నినాదాలపై నిఘా సరే... ఆకలికేకల మాటో..? | avalokanam by aakar patel | Sakshi
Sakshi News home page

నినాదాలపై నిఘా సరే... ఆకలికేకల మాటో..?

Published Sun, Mar 13 2016 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

నినాదాలపై నిఘా సరే... ఆకలికేకల మాటో..?

నినాదాలపై నిఘా సరే... ఆకలికేకల మాటో..?

అవలోకనం
ఆంగ్లీకరణకు గురైన మధ్యతరగతిలోని మనం.. భారతదేశంలోని మెజారిటీ ప్రజల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోం. మన బాధలు, ఆరాటాలు, ఆదుర్దాలను మాత్రమే చర్చించాలని తాపత్రయ పడుతుంటాం. మిగిలిన భారతీయులందరూ మనకు అసందర్భం కిందే లెక్క. ఇది జాతి వ్యతిరేకత కాకపోతే దీన్ని మరే పేరుతో పిలవాలి?

ఒక విధంగా చూస్తే భారత్ ఓ ప్రత్యేక జాతి. తమది కాని, ప్రజానీకం ఉపయోగించే భాషకు భిన్నమైన భాషలో మాట్లాడే కులీన వర్గాన్ని కలిగిన ఒకే ఒక ప్రధాన దేశం మనది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ మరే ఇతర ప్రధాన నగరం విషయంలో అయినా సరే ఇది ముమ్మాటికీ నిజం. కులీనవర్గం అంటే నా దృష్టిలో జనాభా పరంగా మైనారిటీ లో ఉన్నప్పటికీ ఆర్థిక ఎజెండాలో, జాతీయ వార్తల ఎజెండాలో ఆధిపత్యం చలాయిస్తున్న వర్గమని అర్థం. ఐదు కోట్లమంది భారతీయులకు మాత్రమే పాస్‌పోర్టులు ఉన్నాయని ప్రభుత్వ డేటా చెబుతోంది. అంటే జనాభాలో ఐదు శాతం మంది అన్నమాట. నా అంచనా ప్రకారం ఇంగ్లిష్‌ను తమ ప్రథమ భాషగా కలిగిన భారతీయుల కంటే వీరి సంఖ్య ఎక్కువన్నమాట. వీరు తమ ‘మాతృభాష’లో అంటే హిందీ, గుజ రాతీ, తమిళం, మరాఠీ, తెలుగు, ఒరియా, కన్నడ వంటి భాషల్లో మాట్లాడగలు గుతూ ఉండొచ్చు కానీ అంత బాగా మాట్లాడలేరు. అక్షరాలను చదవొచ్చు కానీ వీరు ఈ ‘మాతృభాష’లో సాహిత్యం లేదా వార్తలను చదవలేరు. టీవీ సీరియళ్లు, సినిమా వంటి  వాటిలో సంగీతం కోసం తప్పితే, వీరి సాంస్కృతిక ప్రాధాన్యత ఇంగ్లిష్‌లోని విషయంపైనే మొగ్గుచూపుతుంటుంది.

భారతీయులు సాధ్యమైనంత ఎక్కువగా ఇంగ్లిష్ మాట్లాడుతూ, రాస్తుంటా రని, అందుకే ఇప్పుడు ఇంగ్లిష్‌ని భారతీయ భాషగా గుర్తిస్తున్నారని చెబుతున్నారు. దీన్ని నేను షరతులతో ఒప్పుకుంటూనే, మన టీవీ చానళ్లలో మాట్లాడు తున్న, మన మీడియాలో రాస్తున్న ఇంగ్లిష్ అసలైన భాషకు ముతక రూపం మాత్ర మేనని చెప్పదలిచాను. మరి ఈ రకమైన ఇంగ్లిష్ ఆధిక్యత మనల్ని ఏయే రూపాల్లో ప్రభావితం చేస్తోంది?

