
వృథా సమావేశాలు!
మొత్తానికి అధికార పక్షం, విపక్షం రెండూ కలిసి పార్లమెంటు శీతాకాల సమా వేశాలను చెల్లని కాసుగా మార్చాయి. పెద్ద నోట్ల రద్దుతో తలకిందులైన తమ బతుకుల గురించి పార్లమెంటులో చర్చిస్తారేమో, సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తారేమోననుకున్న ప్రజానీకానికి ఇరు పక్షాలూ నిరాశే మిగిల్చాయి. గత నెల 16న ప్రారంభమైన పార్లమెంటు 22 రోజులపాటు వాయిదాల తమాషా కొన సాగించి చివరకు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినా, బీజేపీ సీనియర్ నాయకుడు అడ్వాణి రెండుసార్లు హితబోధ చేసినా ఎవరూ తలకెక్కించుకోలేదు. ప్రజల కోసం స్వీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలన్న ధ్యాస కనబరచలేదు. గత ఆరేళ్లలో ఇంత ఘోరంగా సమావేశాలు జరగడం ఇదే ప్రథమమని విశ్లేషకులు గణాంక సహితంగా చెబుతున్నారు.
2010లో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై చెలరేగిన వివాదం పర్యవసానంగా లోక్‌సభ 6 శాతం, రాజ్యస¿¶ 2 శాతం మాత్రమే పనిచేశాయి. మళ్లీ ఇన్నేళ్లకు ఉభయ సభలూ దాదాపు అంత నాసిరకమైన పనితీరును ప్రదర్శించాయి. ఈసారి లోక్‌సభ 17.04 శాతం, రాజ్యసభ 20.61 శాతం పని చేసిందని సాక్షాత్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ చెబుతున్నారు. వందల కోట్ల ప్రజా ధనం వృథా అయింది. చిత్రమేమంటే అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ సమావేశాల సమయంలో పార్లమెంటు వెలుపల మాత్రమే మాట్లాడారు. తమను సభలో అవతలి పక్షం మాట్లాడనీయడం లేదని ఆరోపించి జనాన్ని అయోమయంలో పడేశారు. కనీసం ఆఖరి నిమిషంలోనైనా రెండు పక్షాలకూ జ్ఞానో దయమవుతుందేమో... ఈ సమావేశాలను మరో నాలుగైదు రోజులు పొడిగించి సక్రమంగా నిర్వహిస్తారేమోనని ఎదురుచూసినవారికి చివరకు నిరాశే మిగిలింది.
సమావేశాలు సక్రమంగా నిర్వహించడం ప్రభుత్వ పనితనానికి నిదర్శనమవు తుంది. అవి పేలవంగా సాగి విఫలమైతే బయటపడేది దాని చేతగానితనమే... దాని అప్రజాస్వామికతే. ఈ సంగతి బీజేపీ పెద్దలకు తెలియదనుకోలేం. పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అవినీతి అంతానికీ, నల్ల ధనం నిర్మూలనకూ వాటిని చిరునవ్వుతో సహిస్తున్నారని చెప్పుకుంటున్న అధికార పక్షం ఆ సంగతినే పార్లమెంటు వేదికపై ప్రకటించి, చర్చించడానికి ఎందుకు సిద్ధపడలేక పోయిందో అనూహ్యం. వివిధ నిబంధనలకింద ఓటింగ్‌తో కూడిన చర్చ జరపా లన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను అధికార పక్షం నిరాకరించింది.
నిజానికి లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్నప్పుడు ప్రభుత్వం భయపడనవసరం లేదు. దాని వల్ల మిన్ను విరిగి మీద పడదు. పెద్ద నోట్ల రద్దు వంటి అతి పెద్ద నిర్ణయంపై చట్టసభలో చర్చిస్తే, దానిపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వానికి అదేమీ అప్రదిష్ట కలిగించే అంశం కాదు. పైగా తన నిర్ణయంలోని సహేతుకతనూ, ఆ చర్యలోని సదుద్దేశాన్నీ చాటు కోవడానికి దాన్నొక అవకాశంగా తీసుకోవచ్చు. కానీ అధికార పక్షం అందుకు సిద్ధ పడలేదు. చివరకు విపక్షం ఒక మెట్టు దిగొచ్చి బేషరతుగా చర్చించడానికి సరేనన్నా అంగీకరించలేదు. పైగా చర్చకు ద్వారాలు మూసుకుపోయే విధంగా అంతక్రితం రెండు సమావేశాల్లో దాదాపుగా చర్చించిన అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణాన్ని ముందుకు తెచ్చి పక్కకు తప్పుకుంది. ఆ స్కాంపై చర్చించాలంటూ మంత్రి అనంత్‌కుమార్ పట్టుబట్టి ఆశ్చర్యపరిచారు. విపక్షం బేషరతు చర్చకు ముందుకొచ్చి నప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సభ సజావుగా జరిగేలా సమన్వయపరచవలసిన బాధ్యత ఆయనది. అయితే ఆయనకు అంతకన్నా గతంలో చర్చకొచ్చిన అంశమే ముఖ్యమనిపించింది! పార్ల మెంటులో అత్యంత బలహీనంగా ఉన్నామని తెలిసినా ఓటింగ్‌తో కూడిన చర్చకు పట్టుబట్టడం విపక్షాల తెలివితక్కువతనం. దేశ ప్రజలందరినీ పీడిస్తున్న ఒక పెను సమస్యపై పార్లమెంటులో తమ గళం వినిపించడం ముఖ్యమని అవి తెలుసుకోలేక పోయాయి. సమావేశాలు ముగింపుకొచ్చే తరుణంలో ఈ విషయంలో జ్ఞానోదయ మైనా లేశమాత్రమైనా ప్రయోజనం లేకుండాపోయింది.
పెద్ద నోట్ల రద్దుతో వ్యవసాయం మొదలుకొని అన్ని రంగాలూ నిస్తేజమ య్యాయి. ఉపాధి దొరక్క సామాన్యులు మూగగా రోదిస్తున్నారు. ఏం చేయాలో ఎవరికీ పాలుబోవటం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడినా డబ్బు దొరుకు తుందన్న భరోసా ఉండటం లేదు. దొరికినా చేతికొచ్చిన రూ. 2,000 నోటుతో ఏమీ చేయలేక ఉస్సూరంటున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఈ క్యూలలో అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల్లో ఖాతాదారులకు వారానికి రూ. 24,000 ఇస్తామని రిజర్వ్‌బ్యాంకు హామీ ఇచ్చినా అందుకు అవసరమైన డబ్బును అది పంపిణీ చేయలేకపోయింది. దేశంలో దాదాపు అన్ని బ్యాంకుల్లో ‘నో క్యాష్’ బోర్డులే వేలాడుతూ ఖాతాదారులను వెక్కిరిస్తున్నాయి.
మరోపక్క శేఖర్‌రెడ్డిలాంటి నల్ల కుబేరుల ఇళ్లల్లో గుట్టలకొద్దీ నోట్ల కట్టలు పోగుబడుతున్నాయి. నల్ల ధనం అరి కట్టడానికి, అవినీతిని అంతం చేయడానికి తీసుకున్నామన్న చర్య కాస్తా ఇలా తలకిందులయ్యేసరికి ఏం చేయాలో తోచని ప్రభుత్వం నల్లధన వ్యాపారుల గుట్టు మట్లు తెలిస్తే చెప్పమని పౌరుల్నే అడుగుతోంది! ఈసారి జీఎస్‌టీతో సహా 10 ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్టు సమావేశాలకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. కానీ అందులో దివ్యాంగుల హక్కుల బిల్లు ఒక్కటే సజావుగా చర్చ సాగి సభామోదం పొందింది. గుప్తధనం వెల్లడిస్తే 60 శాతం మినహాయింపుతో అంగీకరించేందుకు వీలుకల్పించే ఆర్ధిక బిల్లు, మరో రెండు బిల్లులు మూజువాణి ఓటుతో గట్టెక్కాయి.
పార్లమెంటు వంటి అత్యున్నత చట్టసభలో ప్రజల సమస్యలు చర్చించడానికి అవకాశం ఉండకపోతే... పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నట్టు తాము ప్రవర్తించకపోతే సాధారణ ప్రజానీకంలో సైతం ఆ మాదిరి అప నమ్మకమే ఏర్పడుతుందని, అది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుందని అన్ని పక్షాల నాయకులూ గుర్తించాలి.