క్లీన్‌స్వీప్‌ వేటలో... | India vs South Africa 3rd Test in Ranchi | Sakshi
Sakshi News home page

క్లీన్‌స్వీప్‌ వేటలో...

Published Sat, Oct 19 2019 3:03 AM | Last Updated on Sat, Oct 19 2019 5:05 AM

India vs South Africa 3rd Test in Ranchi - Sakshi

నాలుగేళ్ల క్రితం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 3–0తో సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. నాడు పలువురు స్టార్‌ ఆటగాళ్లతో కూడిన సఫారీ టీమ్‌ కూడా టీమిండియా ముందు చేతులెత్తేసింది. ఇప్పుడు అంతంత మాత్రం అనుభవం ఉన్న ప్రత్యర్థిని పడగొట్టడంలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు.

కోహ్లి నాయకత్వంలో జోరు మీదున్న జట్టు ఇప్పటికే సిరీస్‌ సొంతం చేసుకుంది. ఇక మరో మ్యాచ్‌ కూడా గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయడంతో పాటు టెస్టు ఛాంపియన్ షిప్ లో మరో 40 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని భారత్‌ పట్టుదలగా ఉంది. మరోవైపు భారీ పరాజయాలతో మానసికంగా కుంగిపోయిన డు ప్లెసిస్‌ బృందం ఇక్కడైనా కాస్త మెరుగ్గా ఆడి ఓటమి నుంచి
తప్పించుకోగలదా చూడాలి. 
 

రాంచీ: స్వదేశంలో తిరుగులేని ఆటతో చెలరేగుతున్న భారత్‌... దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో చివరి సమరానికి సిద్ధమైంది. నేటి నుంచి ఇరు జట్ల మధ్య ఇక్కడ మూడో టెస్టు జరుగుతుంది. భారత్‌ ఇప్పటికే 2–0తో సిరీస్‌ సాధించినా... ప్రపంచ టెస్టుఛాంపియన్ షిప్ పాయింట్లు అందుబాటులో ఉండటంతో ఎలాంటి ఉదాసీనతకు తావివ్వకుండా మరో విజయం సాధించాలని భావిస్తోంది. టీమ్‌ ప్రస్తుతం ఉన్న స్థితిలో అది కష్టం కూడా కాకపోవచ్చు. గెలుపు సంగతి తర్వాత కనీసం ‘డ్రా’ చేసుకోగలిగినా అదే గొప్ప విజయంగా భావించే స్థితిలో దక్షిణాఫ్రికా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఐదు రోజులు సాగుతుందా, లేక పుణే తరహాలో ముందే ముగుస్తుందా అనేది ఆసక్తికరం.

కుల్దీప్‌ స్థానంలో నదీమ్‌
తొలి రెండు టెస్టుల్లో భారత్‌ ప్రదర్శన చూసిన తర్వాత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం సాధారణంగా ఉండదు. అయితే పుణే పిచ్‌ పేస్‌కు పనికొస్తుందనే అంచనాతో భారత్‌ ముగ్గురు పేస్‌ బౌలర్లతో బరిలోకి దిగింది. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ముగ్గురిలో ఒకరిని తప్పించి ఒక స్పిన్నర్‌కు చోటిచ్చే అవకాశాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోంది. అప్పుడు ఉమేశ్‌ లేదా ఇషాంత్‌లలో ఒకరు పెవిలియన్‌కే పరిమితం అవుతారు. రెండు రోజుల ప్రాక్టీస్‌ సెషన్‌ తర్వాత చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు స్థానం లభించవచ్చని అనిపించింది. అయితే అనూహ్యంగా అతను శుక్రవారం భుజం నొప్పితో దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన షాబాజ్‌ నదీమ్‌ అరంగేట్రం చేస్తాడా అనేది చెప్పలేం.దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ పెద్ద సంఖ్యలో వికెట్లు పడగొడుతున్నా ఇప్పటి వరకు నదీమ్‌కు భారత జట్టు తరఫున ఆడే అవకాశం రాలేదు.

ఏడాది క్రితం స్వదేశంలో వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. 15 ఏళ్ల సుదీర్ఘ ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 110 మ్యాచ్‌లు ఆడిన 30 ఏళ్ల నదీమ్‌... 28.59 సగటుతో 424 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్, మయాంక్‌ చెలరేగిపోతుండగా మూడో స్థానంలో పుజారా కూడా సత్తా చాటాడు. డబుల్‌ సెంచరీతో కోహ్లి తన విలువను ప్రదర్శించగా రహానే తనదైన శైలిలో రాణించాడు. ఇక్కడ ఆడిన గత టెస్టులో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన కీపర్‌ సాహా మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌ ఆడాలని భావిస్తున్నాడు. జడేజా, అశి్వన్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యం జట్టుకు పెద్ద బలం.

రక్షించేదెవరు?
వైజాగ్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దాదాపు భారత్‌తో సమానంగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయి ఓటమి పాలైంది. పుణేకు వచ్చేసరికి మరింత పేలవ ప్రదర్శన కనబర్చింది. ఒకవైపు బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతుండగా... దక్షిణాఫ్రికా తరహా పిచ్‌లాగే కనిపించిందంటూ చెప్పుకున్న పుణేలో కూడా ఆ జట్టు పేసర్లు ప్రభావం చూపలేకపోయారు. ఇది ఆ జట్టు సమష్టి వైఫల్యానికి నిదర్శనం. స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్, ఓపెనర్‌ మార్క్‌రమ్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు.

విశాఖ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ చితక్కొట్టిన ఆఫ్‌ స్పిన్నర్‌ డేన్‌ పీట్‌ మళ్లీ టీమ్‌లోకి రానున్నాడు. బ్యాట్స్‌మన్‌గా జుబేర్‌ హమ్జాకు చోటు దక్కవచ్చు. హమ్జాకు ఒకే ఒక టెస్టు ఆడిన అనుభవం ఉంది. ఇతర బ్యాట్స్‌మెన్‌ బవుమా, డిబ్రూయిన్‌ కూడా ఏమాత్రం రాణించలేదు.   కెపె్టన్‌ డు ప్లెసిస్‌ కొంత పోరాటపటిమ కనబర్చినా జట్టును రక్షించడానికి అది సరిపోలేదు. కాబట్టి సఫారీలు కొంతైనా పోటీ ఇవ్వాలంటే కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ పట్టుదలగా నిలబడి భారీ స్కోర్లు చేయాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో రబడ, ఫిలాండర్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు.

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, రవీంద్ర జడేజా, అశ్విన్, షమీ, ఉమేశ్, నదీమ్‌/ఇషాంత్‌.
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్‌ (కెప్టెన్), ఎల్గర్, హమ్జా, డిబ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, ముత్తుసామి, రబడ, పీట్, ఇన్‌గిడి.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. చివర్లో కొంత స్పిన్‌కు స్పందించే అవకాశం ఉన్నా మరీ ఇబ్బందికరం కాదు. 2015లో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టులో కూడా పరుగుల వరద పారింది. గత మూడు రోజులుగా రాంచీలో వాన కురవలేదు. అయితే మ్యాచ్‌ జరిగేటప్పుడు ఏదో ఒక సమయంలో వర్షం కొంత సేపు అంతరాయం కలిగించవచ్చని సూచన.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement