'అది ప్రసారమైతే నా పరువు పోయేది'
టీవీల్లో వార్తలు చదివేవాళ్లు ఎప్పుడూ నల్లకోటే వేసుకుంటారెందుకు? సాధారణ దుస్తులు ధరిస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు జవాబులు చెప్పుకునేముందు నల్లకోటు వేసుకోకపోవడం వల్ల ఓ యాంకరమ్మ పడ్డ పాట్లేంటో చూద్దాం..
లాస్ ఏంజిల్స్ కేంద్రంగా నడిచే కేటీఎల్ఏ 5 అనే న్యూస్ ఛానెల్లో వాతావరణ వార్తలు చదివే లిబర్టే చాన్ అనే యాంకర్.. నల్లకోటు లేకుండా ఇంటినుంచే వేసుకొచ్చిన తెల్లగౌనులోనే వార్తలు చదివేందుకు సిద్ధమైంది. గ్రీన్ మ్యాట్ ముందు నించొని, ఏయే నగరాల్లో ఎంతెంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో చదివేప్రయత్నం చేసింది. అయితే ఔట్ పుట్ వీడియోలో పట్టణాల తాలూకు టెంపరేచర్లు ఆమె దుస్తులపై పడి, శరీరకొలతలను చూపుతోందా!? అన్నట్లు ఛాతి, నడుం, కిందిభాగాల్లో నంబర్లు కనిపించాయి. విషయాన్ని గమనించిన కెమెరామెన్.. పరుగున వెళ్లి నలుపు రంగు కోటును అందించాడు. ఎడిటింగ్ లో కట్ చేశారుగానీ ఆ వీడియో అలానే ప్రసారమయ్యేదుంటే నా పరువు పోయేదేనని యాంకరమ్మ చెప్పింది. రెండు రోజుల కింద జరిగిన ఈ తంతంగాన్ని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు కెమెరామన్.
యాంకర్లు నల్లకోట్లు వేసుకుంటే తప్ప వాళ్ల వెనకుండే గ్రీన్ మ్యాట్ లో దృశ్యాలను ఎఫెక్టివ్ గా ప్రసారం కావు. లైటింగ్. ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ ల ప్రాధాన్యంతో నడిచే గ్రీన్ మ్యాట్ మీద షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నీడ(షాడో) లు రాకుండా చూసుకోవటం, లైటింగ్ సెట్ చేసాక సాఫ్ట్ వేర్ ను మరోసారి పరిశీలించడం వంటి జాగ్రలు పాటిస్తారు. గ్రీన్ లేదా బ్లూ మ్యాట్ లో దృశ్యాలు ప్రసారం చేసేటప్పుడు డోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ , ఫైనల్ కట్ ప్రో సాఫ్ట్ వేర్ లను వినియోగిస్తారు. చిన్నచిన్న మార్పులతో టీవీ ప్రసారాలు, సినిమా షూటింగ్ లకు వాడేది ఈ సాఫ్ట్ వేర్లే. దీని పనితీరు కూడా లైటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టే ఇబ్బందులు తలెత్తకుండా న్యూస్ రీడర్లు నల్లకోట్లు ధరిస్తారు.