దక్షిణాఫ్రికా లక్ష్యం 241 | India set target of 241 runs for south africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా లక్ష్యం 241

Published Fri, Jan 26 2018 7:51 PM | Last Updated on Fri, Jan 26 2018 7:52 PM

India set target of 241 runs for south africa - Sakshi

జోహెన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్‌ కావడంతో పోరాడే లక్ష్యాన్ని సఫారీల ముందుంచింది.  శుక్రవారం 49/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా.. మరో 198 పరుగులు చేసి మిగతా తొమ్మిది వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో కేఎల్‌ రాహుల్‌(16), చతేశ్వర పుజారా(1) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరి నిరాశపరిచారు.

ఆ క్రమంలో ఓవర్‌నైట్‌ ఆటగాడు మురళీ విజయ్‌కు జత కలిసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 43 పరుగులు జోడించిన తర్వాత విజయ్‌(25;127 బంతుల్లో 1 ఫోర్‌) అవుటయ్యాడు. అటు తరువాత కోహ్లి-రహానేల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. కాగా,  రబడా బౌలింగ్‌లో కోహ్లి(41) బౌల్డ్‌ కావడంతో 134 పరుగుల వద్ద భారత్‌ జట్టు ఐదో వికెట్‌ను నష్టపోయింది. వెంటనే హార్దిక్‌ పాండ్యా(4) కూడా నిష్క్రమించడంతో భారత జట్టు రెండొందల పరుగులు చేయడం కష్టంగా అనిపించింది.

ఆ తరుణంలో రహానే -భువనేశ్వర్‌ కుమార్‌ల జోడి 55 పరుగుల్ని జత చేయడంతో భారత్‌ తేరుకుంది. అయితే రహానే(48) హాఫ్‌ సెంచరీకి దగ్గరగా ఏడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో భువీకి జత కలిసిన మొహ్మద్‌ షమీ దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లో రెండు సిక్సర్లు, 1 ఫోర్‌తో 27 పరుగులు సాధించి విలువైన భాగస్యామ్యాన్ని జత చేశాడు.ఇక తొమ్మిదో వికెట్‌గా భువీ(33;76 బంతుల్లో 2 ఫోర్లు) అవుట్‌ కాగా, చివరి వికెట్‌గా బూమ్రా(4) పెవిలియన్‌ చేరడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  ఇషాంత్‌ శర్మ(7 నాటౌట్‌) అజేయంగా క్రీజ్‌లో మిగిలాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, మోర్నీ మోర్కెల్‌, ఫిలాండర్‌ తలో మూడు వికెట్లు సాధించగా, ఎన్‌గిడికి వికెట్‌ దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement