భీకర రికార్డులు – ఘోర పరాజయాలు | aakar patel writes on india vs south africa test match | Sakshi
Sakshi News home page

భీకర రికార్డులు – ఘోర పరాజయాలు

Published Sun, Jan 14 2018 12:20 AM | Last Updated on Sun, Jan 14 2018 6:42 AM

aakar patel writes on india vs south africa test match - Sakshi

స్వదేశంలో ప్రపంచ రికార్డులనే బద్దలు చేసి పడేసే మన బ్యాట్స్‌మెన్‌ విదేశాల్లో బౌన్సీ వికెట్ల ముందు సాగిలపడిపోతుంటారు. కారణం మనం బ్యాటింగ్‌ పిచ్‌లను రూపొందించుకోవడమే. మేటి బ్యాట్స్‌మెన్‌లకు నెలవుగా ఉండే భారత జట్టు మేటి బౌలర్ల విషయంలో వెనుక చూపు చూస్తుండటం తెలిసిందే. రెండో తరగతి పౌరులుగా దిగజార్చివేసినప్పటికీ, మన బౌలర్లు చక్కటి ప్రదర్శన చేసినప్పుడే మనకు విదేశీ విజయాలు లభిస్తుంటాయి. బలహీన బౌలింగ్‌ పరిస్థితిని మార్చాలంటే మన మౌలిక వ్యవస్థలో మార్పుతోటే ప్రారంభించాల్సి ఉంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ను నేను అంత ఎక్కువగా చూడలేకపోయాను. అది ఒకందుకు మంచిదే అయింది. నేను క్రికెట్‌ ప్రేమికుడిలా నటిస్తుం టాను కానీ నా జాతీయవాదమే నన్ను ఆటను చూసేలా చేస్తుంటుంది. భారత్‌ ఓడిపోతున్నప్పుడు నేను ఆటను చూడలేను. మన జట్టు ఇప్పుడు అంత బలహీనమైన జట్టేమీ కాదు. జట్టు పని తీరుకు ఏమాత్రం తగని విధంగా జాతీయ జట్టుకు మనం పూర్తి మద్దతు ఇచ్చిన రోజులు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు అలాంటి స్థితి లేదు. 

తొలి టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో కొన్ని సందర్భాల్లో మనమే గెలి చినట్లు కనిపించిది. కానీ బౌన్సీ వికెట్‌ ముందు మన బ్యాట్స్‌మెన్‌ తలవంచారు. దక్షిణా్రíఫికాలో బౌన్సీ వికెట్‌ ఉండటం కొత్తేమీ కాదు. రెండో టెస్టు కూడా ప్రారంభమైనందున కొన్ని అంశాలను పరిశీలిద్దాం. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత్‌ ఎల్లప్పుడూ బ్యాటింగ్‌ ప్రాతిపదిక గల జట్టుగానే ఉంటూ వచ్చింది.

మన మేటి క్రికెటర్ల పేర్లు చెప్పాల్సి వస్తే, గవాస్కర్, టెండూల్కర్, కోహ్లీ లను ప్రస్తావించాలి. పాకిస్తానీయులు కూడా ఇమ్రాన్, వసీమ్, వకార్‌ గురించి చెప్పుకుంటారు. కానీ గొప్ప బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే గొప్ప బౌలర్లు అరుదుగానే ఉంటారు. ఆయా దేశాల జట్లకు చెందిన  11మంది ఆల్‌టైమ్‌ ఆటగాళ్ల జాబితాను రూపొందించడానికి ప్రయత్నించినప్పుడు ఇది స్పష్టమవుతుంది. ఉపఖండానికి పరిమితమైతే.. నేను పాక్‌ జట్టును ఇలా చూస్తాను: హనీఫ్‌ ముహమ్మద్, సయీద్‌ అన్వర్, జహీర్‌ అబ్బాస్, జావిద్‌ మియాందాద్, ఇంజమామ్‌ ఉల్‌ హక్, యూనిస్‌ ఖాన్, రషీద్‌ లతిఫ్, ఇమ్రాన్‌ ఖాన్, వసీమ్‌ అక్రమ్, వకార్‌ యూనిస్, షోయబ్‌ అక్తర్‌. ఇక భారత్‌ జట్టు కూర్పును నేను ఇలా చూస్తాను: గవాస్కర్, సెహ్వాగ్, కోహ్లీ, టెండూల్కర్, ద్రావిడ్, గంగూలీ, ధోనీ, కపిల్‌ దేవ్, కుంబ్లే, శ్రీనాథ్, జహీర్‌.

ఈ రెండు జట్లలో మరింత సమతుల్యతతో, ఆడేందుకు కష్టమైన జట్టు ఏది? (కనీసం కాగితంమీద అయినా) మనది మాత్రం కాదు. రెండు జట్ల మధ్య తేడా ఏమిటంటే, మన బౌలింగ్‌ బలహీనమైనది. భారత్‌లో బ్యాట్స్‌మెన్‌ కంటే శ్రమించే బౌలర్లు తక్కువగా ఉంటారు. ఇక్కడ ఆట ఆడే విషయంలో రెండో అంశం కూడా ఉంది. ఎందుకంటే మనది బ్యాటింగ్‌ ప్రధాన జట్టు. మనం బ్యాట్స్‌మెన్‌కి అనుకూలమైన వికెట్లను, పిచ్‌ని తయారు చేస్తాము. 2009లో క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్‌ కోసం రాసిన వ్యాసంలో ఎస్‌. రాజేష్‌ మన వికెట్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించవంటూ గణాంకాలతో సహా వివరించారు. భారత్‌లో 40 శాతం టెస్టులు డ్రాగా ముగుస్తాయి. కాగా, దక్షిణాప్రికాలో మాత్రం 7 శాతం టెస్టులు మాత్రమే డ్రాగా ముగుస్తాయి. ఆస్ట్రేలియాలో చూసినా డ్రాలు 11 శాతం మాత్రమే.

భారత్‌లో భారీ స్కోర్లు అసాధారణం కాదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో రెండు పక్షాలూ తమ తొలి ఇన్నింగ్స్‌లో తలొక 200 పరుగులు చేశాయి. మన గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో ఇలాంటిది ఎన్నడూ సంభవించదు. మన మైదానాల్లో బౌలర్లు ఇలాంటి ఫలితాన్ని సాధించే అవకాశమే ఉండదు. అందుకే తొలి టెస్టులో మనం ఓడిపోయిన తరహా పిచ్‌లను స్పోర్టింగ్‌ వికెట్లు అంటుంటారు. బౌలర్లకు కూడా ఫలితాలు చూపే అవకాశం ఇస్తాయి కాబట్టే వాటిని స్పోర్టింగ్‌ వికెట్లు అంటుంటారు. ఉదాహరణకు 2000–2010 మధ్య దశాబ్ద కాలంలో టెస్టులలో బౌలర్లకు చక్కగా ఉపయోగపడిన 10 మైదానాలను లెక్కించినట్లయితే, వీటిలో ఒక్కటంటే ఒక్క భారతీయ మైదానం కూడా లేదు. మరోవైపున, తొలి ఇనింగ్స్‌లో సగటున భారీ స్కోరు సాధించిన 10 మైదానాల్లో భారత్‌కి చెందినవి మూడు ఉన్నాయి: కోల్‌కతా, బెంగళూరు, మొహాలి.

ఈ పరిస్థితులే భారత జాతీయ జట్టును బౌలింగ్‌లో బలహీనంగానూ, బ్యాటింగులో బలమైన జట్టుగానూ రూపొందించాయి. కానీ ఆ బ్యాటింగ్‌ బలం కూడా సొంత మైదానాల్లోనే ఉంటుంది. భారతీయులలో అనేకమంది స్పిన్నర్లను, మందకొడి వికెట్లను చూసేందుకు ఇష్టపడరని చెప్పగలను. కానీ నాతోపాటు చాలామందిని తొలి సెషన్‌ పూర్తిగా, ఆ తర్వాత కూడా బౌన్సీ వికెట్‌పై దూసుకొచ్చే బంతులను చూస్తుండటమే బాగా ఉద్వేగపరుస్తుంటుంది.

మరొక అంశమేదంటే, నిజమైన ఫాస్ట్‌ బౌలర్‌ మంచి బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెడుతుండటం. శ్రీలంక లేదా భారత్‌లో మ్యాచ్‌ను చూడటం కంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో ప్రమాదకరంగా ఉండే బౌన్సీ వికెట్‌ను చూడటం పూర్తి భిన్నంగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌ గాయపడటాన్ని నేను చూడాలనుకోను ఆటలో ఉద్వేగం తీసుకొచ్చేది ఇదే. కానీ భారత్‌లో ఇలాంటిది అస్సలు కనబడదు. ఒక అంశంలో మనం నిజాయితీగా ఉందాం. భారత్‌లో టెస్టు క్రికెట్‌ చూడటం విసుగ్గానూ, చాలావరకు చూడటానికి అననుకూలంగానూ ఉంటుంది. 

ఈ పరిస్థితిని మార్చాలంటే మన మౌలిక వ్యవస్థలో మార్పుతోటే ప్రారంభించాలి. బీసీసీఐ ప్రపంచంలోనే అతి సంపన్నమైన సంస్థ అయినప్పటికీ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పోలిస్తే మన స్టేడియంలు పరమ చికాకును కలి గిస్తాయి. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా గ్రౌండ్‌ అయితే ప్రపంచంలో అత్యంత భయంకరమైన స్టేడియం. ఇది పూర్తిగా సిమెంట్‌ దూలాలతో ఉండటమే కాకుండా ప్రతి చోటా ప్రకటనలే కనిపిస్తుంటాయి. మనకు ఎలాంటి క్రికెట్‌ కావాలో వికెట్లే నిర్ణయిస్తుంటాయి. మనం మీడియం పేస్‌ బౌలర్లు లేక స్పిన్నర్లను కోరుకుంటున్నామా లేక ఊపిరిని బిగబట్టేలా చేసే ఫాస్ట్‌ బౌలర్లను కోరుకుంటున్నామా లేక వాంఖడే, ఈడెన్‌ గార్డెన్స్‌లో రికార్డులను భీకరంగా బద్దలు చేస్తూనే, దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో కొన్ని ఓవర్లను కూడా తట్టుకోలేని బ్యాట్స్‌మెన్‌ను కోరుకుంటున్నామా?

మొదటే చెప్పినట్లుగా, నేను భారత క్రికెట్‌ జట్టు ప్రేమికుడినే కాని క్రికెట్‌ ఆట ప్రేమికుడిని కాదు కాబట్టే నేను క్రికెట్‌ ఆటను చూస్తుంటానని నా అనుమానం. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న రెండో టెస్టును, అలాగే సిరీస్‌ను కూడా మనం గెలుచుకుంటామని ఆశిస్తాను. కానీ అలా గెలిచినప్పటికీ, అదెలా సాధ్యపడుతుం దంటే, రెండో తరగతి పౌరులుగా దిగజార్చివేసినప్పటికీ, మన బౌలర్లు చక్కగా ఆడినందుకే అయి ఉంటుంది.









వ్యాసకర్త కాలమిస్టు, రచయిత 
ఆకార్‌ పటేల్‌
aakar.patel@icloud.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement