అమెరికాలో పండనున్న ‘పటేళ్ల’ పంట
అమెరికాలో అత్యంత విజయవంతమైన సామాజికవర్గాలలో గుజరాత్‌కు చెందిన పటేల్ కమ్యూనిటీ ఒకటి. ఆ దేశంలోని మొత్తం మోటల్స్ (హోటళ్లు)లో సగం వరకు వీళ్లే నిర్వహిస్తున్నారు. 20వ శతాబ్దికి ముందు ఎలాంటి వ్యాపార చరిత్ర లేని పటేళ్లు పరదేశంలో హోటల్ రంగంలో పూర్తి ఆధిపత్యం చలాయించడమే ఒక విశేషం. ఇప్పుడు అమెరికా వలస విధానంపై ఆ దేశాధ్యక్షుడు ఒబామా జారీ చేసిన తాజా డిక్రీ పటేళ్ల పంట పండించనుంది.
దాదాపు 30 ఏళ్ల క్రితం నేను పాఠశా లలో చదువుతున్నప్పుడు నా స్నేహితుడు అమెరికాకు వెళ్లేందుకు వీసాకోసం దర ఖాస్తు చేస్తూ తన చివరి పేరును మార్చు కున్నాడు. అతడు పటేల్. అదే పేరుతో దరఖాస్తు చేసినట్లయితే తన వీసాను తిరస్కరించే అవకాశం ఖచ్చితంగా ఉం దని అతడు భావించాడు. అది నిజమో కాదో నాకయితే తెలీదు (నేను కూడా 16 సంవత్సరాల వయసులోనే దరఖాస్తు చేసి వీసా పొందాను). కానీ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న పటేళ్లు అప్పటికే చాలామంది ఉండేవారన్న మాట నిజం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా అమెరికా వలస విధానంలో ప్రకటించిన మార్పు అమెరికాలోని అక్రమ వలస దారులకు ప్రత్యేకించి 5 లక్షల మంది భారతీయుల ప్రతిపత్తిని చట్ట బద్ధం చేయనుంది. వీరిలో చాలామంది గుజరాత్‌కి చెందిన పటేల్ సామాజిక వర్గానికి చెందినవారే.
వలసవిధానంలో మార్పుచేస్తూ ఒబామా ఇచ్చిన ఆదేశం 41 లక్షలమంది అమెరికా సంతతి పిల్లల తల్లిదండ్రులకు, ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన 3 లక్షల మంది పిల్లలకు వరంగా మారిందని మీడియా సమాచారం. అమెరికాలో నివసిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న నిపుణత కలిగిన వలస ఉద్యోగులు, పట్టభద్రులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సదవకా శాన్ని కల్పిస్తూ ఒబామా వలస విధానంలో విస్తృత మార్పులను ప్రకటించారు. అమెరికాను ఇతర ప్రపంచ దేశాల కంటే ముందు నిలపడంలో మరింత పారదర్శకతతో వ్యవహరించడానికి ఇది వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.
గత సంవత్సరం ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం అమెరికాలో 1.5 లక్షల మంది పటేళ్లు ఉన్నారని అంచనా. అయితే చాలామంది పటేళ్లు తమ చివరి పేర్లకు అమిన్ వంటి పేర్లను ఉపయోగిస్తున్నం దున వీరి సంఖ్య 2 లక్షల వరకు ఉండవచ్చు. అమెరికాలో ఉన్న పటేల్ వర్గీయులలో చాలామంది చట్టబద్ధంగా వచ్చినవారే. అమెరికాలో అత్యంత విజయవంతమైన సామాజిక వర్గాలలో వీరిదీ ఒకటి.
అమెరికాలోని మొత్తం మోటల్స్ (హోటళ్లు) లో సగం వరకు భారతీయులు.. అందులోనూ పటేల్ సామాజికవర్గమే నిర్వహిస్తోం దని 1999లో తుంకు వరదరాజన్ అనే విలేకరి న్యూయార్క్ టైమ్స్‌లో రాశారు. పటేళ్లు ఎవరంటే, ‘వైశ్యులు లేదా వర్తకులు. అరేబియన్ సముద్రం పక్కన ఉండే భారతీయ రాష్ట్రం గుజరాత్‌లో మధ్యయుగాల్లో రాజులకు చెల్లించవలసిన పదో వంతు పన్నును లెక్కించడానికి వీరిని నియమించేవారు. వీరి మూలం గుజరాత్. వీరి రక్తంలోనే వ్యాపారం నిండి ఉంటుందని భారతీయులలో చాలా మంది ప్రజల నమ్మకం. పటేళ్లు కూడా దీన్ని నమ్ముతున్నట్లే కనిపిస్తారు’ అని ఆ విలేకరి రాశారు. ఇది నిజం కాదు. స్వయంగా పటేల్ వర్గీయులే నమ్మేసేటంత స్థాయిలో వారు తమ గురించి తాము తారస్థాయిలో ప్రచారం చేసుకున్నట్లు చెప్పుకునే కల్పనాగాథల నుండి ఇవి పుట్టుకొచ్చాయి. వాస్తవానికి పటేళ్లు కూడా పాటిల్, రెడ్లు, యాదవులు, గౌడలు, జాట్‌లు వంటి ఇతర రైతాంగ కులాల్లో భాగమైన రైతులు. నాలుగు కిందిస్థాయి సవర్ణులు లేదా గుర్తింపు పొందిన కులాల నుండి వీరు వచ్చారు. మనుస్మృతిలో వీరిని శూద్రులుగా పేర్కొన్నారు.
అయితే పటేళ్లు ఈ నాలుగు సామాజిక బృందాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటారు. ఎందుకంటే వీరు శాకాహారులు, పైగా వీరు వ్యాపారంవైపు మొగ్గు చూపారు. అయితే వీరికి వ్యాపారం ఒక వారసత్వంగా రాలేదు. 20వ శతాబ్దికి ముందు వీరికి ఎలాంటి వ్యాపార చరిత్రా లేదు. కానీ జైన్ వ్యాపారుల ఆధిపత్యంలో ఉన్న గుజరాత్‌లో వ్యాపార సంప్రదాయాన్ని వీరు పుణికిపుచ్చుకున్నారు.
అయితే పటేళ్లు హార్డ్‌వేర్ స్టోర్లు, పెట్ షాపులు, ఔషధ విక్రయ సంస్థలలో ప్రవేశించకుండా మోటల్స్‌లో తమ అదృష్టాన్ని ఎందుకు చూసుకున్నారు అనే అంశాన్ని న్యూయార్క్ టైమ్స్ రచయిత వరద రాజన్ సరిగా అర్థం చేసుకోలేకపోయారు.
ఒక కారణం ఏదంటే మోటల్స్ వ్యాపార స్థాయి విభిన్నమైనది. పైగా మోటల్స్‌ను విస్తరించుకోవచ్చు. రెండో కారణం ఏమిటంటే మోటల్స్ వ్యాపారం పటేళ్లకు ద్వంద్వ గుర్తింపును తెచ్చిపెడుతుంది. మోటల్స్ కౌంటర్ నుంచి వీరు అమెరికాతో వ్యవహరిస్తారు. కౌం టర్ వెనుక కిచెన్‌లో కధీ-బాత్ (గుజరాత్ ఆహారం) వంట వండ టం, టెలివిజన్లలో రామాయణం, బాలీవుడ్ సినిమాలను చూడటం ద్వారా వీరు అమెరికాలోనే భారత్‌ను పునఃసృష్టి చేయగలరు. మోటల్ వ్యాపారం మేధస్సు కంటే కష్టపడటం అవసరమైన వ్యాపారం. పటేళ్లు దాన్నే కోరుకున్నారు.
అందుకనే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న పటేల్ సైతం ఆ దేశానికి సంపద లాంటి వాడు. ఎందుకంటే అతడు తనకు, తన కమ్యూనిటీకి కట్టుబడి ఉంటాడు తప్పితే దేశానికి అతడు ఉపద్రవం, కంటకం కాదు.
పైగా, పాశ్చాత్య ప్రపంచంలో భారతీయ వలస ప్రజలకు పాకిస్థానీయులు, బంగ్లాదేశీయుల కంటే మించిన మంచి పేరుంది. దీనికి ఒక కారణం ఏమిటంటే సాధారణంగా వలస భారతీయులు ఉన్నత సామాజికవర్గానికి సంబంధించిన వారై ఉండటం. పైగా అన్ని అర్హతలూ కలిగిన వృత్తి జీవుల్లా కనిపిస్తారు. మరొక కారణం ఏమిటంటే ప్రత్యేకించి యూరప్‌లోని పాకిస్థానీ, బంగ్లాదేశీ వలస దారులలో చాలామంది తీవ్ర మతాభినివేశం కలిగి ఉన్నారు.
వీరు అరబ్ బృందాలతో జత కట్టారు. దీంతో వీరు హానికరంగా తయారయ్యారు. వీరిలో నిరుద్యోగం పరాకాష్టకు చేరింది. దీంతో పాకిస్థానీ, బంగ్లాదేశీ వలసదారులను ఆతిథ్య దేశం లేదా ఖండం ఒక ఉపద్రవంగా చూస్తోంది. నా పాకిస్థానీ మిత్రుడొకరు ఇటీవల ఒక విషయం చెప్పారు. ప్రత్యేకించి అమెరికాలో ఉన్న కొంతమంది పాకిస్థానీయులు ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్థాన్‌తో ముడిపడి ఉంటే వచ్చే సమస్యలనుండి తప్పించుకోవడం కోసం ఫక్తు భారతీయుల్లా వ్యవహరిస్తున్నారట.
మరోవైపున యూరప్‌లోని ఉపఖండ రెస్టారెంట్లలో చాలా వాటిని బంగ్లాదేశీయులు సమర్థవంతంగా నడుపుతున్నారు కానీ ఇవి ఇండియన్ రెస్టారెంట్లుగా గుర్తింపు పొందాయి. బంగ్లాదేశ్ అంటే ఎక్కడుంది, వాళ్లెవరు అనే పరిజ్ఞానం లేకపోవడం వల్ల కావచ్చు.. యూరప్‌లో ఇండియన్ బ్రాండ్ మరింత ఆకర్షణీయంగా మారింది. మూడో కారణం ఏమిటంటే భారతీయ ఆహారంగా పశ్చిమ దేశాలకు పరిచితమైనది బెంగాలీ ఆహారమే. ఈ నేపథ్యంలో అమెరికా వలస విధానంపై ఒబామా జారీ చేసిన తాజా డిక్రీ మూడు ఉపఖండ బృందాలకూ దోహదపడు తుంది కానీ, భారతీయులు ప్రత్యేకించి పటేళ్లకే ఇది ఎక్కువగా ఉపకరిస్తుంది. పటేల్ కమ్యూనిటీకి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు కూడా ఇది మంగళకరమైన వార్తే.
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
- ఆకార్ పటేల్