ఎక్కడైనా నేతల మాటలు నీటి మూటలే
అవలోకనం
జనాకర్షక వాగ్దానాలు చేసే నేత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక ప్రత్యేక పద్ధతిలో పరిణామం చెందుతుంటుంది. ఒక వ్యక్తి మేధస్సు దాన్ని మార్చలేదు. కాబట్టి అమెరికన్లకు ఉపాధిని కల్పిస్తామన్న ట్రంప్ వాగ్దానం శుష్క నినాదమే. అలా అని రాబోయే అధ్యక్షులు ఉద్యోగాలు కల్పిస్తాం అని వాగ్దానం చేయకుండా మానరు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు సాధారణంగా మూడు విషయాలు మాట్లాడుతుంటారు. వాషింగ్టన్ నగరాన్ని మార్చేయడం, అమెరికా ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం, అమెరికన్లకు ఉపాధిని కల్పించడం. మొదటిది ఎన్నటికీ జరిగేది కాదు. రెండు వందల ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన వాషింగ్టన్ ఒక గొప్ప రిపబ్లిక్కుకు రాజధాని. అది, ప్రపంచంలో మరే దేశానికీ లేనంతటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను, అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని నియంత్రించే నగరం. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని అదేమీ ఎదురు చూడటం లేదు. ఏదైనా పెను మార్పును తేవడం సాధ్యమే అయినా, అది దాన్ని మరింత అధ్వానంగా మార్చేదే కావచ్చు.
‘అమెరికా ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యాన్ని ఇవ్వడం’ అంటే ఇంతకు ముందటి అధ్యక్షులు అమెరికాను రెండవ, మూడవ స్థానంలో నిలిపారనే అర్థం వస్తుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. కాబట్టి అసలు ఆ నినాదమే అర్థరహిత మైనది. విదేశాంగ విధానమంటే నిజమైన అర్థం జాతీయ విధానమేనని రిచర్డ్ నిక్సన్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన హెన్రీ కిసింజర్ అన్నారు. అంటే, అమెరికా తమ జాతీయ ప్రయోజనాల కోసమే విదేశాల్లో యుద్ధాలు చేసిం దని అర్థం. అందువలన ఆ అర్థంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. మహా అయితే గెలవలేని యుద్ధాలు సాగిస్తున్న తమ సేనలను స్వదేశా నికి తిరిగి రప్పిస్తారు. కానీ ఆయన ఆ పని చేస్తున్న మొదటి అధ్యక్షులు కాలేరు.
ఇక మూడవ వాగ్దానం చాలా ఆసక్తికరమైనది. ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే అమెరికా ఎన్నికలకు సంబంధించిన నిజమైన సమస్యలని అంటారు. బ్లూ కాలర్ ఉద్యోగాలు చేసే శ్వేత జాతీయులు ట్రంప్ ఓటు బ్యాంకు. బ్లూ కాలర్ ఉద్యోగులు అంటే వ్యవసాయేతరమైన శారీరక శ్రమ చేసే కార్మికులు. హెన్రీ ఫోర్డ్ తన కంపెనీలో విడి భాగాలను కార్లుగా అసెంబుల్ (కూర్పు) చేసే కార్మికులు సైతం కొనుక్కోగలిగిన చౌక కార్లను తయారుచేశాడు. తద్వారా ఆయన బ్లూ కాలర్ ఉద్యోగులను మధ్యతరగతిలో భాగంగా మారే క్రమాన్ని ప్రారంభించాడు.
ముప్పయ్యేళ్ల క్రితం నేను విద్యార్థిగా జేన్స్‌విల్లేలో జాన్సన్ అనే ఆయన ఇంట్లో ఉండేవాడిని. ఆయన దశాబ్దాల తరబడి కార్ల అసెంబ్లీ కర్మాగారంలో కార్లకు చక్రాలను అమర్చే పని చేశారు. శ్రమ చేయడం ద్వారా సంపాదించిన డబ్బుతో ఆయన చక్కటి ఇల్లు కట్టుకున్నారు, పిల్లలకు మంచి చదువులు చెప్పిం చారు. 1919లో ప్రారంభమైన ఆ కర్మాగారంలో 5,000 మందికిపైగా ఉద్యోగులు ఉండేవారు. చైనా, దక్షిణ అమెరికాలలో శ్రమ చౌక, శ్రామిక వ్యయాలు తక్కువ. కాబట్టి ఆ కర్మాగారాన్ని 2009లో మూసేశారు.
యాంత్రీకరణ, ఆటోమేషన్‌ల (స్వయంచాలక యాంత్రీకరణ) మూలంగా చైనా, దక్షిణ అమెరికా, భారత్‌లు కూడా నేడు అలాంటి ఉద్యోగాలను కోల్పోవడం మొదలైంది. తక్కువ ధరకు దొరికే శ్రమ స్థానంలో సైతం ప్రవేశపెట్టగలిగేటంత సమర్థవంతమైనవిగా యాంత్రీకరణ, ఆటోమేషన్‌లు మారుతున్నాయి. వస్తు తయారీ సంస్థలు తిరిగి అమెరికాకు వస్తున్నాయి. కానీ అది, శ్రమ అవసరం లేని వస్తు తయారీ. అమెరికాలో బ్లూకాలర్ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబాలు ఇంకా చాలా కాలంపాటే ఆ అధిక వేతనాల వల్ల మేలును పొందగలుగుతాయి. కొంత వరకు ఇది చైనాకు కూడా వర్తిస్తుంది. మన దేశంతో పోలిస్తే ఆ దేశ తలసరి ఆదాయం ఐదు రెట్లు ఎక్కువ. ఉద్యోగాలు లేకపోవడం, ప్రజాస్వామిక రాజకీ యాలు అనే సమస్య నిజంగా తలెత్తుతున్నది ఇక్కడ భారతదేశంలోనే. అది ఇప్పుడే, మన కళ్ల ముందే జరుగుతోంది. ఆటోమేషన్ కారణంగా ఇన్ఫోసిస్ 8 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందని కొద్ది రోజుల క్రితం తెలిసింది. ఈ సమాచారం కొంత అసాధారణమైనదే. రెండు దశాబ్దాలుగా మన సాఫ్ట్‌వేర్ కంపె నీలు ముమ్మరంగా ఉద్యోగులను పనిలోకి తీసుకుంటున్నాయి. ఆ ధోరణి ముగిసి పోయింది. ఇప్పుడు అవి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుని, చిన్న, మరింత నైపు ణ్యవంతమైన శ్రామిక శక్తిని సమకూర్చుకోవడం ప్రారంభించాయి. వారు ఇక ఎంత మాత్రమూ భారీ సంఖ్యలో నియామకాలు చేయరు. ఇది, మన నగరాల లోని వైట్ కాలర్ ఉద్యోగులు (ఆఫీసులో డెస్క్ లేదా కంప్యూటర్ వద్ద పనిచేసే వారు), విద్యావంతులు సైతం ఎదుర్కొంటున్న సమస్య. ఇక పట్టణాలు, గ్రామా లలో కోట్ల కొలదిగా ఉన్నవారి గతి ఏం కావాలి? వారు చిక్కుల్లో ఉన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై సాగుతున్న ఆందోళనల స్వభావాన్ని మనం ఈ అశాంతిని ప్రతిపాదికగా చేసుకునే అర్థం చేసుకోవాల్సి ఉంది. గుజ రాత్‌లోని పాటిదార్లు, హరియాణాలోని జాట్లు, మహారాష్ట్రలోని మరాఠాలు చేస్తున్న ఆందోళనల ప్రధాన డిమాండు గౌరవప్రదమైన వేతనాన్ని అందించగల బ్లూ కాలర్ ఉద్యోగాలు కావాలనేదే. అది నేడు అసాధ్యం. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని మరే దేశంలోనైనా ఇకపై భారీ ఎత్తున అలాంటి ఉద్యోగాలు లభించవు. కార్మికుల సంఖ్య పెరగడం వల్ల లేదా సామర్థ్యం మెరుగుపడటం వల్ల ఉత్పత్తి పెరిగి, ఆర్థిక వృద్ధి పెంపొందుతుంది. మన దేశంలో నైపుణ్యంలేని, చదు వులేని, ఏదైనా వస్తువును ఉత్పత్తి చేయగల సామర్థ్యం లేని శ్రామికులు మరీ ఎక్కు వగా ఉన్నారు. శ్రమ వ్యయం తక్కువగా ఉండటమే లాభదాయకం కాదు. ఏ అద్భుత విధానము, నినాదము, లోగో దాన్ని మార్చలేవు.
భారత్‌లోనైనా, అమెరికాలోనైనా జనాకర్షక వాగ్దానాలు చేసే నేత విష యంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచం సంక్లిష్టమైనది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక ప్రత్యేక పద్ధతిలో పరిణామం చెందుతుంటుంది. ఒక వ్యక్తి మేధస్సు దాన్ని మార్చ లేదు. కాబట్టి అమెరికన్లకు ఉపాధిని కల్పిస్తామన్న ట్రంప్ వాగ్దానం శుష్క నినాదం మాత్రమే. అలా అని తదుపరి రాబోయే అధ్యక్షులు కూడా వాషింగ్టన్‌ను మార్చేస్తాం, అమెరికా ప్రయోజనాలను ప్రథమ స్థానంలో ఉంచుతాం, అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం అని వాగ్దానం చేయకుండా మానరు.
ఆకార్ పటేల్
aakar.patel@icloud.com