ఖలీస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై కెనడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా సిక్కు వేర్పాటువాదీ హత్య వెనుక భారత ప్రధాని మోదీతోపాటు అమిత్ షా, విదేశాంగమంత్రి, పలువురు ప్రముఖుల హస్తం ఉందంటూ కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్ అండ్ మెయిల్' ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం సంచలనంగా మారింది.. కెనడాలో నివసిస్తున్న మరికొందరు వేర్పాటువాదులను కూడా నిర్మూలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు పేర్కొంది.
అయితే ఆ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. కెనడా అర్థంలేని ఆరోపణలు చేస్తుందని, ఇటువంటి హాస్యాస్పదమైన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. దీంతో కెనడా తాజాగా వెనక్కి తగ్గింది. ఆ కథనాలు ఊహజనితమైనవని, అవాస్తవమని తెలిపింది. ఈ మేరకు జస్టిన్ ట్రూడో జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్ సలహాదారు నథాలీ జి డ్రౌయిన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్న వేళ అక్టోబరు 14న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు, అధికారులు అసాధారణ చర్య చేపట్టారు. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు కెనడా గడ్డపై పాల్పడుతున్న నేర కార్యకలాపాలకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ నేర కార్యకలాపాలకు భారత ప్రధాని మోదీ, ఆ దేశ విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సంబంధం ఉన్నట్లు కెనడా ప్రభుత్వం ఎన్నడూ పేర్కొనలేదు. దీని సాక్ష్యాధారాల గురించి కూడా తెలియదు. దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైనా అవన్నీ ఊహాజనితం.. అవాస్తవమైనవే’’ అని కెనడా సర్కారు తమ ప్రకటనలో వెల్లడించారు.
కాగా నిజ్జర్ హత్యగురించికెనడా ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తాపత్రికలో ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. నిజ్జర్ హత్యకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కుట్ర పన్నారని, ఈ విషయాన్ని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారం ఇచ్చారని కెనడా జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.
దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. అవన్నీ హాస్యాస్పద వార్తలనేనని ఖండించింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజారుస్తాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ గురువారం పేర్కొన్నారు. . ఈ క్రమంలోనే కెనడా తాజాగా ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment