యుద్ధం గుజరాతీల నైజం కాదు నిజమే | aakar patel article on akhilesh 'no Gujarati martyrs' comment | Sakshi
Sakshi News home page

యుద్ధం గుజరాతీల నైజం కాదు నిజమే

Published Sun, May 14 2017 1:13 AM | Last Updated on Tue, Aug 21 2018 2:46 PM

యుద్ధం గుజరాతీల నైజం కాదు నిజమే - Sakshi

యుద్ధం గుజరాతీల నైజం కాదు నిజమే

అవలోకనం
గుజరాతీలలో అమరవీరులు ఎవరైనా ఉన్నారా? దేశం కోసం పోరాడి, అమరులైన గుజరాతీలు ఉన్నారా? అని అడిగి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కొందరిని నొప్పించారు. కశ్మీరీ సైనికాధికారి లెఫ్టినెంట్‌ ఉమ్మర్‌ ఫయాజ్‌ హత్య తర్వాత ఆయన ఆ వ్యాఖ్యను చేశారు. ఎంతో మంది కాదుగానీ, కొందరున్నారు అనేదే ఆయన ప్రశ్నకు జవాబు. కొన్నేళ్ల క్రితం నేను ఈ విష యంపై పరిశోధన చేశాను. పది లక్షలకు పైబడిన మన సైన్యంలోకి 2009లో 719 మంది గుజరాతీలే చేరారు. అదే రికార్డు సంఖ్య. అంతకు ముందటి రెండేళ్లయిన 2008, 2007లలో సైన్యంలో చేరిన గుజరాతీలు 230 మంది మాత్రమే.

గుజరాత్‌లో ఆరు కోట్లకు పైగా ప్రజలున్నారు. కానీ భారత సైన్యంలో గుజరాతీల కంటే ఎక్కువగా విదేశీయులున్నారు. ఇది వాస్తవం. గుజరాత్‌లో సగం ఉండే నేపాల్‌ దేశం గుజరాతీలకంటే అనేక రెట్లు ఎక్కువ మందిని  సైనికులుగా భారత్‌ కోసం పోరాడటానికి పంపింది. నిజానికి గూర్ఖా రెజిమెంట్లు ప్రపంచం లోనే అత్యుత్తుమ పోరాట దళాలలోకి వస్తాయి. అందుకు భిన్నంగా గుజరాత్‌లో సైనికతత్వ సంప్రదాయం లేదు. ఇదేమీ పూర్తిగా గుజరాత్‌కున్న ప్రత్యేక లక్షణ మేమీ కాదు. భారత్‌లోనే కాదు పాకిస్తాన్‌లో కూడా సైన్యం రిక్రూట్‌మెంట్‌ అస మానంగా విస్తరించి ఉంటుంది. ‘‘సౌ పుష్ట్‌ సే, హై పేషా ఎ ఆబా సిపాహ్‌గిరీ’’  (సైనికులుగా పనిచేయడం వంద తరాలుగా మా కుటుంబ వృత్తిగా ఉంటోంది)  అన్నాడు గాలిబ్‌. గుజరాత్‌లోని ఏ సామాజిక వర్గమూ ఆ మాట అనజాలదు. అయితే మరాఠాలు, పంజాబీలు, గూర్ఖాలు అ మాట అనగలుగుతారు.

ధైర్యవంతులై ఉండటానికి, దీనికీ ఏ సంబంధమూ లేదు. ఇది చాలా వరకు అవకాశానికి, ఆ తదుపరి సాంప్రదాయానికి సంబంధించినది. బ్రిటిష్‌వారు తమ కిరాయి సైన్యాన్ని ప్రధానంగా తాము వాస్తవంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచే తయారు చేసుకునారు. ఇందుకు కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. బెంగాల్‌ సైన్యం పాల్గొన్న 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్‌వారు పంజాబీ హిందువులు, ముస్లింలు, సిక్కుల నుంచి సైనికులను రిక్రూట్‌ చేసుకోవడం వైపు మళ్లారు. ఈ పంజాబీలు చాలా వరకు జాట్లు (జనరల్‌ జియా ఉల్‌ హఖ్‌ సైనికేత రమైన అరియన్‌ సామాజికవర్గం నుంచి పాకిస్తాన్‌ సైన్యంలో చేరినవారని చాలా మందే గమనించారు).

ఏదిఏమైనా చాలావరకు సైన్యం రిక్రూట్‌మెంట్‌ 1857 తిరుగుబాటుకు చాలా ముందే ప్రారంభమైంది. బెంగళూరులోని నా ఇల్లు మిలిటరీ ఏరియాలో ఉంది. మా ఇంటికి సమీపంలోనే  మద్రాస్‌ శాపర్స్‌ (సైనిక ఇంజనీర్ల దళం) బలగం వృద్ధి చెందింది, 1780 నుంచి భారత సైన్యానికి అది సేవలను అందిస్తోంది. అంత సుదీర్ఘ సాంప్రదాయం నెలకొన్నప్పుడు ఆ పనిని తండ్రి, తర్వాత కొడుకు కొన సాగిస్తాడు. చారిత్రకంగా సైనిక రిక్రూట్‌మెంట్‌ లేని ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు. గుజరాత్‌లో ‘యుద్ధ విద్యల’ సామాజిక వర్గాలు కొన్ని ఉన్నాయి, సైన్యంలో చేరేవారు ఆ వర్గాలకు చెందినవారే. వారిలో దర్బార్‌ (రాజ్‌పుట్‌) సామా జికవర్గం వంటి వారున్నారు. జడేజా, సోలాంకి వంటి పేర్లు వారికి ఉంటాయి. కాబట్టి గుజరాతీ అమరవీరుల సంఖ్య తక్కువేగానీ, గుండు సున్నా కాదు. గుజరాత్‌లో పెద్దగా యుద్ధాలు జరగకపోవడం కూడా ఆ రాష్ట్రం నుంచి తక్కువ మంది సైని కులు తయారు కావడానికి మరో కారణం.  

అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్‌ను 1297లో జయించాడు. ఆ తర్వాత, గుజ రాత్‌లో యుద్ధం కొంత జరగకపోలేదు. అయితే, అందులో గుజరాతీల ప్రమే యం చాలా తక్కువ. అహ్మదాబాద్‌ను అక్బర్‌ ఆక్రమించి గుజరాత్‌ను మొగల్‌లు తమ చేతుల్లోనే ఉంచుకునే వరకు జరిగిన కొన్ని యుద్ధాలు కూడా ఉత్తరాది ముస్లింలలో వారిలో వారికి మధ్య జరిగినవే. ఆ తర్వాత మరాఠాలు దానిలో పెద్ద భాగాలను స్వాధీనం చేసుకున్నారు. బరోడాపై నేటికీ వారి పట్టు ఉంది. ఆ తర్వాత గుజరాత్‌ను ఇంగ్లిష్‌ వారు స్వాధీనం చేసుకోవడం సూరత్‌తో ప్రారంభమైంది. ఈ పోరాటంలో గుజరాతీల ప్రమేయం.. హిందువులు, ముస్లింలు లేదా పార్శీలు అన్న ప్రసక్తే లేకుండా చాలా తక్కువ.

గుజరాత్‌లో శక్తివంతమైన వర్తక సంస్కృతి ఉండటం కూడా సైన్యంలో గుజరాతీలు లేకపోవడానికి మరొక కారణం. వర్తక సంస్కృతి వ్యవహారవాదాన్ని నొక్కి చెబుతుంది. ‘యుద్ధవిద్యల’ సామాజిక వర్గాలలో ఎక్కువ భాగం దీనిని హేళన చేస్తారు. అయితే గుజరాత్‌ గొప్ప వ్యాపారవేత్తలను చాలా మందిని అందించింది. గౌరవానికి అంటిపెట్టుకుని గట్టిగా నిలబడటానికి బదులు రాజీపడ గల సామర్థ్యం ఉండటం... గుజరాత్‌ ఎందరో గొప్ప రాజనీతిజ్ఞులను అందించ డానికి కారణం. స్వాతంత్య్రానికి ముందటి నలుగురు అతి గొప్ప రాజకీయ నేతలలో ముగ్గురు... గాంధీ, జిన్నా, పటేల్‌... గుజరాతీలే.

 ఈ సంస్కృతి నేడు ప్రతిఫలించే ఆసక్తికరమైన రూపాలలో ఒకటి నా కుల మైన పాటీదార్లలో కనిపిస్తుంది. హరియాణాలోని జాట్లతో పాటూ మేం కూడా దేశంలో కెల్లా అతి తక్కువ లైంగిక నిష్పత్తులున్న వర్గం. తరచుగా ఆడ పిండాలను కడతేర్చడం లేదా ఆడ పసికూనలను పుట్టినప్పుడే గొంతు నులిమేయడం జరు గుతుంటుంది. ఇది పాటీదార్లకు మహా సిగ్గుచేటైన విషయం, దీన్ని సరిదిద్దు కోవాల్సి ఉంది. అయితే, జాట్లలాగా పాటీదార్లు పరువు హత్యలకు పాల్పడరు. అంటే ప్రాయం వచ్చిన ఆడవారు తాము ప్రేమించినవారిని పెళ్లి చేసుకుంటే హత మార్చరు. వర్తక సంస్కృతి గౌరవానికి విలువను ఇవ్వదు.

అఖిలేష్‌ యాదవ్‌ వ్యాఖ్యకు కొందరు బాధపడటం బాగానే ఉంది గానీ, అది కొంత యదార్థం, నిజం మీద ఆధారపడి ఉన్నది. యుద్ధవిద్యా సాంప్రదాయం లేనందుకు గుజరాతీలు సిగ్గుపడాల్సిందేమీ లేదు. వాళ్లు దేశానికి ఇతర విధాలుగా తోడ్పడుతున్నారు. ఎంతో మంది అమరవీరులను తయారుచేయకపోయినా అత్యంత గొప్ప యోధుడు ఒక్కడిని స్పష్టించామని గుజరాతీలు చెప్పుకోవచ్చు... ఆయన గాంధీ.

ఆకార్‌ పటేల్‌
కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement