ఉరికొయ్యతో మతం పీటముడిని విప్పగలమా? | death sentence to one group is not the solution to terrorism, aakar patel writes | Sakshi
Sakshi News home page

ఉరికొయ్యతో మతం పీటముడిని విప్పగలమా?

Published Sun, Dec 6 2015 4:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

ఉరికొయ్యతో మతం పీటముడిని విప్పగలమా?

ఉరికొయ్యతో మతం పీటముడిని విప్పగలమా?

అవలోకనం
 
ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి చూడాలనేది నిజాయితీతో కూడిన, సబబైన కోరికేనా అనేదే నా ప్రశ్న. హిందూ, సిక్కు ఉగ్రవాదులను ఉగ్రవాదులుగా చూడటం మనకు తేలికేం కాదు. అఫ్జల్ గురుకు ‘మరణ దండన విధించనిదే సమాజ సమష్టి అంతరాత్మ సంతృప్తి చెంద ద’ని సుప్రీం కోర్టు పేర్కొంది. ముస్లిమేతరులను ఉరితీయడానికి కూడా అలాంటి సమర్థనలను యోచించగలిగేటంత వరకు ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి చూడటం మనకు సాధ్యం కాదు.
 
గత నెల మలేసియాలో మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్ర వాదం గురించి రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరు చేసి చూడాలి. రెండు, ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఉగ్రవాదం. ఇది నిజమేనా?

ఈ ఏడాది కశ్మీర్‌కు వెలుపల దేశవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదం వల్ల చనిపోయినవారి సంఖ్య 21. గత ఏడాది అది నలుగురు కాగా, అంతకు ముందటి ఏడాది 25. అంతకంటే ముందటి ఏడాది ఒకే ఒక్కరు.
 దేశంలో ఏటా ఐదు లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు పోషకాహార లోపంతో మరణిస్తున్నారు. నిజాయితీతో కూడిన ఏ ప్రమాణం ప్రకారం చూసినా దేశ జనాభాలో సగం మంది పేదలు, అందులో సగం మంది నిరక్ష రాస్యులు. మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే.

అయినా ఉగ్రవాదం వాతావారణ మార్పుల కంటే కూడా పెద్ద సమస్యా? భూతాపం పెరుగుదలే చెన్నై వరదలకు కారణమని ప్రధానే అంగీ కరించారు. ఈ వరదల్లో 280 మంది కంటే ఎక్కువ మందే మరణించారు. కాబట్టి ఉగ్రవాదం, అతిశయించి చూపుతున్న సమస్యని నాకు అనిపిస్తుంది.

పేదరికం, పోషకాహార లోపం, నిరక్షరాస్యత వంటి సమస్యలను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించుకున్న పాశ్చాత్య దేశాలకు అది తక్షణమైన అత్యవసర సమస్య. భారతీయులలో అత్యధికులకు భిన్నంగా సౌఖ్యంగా సాగిపోతుండే వారి జీవితాలకు ఉగ్రవాదమంటే అందుకు అంతరాయాన్ని కలిగించే సంచలనం.
 అయితే ఈ వ్యాసాన్ని రాస్తున్నది దాని గురించి కాదు. మన ప్రధాని చెప్పిన మొదటి అంశమైన ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేయడం గురించి. ఇంతకూ దాన్ని అలా వేరుచేయడం ఎలా?

కొన్ని వాస్తవాలను చూడండి..

