బీజేపీ విజయంపై తీవ్రంగా స్పందించిన అఖిలేశ్ | BJP won on caste and religion, says Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

బీజేపీ విజయంపై తీవ్రంగా స్పందించిన అఖిలేశ్

Published Tue, Dec 19 2017 3:57 PM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

BJP won on caste and religion, says Akhilesh Yadav - Sakshi

సాక్షి, లక్నో: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉంది. అయితే గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రజలు ఓటేసింది అభివృద్ధికా కానేకాదని, కేవలం కుల, మతతత్వాన్ని రెచ్చగొట్టి బీజేపీ ఓట్లు రాబట్టుకుందని దుయ్యబట్టారు. గుజరాత్ ఫలితాల్లో బీజేపీ తృటిలో ఓటమిని తప్పించుకుందన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో మరికాస్త చూపించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. హార్ధిక్ పటేల్, జిగ్నేశ్ మెవానీ లాంటి ఓబీసీ నేతలు, దళిత నేతలతో కలిసి పోరాటం కొనసాగిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, ఆ పార్టీ కూటమి అద్భుత ఫలితాలు సాధిస్తుందని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు.

లక్నోలో మంగళవారం మీడియాతో అఖిలేశ్ మాట్లాడుతూ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో నామమాత్ర విజయాన్ని బీజేపీ సాధించింది. అభివృద్ధి గురించి ఎల్లప్పుడూ ప్రస్తావించే బీజేపీ పెద్దలు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాత్రం కులం, మతం లాంటి అంశాలనే వాడుకున్నారని విమర్శించారు. యూపీలో సైతం వారు అభివృద్ధి కంటే కూడా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని ఆరోపించారు. నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినా బీజేపీ గత ఎన్నికలతో పోల్చితే చాలా తక్కువ స్థానాల్లో నెగ్గిందన్నారు. గుజరాత్‌లో తరహాలోనే ప్రాంతీయ పార్టీలు, నేతలతో పొత్తుకుని బరిలోకి దిగితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఓడిస్తుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement