జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన చివరిదైన మూడో టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా వికెట్లను వరుసగా నేలకూల్చి 63 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలను 177 పరుగులకే కట్టడి చేసి చిరస్మరణీయమైన గెలుపును భారత్ సొంతం చేసుకుంది. నాల్గో రోజు ఆటలో రెండో సెషన్ తర్వాత టీమిండియా బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో గెలుపు దిశగా వచ్చిన సఫారీలు ఒక్కసారిగా బొక్కబోర్లా పడ్డారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా, బూమ్రా, ఇషాంత్ శర్మలు తలో రెండు వికెట్లు సాధించారు. భువనేశ్వర్‌కు వికెట్ దక్కింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్( 86 నాటౌట్; 240 బంతుల్లో 9ఫోర్లు, 1 సిక్స్) కడవరకూ ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.
శనివారం నాల్గో రోజు ఆటలో భాగంగా 17/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా లంచ్ సమయం వరకూ నిలకడగా బ్యాటింగ్ చేసింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు డీన్ ఎల్గర్, హషీమ్ ఆమ్లాలు బాధ్యతాయుతంగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడి 119 పరుగుల భాగస్వామ‍్యాన్ని జతచేసి సునాయాస విజయానికి బాటలు వేసుకునే యత్నం చేశారు. అయితే 124 పరుగుల వద్ద ఆమ్లా(52) రెండో వికెట్‌గా అవుటైన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆపై డివిలియర్స్(6), డు ప్లెసిస్(2), డీ కాక్(0), ఫిలాండర్(10), పెహ్లకోవాయా(0), రబడా(0), మోర్నీ మోర్కెల్(0) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ప్రధానంగా 37 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు సాధించిన భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సఫారీలపై సిరీస్‌ను వైట్‌వాష్ కాకుండా కాపాడుకున్న విరాట్ సేన పరువు నిలుపుకుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 187 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 247 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 194 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 177 ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment