కర్ర పట్టండి కానీ.. కరుకుగా మాట్లాడకండి!!
అవలోకనం
ఉగ్రవాదులపై యుద్ధంలో ఉగ్రవాదులను కూడా ఉపయోగించుకుంటామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఇటీవల సియాచిన్‌లో చేసిన ప్రకటన రాజ్యాంగబద్ధమైన అన్ని హద్దులనూ అతిక్రమించింది. వెంటనే, తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ ప్రతిచోటా హింసాత్మక చర్యలకు మద్దతు ఇస్తోందని పాక్ ఆరోపించింది. దేశ రక్షణ విషయంలో మంత్రి మృదువుగా మాట్లాడుతూనే బడిత కర్ర పట్టుకుంటే మంచిది.
రక్షణమంత్రి బడిత కర్రను చేతిలో పట్టుకోవాలి కానీ మృదువుగా మాట్లాడాల్సి ఉంటుంది. కులీన ఐఐటీలో చదివిన మన మనోహర్ పారికర్‌లో దీనికి వ్యతిరేక కోణం కనబడుతోంది. చిన్న కర్ర, చాలా పెద్ద నోరు పెట్టుకున్న వ్యక్తిని భారత్ తనలో చూస్తోంది. రాజ్యవిధానంలో భాగంగా ఉగ్రవాదులను ఉపయోగించుకోవటం గురించి ఆయన మే నెల 21న మాట్లాడారు. ఆయన అన్న మాట లివి. ‘నేనిక్కడ స్పష్టంగా చెప్పకూడని విషయాలు కొన్ని ఉన్నాయి’ అని అంటూనే వాటిపై చర్చకు దిగారు. ‘ఏ దేశమైనా (పాకిస్తానే ఎందుకు) నా దేశానికి వ్యతిరేకంగా పథకాలు రచిస్తున్నట్లయితే, మనం తప్పకుండా కొన్ని చురు కైన చర్యలు చేపడతాం.’ హిందీ సామెతను ఉటంకిస్తూ ఆయన ఇలా అన్నారు. ‘కాంటేసే కాంటా నికాల్నా. మనం ఉగ్రవాదులను ఉగ్రవాదులతోటే తటస్థం చేయాలి. మనం అలా ఎందుకు చేయకూడదు? మన సైనికుడే ఆ పని ఎందుకు చేయాలి?’
భారత్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఉపయోగించే వైఖరిని అమలు చేసి విఫలమైంది. జమాత్ ఇ ఇస్లామి, ఇతర ఇస్లామిస్ట్ గ్రూపుల వ్యతిరేకులను ఉప యోగించుకోవాలని 1990లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణ యించుకుంది కానీ కశ్మీర్‌లో ఆ వ్యూహం బెడిసికొట్టింది. ఈ ప్రయోగం త్వరలోనే ముగిసిపోయింది కూడా. భారత్ ప్రయోజనాలకోసం పనిచేసిన కుకా ప్యారీ నేతను అప్పటికి ఇంకా ప్రాబల్యంలో ఉన్న మిలిటెంట్లు కాల్చి చంపారు.
మధ్యభారత్‌లో కూడా ఈ ప్రయోగం విఫలమైంది. ఇక్కడ ప్రభుత్వం మావోయిస్టులపై సాయుధ మిలిటెంట్లను మోహరించింది. ఈ మిలిటెంట్లు అప్పటి నుంచి నిస్సహా యులైన ప్రజలపై పడ్డారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునయినా పారికర్ వంటి మంత్రి తాను చెప్పబోయే మాటల గురించి ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవలసి ఉంది.
పారికర్ ప్రకటనతో ప్రతిపక్షం నివ్వెరపోయింది. ‘రక్షణమంత్రి ఒక ఘోరమైన ప్రకటన చేశారు. తన మాట లు ఎంత దూరం వెళ్లాయో ఆయన గుర్తిస్తారనీ, వాటిని వెనక్కు తీసుకోవడానికి తగిన మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను’ అని పి. చిదంబరం ప్రకటించారు. పైగా, ‘పదేళ్ల యూపీయే ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులను లేదా నేరస్థ శక్తులను భారత్ ఎన్నడూ మోహరించలేదు. ఇప్పుడు ఎన్డీయే ప్రభు త్వం కూడా అలా చేయలేదని, ఇకపై చేయబోదని నా నమ్మ కం’ అనేశారు చిదంబరం. ‘రక్షణమంత్రి ప్రకటన అన్ని హద్దులనూ అతిక్రమించిందనీ దాన్ని ఆయన వెంటనే ఉపసంహరించుకోవాల’ని డిమాండ్ చేశారు.
అయితే, వాస్తవం చెప్పాలంటే, పారికర్ తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. మే 26న చేసిన మరో ప్రకట నలో, ‘భారత్‌ను కాపాడేందుకు ఎంతవరకైనా తాను తెగిస్తా ననీ, దేశంపై దాడి చేసేవాళ్ల పని పడతాననీ’ ఆయన దుస్సాహసిక ప్రకటన చేశారు.
భారత రక్షణమంత్రి ప్రకటనను పాకిస్తాన్ అంది పుచ్చుకుంది. బలూచిస్తాన్ ఘర్షణల్లో భారత్ జోక్యం చేసు కుంటోందని, తమ దేశానికి వ్యతిరేకంగా ప్రతిచోటా హిం సాత్మక చర్యలకు మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ వెంటనే ఆరోపణకు దిగింది. పారికర్ చేసిన ఈ తరహా ప్రకటన వల్ల కాస్సేపు చప్పట్లు వినిపిస్తాయి కానీ దీర్ఘకాలంలో ఇది మన దేశానికి నష్టం కలిగిస్తుందని బీజేపీ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికీ స్పష్టమయ్యే ఉంటుంది. పాకిస్తానీ బోటును కూల్చి వేశామంటూ గతంలో భారతీయ నావికాధికారి ప్రకటించి ఇదే తప్పు చేశారు. ఇది సమస్యాత్మకంగా మారటం కూడా మనం కొన్ని నెలల క్రితం చూశాం.
నా అభిప్రాయం ప్రకారం, మంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన రెండు ప్రతిజ్ఞలను పారికర్ అతిక్రమించారు. ‘రాజ్యాంగబద్ధంగా, శాసనానికి అను గుణంగా పనిచేస్తాన’ని చేసిన ప్రమాణాన్ని, ఉగ్రవాదులను ఉపయోగించుకుంటామంటూ మంత్రి చేసిన ప్రకటన ఉల్లంఘించింది. మంత్రి చేసిన మరొక ప్రతిజ్ఞ గోప్యతకు సంబంధించింది. అంతర్జాతీయ చట్టం అస్పష్టంగా, అనిశ్చి తంగా ఉంటుంది కనుక అన్ని ప్రభుత్వాలూ గోప్యత విష యంలో జిత్తులమారితనాన్ని ప్రదర్శిస్తాయి కానీ కొంత మంది మంత్రులు దాన్ని అతిశయించి చెబుతుంటారు.
‘నా విధులను నెరవేరుస్తున్నప్పుడు అవసరమైతే తప్ప నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను’ అంటూ పారికర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధమైన గోప్యతకు కట్టుబడ్డారు. కానీ, ‘ఉగ్రవా దులను ఉపయోగించుకుంటాం’ అంటూ ఇప్పుడాయన చేసిన ప్రకటన ద్వారా నిజంగానే ప్రభుత్వ విధానాన్ని బహి ర్గతం చేయాలనుకున్నట్లయితే, అది తన విధులను నేర వేర్చడంలో భాగంగా ప్రకటించినట్లు కాదు.
భారత్ తక్కువ వనరులు ఉన్న పేదదేశమని పారికర్ అంగీకరిస్తున్నారు. తమకు కూడా సమానంగా పింఛన్లను ఇవ్వాలని రిటైరైన సైనికులు డిమాండ్ చేసినప్పుడు అలా చేయడం ద్వారా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు తెలీవు అంటూ పారికర్ పేర్కొన్నారు.
రక్షణమంత్రి పర్యవేక్షణలో భారతీయ వాయుసేన ముందుగా ప్రతిపాదించినటు,్ల 126 రాఫెల్ యుద్ధ విమా నాలను కాకుండా 36 విమానాలను మాత్రమే కొత్తగా కొన బోతోంది. ఈ తగ్గింపుకు అనేక కారణాలుండవచ్చు కానీ వాటిలో బడ్జెట్ అతి కీలకమైనది. ప్రభుత్వం ఏర్పాటు చేయ దలిచిన పర్వత యుద్ధతంత్ర విభాగాన్ని 80 వేలమందితో కాకుండా 35 వేల బలగాలకే కుదించాలని మంత్రి నిర్ణయించారు. ఇంతటి భారీ పథకాల అమలుకోసం డబ్బు ఎక్కడినుంచి వస్తుంది అంటూ మంత్రి ప్రశ్నించారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంది కూడా. ఉగ్రవా దులను ఉపయోగించుకోవడంపై బడాయి పోయినట్లుగా కాకుండా మంత్రి ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడటాన్ని మర్చిపోకుండానే బడిత కర్రను పట్టుకోవడంపైనే తన సమ యాన్ని, శక్తినీ వెచ్చించడంపై దృష్టి పెడితే బాగుంటుంది.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com)
ఆకార్ పటేల్