మొదటి అంశం ఏమిటంటే, పట్టణ మధ్యతరగతి ప్రజల ఆరాటాలను, ఆదుర్దాలను జాతీయ ప్రాధమ్యాలుగా ముందుపీటిని ఉంచడం. పోషకాహార లోపం వల్ల దేశంలో సంభవిస్తున్న మరణాల కంటే విద్యార్థుల నినాదాలకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టడానికి మన మీడియా అమితాసక్తి చూపు తోంది. జాతి వ్యతిరేక నినాదాల వల్ల ఎంతమంది భారతీయులు నేరుగా ప్రభావి తులవుతున్నారో అస్పష్టమే. ఆ నినాదాల వల్ల దేశభక్తిపరులుగా మనం విచారం వ్యక్తం చేసి ఉండొచ్చు. కాని ఆ నినాదాలు మాటలు మాత్రమే. అదే సమయంలో ఒక సంవత్సరంలో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతి ఏటా దేశంలో పోషకాహార లోపం వల్ల 5 లక్షల మంది భారతీయ పిల్లలు విషాద మరణాలకు గురవుతు న్నారు. కానీ టీవీల్లో ఆగ్రహావేశాలతో కూడిన చర్చకు తగిన విషయంగా ఈ మరణాలకు చోటు లభించడం లేదు. ఎందుకంటే ఈ మరణాలు ఇంగ్లిష్ మాట్లాడే మధ్యతరగతిని ఏమాత్రం ప్రభావితం చేయవు.

దీనివల్లే మన ఆర్థిక ప్రాధాన్యతలు వక్రీకరణకు గురవుతున్నాయి. జాతీయ వాద మధ్యతరగతిపైనే మీడియా దృష్టి పెడుతోంది కాబట్టి మనం లక్ష కోట్ల విలు వైన బుల్లెట్ ట్రైన్‌పైనే తీవ్రంగా చర్చిస్తుంటాము. దేశంలో 30 కోట్లమంది ప్రజలు హీనావస్థలో కాకున్నా భయంకరమైన దారిద్య్ర పరిస్థితుల్లో ఉంటున్న విషయం మన కంటికి ఆనదు. దీనికి కారణం చాలా సాధారణమైనది. భారత్‌లో పేదలకు తమదైన వాణి లేదంతే. మన దేశంలో రాజకీయాలు ఈ మధ్యతరగతి తోనే తీవ్ర వైపరీత్యంతో ప్రభావితం అవుతున్నాయి. ప్రతి సంవత్సరం, కశ్మీరీ వేర్పాటు వాదం లేదా ఇస్లామిక్ ఉగ్రదాడుల కంటే ఎక్కువగా ఈశాన్య భారత్ లేదా మధ్య భారత్‌లోని తీవ్రవాదుల దాడుల్లోనే భారతీయులు అధికంగా చనిపోతున్నారు. దీనికి సంబంధించిన డేటా చాలా స్పష్టంగా ఉంది.

కాని మన పట్టణ మధ్య తరగ తి ఆదుర్దాను ప్రతిఫలిస్తుంది కాబట్టే మీడియాలో ఇస్లామిక్ ప్రమాదంపై పదే పదే చర్చలు జరుగుతుంటాయి. అదే సమయంలో మావోయిస్టు తీవ్రవాదం, ఈశాన్య భారత్‌లోని వేర్పాటువాదం వీరిని అంతగా ప్రభావితం చేయదనుకోండి. ఇందు వల్లే పాకిస్తాన్‌కు ఎదురొడ్డుతున్న మన సైనికులు ప్రమాదవశాత్తూ చనిపోయినా వారిని హీరోలుగా చూపిస్తుంటాం. సౌరవ్ కాలియా నుంచి హనుమంతప్ప వరకు సరిహద్దుల్లో చనిపోతున్న పలువురి సైనికుల పేర్లు మధ్యతరగతి భారతీయులకు సుపరిచితమే కానీ ఈశాన్య భారత్‌లో లేదా ఛత్తీస్‌గఢ్‌లో నేలకొరిగిన ఒక పోలీసు లేదా పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్న వారి పేర్లు చెప్పాలంటే మన మధ్య తరగతి తల్లకిందులైపోతుంటుంది.

 వందలాది భారతీయులు బోట్లు తల్లకిందులై, ఆలయాల్లో తొక్కిసలాటకు గురైన ఘటనల్లో మరణించడం గురించి మన పత్రికలు నిత్యం నివేదిస్తూనే ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో యాదృచ్ఛికంగా విషాహారాన్ని ఆరగించి పిల్లలు మరణించడంపై, నేత్ర చికిత్స శిబిరాల్లో చూపు కోల్పోయిన అంధులపై, కల్తీ సారా వల్ల చూపు కోల్పోతున్న, చనిపోతున్న వారిపై మనం వార్తలు చూస్తూనే ఉంటాం. కాని విద్యార్థుల నినాదాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇలాంటి ఘటనలపై టీవీ చర్చలో లభించదు. కులీనవర్గానికి చెందిన ఒక మహిళ హత్యకు (షీనా బోరా కేసులోవలే) ఇస్తున్న కవరేజితో దీన్ని పోల్చి చూడాలని నేను సూచిస్తున్నాను. ఆంగ్లీకరణకు గురైన మధ్యతరగతిలోని మనం భారతదేశంలోని మెజారిటీ ప్రజల సమస్యలను పట్టించుకోం. మన బాధలు, ఆదుర్దాలను మాత్రమే చర్చించాలని మనం తాపత్రయపడుతుంటాం. మిగిలిన భారతీయులందరూ మనకు అసంద ర్భం కిందే లెక్క. ఇది జాతి వ్యతిరేకత కాకపోతే దీన్ని మరే పేరుతో పిలవాలి?

ఇంగ్లిష్ ఆధిపత్యంకి సంబంధించి మరొక అంశాన్ని చూద్దాం. యూరప్ శాస్త్రీయ సంస్కృతిలోకి భారత మధ్యతరగతి చాలా తక్కువగా చొచ్చుకుపో యింది. మనం జనరంజకమైన వాటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటాం. యూరప్ శాస్త్రీయ సంగీతాన్ని, దాని ఏకస్వరమేళనను అర్థం చేసుకోనిదే యూరప్ సంస్కృతి గురించి అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. భారత్‌లో ఏక స్వర మేళన సంప్రదాయం లేదు. అంటే ఏకకాలంలో రెండు స్వరాలను ఆలపిస్తుం టాం. శాస్త్రీయ సింఫనీ కచ్చేరీని చూస్తున్నవారు ఆ కచ్చేరీలో హీరో లేకపోవడాన్ని గుర్తిస్తారు. సింఫనీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కండక్టర్ (నిర్వాహకుడు) అంటారు. ఈ నిర్వాహకుడు కనీసం ఒక పరికరాన్ని కూడా వాయించరు. తను సమయాన్ని మాత్రమే నిర్వహిస్తుంటారు. సింఫనీలో సంగీతకారులందరూ సమానమే. అదే హిందూస్తానీ లేదా కర్ణాటక సంగీత కచ్చేరీలో అంతరాల వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంటుంది.

యూరప్ సమాజానికి ఈ సాంస్కృతిక సమానత్వం, ఏకస్వరమేళనకు ఉన్న సంబంధం ఏమిటి? నిజమైన టీమ్ క్రీడగా చెబుతున్న ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో వారిని ఉత్తమ జట్లుగా నిలుపుతున్నది ఇదేనా? భారతీయులకు ఇది తెలియక పోవచ్చు. పాశ్చాత్య దేశాల్లో మన భారతీయులకు ఆసక్తికరమైన ఏకైక అంశం ఏదంటే పాప్ మ్యూజిక్, ట్వీటర్. ఇవి గాఢతను లేదా అర్థవంతమైన ఏర్పాటును కలిగి ఉండదు. ఇది సారహీనమైనది. అందుకే అనివార్యంగా అర్ధవంతమైనది కాదు.

నిజమే. ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం వల్ల భారతీయులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆర్థికపరమైనది. ఇక్కడ సైతం మధ్యతరగతికే ప్రయోజనాలు కలుగుతున్నాయి.

కానీ, మన జాతీయ సంవాదం, మన ప్రాధమ్యాలు, మన ఎజెండాకు ఇంగ్లిష్ మాట్లాడుతున్న మధ్యతరగతి కల్గించిన నష్టం తీవ్రాతితీవ్రమైంది. ఆ నష్టాన్ని పూరించడం కూడా సాధ్యం కాదు.
http://img.sakshi.net/images/cms/2016-02/51455999571_Unknown.jpg
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత  aakar.patel@icloud.com
 ఆకార్ పటేల్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement