TV anchors
-
యాంకర్లు బస చేసిన హోటల్స్‌పై దృష్టి
సాక్షి, మచిలీపట్నం: ‘బందరులో హైటెక్ వ్యభిచారం’ అనే శీర్షకన సాక్షిలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ తరహా విష సంస్కృతి విస్తరిస్తుందన్న కథనం రాజకీయ, పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సీరియస్‌గా తీసుకున్నారు. లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బందరు డివిజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన చిలకలపూడి పోలీసులు నగరంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. యాంకర్లు బస చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన హోటల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎంత కాలం క్రితం వచ్చారు. ఎందుకొచ్చారు. ఎన్ని రోజులున్నారో ఆరా తీశారు. మరొక వైపు పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఉన్న అపార్టుమెంట్లలో కూడా సోదాలు నిర్వహించారు. విచారణ జరుపుతున్నాం: రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ ప్రశాంతమైన బందరు నగరంలో హైటెక్ వ్యభిచారం జరిగే అవకాశాలు లేవు. సాక్షిలో వచ్చిన కథనంపై సమగ్ర విచారణ జరపుతున్నాం. ప్రత్యేక బృందాలతో నగరంలోని లాడ్జీలు, అపార్టుమెంట్లు సోదాలు చేస్తున్నారు. -
పాకిస్థాన్‌తో టీవీ యాంకర్ల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిందేనంటూ పలు ప్రాంతీయ టీవీలతోపాటు పలు జాతీయ టీవీ ఛానళ్ల యాంకర్లు తీర్మానించడమే కాదు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు భారత సైన్యానికి వెంటనే కదన రంగంలోకి దూకాల్సిందిగా శనివారం పదే పదే పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరు కూడా ఇదే కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. తెలుగు టీవీ యాంకర్ రష్మీ అవేశంతో ఊగిపోతూ పాకిస్థాన్‌పై రెండో సర్జికల్ స్ట్రైక్స్ చేయాలంటూ ‘తెర మాకీ....’ అంటూ రెచ్చిపోయారు. పాకిస్థాన్‌పై ఎలా బదులు తీర్చుకోవాలో తేల్చుకోవడానికి అఖిల పక్ష సమావేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ తర్జనభర్జనలు పడుతుండగానే ‘పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలకు మోదీ సిద్ధంగా ఉన్నారు’ అంటూ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తూ వస్తున్నారు. ‘ప్రతీకారం కోరుకుంటున్న భారత్’ అన్న నినాదంతోనే ‘రిపబ్లిక్ టీవీ’ వార్తలను ప్రసారం చేసింది. సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ అర్నాబ్ గోసామి మాట్లాడుతూ ‘పాక్‌తో యుద్ధం చేయడం మినహా మరో మార్గం ఉందా ? లేదు!’ అంటూ సెలవిచ్చారు. ‘పాకిస్థాన్ విషయంలో ఇక వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు’ అంటూ టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్ వ్యాఖ్యానించారు. ‘ ఓ భారత ప్రధాని ప్రజలనుద్దేశించి ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే మొదటి సారి. పాకిస్థాన్‌తో పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు’ అని ఇండియా టుడే టీవీ యాంకర్ రాహుల్ కన్వల్ వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్‌లోని అన్ని టెర్రరిస్టు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపాలి’ అంటూ న్యూస్ 18 యాంకర్ భూపేంద్ర చౌబే పిలుపునిచ్చారు. యుద్ధానికి సమయం ఆసన్నమైందంటూ 2016లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులను ప్రస్తావిస్తూ ఏబీపీ న్యూస్ ఛానల్ అయితే ఇటీవల విడుదలైన ‘యురి’ బాలివుడ్ సినిమాలోని క్లిప్స్‌ను చూపించారు. యాంకర్ల పిలుపులపై ‘ఎన్డీటీవీ ఇండియా’ రవిష్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ‘మన సైనికులు మరణించినందుకు మనకు బాధగా ఉంటుంది. మనసు ప్రతీకారం కోరుకుంటుంది. ఇక్కడే కాస్త సంయమనం అవసరం. అరుపులు, కేకలు వినిపించడానికి ప్రతి సంఘటన ఓ సినిమా ప్లాట్ కాదు. రెచ్చగొట్టే భాష రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తుంది. సమస్యను పరిష్కరించదు. ఈ సమయంలో మనం మౌనం పాటించడమే అమర వీరులకు నిజమైన నివాళి. మృధువుగా మాట్లాడుతాం. బాధిత కుటుంబాల మెదళ్లును తొలుస్తున్న విషయం గురించి ఆలోచిద్దాం. కశ్మీరు పరిస్థితి కంటే మీడియా పరిస్థితి దిగజారినందుకు బాధగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కార్గిల్ వీరుడి అమూల్య సందేశం ‘జీ న్యూస్’ చర్చాగోష్టిలో పాల్గొన్న 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొని కుడి కాలును కోల్పోయిన యోధుడు మేజర్ నవదీప్ సింగ్ చాలా బాధ్యుతాయుతంగా స్పందించారు. ‘దేశ త్రివర్ణ పతాకానికి అండగా ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధంగానే ఉన్నారు. ఒకప్పుడు టెర్రరిస్టయిన నజీర్ వానిలాగా ఓ కశ్మీర్ యువకుడు ఎందుకు కావాలనుకుంటున్నాడో కూడా ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రాణాలే కాదు, అవయవాలు కూడా పోతాయి. ఆ తర్వాత నష్ట పరిహారం కోసం కోర్టుల తలుపులు తట్టాలి. యుద్ధంలో సైనికుడు చనిపోవాలని మనం కోరుకుంటాం. ఆ తర్వాత ఆ సైనికుడి వితంతు భార్య పింఛను కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. యుద్ధంలో కొన్నిసార్లు మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకవు. పింఛను కావాలంటే భర్త మతదేహాన్ని తీసుకరావాలని అధికార యంత్రాంగం ఆదేశిస్తుంది. యుద్ధంలో గాయపడితే అంగవైకల్య నష్టపరిహార పింఛను కోసం ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాలి. యుద్ధంలో కాలు కోల్పోయిన నేను పింఛను కోసం ఏడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగాను. సైనిక పింఛను విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పీళ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశించినప్పటికీ ఇప్పటికీ వెయ్యి కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రాణాలతో పరాచకాలొద్దు. అన్యాయంగా సైనికుల ప్రాణాలను బలిపెట్టవద్దు. భారత సైన్యానికి ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసు. ఎం చేయాలో వారికి మనం సూచించాల్సిన అవసరం లేదు. సముచిత సమయంలో సముచిత చర్య తీసుకోవడం వారికి తెలుసు. ముందుగా పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రపంచం ప్రకంటించేలా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకరావాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందిగదా అంటూ ఆవేశంతో మాట్లాడడం సముచితం కాదు’ అని ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయినా ‘సార్! మీరు పుల్వామా దాడి చిత్రాలను చూసినట్లు లేదు. ప్రతీకారం ఒక్కటే పరిష్కారమని మీరు భావించకపోవడానికి అదే కారణం అనుకుంటా’ అని జీన్యూస్ యాంకర్ వ్యాఖ్యానించడం కొసమెరపు. -
జోరుగా.. హుషారుగా
జూబ్లీహిల్స్: మహిళలను ఎక్కడ పూజిస్తారో.. గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, శక్తిస్వరూపిణులైన అతివలు వారిలోని నైపుణ్యాలను, అభిరుచులను ప్రదర్శించడం అభినందనీయమని ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను అన్నారు. యూసుఫ్‌గూడ సవేరా ఫంక్షన్హాల్లో బుధవారం నారీలోకం పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వృత్తి, ఉపాధి, కుటుంబ బాధ్యతల్లో మునిగితేలే మహిళలకు ఒక ఆటవిడుపులా కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా ఆటపాటలు, వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో మునిగితేలారు. ర్యాంప్‌వాక్‌తో అదరగొట్టారు. విజేతలకు బహుమతులు అందించారు. రెడ్‌రోజ్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బుల్లితెర నటీమణులు రోహిణి, రాగిణి, ఇంటూరి వాసు, రిషిక, రాంజగన్, భాను సహా పలువురు పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకుడు రాజేష్, జెమినీ టీవీ ప్రతినిధి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
గ్లామరస్ షో
సావిత్రి నుంచి సమంత వరకు తారల దుస్తులు... యువతుల డ్రెస్సింగ్ స్టైల్స్‌కి స్ఫూర్తిని అందించడంలో ముందుంటాయనేది తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో స్టార్స్‌తో పోటీ పడుతున్నారు టీవీ యాంకర్స్. చిన్ని తెరపై కేవలం వ్యాఖ్యానంతో మాత్రమే కాకుండా... గ్లామరస్తో రియాలిటీ షోలను రక్తికట్టిస్తున్న కొందరు టీవీ స్టార్స్‌కి ఇప్పుడు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్. ‘సినిమాలకు తీసిపోని విధంగా యాంకర్ల డ్రెస్సింగ్‌ను తీర్చిదిద్దాల్సి ఉంటుంది’ అంటున్నారు సిటీ డిజైనర్ దీప్తి. ‘అంబర’ లేబుల్‌తో ఫ్యాషన్ రంగంలో స్వల్ప కాలంలోనే టాప్ ప్లేస్‌కు చేరుకున్న ఈమె.. టీవీ స్టార్లకు డ్రెస్‌ల డిజైనింగ్‌లో అందవేసిన చేయి అనిపించుకుంటున్నారు. సుమ, ఝాన్సీ, ఉదయభాను తర్వాత చిన్ని తెర రాణులుగా మారిన అనసూయ, శ్రీముఖి, రేష్మి, లాస్య... లాంటి వారికి కేవలం యాంకరింగ్ ఒకటే సరిపోవడం లేదు. వీరు గ్లామర్ ద్వారానూ మెప్పించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీరి డ్రెస్సింగ్‌కు, డిజైనింగ్‌కు ప్రాధాన్యత మరింత పెరిగింది. దీంతో సిటీ డిజైనర్లకు చిన్ని తెర సెలబ్రిటీల డిజైనింగ్ బాధ్యతలూ వచ్చేశాయి. ‘సీనియర్ సినీ స్టార్, రాజకీయ నాయకురాలైన రోజా లాంటి ప్రముఖ మహిళకు డ్రైస్ డిజైనింగ్ అంటే ఆషామాషీ కాదు. ఇలాంటి టాస్క్‌లే డిజైనింగ్, స్టైలింగ్ ప్రతిభకు పదును పెడతాయనేది నా నమ్మకం’ అంటారు దీప్తి. దీప్తి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... చిన్ని తెరపై చిందేస్తున్న డిజైన్లు.. గతంతో పోలిస్తే ఇప్పుడు టీవీ షోలకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆయా షోలలో వ్యాఖ్యాతలు, న్యాయ నిర్ణేతలు తదితరులకూ సినీతారలతో సమానంగా ఫాలోయింగ్ ఉంటోంది. నా ఫస్ట్ టీవీ షో జబర్దస్త్. అందులో రోజా గారికి డిజైన్స్ చేశాను. రోజా గారు అప్పటి వరకు చీరలు, అప్పుడప్పుడు చుడీదార్స్ మాత్రమే ధరించేవారు. మేం కొత్త లుక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్‌టైమ్ పంపిన డిజైన్‌నే ఆమెకు నచ్చింది. ఇక అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నరగా రోజా గారికి డిజైన్ చేస్తున్నాను. అలాగే జయసుధ, సుమ, రేష్మి, అనసూయ, శ్రీముఖిలతో సహా టాప్ టీవీ యాంకర్లకు డిజైన్లు అందిస్తున్నాను. సెట్... హిట్ టీవీ షోలను రక్తికట్టించడంలో ప్రధాన పాత్ర పోషించేది యాంకర్లు. దాదాపు ప్రేక్షకులు వీరినే గమనిస్తుంటారు. కాబట్టి అనుకున్నంత తేలికగా ఉండదీ వర్క్. యాంకర్‌కి డ్రెస్ డిజైన్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ దగ్గర్నుంచి ఎన్నో అంశాలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్ కలర్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో సెట్ అవ్వాలి. కొన్ని సెట్స్ డల్‌గా, డిమ్లైట్స్తో ఉంటాయి. దానికి సోబర్ కలర్స్ డిజైన్ డ్రెస్ ఇస్తే కనిపించదు. ఇప్పుడు సుమ చేస్తున్న ఇ–జంక్షన్ సెట్లో బ్లూ, గ్రీన్ లాంటి కలర్స్ వాడకూడదు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో అవి ఉన్నాయి. ఇలా సెట్లో కలర్స్‌ను బట్టి డిజైనింగ్ ఉండాలి. అంతేకాదు కామెడీ, సీరియస్, ఫెస్టివల్.. ఇలా షో కాన్సెప్ట్‌ను మైండ్‌లో ఉంచుకోవాలి. ఓ వారం కనిపించిన అవుట్‌ఫిట్ మరోవారం అవుట్‌ఫిట్‌కు పూర్తి భిన్నంగా ఉండాలి. దాదాపు 10కి పైగా టాప్ షోలు, బెస్ట్ యాంకర్లకి చేశాను. రాజశ్రీ లాంటి సీరియల్ యాక్టర్లకి డిజైన్లు అందించాను. ఇప్పుడు టీవీ యాక్టర్లు, యాంకర్లు సెలబ్రిటీ హోదాలో ఈవెంట్స్‌కి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచేలా, వారికి నప్పేలా డ్రెస్ డిజైన్ చేయాలి. -
సగటు మనిషి సమస్యలపై టీవీ యాంకర్ల శీతకన్ను
అవలోకనం ప్రకటనదారులు ఖర్చుపెట్టగల సామర్థ్యమున్న వినియోగదారు బృందాలపైనే ఆసక్తి చూపుతుంటారు. ఈ తరహా వినియోగదారులను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి టీవీ చానళ్లు ఈ బృందాల ఆకాంక్షలను పట్టించుకునే కంటెంట్, రిపోర్టులపైనే దృష్టి పెట్టితీరాలి. అందుకనే పోషకాహార లేమి, ప్రాథమిక పాఠశాలలను పోటీతత్వంతో నడపడంలో ప్రభుత్వాల అసమర్థత వంటి అంశాలు టీవీ చానళ్ల ప్రైమ్‌టైమ్ చర్చల్లోకి రావు. అందుకే ఉన్నత తరగతి బాగా ఆసక్తి చూపే ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలపైనే అతిశయించిన స్థాయిలో చర్చ చేస్తుంటారు. భారత్‌లో టీవీ యాంకర్లు మరీ శక్తిమంతులుగా అవతరించారా? ప్రత్యేకించి టైమ్స్ నౌ ఆర్నాబ్ గోస్వామి వంటి ఇంగ్లిష్ యాంకర్ల విషయానికి వస్తే నేను అవుననే సమాధానమిస్తాను. శక్తిమంతులు అంటే నా ఉద్దేశం... ప్రతిరోజూ దేనిపై చర్చ సాగాలి, ఏది ముఖ్యమైనది అనే అంశాన్ని వీరు ప్రభావితం చేస్తారనే. ఇది ప్రింట్ మీడియాలోనూ, ఇంటర్నెట్లోనూ ఉన్న జర్నలిస్టులకు లేని, ఎన్నటికీ వారు కలిగివుండని అధికారం. గోస్వామి వంటి యాంకర్లు కలిగిస్తున్న ఈ ప్రభావం చాలావరకు ప్రతికూల మైనదే అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి వారి దృష్టంతా ఉన్నత వర్గ ఆరా టాలకు సంబంధించిన అంశాలపైనే ఉంటుంది. దేశంలో ఆరోగ్యం, ప్రాథమిక విద్య, పోషకాహారం వంటి సమస్యల బారినపడుతున్న కోట్లాది మెజారిటీ ప్రజ లకు చెందిన అంశాలను వీరు చర్చించరు. ఇలా అంటున్నానంటే యాంకర్ ఒక దుష్టుడనీ, హాని కలిగించే వాడనీ అర్థం కాదు. ఇలా జరగడానికి, ఇలాంటి పరిస్థితి అంత సులభంగా మారకపోవడానికి వ్యవస్థాగత కారణాలు చాలానే ఉన్నాయి. మొదటది. భాష పరంగా భారత్ ఒక అసాధారణమైన జాతి. ఉన్నత వర్గాలు విదేశీ భాషనే తమ వ్యవహార భాషగా మార్చుకున్న ఒకే ఒక ప్రధాన దేశం ఇది. దీన్ని తీవ్రమైన సాంస్కృతిక పతనమనే చెప్పాలి. భారతీయుల్లో దాదాపు పది శాతం మంది ఏదో ఒక రకంగా ఇంగ్లిష్‌ను మాట్లాడగలరని అంచనా. ఈ పదిశాతం మంది భారతీయుల్లో పావుశాతం అంతకంటే తక్కువ జనా భాకు ఇంగ్లిష్ ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఉంటోందని నా భావన. ఇంగ్లిష్ ఒక అనుసంధాన భాషగా ఉంది కాబట్టే ఈ ఉన్నత వర్గమే భారత్‌లో భాషాపరంగా అనుసంధానమై ఉన్న ఏకైక జనాభాగా ఉంది. ఒక పేద తమిళుడు ఒక నిరుపేద కశ్మీరీతో లేదా గుజరాతీయుడితో మాట్లాడేందుకు మార్గమే లేదు. కానీ ఈ రాష్ట్రాలకు చెందిన ఉన్నత తరగతి ప్రజలు మాత్రం ఇంగ్లిష్‌లో సులభంగా మాట్లాడుకోగలరు. ఈ వర్గం ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో సులభంగా పనిచేయడానికి, డజను అధికార భాషలను కలిగి ఉన్న ఉపఖండంలో ఎలాంటి కష్టం లేకుండా వీరు ఒకచోటి నుంచి మరొక చోటికి బదిలీ కావడానికి ఇదే కారణం. రెండో కారణం ఏమిటంటే, భారత్‌లో మీడియా అత్యధికంగా సబ్సిడీకర ణకు గురైంది. దేశంలో వార్తాపత్రికలు చాలావరకు 4 రూపాయలకే లభ్యమవు తాయి. ఈ ధరకు మీరు 40 పేజీల పూర్తిస్థాయి ఇంగ్లిష్ పత్రికను పొందగలరు. అమెరికాలో, యూరప్‌లో మరెక్కడైనా సరే ఇదే పత్రిక ధర రూ.70 లుగా ఉంటుంది. మన పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో చూసినా భారత్‌లోని పత్రికల కంటే నాలుగు రెట్లు ఎక్కువ ధర ఉంటుంది. న్యూస్‌ప్రింట్ ధర అంటే వార్తలను ముద్రించే పేపర్ ధర ప్రపంచవ్యాప్తంగా ఒకటే. భారత్‌లోని ప్రధానమైన దినపత్రికలు కెనడాకు చెందిన న్యూస్‌ప్రింట్‌ను డాలర్లలో కొంటుంటాయి. నా అంచనా ప్రకారం ఒక్కొక్క పేపర్ అచ్చయ్యేందుకు కనీసం రూ. 12లు అవుతుంది. మరి పత్రికా యజమానులు పాఠకుడికి అంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు? బహుశా ప్రకటనదారులే కావచ్చు. అదేవిధంగా టాటా స్కై ఇంగ్లిష్ న్యూస్ ప్యాకేజీ 20 ఇంగ్లిష్ వార్తా చానళ్లను నెలకు రూ. 60లకే అందిస్తోంది. అంటే టైమ్స్ నౌ టీవీ చానల్‌ను మనం రోజుకు 3 రూపాయల ఖర్చుతో చూడవచ్చు. అదే అమెరికాలోని ఫాక్స్ న్యూస్‌కు మనం చందా కట్టా లంటే 20 రెట్లు ఎక్కువ చెల్లించాలి. మళ్లీ ప్రశ్నిస్తున్నా. మన ఇంగ్లిష్ చానళ్లను అంత సబ్సిడీ ధరలకు ఎవరు అందిస్తున్నారు? యాంకర్ల వేతనాలను ఎవరు చెల్లిస్తున్నారు? అంటే ప్రకటనదారులే అని చెప్పాలి. ప్రకటనదారులు కొన్ని వినియోగదారు బృందాలపట్లే.. అంటే ఖర్చుపెట్టగల సామర్థ్యమున్న బృందాలపైనే ఆసక్తి చూపుతుంటారు. ఈ తరహా వినియోగదారు లను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి టీవీ చానళ్లు ఈ బృందం ఆకాంక్ష లను పట్టించుకునే కంటెంట్, రిపోర్టులపైనే దృష్టి పెట్టితీరాలి. అందుకనే పోషకా హార లేమి, ప్రాథమిక పాఠశాలలను పోటీతత్వంతో నడపడంలో ప్రభుత్వాల అసమర్థత వంటి అంశాలు టీవీ చానళ్ల ప్రైమ్ టైమ్ చర్చల్లోకి రావు. అందుకే ఉన్నత తరగతి బాగా ఆసక్తి చూపే ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలపైనే అతిశయించిన స్థాయిలో చర్చ చేస్తుంటారు. అయితే తరచుగా యాంకర్లు తమ కంటెంట్ జనాదరణకు సంబంధించిన ఈ వ్యవస్థాగత అంశాలను తమ వ్యక్తిగత ప్రతిభతో గందరగోళపరుస్తుంటారను కోండి. అయితే ఈ వ్యవస్థాగత కారణాల వల్లే ఇంగ్లిష్ యాంకర్ అత్యంత శక్తిమం తుడు అవుతున్నాడు. గడిచిన కొన్ని సంవత్సరాల్లో అర్నాబ్ వంటి యాంకర్లు చేస్తున్న డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వమే తన విధానాలను, చర్యలను సవ రించుకోవలసి వచ్చిందన్న మాట వాస్తవం. ప్రభుత్వంలో కాస్త వివేకవంతుడైన వ్యక్తి ఈ విషయంలో తన విశ్లేషణను నాతో పంచుకున్నారు. దాంట్లో కొంత భాగాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆయన ఇలా చెప్పాడు: ‘అర్నాబ్ ఇప్పుడు ఎజెండాను రూపొందిస్తున్నారు... చైనా, పాకిస్తాన్ల నుంచి భారత్‌కు ఇక్కడి నుంచి ఆ దేశాలకు నేతలు చేసే సందర్శనలను సరిహద్దుల్లోంచి జొరబడుతున్న చొరబాటుదారుల చిత్రాలతో, లేక ఇన్ఫ్రారెడ్ చిత్రాలతో చూపిస్తుంటారు. అలాంటి సందర్శనలను నిలిపివేయిం చడం లేదా దాని ప్రభావాన్ని పలుచబారేలా చేయడమే దీని లక్ష్యం.’ ఇలాంటి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుంది. ఎందుకంటే టీవీ యాంకర్ అనేవాడు పాపులారిటీ, రేటింగుల కంటే మించిన ప్రాధాన్యత కలిగిన వాడు కాదు. తమకున్న జనాకర్షణ జాతి హితంతో ముడిపడి ఉందని అతడు లేదా ఆమె భావిస్తూండవచ్చు. అయితే కొన్ని అంశాలలో ఇది వాస్తవం కాదు అనడంలో వివా దమే లేదు. అలాంటి సందర్భాల్లో మనకు ఎంత నష్టం జరుగుతుంది? దుర దృష్టవశాత్తూ టీవీ చర్చలో ఇది ఒక అంశంగా ముందుకు రావడం లేదు. (వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ) -
'అది ప్రసారమైతే నా పరువు పోయేది'
టీవీల్లో వార్తలు చదివేవాళ్లు ఎప్పుడూ నల్లకోటే వేసుకుంటారెందుకు? సాధారణ దుస్తులు ధరిస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు జవాబులు చెప్పుకునేముందు నల్లకోటు వేసుకోకపోవడం వల్ల ఓ యాంకరమ్మ పడ్డ పాట్లేంటో చూద్దాం.. లాస్ ఏంజిల్స్ కేంద్రంగా నడిచే కేటీఎల్ఏ 5 అనే న్యూస్ ఛానెల్లో వాతావరణ వార్తలు చదివే లిబర్టే చాన్ అనే యాంకర్.. నల్లకోటు లేకుండా ఇంటినుంచే వేసుకొచ్చిన తెల్లగౌనులోనే వార్తలు చదివేందుకు సిద్ధమైంది. గ్రీన్ మ్యాట్ ముందు నించొని, ఏయే నగరాల్లో ఎంతెంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో చదివేప్రయత్నం చేసింది. అయితే ఔట్ పుట్ వీడియోలో పట్టణాల తాలూకు టెంపరేచర్లు ఆమె దుస్తులపై పడి, శరీరకొలతలను చూపుతోందా!? అన్నట్లు ఛాతి, నడుం, కిందిభాగాల్లో నంబర్లు కనిపించాయి. విషయాన్ని గమనించిన కెమెరామెన్.. పరుగున వెళ్లి నలుపు రంగు కోటును అందించాడు. ఎడిటింగ్ లో కట్ చేశారుగానీ ఆ వీడియో అలానే ప్రసారమయ్యేదుంటే నా పరువు పోయేదేనని యాంకరమ్మ చెప్పింది. రెండు రోజుల కింద జరిగిన ఈ తంతంగాన్ని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు కెమెరామన్. యాంకర్లు నల్లకోట్లు వేసుకుంటే తప్ప వాళ్ల వెనకుండే గ్రీన్ మ్యాట్ లో దృశ్యాలను ఎఫెక్టివ్ గా ప్రసారం కావు. లైటింగ్. ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ ల ప్రాధాన్యంతో నడిచే గ్రీన్ మ్యాట్ మీద షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నీడ(షాడో) లు రాకుండా చూసుకోవటం, లైటింగ్ సెట్ చేసాక సాఫ్ట్ వేర్ ను మరోసారి పరిశీలించడం వంటి జాగ్రలు పాటిస్తారు. గ్రీన్ లేదా బ్లూ మ్యాట్ లో దృశ్యాలు ప్రసారం చేసేటప్పుడు డోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ , ఫైనల్ కట్ ప్రో సాఫ్ట్ వేర్ లను వినియోగిస్తారు. చిన్నచిన్న మార్పులతో టీవీ ప్రసారాలు, సినిమా షూటింగ్ లకు వాడేది ఈ సాఫ్ట్ వేర్లే. దీని పనితీరు కూడా లైటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టే ఇబ్బందులు తలెత్తకుండా న్యూస్ రీడర్లు నల్లకోట్లు ధరిస్తారు. -
కూరకి తాలింపు మాటకు లాలింపు
డా.గురవారెడ్డి మా అమ్మ ఎప్పుడూ ఒక సూక్తి చెప్తుండేది... ‘కూరకి తాలింపు - చీరకి జాడింపు - మాటకి లాలింపు’ అవసర మని. కూర సంగతి, చీర సంగతి మనకు పెద్ద తెలియదు కానీ - మాటకి మట్టుకు లాలింపు ఉండాల్సిందేనని నా గట్టి నమ్మకం. అలా అని నేను మహా మృదు భాషాప్రవీణుడిని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మన ఒంట్లో మృదు భాషణం లేదు - మిత భాషణం అంత కన్నా లేదు. నాకు నిశ్శబ్దం నిస్తేజంలా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ వాగుతూనే, తూగుతానే (తాగుతూ కాదండీ బాబూ) బాల్చీ తన్నేయాలని నా కోరిక. వాగుడు ఇష్టం కాబట్టి చుట్టుపక్కల వాళ్లని గమనించడం సహజమే కదా! అప్పుడు తెలిసింది ఏమిటంటే వాగుడులో చాలా రకాలుంటాయని. కొందరు ఇనుప సుత్తెలు. వారు బాదుతుంటే మనకు వెంటనే తెలిసిపోతుంది. తప్పించుకో వచ్చు ఏదో వంకబెట్టి. కానీ మరికొందరు రబ్బరు సుత్తెలు. వీళ్లతో డేంజర్. మొదట పెద్ద నొప్పి ఉండదు. ఓ గంట పోయాక కాని ఆ దెబ్బల ప్రభావం తెలీదు. సంభాషణాచతురులు కొందరుం టారు. వీరితో మనం ఏం మాట్లాడ ప్రయత్నించినా దాన్ని లాఘవంగా మెడలు వంచి, విరిచి, తమవైపుకు తిప్పేసి, వారెంత ఘనాపాటులో, వారికి ఎంత పరపతి ఉందో, వారెంతమంది బడుగు వర్గాలను ఉద్ధరించారో, ఇత్యాది విషయాలన్నీ అయిదు నిమిషాల్లో చెప్పేయగలరు. కొంతమంది ప్రతి విష యానికీ, మళ్లీ మాట్లాడితే ప్రతి వాక్యానికీ వ్యంగ్య బాణాన్ని అనుసంధించి మన గుండెకి గుచ్చుకునే రీతిలో వదులుతారు. ఉదాహరణకి - ‘ఇపుడేనా రావడం’ అని పలకరిస్తే, - ‘ఆహా! రాత్రికే వచ్చి, మెట్ల కింద పడుకుని, ఇప్పుడు కనపడుతున్నాను మీకు’ అంటారు. సరే ఆ వ్యంగ్యాన్ని దిగమింగి, ‘ఆరోగ్యం బాగుందా’ అంటే ‘నాకేం గుండ్రాయిలాగున్నా - కనపడ్డంలా?’ అని మరో విసురు. నాకు తెలిసిన ఓ డాక్టరు స్నేహితుడుండేవాడు ఇంగ్లండులో. ఆయన పార్టీలో ఉన్నాడంటే - ఆ దరి దాపులకు వెళ్లేవాణ్ని కాదు. ఆయన డైలాగులు కొన్ని వినిపిస్తాను మీకోసం. ‘ఏవాయ్. పెద్ద హాస్పిటల్ పెట్టి తెగ సంపాదిస్తున్నావటగా. జాగ్రత్త - డబ్బు జబ్బు చేసి గబ్బుపట్టిపోతావ్.’ - ‘సూట్ కొత్తది లాగుందీ - ఒరిజినల్ యేనా - మేడ్ ఇన్ చైనానా’ - ఇవి మచ్చు తునకలు మాత్రమే. ఈ డాక్టరుగారి వ్యంగ్య హాస్యాన్ని వాళ్లావిడ ఎలా తట్టుకుంటుందో - తిట్టుకుంటుందో!! మరికొంతమంది ఊతపదాల సామ్రాట్టులుంటారు. సంభాషణలో ప్రతి మాట వెనక ఊతపదం లేకపోతే వాళ్లకి మాటలు పడిపోతాయి. బాపట్లలో ఓ తెలుగు టీచరుండేవాడు. ‘పోనీలే’ ఆయన ఊతపదం. ‘సర్, రేపు స్కూల్ సెలవు’ అంటే ‘పోనీలే’, ‘సర్, తెలుగు పుస్తకం పోయింది’ అంటే మళ్లీ ‘పోనీలే’. ఓసారి హెడ్మాస్టర్ భార్య చనిపోయింది. అసెంబ్లీలో బంట్రోతు వచ్చి ‘అయ్యా! హెడ్మాస్టర్గారి శ్రీమతి చనిపోయా రయ్యా’ అంటే - ఈయన వెంటనే ‘పోనీలే’ అనడం జరిగింది. ఏదో సిన్మా అనుకుంటా - ఒక ఆసామికి ‘అంతా మీ దయ’ ఊతపదం. ‘అయ్యా బాగున్నారా’ - ‘బాగున్నాను సార్. అంతా మీ దయ’. ‘ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నట్లున్నాయ్’ - ‘అవును సార్ - అంతా మీ దయ’. ‘ఈ మధ్య మీకు కొడుకు పుట్టాడట గదా’ - ‘అవును సార్ - అంతా మీ దయ’. ఇంక మాట్లాడను - ఊతపదాల గురించి స్వస్తి. నాకు సత్సంగం అంటే చాలా ఇష్టం. మంచి మాటలు రోజూ వింటుంటే కొన్నైనా హృదయంలో తిష్ట వేసుకుని, మనల్ని మంచి మార్గాన నడిపిస్తాయని నా నమ్మకం. చాగంటివారి దగ్గర నుంచి, రంగరాజన్, జగ్గీ వాసుదేవ్, ఆచార్య రజనీష్ దాకా అందరి బోధలూ వింటాను. మంచి వక్తలతో, మంచి వ్యక్తులతో కాసేపు కూచుంటే మనసు తరించి పోతుంది. కాకపోతే అలాంటి వ్యక్తులు దొరకడమే కష్టం. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ని. వివిధ రంగాలలో నిష్ణాతులై, తలపండిపోయిన అనేకమంది గొప్పవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వారితో అవకాశం దొరికి నప్పుడల్లా ముచ్చటిస్తుంటాను. ఆ సంభాషణలు నన్ను అనుక్షణం ఉత్తేజపరచి, జీవిత గమనంలో కొత్త కోణాలను ఆవిష్కరింప జేస్తుంటాయి. శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్రెడ్డిగారితో కాసేపు కూచుంటే - మానవీయత విలువలు ఎంత ఉన్నతంగా ఉండాలో తేటతెల్లమవుతుంది. గజల్ శ్రీనివాస్‌తో మాట్లాడుతుంటే - ఆణిముత్యా ల్లాంటి జీవిత సత్యాలు దొరుకుతాయి. భగవద్గీత మొత్తం శ్లోకాలను గానం చేసిన గంగాధరశాస్త్రితో ఎంతసేపు సంభాషించినా తనివి తీరదు. శ్లోకాలను ఉటంకిస్తూ, స్వచ్ఛ మైన స్వరంలో ఆయన అందించే సూక్తులు అంతరంగాన్ని ప్రశాంతపరుస్తాయి. బాలుగారి సాన్నిధ్యం అడపాదడపా దొరుకుతుంది. ఆయన పాటలే కాదు... మాటలు కూడా భావయుక్తంగా ఉంటాయి. ఎదుటివారి అభిరుచిని, అనురక్తిని గమనించి, సరస సల్లాపం చేయడం అందరికీ వచ్చే విద్య కాదు. చుట్టుపక్కల జనం సంగతి వదిలేసినా... టీవీ యాంకర్స్ మనల్ని ‘చిత్ర’ హింసలు పెడ్తుంటారు. కొంతమందికి ఉచ్చారణ రాదు. మరికొంత మందికి ఇంటర్వ్యూ ఎలా చేయాలో రాదు. ప్రశ్న సమాధానం కంటే నాలుగు రెట్లు నిడివి ఉంటుంది. టీవీలు వదిలేసి, మంచి ఉపన్యాసం విందామని ఏ రవీంద్రభారతికో వెళ్లామను కోండి. కొంతమంది మైకాసురులు గంటల తరబడి మాట్లాడి మాట్లాడి, మనల్ని ప్రసంగ బాధితుల సంఘంలో చేర్చేస్తారు. చివరగా, నేను చెప్పదలచుకున్న దేమిటంటే - మాట్లాడటం ఓ అద్భుతమైన కళ. అది నేర్చుకోవాలి. అభ్యాసం చేయాలి. ఉంది కదా అని నోరు పారేసుకోకూడదు నలుగురిలో. సున్నితంగా ప్రియభాషణం, అతి క్లుప్తంగా మితభాషణం చేయగలగాలి. మనకు రాకపోతే అలాంటివాళ్లని పెళ్లి చేసుకోవాలి. ఓ కవి రాశాడు వాళ్లావిడ గురించి అనుకుంటా. ‘‘నడిచిందంటే గుమ్మం వరకే - నవ్విందంటే అధరం వరకే - మాటాడిందంటే నా చెవి వరకే - కోపం వచ్చిందంటే కొద్దిపాటి మౌనం వరకే’’. మా ఆవిడ కూడా ఇలాంటి బాపతే. వాల్మీకి చెప్పాడు అసలు సంభాషణ ఎలా ఉండాలో. ‘అవిస్తరం - సుదీర్ఘంగా ఉండ కూడదు, అసందిగ్ధం - అస్పష్టత ఉండకూడదు, అవిలంబితం - సాగదీసినట్లు ఉండకూడదు, అవ్యథం - నొప్పించకూడదు, ఉరస్థ కంటగం వాక్యం వర్ధతే మధ్యమ స్వరం - హృదయం నుంచి జనించిన మాటలు కంఠం ద్వారా వృద్ధి చెందుతూ మంద్రంగా మొదలై, మధ్యస్థాయి వరకే పెరగాలి తప్ప ఉచ్ఛ స్వరంలో ఉండకూడదు’ అని. నా వాగుడు వాల్మీకి లెవెల్‌కి ఎపుడు వెళుతుందో!!