు చాలాకాలం కొనసాగడంపై నిపుణులతోసహా చాలామంది ప్రజలకు అంతగా అవగాహన లేదనడం కరెక్టే కావచ్చు. కానీ కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో ఈ దేశాన్ని పాలించడంలో దశాబ్దాల అనుభవం కాంగ్రెస్ పార్టీ సొంతం. పెద్ద నోట్ల రద్దు విపరిణామాలపై తగినంత డేటా, సమాచారం దానికి తప్పకుండా తెలిసే ఉండాలి. ఆ పార్టీకి కూడా అది తెలియదన్నట్లయితే అది కాంగ్రెస్ అసమర్థతగానే చెప్పాలి.
క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న జననేతలు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ మాత్రమే మొదటినుంచే పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ వచ్చారు. నోట్ల రద్దు నిర్లక్ష్యపూరితమైన చర్య అనీ, జనం మద్దతును అది కోల్పోతుందని వీరు గుర్తించి ఉండవచ్చు. అసౌకర్యం తీవ్రస్థాయిలో కొనసాగడం, ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ చర్య లక్ష్యం నల్లధనంపై దాడి చేయడం నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సుస్థిరత వైపునకు మారడంతో.. నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం ఆస్వాదించిన తొలినాళ్ల ఉల్లాస స్థితికి క్యూలలో ఉంటున్న జనం నుంచే ఎదురుదెబ్బ తగిలింది.
పెద్ద నోట్ల రద్దు విషాదాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోలేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి రాహుల్ గాంధీ పేలవమైన పరిస్థితినే సూచిస్తోంది. ప్రజాకర్షక రాజకీయాల్లో నినాదాలతో జనం మద్దతు పునాదిని కూడగట్టడం చాలా అవసరం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీ దీన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. మనకాలపు అత్యంత సమర్థ రాజకీయనేత మోదీ కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి సామర్థ్యం లేని కాంగ్రెస్.. అమూల్య మైన రాజకీయ అవకాశం తన ముందున్నప్పటికీ దాన్ని ఎలా సరైన విధంగా ఒడిసిపట్టుకోవాలో తెలియని స్థితిలో అస్పష్టపు ప్రకటనలు చేస్తోంది.
ప్రస్తుత సంక్షోభం పట్ల రాహుల్ గాంధీ వైఖరి ఏమాత్రం అర్ధవంతంగా లేదనిపిస్తోంది. మొదట తాను కాస్త ప్రయత్నించారు. తర్వాత ఏకపక్ష చర్య ద్వారా ప్రతిపక్ష ఐక్యతనే అర్ధరహితంగా విచ్ఛిన్న పరిచారు. ప్రధాని వ్యక్తిగత అవినీతిని బయటపెడతానని హెచ్చరించారు. కానీ తర్వాత మాత్రం మోదీని కలుసుకున్నప్పుడు రైతుల దుస్థితి గురించి ప్రస్తావనకు ఎజెండా మార్చుకున్నారు. తన వైఖరిలో ఎలాంటి వ్యూహం కానీ, క్రమశిక్షణ కానీ లేవని ఇది సూచిస్తోంది. ప్రధాని వ్యక్తిగతంగా అవినీతిపరుడని చాలా కొద్దిమంది మాత్రమే నమ్ముతున్నారు. అలాంటప్పుడు మాటవరసకైనా అలాంటి ఆరోపణ చేసి ఉండకూడదు.
మొత్తం మీద కేంద్రప్రభుత్వం తనకు తాను రూపొందించుకున్న అతి పెద్ద సంక్షోభం మధ్యలో మనం ఉన్నాం. దేశ పౌరులతో, మన జీవితాలపై కలిగిస్తున్న ప్రభావాలతో తీవ్రంగా ముడిపడి ఉన్న సంక్షోభం ఇది. నూతన సంవత్సరం తొలి వారాల్లో వ్యక్తిగత అసౌకర్యం కలిగిస్తూ, కొత్త సంవత్సరం తొలి కొన్ని నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతూ కొనసాగుతానని వాగ్దానం చేస్తున్న సంక్షోభం ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే... ప్రభుత్వం అతి పేలవంగా నిర్వహిస్తున్న, ప్రతిపక్షం అంతకంటే అధ్వానంగా వ్యవహరిస్తున్న సంక్షోభంగా ఇది అత్యంత స్పష్టంగా రుజువవుతోంది.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com