సగటు మనిషి సమస్యలపై టీవీ యాంకర్ల శీతకన్ను
అవలోకనం
ప్రకటనదారులు ఖర్చుపెట్టగల సామర్థ్యమున్న వినియోగదారు బృందాలపైనే ఆసక్తి చూపుతుంటారు. ఈ తరహా వినియోగదారులను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి టీవీ చానళ్లు ఈ బృందాల ఆకాంక్షలను పట్టించుకునే కంటెంట్, రిపోర్టులపైనే దృష్టి పెట్టితీరాలి. అందుకనే పోషకాహార లేమి, ప్రాథమిక పాఠశాలలను పోటీతత్వంతో నడపడంలో ప్రభుత్వాల అసమర్థత వంటి అంశాలు టీవీ చానళ్ల ప్రైమ్‌టైమ్ చర్చల్లోకి రావు. అందుకే ఉన్నత తరగతి బాగా ఆసక్తి చూపే ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలపైనే అతిశయించిన స్థాయిలో చర్చ చేస్తుంటారు.
భారత్‌లో టీవీ యాంకర్లు మరీ శక్తిమంతులుగా అవతరించారా? ప్రత్యేకించి టైమ్స్ నౌ ఆర్నాబ్ గోస్వామి వంటి ఇంగ్లిష్ యాంకర్ల విషయానికి వస్తే నేను అవుననే సమాధానమిస్తాను. శక్తిమంతులు అంటే నా ఉద్దేశం... ప్రతిరోజూ దేనిపై చర్చ సాగాలి, ఏది ముఖ్యమైనది అనే అంశాన్ని వీరు ప్రభావితం చేస్తారనే. ఇది ప్రింట్ మీడియాలోనూ, ఇంటర్నెట్‌లోనూ ఉన్న జర్నలిస్టులకు లేని, ఎన్నటికీ వారు కలిగివుండని అధికారం.
గోస్వామి వంటి యాంకర్లు కలిగిస్తున్న ఈ ప్రభావం చాలావరకు ప్రతికూల మైనదే అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి వారి దృష్టంతా ఉన్నత వర్గ ఆరా టాలకు సంబంధించిన అంశాలపైనే ఉంటుంది. దేశంలో ఆరోగ్యం, ప్రాథమిక విద్య, పోషకాహారం వంటి సమస్యల బారినపడుతున్న కోట్లాది మెజారిటీ ప్రజ లకు చెందిన అంశాలను వీరు చర్చించరు. ఇలా అంటున్నానంటే యాంకర్ ఒక దుష్టుడనీ, హాని కలిగించే వాడనీ అర్థం కాదు. ఇలా జరగడానికి, ఇలాంటి పరిస్థితి అంత సులభంగా మారకపోవడానికి వ్యవస్థాగత కారణాలు చాలానే ఉన్నాయి. మొదటది. భాష పరంగా భారత్ ఒక అసాధారణమైన జాతి. ఉన్నత వర్గాలు విదేశీ భాషనే తమ వ్యవహార భాషగా మార్చుకున్న ఒకే ఒక ప్రధాన దేశం ఇది. దీన్ని తీవ్రమైన సాంస్కృతిక పతనమనే చెప్పాలి. భారతీయుల్లో దాదాపు పది శాతం మంది ఏదో ఒక రకంగా ఇంగ్లిష్‌ను మాట్లాడగలరని అంచనా.
ఈ పదిశాతం మంది భారతీయుల్లో పావుశాతం అంతకంటే తక్కువ జనా భాకు ఇంగ్లిష్ ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఉంటోందని నా భావన. ఇంగ్లిష్ ఒక అనుసంధాన భాషగా ఉంది కాబట్టే ఈ ఉన్నత వర్గమే భారత్‌లో భాషాపరంగా అనుసంధానమై ఉన్న ఏకైక జనాభాగా ఉంది. ఒక పేద తమిళుడు ఒక నిరుపేద కశ్మీరీతో లేదా గుజరాతీయుడితో మాట్లాడేందుకు మార్గమే లేదు. కానీ ఈ రాష్ట్రాలకు చెందిన ఉన్నత తరగతి ప్రజలు మాత్రం ఇంగ్లిష్‌లో సులభంగా మాట్లాడుకోగలరు. ఈ వర్గం ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో సులభంగా పనిచేయడానికి, డజను అధికార భాషలను కలిగి ఉన్న ఉపఖండంలో ఎలాంటి కష్టం లేకుండా వీరు ఒకచోటి నుంచి మరొక చోటికి బదిలీ కావడానికి ఇదే కారణం.
రెండో కారణం ఏమిటంటే, భారత్‌లో మీడియా అత్యధికంగా సబ్సిడీకర ణకు గురైంది. దేశంలో వార్తాపత్రికలు చాలావరకు 4 రూపాయలకే లభ్యమవు తాయి. ఈ ధరకు మీరు 40 పేజీల పూర్తిస్థాయి ఇంగ్లిష్ పత్రికను పొందగలరు. అమెరికాలో, యూరప్‌లో మరెక్కడైనా సరే ఇదే పత్రిక ధర రూ.70 లుగా ఉంటుంది. మన పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో చూసినా భారత్‌లోని పత్రికల కంటే నాలుగు రెట్లు ఎక్కువ ధర ఉంటుంది.
న్యూస్‌ప్రింట్ ధర అంటే వార్తలను ముద్రించే పేపర్ ధర ప్రపంచవ్యాప్తంగా ఒకటే. భారత్‌లోని ప్రధానమైన దినపత్రికలు కెనడాకు చెందిన న్యూస్‌ప్రింట్‌ను డాలర్లలో కొంటుంటాయి. నా అంచనా ప్రకారం ఒక్కొక్క పేపర్ అచ్చయ్యేందుకు కనీసం రూ. 12లు అవుతుంది. మరి పత్రికా యజమానులు పాఠకుడికి అంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు? బహుశా ప్రకటనదారులే కావచ్చు. అదేవిధంగా టాటా స్కై ఇంగ్లిష్ న్యూస్ ప్యాకేజీ 20 ఇంగ్లిష్ వార్తా చానళ్లను నెలకు రూ. 60లకే అందిస్తోంది. అంటే టైమ్స్ నౌ టీవీ చానల్‌ను మనం రోజుకు 3 రూపాయల ఖర్చుతో చూడవచ్చు. అదే అమెరికాలోని ఫాక్స్ న్యూస్‌కు మనం చందా కట్టా లంటే 20 రెట్లు ఎక్కువ చెల్లించాలి. మళ్లీ ప్రశ్నిస్తున్నా. మన ఇంగ్లిష్ చానళ్లను అంత సబ్సిడీ ధరలకు ఎవరు అందిస్తున్నారు? యాంకర్ల వేతనాలను ఎవరు చెల్లిస్తున్నారు? అంటే ప్రకటనదారులే అని చెప్పాలి.
ప్రకటనదారులు కొన్ని వినియోగదారు బృందాలపట్లే.. అంటే ఖర్చుపెట్టగల సామర్థ్యమున్న బృందాలపైనే ఆసక్తి చూపుతుంటారు. ఈ తరహా వినియోగదారు లను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి టీవీ చానళ్లు ఈ బృందం ఆకాంక్ష లను పట్టించుకునే కంటెంట్, రిపోర్టులపైనే దృష్టి పెట్టితీరాలి. అందుకనే పోషకా హార లేమి, ప్రాథమిక పాఠశాలలను పోటీతత్వంతో నడపడంలో ప్రభుత్వాల అసమర్థత వంటి అంశాలు టీవీ చానళ్ల ప్రైమ్ టైమ్ చర్చల్లోకి రావు. అందుకే ఉన్నత తరగతి బాగా ఆసక్తి చూపే ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలపైనే అతిశయించిన స్థాయిలో చర్చ చేస్తుంటారు.
అయితే తరచుగా యాంకర్లు తమ కంటెంట్ జనాదరణకు సంబంధించిన ఈ వ్యవస్థాగత అంశాలను తమ వ్యక్తిగత ప్రతిభతో గందరగోళపరుస్తుంటారను కోండి. అయితే ఈ వ్యవస్థాగత కారణాల వల్లే ఇంగ్లిష్ యాంకర్ అత్యంత శక్తిమం తుడు అవుతున్నాడు. గడిచిన కొన్ని సంవత్సరాల్లో అర్నాబ్ వంటి యాంకర్లు చేస్తున్న డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వమే తన విధానాలను, చర్యలను సవ రించుకోవలసి వచ్చిందన్న మాట వాస్తవం.
ప్రభుత్వంలో కాస్త వివేకవంతుడైన వ్యక్తి ఈ విషయంలో తన విశ్లేషణను నాతో పంచుకున్నారు. దాంట్లో కొంత భాగాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆయన ఇలా చెప్పాడు: ‘అర్నాబ్ ఇప్పుడు ఎజెండాను రూపొందిస్తున్నారు... చైనా, పాకిస్తాన్‌ల నుంచి భారత్‌కు ఇక్కడి నుంచి ఆ దేశాలకు నేతలు చేసే సందర్శనలను సరిహద్దుల్లోంచి జొరబడుతున్న చొరబాటుదారుల చిత్రాలతో, లేక ఇన్ఫ్రారెడ్ చిత్రాలతో చూపిస్తుంటారు. అలాంటి సందర్శనలను నిలిపివేయిం చడం లేదా దాని ప్రభావాన్ని పలుచబారేలా చేయడమే దీని లక్ష్యం.’
ఇలాంటి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుంది. ఎందుకంటే టీవీ యాంకర్ అనేవాడు పాపులారిటీ, రేటింగుల కంటే మించిన ప్రాధాన్యత కలిగిన వాడు కాదు. తమకున్న జనాకర్షణ జాతి హితంతో ముడిపడి ఉందని అతడు లేదా ఆమె భావిస్తూండవచ్చు. అయితే కొన్ని అంశాలలో ఇది వాస్తవం కాదు అనడంలో వివా దమే లేదు. అలాంటి సందర్భాల్లో మనకు ఎంత నష్టం జరుగుతుంది? దుర దృష్టవశాత్తూ టీవీ చర్చలో ఇది ఒక అంశంగా ముందుకు రావడం లేదు.
(వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com )