
భూముల చోరీలో మనమూ భాగస్వాములమే
అభివృద్ధి కోసం సొంత ఫ్లాట్ ఇచ్చేసేవారు మనలో ఎవరున్నారు? మనలాగే తమ నివాసాలను వదులుకోడానికి ఇష్టపడని బలహీనులు అన్ని త్యాగాలూ చేయాలని మనం పట్టుబడతాం. ప్రభుత్వ వ్యతిరేక హింస తలెత్తితే ఏమిటిది? అని కలవరపడిపోతాం. ఆదివాసుల భూముల దొంగతనం మాటునే ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. మధ్యతరగతికి చెందిన మనం ఈ దొంగతనంలో పూర్తి భాగస్వాములం.
ముంబై పొద్దర్ రోడ్లో లతా మంగేష్కర్ నివాస భవనం ఉంది. దాని ముందు ఫ్లైఓవర్‌ను నిర్మించేట్టయితే దేశాన్నే విడిచిపోతానని పదేళ్ల క్రితం, 2006లో లత ప్రకటించారు. మొదట ఆమె ఆ నిర్మాణం వల్ల తన గొంతు చెడి పోతుందన్నారు. ఆ తర్వాత ‘‘ఆ రోడ్డు మీద డ్రిల్లింగ్ జరిగితే పలు భవనాల పునాదులు కదిలిపోతాయ’’న్నారు.
ఇంతకూ ఆ ఫ్లైఓవర్‌ను నిర్మించలేదనుకోండి. మన దేశంలో బొగ్గు గనుల తవ్వకాన్ని గురించి ఈ వారం నాకో కొత్త విషయం తెలిసింది. దాన్ని మీ ముందుంచుతాను. అభివృద్ధి అనే బృహత్ కార్యక్రమాన్ని మనం ఎంత న్యాయంగా చేపడుతున్నామనే దానికి చెందిన ఒకటి, రెండు అంశాలు చెబుతాను.
బొగ్గు గనుల కోసం భూసేకరణపై నివేదికను రూపొందించే పనిలో ఉన్న నా సహోద్యోగి అరుణా చంద్రశేఖర్ ద్వారా అవి తెలిశాయి. ముందుగా దేశంలోని గనుల తవ్వకాన్ని నియంత్రించే చట్టాలనూ, భారత పౌరుల ఆస్తు లను, హక్కులను పరిరక్షించే చట్టాలనూ చూద్దాం.
భూసేకరణలో న్యాయమైన పరిహారం, పునరావాసం, పునఃస్థాపన, పారదర్శకతల హక్కు చట్టాన్ని (భూసేకరణ చట్టం) 2014లో చేశారు. ఆ చట్టాన్ని అనుసరించి పునఃస్థాపనకు ‘‘భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే కుటుంబాల ఆమోదం అవసరం. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు లకైతే 70 శాతం, ప్రైవేటు ప్రాజెక్టులకైతే 80 శాతం కుటుంబాలు అందుకు ఆమోదం తెలపాలి.’’
అది సమంజసమనే అనిపిస్తోంది.‘‘షెడ్యూల్డ్ ప్రాంతాలలో సంబంధిత గ్రామ సభల ముందస్తు ఆమోదం అవసరమనే ఏర్పాటు కూడా ఆ చట్టంలో ఉంది.’’ దీనికి తోడు ‘‘సామాజిక ప్రభావ అంచనా’’ కూడా అవసరం. అంటే ప్రభావిత ప్రజా సమూహాలతో సంప్రదింపులు జరిపి... భూసేకరణ వల్ల ప్రజల భూములపైన, జీవనోపాధులపైన కలిగే ప్రభావాన్ని, ఆర్థిక, సామా జిక, రాజకీయ, సాంస్కృతిక పర్యవసానాలను మదింపు చేయడం.
ఇది సమంజసమైనదేనని మీరు అనుకునేట్టయితే... బొగ్గు గనుల తవ్వకం కోసం తీసుకునే భూములకు ఈ చట్టం వర్తించదని కూడా మీకు తెలియడం అవసరం. బొగ్గు గనుల విషయంలో నిర్దిష్టంగా భూయజమానులతో సంప్ర దించడమనేదే లేదు. భూములు తీసుకోడానికి ముందు వారి ఆమోదం అవసరం లేదు. ఇక ప్రభావ అంచనా అనే ప్రశ్నే లేదు.
లతా మంగేష్కర్ తెలిపిన అభ్యంతరం గురించి తెలిసిన పాఠకులకు... బొగ్గు గనుల కోసం భూసేకరణ వల్ల కలిగే ప్రభావంపై చంద్రశేఖర్ జరిపిన పరిశీలనలోని ఒక చిన్న అంశాన్ని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. తవ్వకం జరిగే ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య స్కూళ్లను మూసేస్తారు. స్కూలు భవనాలు కంపించిపోయేంత పెద్దగా ఆ పేలుళ్ల శబ్దాలు వినవస్తుంటాయి!
ఇక షెడ్యూల్డ్ తెగలు, తదితర సంప్రదాయక అటవీవాసుల (అటవీ హక్కుల) చట్టానికి వద్దాం. ఈ చట్టం,‘‘అటవీ వాసులైన షెడ్యూల్డ్ తెగలకు, ఇతర సంప్రదాయక అటవీవాసులకు భూమి తదితర వనరులపై ఉండే హక్కులను గుర్తిస్తుంది. ఈ సమూహాల సభ్యులు తాము ఆధారపడి ఉన్న అటవీ భూమిపైన లేదా సాగుయోగ్యం చేసుకున్న భూమిపైన హక్కులను కోరవచ్చు. సమూహాలు తమ సమష్టి ఆస్తులుగా ఉన్న సమాజ లేదా గ్రామ అడవులు, మత, సాంస్కృతిక స్థలాలు, నీటి వనరులపై సైతం హక్కులను కోరవచ్చు.’’
అటవీ భూములపై హక్కులు ఎవరివని నిర్ణయించడంలో గ్రామ సభలు తప్పక కీలక పాత్ర వహించాలని చట్టం చెబుతుంది.
అంతా బాగుందని అనిపిస్తోంది కదా? దురదృష్టవశాత్తూ ఈ చట్టాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆదివాసీ వ్యవహారాల శాఖే చెబుతోంది. షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీల విస్తరణ చట్టం కూడా భూసేకరణను నియంత్రి స్తుంది. దానినే పీఈఎస్‌ఏ అని కూడా అంటారు. ఈ చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరపడానికి ముందు, అలాంటి ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యే ప్రజల పునరావాసం, పునఃస్థాప నల కంటే ముందు పంచాయతీలను సంప్రదించడం అవసరం. చట్టం ప్రకారం సామాజిక ప్రభావ అంచనాలు అవసరమనే అంశాన్ని ‘‘దాదాపు ఎన్నడూ పాటించరు’’ అని చంద్రశేఖర్ అంటారు. ఆ మదింపు కచ్చితత్వాన్ని లేదా పరిపూర్ణతను అంచనా కట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేకపోవడం కూడా అందుకు ఒక కారణం.
ప్రభుత్వం సక్రమంగా పాటించి, అమలుచేసే చట్టం ఏదైనా ఉందంటే, అది భూములను లాక్కోవడాన్ని అనుమతించే బొగ్గు నిక్షేపాల ప్రాంత చట్టం.
ఈ చట్టాన్ని అనుసరించి భూసేకరణ గురించి ప్రభుత్వం గెజిట్‌లో ఒక ప్రకటన ఇస్తుంది (చివరిసారిగా మీరు ప్రభుత్వ గెజిట్‌ను ఎప్పుడు చదివి ఉంటారు?). ఆ తర్వాత, 30 రోజులలోగా రాతపూర్వకమైన అభ్యంతరాలేవీ రాకపోతే, భూమిని ‘‘(ఎలాంటి చిక్కులూ లేకుండా) పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంచే’’ క్రమం మొదలవుతుంది.
దేశంలోని గనులలో దాదాపు మూడో వంతు కోల్ ఇండియా లిమిటెడ్ నియంత్రణలోనే ఉన్నాయి. ఆ సంస్థ విధానాలను పరిశీలించిన ఒక పార్లమెంటరీ కమిటీ... ఆదివాిసీ తెగలకు ‘‘అధికారిక గెజిట్ అందుబాటులోనే ఉండదు. కాబట్టి తమ భూములను ప్రజా ప్రయోజనాల కోసం తీసుకుంటు న్నారని వారికి తెలిసేదెలా?’’
ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనేనని నేనంటాను (అదానీ, జార్ఖండ్‌లో 200 కోట్ల డాలర్ల బొగ్గు అధారిత విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారనే వార్త ఫిబ్రవరి 6న వెలువడింది). ఆదివాసుల భూముల దొంగతనం మాటునే ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. మధ్య తరగతికి చెందిన మనం ఈ దొంగతనంలో పూర్తి భాగస్వాములం.
అభివృద్ధి కోసం సొంత ఫ్లాట్ ఇచ్చేసేవారు మనలో ఎవరున్నారు? మన వర్గ ప్రముఖులైతే అత్యంత అవసరమైన ఫ్లైఓవర్‌ను సైతం వద్దని వీటో చేయగలరు. మనలాగే తమ నివాసాలను వదులుకోడానికి ఇష్టపడని బలహీ నులైన ఇతరులు మనకు బదులుగా అన్ని త్యాగాలనూ చేయాలని మనం పట్టుబడతాం. ప్రభుత్వ వ్యతిరేక హింస తలెత్తితే ఏమిటిది? అని కలవర పడిపోతాం.
భూములు లాక్కోవడం గురించిన ఈ నగ్న సత్యం తెలియడంతోనే ‘‘మావోయిస్టు’’, ‘‘అభివృద్ధి’’ వంటి పదాలకు పూర్తి భిన్నమైన అర్థాలు స్ఫురిస్తాయి.
ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com