  • మీరు త మిళం మాట్లాడే హిందువు అయితే, మన మాజీ ప్రధానిని హత్య చేసినందుకు మిమ్మల్ని ఉరితీయరు.
  • 1991లో రాజీవ్ గాంధీని, మరో 14 మందిని ఆత్మాహుతి దాడిలో హతమార్చిన కేసులో మురుగన్, శంతన్, పెరారివలన్ అనే ముగ్గురికి ఉరిశిక్ష విధించారు. అయితే గత ఏడాది వారిని ఉరితీయరాదని నిర్ణయించారు. తమిళనాడు ప్రభుత్వం వారిని కాపాడటంలో చురుకైన పాత్ర పోషించింది.  
  • మీరే గనుక పంజాబీ మాట్లాడే సిక్కు అయితే, ఒక ముఖ్యమంత్రిని చంపినందుకు మిమ్మల్ని ఉరితీయరు. పంజాబ్ ముఖ్యమంత్రి బియంత్ సింగ్‌ను, మరో 17 మందిని ఒక ఆత్మాహుతి దాడిలో హతమార్చిన బలవంత్‌సింగ్ రాజోనాను ఉరితీయలేదు. తనకు మరణశిక్ష విధించి, తన అవయవాలను దానం చేయాలని రాజోనా కోరినా ఆ పని చేయలేదు.
  • మరో పంజాబీ మాట్లాడే సిక్కు, దేవిందర్‌పాల్ సింగ్ భుల్లార్  1993లో ఒక కాంగ్రెస్ నేతపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అతనినీ ఉరి తీయలేదు.
  • గుజరాతీ మాట్లాడే ఒక సింధీ హిందువైన మాయా కొద్నానికి, తోటి గుజరాతీలు 97 మందిని హత్యగావించినందుకు శిక్ష విధించారు. అయినా ఆమె జైలులో గడపాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా లభిస్తున్న బెయిళ్లతో శిక్షపడ్డ నేరస్తురాలై ఉండి కూడా ఆమె జైలు బయటనే గడుపుతున్నారు.
  • అదే మీరు గుజారాతీ మాట్లాడే ముస్లిం అయితే, ఉగ్రవాద ఆరోపణలకు గానూ మిమ్మల్ని ఉరితీస్తారు. యాకూబ్ మెమెన్ కుటుంబానికి తెలిసివచ్చిన నిజం అదే. మెమెన్‌ను ఉరితీయరాదని కొందరు అన్నారు, నిజమే. అయితే వారు ఉరిశిక్షల రద్దును కోరేవారు. మొదట పేర్కొన్నవారితో సహా అన్ని రకాల నేరస్తుల ఉరిశిక్షలకూ వారు వ్యతిరేకులు. ముస్లిం అయిన మెమన్‌కు తోటి గుజరాతీల మద్దతు సైతం లభించలేదు.
  • అలాగే మీరు కశ్మీరీ మాట్లాడే ముస్లింలయితే, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలకు మీకు ఉరి వేస్తారు. అఫ్జల్ గురు కుటుంబం ఆ నిజాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి వచ్చింది. గురు కేసులో ఆధారాలు తప్పయి ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ఉంది. అయినా అది అతని మరణ శిక్షను అమలుకాకుండా ఆపలేకపోయింది.  
  • తమిళనాడు, పంజాబ్ శాసన సభల్లో తమ రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదులను కాపాడాలని విపరీతమైన రాజకీయ ఒత్తిడి వచ్చింది.
  • ఇక కొద్నానీ గుజరాత్ ప్రభుత్వంలో మంత్రి, ఆమె నాయకుడు స్వయంగా ముఖ్యమంత్రి (నేటి ప్రధాని నరేంద్ర మోదీ). బాధ్యతగల మంత్రి అయి ఉండి కూడా తోటి గుజరాతీలపై ఆమె సాగించిన హత్యాకాండపై ఆయన పల్లెత్తు మాట్లాడలేదు.
  • ఇక్కడ నేను చెబుతున్నవాటిలో కొత్త విషయాలేవీ లేవు. అన్నీ బహిరంగంగా జరిగినవి, అధికారికంగా నమోదైనవే.
  • ఇక మొదట చర్చిన్తున్న విషయానికే తిరిగి వస్తే, నా ప్రశ్న ఒక్కటే. ఉగ్రవాదాన్ని మనం మతం నుంచి వేరుచేయాలనేది నిజాయితీతో కూడిన, సబబైన కోరికేనా? అదే  జరగాలని ఒక నేత కోరుకునేట్టయితే ముందుగా చేపట్టాల్సిన చర్యలేమిటి?
  • ఎవరికైనాగానీ, ప్రత్యేకించి ప్రపంచంలోని మనమున్న ఈ ప్రాంతంలోని వారికి ఈ పని చేయడం కష్టమని నేనంటాను. ఉగ్రవాదులు హిందువులో, సిక్కులో అయితే వారిని ఉగ్రవాదులుగా చూడటం మనకు తేలికేం కాదు. వారికి శిక్షలు విధించినా, వారు కూడా ఆత్మాహుతి దాడులనే అవే ఎత్తుగడలను ప్రయోగించినా, వారి చర్యల వల్ల వారు ఎంచుకున్న లక్ష్యాలతో పాటూ అమాయక ప్రజలు కూడా బలైపోయినా అది అంతే.
  •  పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి మద్దతునిచ్చినందుకు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించారు. గురుకు ‘‘మరణ దండన విధించనిదే సమాజ సమష్టి అంతరాత్మ సంతృప్తి చెందదు’’ అని భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు పేర్కొంది.


ముస్లిమేతరులను ఉరితీయడానికి కూడా మనం అలాంటి సమర్థనలను యోచించగలిగేటంత వరకు, ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి ఆలోచించడం సాధ్యం కాదని నా అభిప్రాయం.
 
- ఆకార్ పటేల్
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత)
aakar.patel@icloud.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement