విరాట్ కోహ్లి అండ్ గ్యాంగ్
జోహెన్నెస్‌బర్గ్: ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. స్వదేశంలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఘనత సాధించిన కోహ్లి.. విదేశీ పర్యటనలో ఘోర పరాభవాన్ని చవిచూశాడంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మండిపడ్డారు. ప్రధానంగా కోహ్లి కెప్టెన్సీని టార్గెట్ చేస్తూ విమర్శకులు తమ నోటికి పని చెప్పారు. అయితే కోహ్లికి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్లెర్ వెసెల్స్ నుంచి ఊహించని మద్దతు లభించింది. సారథిగా కోహ్లి వ్యవహరించే స్టైల్‌లో ఎవరైనా తప్పులు వెతికే పని చేస్తే మాత్రం చివరకు నిరాశ తప్పదంటూ వెసెల్స్ అభిప్రాయపడ్డాడు.
' ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లినే బెస్ట్. అందులో ఎటువంటి సందేహం లేదు. సహచర ఆటగాళ్లపై నమ్మకాన్ని ఉంచుతూ గెలుపు కోసం కృషి చేసే కెప్టెన్ కోహ్లి. విరాట్‌ను బ్యాటింగ్ పరంగా చూసినా, నాయకుడిగా చూసినా గెలుపే అతని లక్ష్యం. ఆ క్రమంలోనే ఫీల్డ్‌లో అతను దూకుడుగా ఉంటాడు. ఆ దూకుడు కొన్ని సందర్బాల్లో మంచి చేస్తే, కొన్నిసార్లు విఫలం కూడా కావొచ్చు. ఓవరాల్‌గా చూస్తే భారత జట్టును నడిపించే విధానంలో కోహ్లిని వేలెత్తిచూపలేరు' అని వెసెల్స్ పేర్కొన్నాడు.
మరొకవైపు భారత పేసర్లు మొహ్మద్ షమీ, భువనేశ్వర్‌లపై వెసెల్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఇద్దరూ అత్యుత్తమ టెస్టు బౌలర్లంటూ కొనియాడాడు. దాంతో పాటు ఇషాంత్ శర్మ, రవి చంద్రన్ అశ్విన్‌లు కూడా మెరుగ్గా రాణించారన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment