
జేఎన్‌యూలో ప్రసంగిస్తున్న కన్హయ్య, పక్కన షెహ్లా రషీద్ (ఫైల్ ఫొటో)
అవలోకనం
కన్హయ్య, ఉమర్ ఖలీద్, గుర్‌మెహర్, షెహ్లా రషీద్ వంటి ధైర్యవంతులైన యువతీయువకులు హిందుత్వకు ఎదురు నిలుస్తున్నారు. వారేమీ తప్పు మాట్లాడటం లేదు. కశ్మీరీలతో చర్చను ప్రారంభించడంలో తప్పు ఏముంది? మనం మన ఆదివాసులు, దళితులతో చెడుగా ప్రవర్తిస్తున్నామనడంలో తప్పేముంది? అది నిజం. ‘దేశ వ్యతిరేకుల’పై మరో దఫా హింస, విద్వేషకాండ ప్రారంభమయ్యాయి. వారి అభిప్రాయాలతో ఏకీభవించినా, ఏకీభవించకున్నా మనం వారికి మద్దతు తెలపాలి, వారి తరఫున నిలవాలి.
మోదీ ప్రభుత్వ నియంత్రణలోని ఢిల్లీ పోలీసులు కన్హయ్య కుమార్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డాడని నిరూపించే ఆధారాలను చూపలేదని ఇటీవలి వార్తా నివే దికలను బట్టి తెలుస్తోంది. కన్హయ్య, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి. ఏడాదిక్రితం జాతీయస్థాయి విద్వేషానికి గురైన వ్యక్తి. అతనెవరో తెలి యనివారికోసమే ఈ వివరాలు. ఆయనపై భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నా డనే అభియోగం మోపారు. ఇంతకూ అసలు భారత వ్యతిరేక నినాదం అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. అజాదీ అనే పదానికి ఎన్నో రూపాలూ, అర్థాలూ ఉన్నా, ‘‘కశ్మీర్ కోరేది అజాదీ’’ అనే నినాదం భారత వ్యతిరేకమైనదని భావిస్తుంటారు. అది ‘దేశ వ్యతిరేకమైనదే’ అనుకున్నా దేశద్రోహం కాదు. నిర్ధి ష్టంగా హింసకు పిలుపును ఇస్తేనే ఆ వ్యక్తిపై దేశద్రోహ నేరాన్ని మోపవచ్చునని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. టేపులలో కన్హయ్య గొంతు వినరాలేదని ఇప్పుడు చెబుతున్నారు. ఈ కారణంగా అతనిపై దేశద్రోహ నేరాన్ని ఆరోపించ కూడదు, అతనిని అరెస్టు చేసి, జైలుపాలు చేసి ఉండకూడదు. ఇక కోర్టులో అత నిపై దాడి చేసిన లాయర్లది క్రిమినల్ నేరం. జేఎన్‌యూ వ్యవహారంపై కఠోరమైన వ్యాఖ్యలను ట్వీట్ చేసిన ప్రధాని, స్మృతి ఇరానీలు అతనికి క్షమాపణ చెప్పాలి.
జైలు నుంచి విడుదౖలñ నప్పుడు కన్హయ్య చేసిన ఉపన్యాసం అద్భుతమైనదని చాలా మంది అభిప్రాయం. అలా అనుకున్న వారిలో నేనూ ఒకడిని. బీజేపీకి అతను చాలా ప్రమాదకరమైనవాడు, అది అతనివైపు వేలెత్తి చూపకపోవడమే మంచిది అని నేను అప్పుడు రాశాను. అతనికి ఎదుటివారిని ఒప్పింపచేయగల భావ వ్యక్తీకరణా సామర్థ్యం ఉంది. రాహుల్ గాంధీ లాంటి నేతలు చేయలేని విధంగా అతను ప్రధాని నరేంద్ర మోదీ గంభీర పద గుంభనను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. కన్హయ్య జైలు నుంచి వచ్చాక నేను అతన్ని కలుసుకున్నాను. మా సమావేశం అతని ఉపన్యాసంలో కనిపించిన దాన్ని ధృవీకరించింది. అతను ఆకర్ష ణీయమైన వ్యక్తి. భావ గాంభీర్యంగల, ఆలోచనాయుతుడైన, నమ్రతగల యువ కుడు. అతనికి తన గురించి మాట్లాడటం నచ్చదు. సమస్యలపై లోతుగా చర్చిం చాలని కోరుకుంటాడు. అతను విడుదలైన తర్వాత బీజేపీ విద్యార్థి విభాగం అతన్నిSవిస్మరించింది, పార్టీ సైతం అతనితో వాదోపవాదాల్లోకి దిగడం కంటే దూరంగా ఉండటాన్నే ఎంచుకుని తెలివైన పని చేసింది. మీడియా తన దృష్టిని అతనిపై నిలపకుండా నిలువరించింది. ఈ విషయానికి ఇక ముగింపు పలకాలనే అతనికి వ్యతిరేకంగా ఆధారాలేవీ లేవనే వార్తను లీక్ చేసి ఉండొచ్చు.
కానీ దేశ వ్యతిరేకత సమస్య విశ్వవిద్యాలయాలలో తిరిగి తలెత్తింది. ఈసారి అమర జవాను కుమార్తె గుర్‌మెహర్ కౌర్ వంటి ఇతర యువతీయువకులు జాతీయ ప్రముఖులుగా మారారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఆమె చేసిన ప్రకటన లపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోకులు వేసి హేళన చేశారు. ఈ దేశ వ్యతిరేక చర్చలోని ఇరు పక్షాలలో ఒక పక్షం మాత్రమే హింసాత్మకమైనది, హింసను అను మతించేది. అది ప్రభుత్వమూ, ఏబీవీపీలాంటి దాని మిత్ర బృందాలే. తమ చర్య లను మీడియా, సాధారణ ప్రజానీకమూ తీవ్రంగా వ్యతిరేకిస్తారని స్పష్టంగా తెలిసి కూడా విద్యార్థులు సమస్యను ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు, తమ పైకి హింసను ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఇదే అసలు ప్రశ్న. అధిక సంఖ్యాకవాదపు, పచ్చిగూండాయిజపు భావజాలాన్ని ప్రతిఘటించడానికి నేడు భారతదేశంలో మరో వేదిక లేకపోవడమే అందుకు కారణం.
బీజేపీ, హిందుత్వ గ్రూపులు జాతీయవాద ఎజెండాను గట్టిగా ముందుకు నెడుతున్నాయి. జాతీయగీతం, జాతీయ జెండా, కశ్మీర్, మావోయిజం లేదా మైనా రిటీల హక్కులు వంటి అంశాలపై వారు మరో అభిప్రాయాన్ని సహించరు. మిగతా పార్టీలు ఈ జాతీయవాదం చర్చ నుంచి పారిపోతాయి. వ్యక్తిహక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛలకోసం నిలబడటం వల్ల కలిగే ఎన్నికలపర మైన ప్రయోజనాలేవీ లేవని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రజల మానసిక స్థితి మరింత ఎక్కువ జాతీయవాదానికి అనుకూలంగా ఉన్నదని కోర్టులు సైతం నిర్ధారణకు వచ్చినట్టుంది. సినిమా ప్రదర్శనకు ముందు జాతీయగీతాన్ని లేచి నిలబడి, వినడాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పులు దాన్నే సూచిస్తున్నాయి. మీడియా ఒక వ్యాపారం కాబట్టి అది జనాభిప్రాయానికి తలవంచక తప్పదు. వార్తా పత్రికలు వాటి సంపాదకీయ పేజీలలో అసమ్మతి అభిప్రాయాలను అనుమ తిస్తాయి. కానీ టీవీకి ఇది నిజంగానే సాధ్యం కాదు. వార్తా చానళ్లు తమ రేటింగ్స్‌ను పెంచుకోవాలంటేæ మెజారిటీతో పాటే నిలవాలి.
ప్రతిఘటనకు, అసమ్మతికి ఇక ఉన్న ఏకైక వేదిక విశ్వవిద్యాలయమే. కన్హయ్య, ఉమర్ ఖలీద్, గుర్‌మెహర్, షెహ్లా రషీద్ వంటి ధైర్యవంతులైన యువతీ యువకులు హిందుత్వకు ఎదురు నిలుస్తున్నారు. వారేమీ తప్పు మాట్లాడటం లేదు. కశ్మీరీలతో చర్చను ప్రారంభించడంలో తప్పు ఏముంది? మనం మన ఆది వాసులు, దళితులతో మనం చెడుగా ప్రవర్తిస్తున్నామనడంలో తప్పేముంది? అది నిజం.
దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ప్రవేశపెట్టిన మాజీ ఎన్నికల కమిషనర్ ఎంఎస్ గిల్‌తో మాట్లాడుతూ నేనొకసారి నేనీ విషయాన్ని ప్రస్తావించాను. ఒక విశ్వవిద్యాలయాన్ని గొప్పదిగా చేసేది ఏది? అని అడిగాను. కేంబ్రిడ్జిలో చదివిన ఆయన, ఆలోచనా స్వేచ్ఛను అనుమతించేదని చెప్పారు. ధైర్యవంతులైన మన విద్యార్థులు అడుగుతున్నది అలా ఆలోచించే హక్కునే. వారు గత ఏడాది దీన్నే కోరారు. అందుకుగానూ అప్పట్లో తిట్లూ, తన్నులూ తిన్నారు. నాడు దెయ్యంగా చిత్రించిన మనిషి చట్టవిరుద్ధమైనదేదీ చేయలేదనే వార్తను మోదీ ప్రభుత్వ పోలీ సులు చల్లగా లీకు చేశారు.
‘దేశవ్యతిరేకుల’కు వ్యతిరేకంగా మరో దఫా హింస, విద్వేషకాండ ప్రారం భమయ్యాయి. వారి అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకున్నా మనం వారికి మద్దతు తెలపాలి, వారి తరఫున నిలవాలి.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com