భయానక ప్రపంచం వైపు మీడియా పయనం..! | opinion on ND TV ban over pathan kot issue by aakar patel | Sakshi
Sakshi News home page

భయానక ప్రపంచం వైపు మీడియా పయనం..!

Published Sun, Nov 6 2016 2:04 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

భయానక ప్రపంచం వైపు మీడియా పయనం..!

భయానక ప్రపంచం వైపు మీడియా పయనం..!

అవలోకనం
సోషల్‌ మీడియా వార్తాపత్రికలకు ప్రత్యామ్నాయం కాదు. వార్తాపత్రికలు గతించనున్న భవిష్యత్‌ కాలంలో సరైన విధంగా సమాచారాన్ని అందించే సామగ్రిని ప్రజలు తీవ్రంగా కోల్పో నున్నారు. ఉద్రేకం, ఆగ్రహం ప్రాతిపదికన పోటీపడుతున్న అర్నాబ్‌ తదితర యాంకర్లతో పూర్తిగా ప్రాచుర్యం పొందిన జర్నలిజం ప్రపంచాన్ని మనం వదిలిపెడతాము. ప్రాథమిక సమాచారం కూడా లేకుండానే తమ ఫోన్‌లను బయటకు తీసి వ్యాఖ్యను ట్వీట్‌ చేసే ప్రజల్లోకి వచ్చి పడతాము. అది నిజంగానే ఒక భయానక ప్రపంచంగా ఉంటుంది.

గత కొన్ని రోజులుగా మీడియానే తనకు తానుగా వార్తల్లో నిలిచింది. మొదటగా భారత్‌లో అత్యంత జనరంజక ఇంగ్లిష్‌ జర్నలిస్టు, మైలురాయిని నెలకొల్పిన టీవీ షో యాంకర్‌ తన పదవి నుంచి వైదొలిగారు. భారత్‌లో జర్నలిజం దిశ దశను నిర్దేశించిన దశాబ్దానికి ముగింపు పలకాలని అర్నాబ్‌ గోస్వామి నిర్ణయించుకున్నారు. రిపోర్టింగ్‌ ద్వారా కాకుండా యాంకరింగ్‌ ద్వారా అతడు దీన్ని సాధిం చారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎడిటర్‌ కొద్ది రోజుల క్రితం సాక్షాత్తూ ప్రధానమంత్రి ముందే ఒక సంచలన ప్రసంగం చేస్తూ ‘సెల్ఫీ జర్నలిజం’ అనే భావనను ప్రతి పాదించారు. ప్రపంచం వైపుకు కాకుండా జర్నలిస్టు వైపు కెమెరాను ఫోకస్‌ చేసే జర్నలిజంగా ఆయన వర్ణించారు. కనీసం భారత్‌లో అయినా గోస్వామి ఈ తరహా శైలికి మార్గదర్శిగా, దాని అత్యుత్తమ ప్రతినిధిగా అయ్యారు.

అన్ని ఇంగ్లిష్‌ చానల్స్‌కు మాదిరే తన చానల్‌కు కొద్దిమంది వీక్షకులే ఉంటు న్నారు. ప్రత్యేకించి ఆ చానల్‌ వాణిజ్యపరంగా కూడా పెద్ద చానల్‌ ఏమీ కాదు. ఎందుకంటే వార్తా చానళ్ల కంటే వార్తాపత్రికలే ఇప్పటికీ అధికంగా డబ్బు సంపా దిస్తున్నాయి. అయితే నగర ఉన్నత వర్గాలు అతడి షోను చూసేవి కాబట్టి అతడి చానల్‌ ప్రభావశీలంగా ఉండేది. ఈ కారణం వల్లే జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యా లయంలో నినాదాలు, ఒక ప్రముఖ వ్యక్తి కుమార్తె హత్య వంటి కథనాలపై అర్నాబ్‌ ఎంతో ఉద్రేకంగా మాట్లాడేవారు. నిజానికి ఇవి చాలామంది భారతీయు లకు అసంగతమైన కథనాలు. దారిద్య్రం, నిరక్షరాస్యత, ఆకలి వంటి సమస్యలు అతడి షోలో కనిపించవు. పాకిస్తాన్‌ ఉగ్రవాదం, సర్జికల్‌ దాడుల పైనే అతడు పట్టించుకుంటాడు. సమతుల్యత లేని అతడి సుదీర్ఘ, గంభీరోపన్యాసాలు అతడి దేశానికి హాని కలిగించాయనడం నిజమే. కానీ తాను చేస్తున్న పనిలో అతడు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించడం కూడా అంతే నిజం.

మరి అతడిప్పుడు ఎందుకు తన స్థానం నుంచి వైదొలిగాడు. బహుశా తానిం తవరకు చేసినదానిపట్ల వేగిపోయివుండవచ్చు. అలాంటి ప్రదర్శనలు తనకిక అవ సరం లేదని అనుకుని ఉండవచ్చు. సొంత చానల్‌ను కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది నిజమే అయితే, జర్నలిస్టుకు ఒక వేదిక చాలా ముఖ్యమైనదని అతడు గుర్తిస్తాడని ఆశిస్తాను. ఒక చోట ప్రాచుర్యం పొందిన వారిలో అనేకులు మరొక చోట పూర్తిగా విఫలమయ్యారు. గ్లెన్‌ బెక్‌ సొంత చానల్‌ స్థాపించక ముందు ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌లోని స్టార్‌ జర్నలిస్టులలో ఒకడు. కానీ అతడి సొంత చానల్‌ విఫలమైంది. అర్నాబ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నాను. భారతీయులను నిజంగా ప్రభావితం చేస్తున్న అంశాలపై ఇకపై అతడు నివేదిస్తాడని ఆశిస్తున్నాను.

ఇక రెండో కథనం... జాతీయ భద్రతను ప్రమాదంలో పడవేసిన, సున్నిత సమాచారాన్ని నివేదించిందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం మరొక వార్తా చానల్‌ ఎన్డీటీవీపై ఒక రోజు నిషేధం విధించింది. అనేక వార్తా చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేసిన పఠాన్‌కోట్‌ దాడిపై నివేదన అది. అయితే ప్రభుత్వం సూచిస్తున్నంత ప్రమా దాన్ని నిజానికి ఎన్డీటీవీ కవరేజ్‌ కలిగించలేదని రిపోర్టులు చెబుతున్నాయి. మీడి యాను భారీగా సెన్సార్‌ చేసిన ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీతో ప్రస్తుత ఒక రోజు నిషేధాన్ని పోలుస్తూ ఎడిటర్స్‌ గిల్డ్‌ ప్రకటన కూడా చేసింది.

వాస్తవానికి ఆ కవరేజ్‌ ఎంత హాని కలిగించిందనేది మనకు తెలీదు. పైగా ఎన్డీటీవీ చాలా జాగరూకత, యథాతథమైన చానల్‌ అనిదాని వీక్షకులకు తెలుసు. అయితే టెలివిజన్‌ వార్తల కవరేజీ సాధారణంగానే ప్రమాదకరంగా మారు తోందని చెప్పగలను. రిపోర్టింగ్‌పై కాక, వ్యాఖ్యానం ప్రాతిపదికనే టీవీ ప్రసా రాలకు సంబంధించి పెట్టుబడి సమకూరుతోంది కాబట్టి టీవీ మాధ్యమం చాలా నిర్లక్ష్యంగా ఉంటోంది. పైగా, ఆ వార్తను పూర్తిగా పరిశీలించి, అర్థం చేసుకోవ డానికి ముందే వార్త ప్రసారం అయిన వెంటనే వ్యాఖ్య ప్రారంభమవుతోంది.

టీవీ మీడియా స్వభావమే అలాంటిది. దురదృష్టవశాత్తూ విషయాల్లో మార్పు జరగడం లేదు. వార్తల్లోని మూడో అంశం ఏదంటే, భారతీయ పాఠకుల సర్వేని ఎలా నిర్వహిస్తున్నారన్న విషయాన్ని ఒక వార్తా నివేదిక వర్ణిస్తోంది. ఇది చాలా పెద్ద పని. తాము ఏ వార్తా పత్రికలు, మ్యాగజైన్‌లు చదువుతున్నామనే అంశంపై లక్షలాది పాఠకులు సర్వేలో పాల్గొంటారు. పాఠకుల సంఖ్యలో వివాదం నెలకొనడంతో కొన్నేళ్లుగా సర్వే ఫలితాలను వెల్లడించడం లేదు. పాఠకుల సంఖ్య మొత్తంమీద తగ్గుతోందని అనేక పత్రికలు తెలుపుతున్నాయి. పాశ్చాత్య ప్రపం చంలో కూడా వార్తాపత్రికల పఠనం, దాని ద్వారా వచ్చే ఆదాయాలు వేగంగా పడిపోతున్న ధోరణి కనిపిస్తోంది. సర్వే ఎప్పుడు వెలుగులోకి వచ్చినా భారతీయ ప్రచురణలను కూడా ఈ ధోరణి ప్రభావితం చేస్తున్నట్లు అది చూపుతుందనే నా అంచనా. మ్యాగజైన్‌లు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వార్తా పత్రి కలు కూడా త్వరలోనే దీన్ని అనుసరించబోతున్నాయి.

నా ఉద్దేశంలో ఇది మన దేశానికి అతి పెద్ద విషాదం. సీరియస్‌ జర్నలిజంలో టీవీ ఆసక్తి చూపని వాతావరణాన్ని మనం ఇప్పటికే చూస్తున్నాం. వార్తాపత్రికల లాగా టీవీ మాధ్యమం వార్తల రిపోర్టుతో ముడిపడటం లేదు. నా దృష్టిలో సోషల్‌ మీడియా వార్తాపత్రికలకు ప్రత్యామ్నాయం కాదు. పరిచయాలతో, క్షేత్రస్థాయి అనుభవాల ప్రాతిపదికన రాసే పూర్తి కాలం రిపోర్టర్ల స్థానాన్ని  140 కేరక్టర్ల పరిశీ లనలను పంపే లక్షలాది ప్రజలు పూరించలేరు. వార్తాపత్రికలు గతించనున్న భవి ష్యత్‌ కాలంలో సరైన విధంగా సమాచారాన్ని అందించే సామగ్రిని ప్రజలు తీవ్రంగా కోల్పోనున్నారు. వార్తా పత్రికలు లేని ప్రపంచంలోకి పరివర్తన త్వరలో జరిగినట్లయితే, పత్రికలు వదిలివెల్లిన చోటును అందుకునేందుకు తగిన మీడియా ఉండబోదని నేను ఆందోళన చెందుతున్నాను.

ఉద్రేకంతో, ఆగ్రహంతో పోటీపడుతున్న అర్నాబ్‌ వంటి యాంకర్లతో పూర్తిగా ప్రాచుర్యం పొందిన జర్నలిజం ప్రపంచాన్ని వదిలి పెడతాము. ప్రాథమిక సమా చారం లేకుండానే తమ ఫోన్‌లను బయటకు తీసి వ్యాఖ్యను ట్వీట్‌ చేసే ప్రజల్లోకి వచ్చి పడతాము. అది నిజంగానే ఒక భయానక ప్రపంచంగా ఉంటుంది.


(వ్యాసకర్త : ఆకార్‌ పటేల్‌ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement