ఆర్థిక భావజాలం పూర్తిగా కొరవడిందా? | aakar Patel writes opinion Indian Economic ideology | Sakshi
Sakshi News home page

ఆర్థిక భావజాలం పూర్తిగా కొరవడిందా?

Published Sun, Nov 5 2017 1:47 AM | Last Updated on Sun, Nov 5 2017 1:47 AM

aakar Patel writes opinion Indian Economic ideology - Sakshi

♦ అవలోకనం
బీజేపీకి ఆర్థిక తాత్విక భావజాలం లేదని చిదంబరం అన్నారు. బీజేపీ వెబ్‌సైట్‌ మోదీ భావజాలంగా పేర్కొన్న ‘హిందుత్వ’ అంటే గోవధ, ఆలయం సమస్య, లవ్‌ జిహాద్, అడపాదడపా ఆర్థిక, విదేశాంగ విధానాలకు సంబంధించి యథాలాపంగా ఏవో చర్యలు చేపట్టడం మాత్రమే అయితే... మనం అనుకుంటున్న దానికంటే ఎక్కువ లోతైన సమస్యలో ఇరుక్కుపోయాం.

మన ప్రధానికి ఏదైనా భావజాలం అంటూ ఉన్నదా? ఆయన పార్టీ వెబ్‌సైట్‌ ఆయనది హిందుత్వ భావజాలంగా పేర్కొని, ప్రచారం చేస్తోంది. అయినా ఈ ప్రశ్న అడగడం విడ్డూరంగా అనిపించవచ్చు. మనకున్న అత్యంత వివేచనాపరు లైన రాజకీయవేత్తల్లో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఒకరు. ఆయన, ప్రధాని పార్టీౖయెన బీజేపీకి భావజాలమని చెప్పుకోదగ్గది ఏమీ లేదని అన్నారు. కాబట్టే ఈ ప్రశ్న అడగాల్సి వస్తోంది. ‘‘ప్రభుత్వం, ప్రజా సంక్షేమం, ఆరోగ్యం, విద్యా సదుపాయాలను పెంపొందింపజేసి సమానత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషిచేసేదిగా ఉండటమా? లేక పూర్తి స్వేచ్ఛా విపణి వైఖరిని చేపట్టడమా? అనే అంశంపై తీసుకునే తాత్విక వైఖరికి సంబం ధించి బీజేపీ స్థానం ఎక్కడని మీరు అనుకుంటున్నారు?’’ అని ఒక వ్యాపార దిన పత్రిక చిదంబరాన్ని అడిగింది.

జవాబు చెప్పడానికి ఇది సరళమైన ప్రశ్నేమీ కాదు. స్వేచ్ఛా విపణి వైఖరి అంటే ప్రభుత్వం ఆర్థికవ్యవస్థలో జోక్యం చేసుకోదు. ప్రతిదీ పైవేటు పాత్రధారులకే వదిలేస్తుంది. ఇంచుమించుగా దీన్ని ఆన్‌ రాండ్‌ లాంటి వారు రాసిన సమాజం వంటిదని అభివర్ణించవచ్చు. వారు చెప్పిన సమాజంలో ధీరోదాత్తులైన పెట్టుబడిదారులు తమ మధ్య పోటీ ద్వారా ప్రపం చాన్ని మరింత మెరుగైనదిగా మారుస్తారు, అసమర్థ ప్రభుత్వం అందులోకి తల దూర్చదు. విద్య, వైద్యం సహా సకల రంగాలను అది ప్రైవేటు రంగానికే వది లేస్తుంది. పౌరులు తమంతట తాముగానే ఆ అవసరాలను తీర్చుకోవాలని చేతులు దులుపుకుంటుంది. 

2014 ఎన్నికల ప్రచారంలో మోదీ అలాంటి స్వేచ్ఛా విపణి వ్యవస్థ సమర్ధ్థకు లని అనుకునేవారు. కాంగ్రెస్‌కు ‘సోషలిజం’ వైపు మొగ్గు చూపేదిగా గుర్తింపు ఉంది. స్వేచ్ఛావిపణి వ్యవస్థ దానికి భిన్నమైనది. అయితే గత మూడేళ్లుగా మహా త్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ) తదితర ‘సోష లిస్టు’ పథకాలు కొనసాగుతూనే ఉన్న మాట నిజమే. ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏను రద్దు చేస్తామని మోదీ అన్నారు. కానీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పాత్రకు సంబంధించి నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌(ఎన్‌డీఏ)కి, మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యునై టెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌(యూపీఏ)కి మధ్య తేడా ఏమీ లేనట్టే కనిపిస్తోంది.
చిదంబరం తన సమాధానంలో విసిరిన సవాలు ఇదే.‘‘బీజేపీకి తనదైన కీలక ఆర్థిక భావజాలం లేదా తాత్వికచింతన ఏదీ లేదు. హిందుత్వ, ఆధికసంఖ్యాకవాద ప్రభుత్వం మాత్రమే బీజేపీ కీలక భావజాలంగా ఉన్నాయి.

ఏ ప్రభుత్వానికైనా తనకంటూ ఓ కీలక ఆర్థిక తాత్వికత ఉండాలి. అప్పుడే అటు వామపక్షం నుంచి ఇటు మితవాదపక్షం వరకు ఉండే విభిన్న భావజాలాల వర్ణమాలికలో దాని స్థానం ఏదో తెలుస్తుంది. అది లేదు కాబట్టే అది అంతటా తారట్లాడుతోంది’’ అన్నారు ఆయన. కటువైన ఈ మాటలను ప్రత్యర్థి ఆరోపణలుగా తేలికగా తీసేయవచ్చు. కానీ నేను కాంగ్రెస్‌ ఓటర్‌ని కాను. అయినా నాకు, చిదంబరం ఈ వాదనను ఎక్క డికి తీసుకుపోతున్నారో తెలుసుకోవడం ముఖ్యమనే అనిపిస్తోంది. బీజేపీ వైఖరిని ‘‘కాంగ్రెస్‌ వైఖరితో పోల్చి చూడండి. ఈ (పైన చెప్పిన) పథకాల అమలులో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని నేనే మొదట అంగీకరిస్తాను. అయితే, కాంగ్రెస్‌ మూడు లేదా నాలుగు అంశాలను తన కీలక తాత్వికసారంగా నిర్వచించుకుంది. వాటిలో మొదటిది, ఎవరూ ఆకలితో లేదా పస్తులతో చావరాదు. అందుకే మేం ఎమ్‌జీఎన్‌ ఆర్‌ఈజీఏ, జాతీయ ఆహార భద్రతా చట్టం తెచ్చాం.’’

తమ పార్టీ కీలక భావజాలాన్ని నిర్వచించేవిగా ఆయన ఇతర అంశాలను సైతం పేర్కొన్నారు. గర్భిణులు, బాలింత తల్లులు, ఐదేళ్లలోపు పిల్లల సంక్షే మమూ, రోగనిరోధక కార్యక్రమం సహా ప్రజారోగ్యం కోసం కృషిచేయడమూ, జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం తదితరాలను ఆయన ఉదహరించారు. ఆర్థికవ్యవస్థలో ‘‘ఈ ప్రభుత్వ జోక్యాలు.. కాంగ్రెస్‌ భావజాల సారానికి సంబంధిం చిన విశ్వాసాలు, తాత్వికత’’ అని చిదంబరం అన్నారు. మోదీ దృక్పథంలో అలాంటి నిర్దిష్ట దిశ అనేది ఏదీ కనబడదని చెప్పారు. 

గోరఖ్‌పూర్‌లో 282 మంది పిల్లల మృతిని ప్రస్తావిస్తూ ‘‘అది, కేంద్ర ప్రభు త్వంపైన ప్రభావాన్ని చూపడం లేదు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపైనా ప్రభావం చూపడం లేదు. అది ఎవరి హృదయాన్నీ కదలించడం లేదు... దీపావళి రోజున వారణాసిని దీపాలతో దేదీప్యమానం చేయడం, హిందుత్వ తాత్వికతకు సంకే తంగా నిలిచే ఆలయ నిర్మాణం... వారికి శిశు/మాతా మరణాల రేటు కంటే, పోషకాహారలోపం లేదా ఆకలి కంటే ఎక్కువ ముఖ్యమైనవి.’’ బీజేపీకి, ప్రత్యే కించి మోదీకి తమ చర్యలన్నిటికీ హేతువుగా నిలిచే భావజాలం లేదా దృక్పథం అంటూ ఏదైనా నిర్దిష్టంగా ఉన్నదా? అదే అసలు ప్రశ్న. లేకపోతే చిదంబరం చెప్పినట్టు వారు చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా, స్వచ్ఛ భారత్, పెద్ద నోట్ల రద్దు, మెరుపు దాడులు, బుల్లెట్‌ ట్రైన్, స్టార్టప్‌ ఇండియా, జీఎస్‌టీ వంటి బృహత్‌ చర్యలన్నీ చర్యలన్నిటినీ ఒకదానితో మరో దాన్ని అనుసంధానించే పొంతన గల సమగ్ర భావజాల కథనం ఏదీ లేకపోవడం నిజమేనా? లేక ఇవన్నీ ఒక గొప్ప, పరిపూర్ణతలో భాగమా? లేక అవి ఒకదానితో మరోదానికి సంబంధం లేని, అర్థం లేని విడి విడి భాగాలేనా? బీజేపీ ఓటర్లు సహా మనల్ని అందరినీ వేధిస్తున్న ప్రశ్న, అందరం అడగాల్సిన ప్రశ్న ఇదే. 
 

కాంగ్రెస్, తాను కొన్ని నిర్దిష్ట సమస్యలపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయ త్నించానని చెబుతోంది. వాటి ఉద్దేశాలు మంచివే. అయినా, వాటిని అమలు చేయగల సామర్థ్యం తనకు ఉందని అది మనల్ని ఒప్పించ లేదు నిజమే. అయినా అది గత ప్రభుత్వం. ఇప్పుడు ఇక బీజేపీనే తాను ఏమి చేయాలని కోరుకుంటోంది, దాని బృహత్‌ కథనం (సమగ్ర ప్రణాళిక) ఏమిటో వివరించాల్సి ఉంది. వ్యక్తిగ తంగా నేనైతే, చిదంబరం చెప్పింది తప్పు కావాలనే కోరుకుంటాను. ఐదేళ్లలో లేదా పదేళ్లలో తాము సాధించాల్సినవి ఏమిటి? అనే విషయంపై దృష్టిని కేంద్రీ కరించి ఎన్‌డీఏ ఆలోచిస్తూ ఉండి ఉండాలని ఆశిస్తాను. మోదీ భావజాలంగా బీజేపీ వెబ్‌సైట్‌ పేర్కొన్న ‘హిందుత్వ’ అంటే గోవధ, ఆలయం సమస్య, లవ్‌ జిహాద్, వీటికి తోడుగా అడపాదడపా ఆర్థిక, విదేశాంగ విధానాలకు సంబంధించి యథాలాపంగా ఏవో చర్యలు చేపట్టడం మాత్రమే అయితే... మనం అనుకుం టున్న దానికంటే ఎక్కువ లోతైన సమస్యలో ఇరుక్కుపోయాం.


ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత 
aakar.patel@icloud.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement