
‘రద్దు’ బాధితులకు దక్కేనా ఫలితం?
అవలోకనం
నల్లధనాన్ని కూడా తెల్లధనం లాగే వ్యాపార విస్తరణకు ఉపయోగిస్తారు. వస్తువులు, ఆస్తుల రూపంలో ఉంచుతారు. నగదుగా దాన్ని ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఏదేమైనా, మోదీ తన నిర్ణయాత్మక శక్తిని ఒక్కసారి మెరిపించి చూపారు. తద్వారా నగదుతోనే బతుకు వెళ్లదీసే అత్యంత దయనీయ స్థితిలోని కోట్లాది పేదలను ఒక ప్రయోగానికి వాడుకుం టున్నారు. ఇంతటి భారీ చర్య వల్ల కలిగే గందరగోళాన్ని ముందే అంచనావేసి... దాన్ని ఉపశమింపజేసి, ప్రశాంతతను నెలకొల్పడానికి అవసరమైన ప్రతిభ, శక్తిసామర్థ్యాలు ఎక్కడ?
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో తీసుకొస్తానన్న మార్పులలో రెండు అంశాలు ముఖ్యమైనవి. అవి: నిర్ణయాత్మకత, పరిపాలన. కేవలం ఈ రెండిటి వల్లనే గాక. ఆయనలోని ఇతర గుణాలను చూసి కూడా ప్రజలు ఆయనకు ఓటు వేసిన మాట నిజమే. మోదీ వంశపారంపర్యవాది కాదు. కేవలం తన ప్రతిభతోనే ఆయన నేటి స్థానానికి చేరుకోగలిగారు. నిజాయితీపరునిగా ఆయనకు పేరుంది. మన్మోహన్ సింగ్ హయాంలోలాగా నేటి కేంద్ర మంత్రివర్గంలో అత్యున్నత స్థాయి అవినీతి ఉన్నట్టు వార్తలేమీ లేవు.
అయితే ఆయనలోని నిర్ణయాత్మకత, పరిపాలన అనే ఈ రెండు లక్షణాలే ఇటీవలి రోజుల్లో బహిరంగంగా కనిపిస్తున్నాయి. అవి దేశాన్ని ఎలా ప్రభావితం చేశాయనే అంశాన్ని ఒకసారి చూద్దాం. నిర్ణయాత్మకత అంటే వేగంగానూ, దృఢంగాను నిర్ణయాలను తీసుకోగల సామర్థ్యం. తరచుగా దీన్ని ఒక సుగుణంగా చూస్తుంటారు. నిర్ణయరాహిత్యం అంటే తరచుగా దేన్నయినా జాగ్రత్తగా, క్షుణ్ణంగా ఆలోచించడానికి మరో పేరు. అయినా దాన్ని ఒక బలహీనతగా పరిగణిస్తుంటారు. భరించగల పరిమితికి మించిన అనిశ్చితి లేదా అశాంతి నెలకొన్నప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోరు. మరోవంక, నిర్ణయాత్మకతను కలిగి ఉండటాన్ని పరిపూర్ణ ఆత్మవిశ్వాసంగా చూస్తారు. అంటే లోతైన జ్ఞానంతో కంటే, తన బుద్ధికి సరైనదిగా తోచిన దానినే కచ్చితమైనదని భావించడమని అర్థం. సంజయ్ గాంధీ కూడా నిర్ణయాత్మకంగానే ఉండేవారు. అత్తెసర అక్షరాస్యుడైన (10వ తరగతి మధ్యలో మానేశారు) ఆయనకు గొప్ప అధికారాన్ని కట్టబెట్టారు. ఆయన దానిని అధ్వానంగా ప్రయోగించారు. ఆయన తలబిరుసుతనానికి, ఆత్మవిశ్వాసానికి భారత ప్రజలు ఊహింపశక్యం కానన్ని రకాల బాధలు పడ్డారు. మనందరికీ ఏది మంచో కూడా తనకే తెలుసుననే ఆత్మవిశ్వాసం ఆయనది.
ఇక రెండవది పరిపాలనా సామర్థ్యం. దానిని సైనిక చరిత్రకారులు వాడే ‘పట్టు’ అనే మరో పదంతో కూడా వర్ణించవచ్చు. ఒక జనరల్ తను నేతృత్వం వహించే వారందరిపైనా పూర్తి నియంత్రణను కలిగి ఉండే సామర్థ్యం అని దానికి అర్థం. తన పక్షానికి ఏమి సాధించగలిగే శక్తి ఉన్నదో తెలుసుకొని, అందుకు సంసిద్ధం కావడం. సమాచార సంబంధాలు అధ్వానంగానూ, సరఫరాల మార్గాలు అతి సుదీర్ఘమైనవిగానూ ఉండిన కాలంలో జాలియస్ సీజర్‌కు తన సేనలపై పూర్తి పట్టు ఉండేది, వాటిని నియంత్రించగలిగి ఉండేవాడు. యుద్ధంలో జనరల్ మాంట్‌గమిరీ సాధించినవి మిశ్రమ ఫలితాలే అయినా... ఆయనకు కూడా పట్టు ఉన్నదని భావించేవారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షాన ఉన్న చాలా మంది జనరల్స్‌లాగే ఆయనకు కూడా నాటి పరిస్థితి ఏమీ అంతుబట్టేది కాదు.
నరేంద్ర మోదీ రూ. 500, రూ.1,000 నోట్లను పనికిరానివిగా చేయడం ద్వారా తన నిర్మయాత్మకతను ప్రదర్శించారు. దీనిని నల్లధనాన్ని తుదముట్టించే లేదా దానిపై తీవ్రమైన దాడిని చేసే చర్యగా ప్రచారం చేశారు. అవినీతిపరులైన సంపన్నుల నోట్ల కట్టల దొంతరలు లేదా గోదాములలోని నగదంతా ఇక ఎందుకూ కొరగాని చెత్త కాగితమేనని మోదీ ప్రకటించారు. అంతకు మించి ఈ చర్య నల్లధనాన్ని ఎలా దెబ్బ తీస్తుందో మనకు చెప్పలేదు. నల్లధనం పని చేసేది అలా కాదని వ్యాపారాలు నడిపేవారికి తెలుసు. నేనో వస్తు తయారీ సంస్థను నడుపుతున్న యజమానిని. మరో సేవల వ్యాపారమూ ఉంది. నల్లధనాన్ని కూడా తెల్లధనం లాగే వ్యాపార విస్తరణకు సాధనంగా ఉపయోగిస్తారు. వస్తువులు, ఆస్తుల రూపంలో దాన్ని ఉంచుతారు. పూర్తి ద్రవ్య రూపంలో, నగదుగా దాన్ని ఉంచడం వల్ల ప్రత్యేకించి ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఉగ్రవాద కార్యకలాపాలను సాగించేది నకిలీ నోట్లతోనే కాబట్టి, ఈ చర్య వాటిని దెబ్బతీస్తుందనేది వారు చెప్పిన రెండో కారణం. ఉగ్రవాదంతో ముడిపెట్లాలేగానీ ఏ ఆలోచననైనా నేడు మన దేశంలో మంచిదిగా చలామణి చేసేయొచ్చు. మీడియా కూడా దాన్ని ప్రశ్నించే అవకాశం తక్కువే.
ఏదేమైనా, మోదీ తన నిర్ణయాత్మక శక్తిని ఒక్కసారి మెరిపించి చూపారు. ఫలితంగా మన దేశంలో నగదుతోనే బతుకు వెళ్లదీసే అత్యంత దయనీయ స్థితిలోని కోట్లాది పేదలను ఒక ప్రయోగానికి వాడుకుంటున్నారు. ఓ రెండు పార్టీలు మినహా ప్రతిపక్షాలన్నీ మోదీ అంటేనే ఠారెత్తిపోతున్నాయి. కాబట్టే ఇంతవరకు అవేవీ అసలు పెద్ద నోట్ల రద్దునే వ్యతిరేకించడం లేదు. ఉగ్రవాదాన్ని దానికి తగిలించారు కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరడానికి సైతం కాంగ్రెస్ జంకుతోంది. ప్రజల మానసిక స్థితి ఎలా ఉందనే విషయంలో వారెవరికీ కచ్చితమైన అంచనా లేదు. ఈ చర్యపట్ల ప్రజల్లో ఉత్సాహం ఉన్నదని విశ్వసిస్తున్నారు. అలవోకగా చేసేసిన ఈ క్రూర చర్య కోట్లాది మందిని బాధలకు గురిచేస్తోంది, మానసిక వేదనకు గురిచేస్తోంది. జనవరి 1 నాటికి మన చేతికి ఫలాల లాభాలు అందుతాయనీ, అవే నేడు ప్రజలు అనుభవిస్తున్న బాధలు సమంజసమైనవేనని రుజువు చేస్తాయని మోదీ మనకు చెప్పారు. అదీ చూద్దాం.
మోదీ తన నిర్ణయాత్మకతను ప్రదర్శించి చూపినట్టే... ఈలోగా తన పరిపాలనను కూడా చూపాల్సిన అవసరం ఉంది. విజయోత్సాహంతో మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనను వెలువరించినప్పటి నుంచి ప్రభుత్వం అస్పష్టంగా మాట్లాడుతోంది. ప్రతి చర్యల రూపంలో అది పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. నగదు ఉపసంహరణ (విత్‌డ్రాయల్) పరిమితులను పెంచడం, తగ్గించడమూ, ఇష్టానుసారం కొన్ని రాష్ట్రాలకు నిబంధనలను సడలించడమూ, వేళ్లకు సిరా పూయడం వంటి తాత్కాలిక పరిపాలనా చర్యలను చేపట్టడమూ చేస్తోంది.
ఇంతటి గొప్ప ప్రమాణంలోని చర్యను చేపట్టేటప్పుడు కలిగే గందరగోళాన్ని ముందే అంచనావేసి... దాన్ని ఉపశమింపజేసి ప్రశాంతతను నెలకొల్పడానికి అవసరమైన ప్రతిభ, శక్తిసామర్థ్యాలు ఎక్కడ? అది లోపించాయని ఇప్పుడే అనేయడం సరి కాదు. ఇదో అవకాశం. ఏదో కొద్ది మందిని (ఉగ్రవాద బాధితులలాగా) గాక, కోట్లాది మందిని ప్రభావితం చేసే సంక్షోభంలో దేశం ఉన్న ఈ తరుణంలోనే మోదీకి పట్టు ఉన్నదో, లేదో మనకు తేలేది.
రచయిత ప్రముఖ కాలమిస్టు, aakar.patel@icloud.com
ఆకార్ పటేల్