వన్డేల్లో ఓపెనర్‌గా మారిన తర్వాత తన విశ్వరూప ప్రదర్శన కనబర్చిన రోహిత్ శర్మ ఇప్పుడు టెస్టుల్లోనూ ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటున్నాడు. మరోసారి తనదైన శైలిలో చెలరేగిన అతను రాంచీ టెస్టులోనూ సెంచరీతో మెరిశాడు. గావస్కర్ తర్వాత ఒకే సిరీస్‌లో మూడు శతకాలు బాదిన రెండో భారత ఓపెనర్‌గా నిలిచాడు.
అతనికి అండగా నిలిచిన రహానే కూడా వంద పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. ఫలితంగా మూడో టెస్టులోనూ మనదే శుభారంభం. మ్యాచ్ ఆరంభంలో పిచ్‌ను ఉపయోగించుకొని దక్షిణాఫ్రికా పేసర్లు భారత్‌ను 39/3కే కట్టడి చేసినా... రహానే, రోహిత్ భాగస్వామ్యం టీమిండియాను నడిపించింది. దాంతో సఫారీలకు మళ్లీ నిరాశ తప్పలేదు.
రాంచీ: దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టుల తరహాలోనే మూడో మ్యాచ్‌లోనూ తొలి రోజు భారత్ పట్టు నిలబెట్టుకుంది. శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 58 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (164 బంతుల్లో 117 బ్యాటింగ్; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించగా, అజింక్య రహానే (135 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఇప్పటికే నాలుగో వికెట్‌కు అభేద్యంగా 185 పరుగులు జోడించారు. వర్షం, వెలుతురు లేమి కారణంగా టీ విరామం తర్వాత కొద్ది సేపటికే అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో మరో 32 ఓవర్ల ఆటను కోల్పోవాల్సి వచి్చంది.
దక్షిణాఫ్రికా జోరు...
సిరీస్‌లో తొలిసారి భారత్‌పై దక్షిణాఫ్రికా జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. 16 ఓవర్ల లోపే 3 వికెట్లు తీసి దెబ్బ తీసింది. రబడ అద్భుతమైన బంతులతో చెలరేగగా, ఇన్‌గిడి కూడా టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. ఇదే జోరులో రబడ వేసిన బంతిని స్లిప్‌లోకి ఆడి మయాంక్ (10) వెనుదిరిగాడు. కొద్ది సేపటికి పుజారా (0)ను రబడ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా, దక్షిణాఫ్రికా రివ్యూ కోరి ఫలితం సాధించింది. నోర్జే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన కోహ్లి (12) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. నోర్జే బౌలింగ్‌లోనే అతను ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కోహ్లి రివ్యూ చేసినా లాభం లేకపోయింది.
సూపర్ ఇన్నింగ్స్...
వన్డేల తరహాలోనే రోహిత్ తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను ప్రదర్శించాడు. ఆరంభంలో నిలదొక్కుకునే క్రమంలో అతను చాలా జాగ్రత్తగా ఆడాడు. పేసర్లకు పిచ్ సహకరిస్తుండటం, రబడ బంతిని చక్కగా స్వింగ్ చేస్తుండటంతో రోహిత్ ఎంతో పట్టుదల ప్రదర్శించాల్సి వచి్చంది. 7 పరుగుల వద్ద రబడ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీగా అవుట్ ఇచ్చినా... రివ్యూలో బ్యాట్‌కు బంతి తగిలినట్లు తేలడంతో రోహిత్ బతికిపోయాడు. 11 పరుగుల వద్ద కోహ్లితో సమన్వయ లోపంతో రనౌట్ ప్రమాదంలో పడినా, హమ్జా త్రో నేరుగా వికెట్లకు తాకకపోవడంతో అతనికి మరో అవకాశం దొరికింది. తొలి టెస్టు ఆడుతున్న లిండే తొలి ఓవర్లో రోహిత్ ఇచి్చన కష్టసాధ్యమైన క్యాచ్‌ను షార్ట్‌లెగ్‌లో హమ్జా వదిలేశాడు.
ఆ సమయంలో అతని స్కోరు 28. వీటన్నింటిని దాటుకుంటూ కొన్ని చక్కటి షాట్లు ఆడి 86 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ వరకు ఓపిగ్గా ఆడిన రోహిత్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. ఒకదశలో ఎనిమిది బంతుల వ్యవధిలో నాలుగు బౌండరీలు బాదాడు. పీట్ వేసిన వరుస ఓవర్లో ఒక్కో సిక్సర్ బాది 90ల్లోకి చేరుకున్న అతను, లాంగాఫ్ మీదుగా మరో భారీ సిక్సర్ బాది 130 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత శతకం అందుకునేందుకు రోహిత్‌కు 44 బంతులు మాత్రమే పట్టడం విశేషం. అతని కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ.
రహానే దూకుడు...
చాలా కాలం తర్వాత రహానే చూడచక్కని, దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. రబడపై అతను ఎదురు దాడి చేసిన తీరు 2014 మెల్‌బోర్న్ టెస్టును (జాన్సన్ బౌలింగ్‌లో) గుర్తుకు తెచి్చంది. లంచ్ తర్వాత రబడ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రహానే బౌలర్ లయను దెబ్బ తీశాడు. ఆ తర్వాత రబడ మరో ఓవర్లో కూడా రెండు బౌండరీలు బాదాడు. మరో పేసర్ నోర్జేను కూడా అతను వదల్లేదు. ఇదే ఊపులో 70 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయింది. రహానే కెరీర్‌లో ఇది 21వ హాఫ్ సెంచరీ కాగా... స్వదేశంలో రహానే ఇంత వేగంగా ఎప్పుడూ అర్ధ సెంచరీ చేయలేదు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) ఎల్గర్ (బి) రబడ 10; రోహిత్ (బ్యాటింగ్) 117; పుజారా (ఎల్బీ) (బి) రబడ 0; కోహ్లి (ఎల్బీ) (బి) నోర్జే 12; రహానే (బ్యాటింగ్) 83; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (58 ఓవర్లలో 3 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–12, 2–16, 3–39. బౌలింగ్: రబడ 14–5–54–2, ఇన్‌గిడి 11–4–36–0, నోర్జే 16–3–50–1, లిండే 11–1–40–0, పీట్ 6–0–43–0.
► ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ ఘనత వహించాడు. ఈ సిరీస్‌లో రోహిత్ 17 సిక్స్‌లు కొట్టాడు. హెట్‌మైర్ (వెస్టిండీస్–2018–19 సిరీస్‌లో బంగ్లాదేశ్‌పై 15 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
►దక్షిణాఫ్రికాపై ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటి వరకు రోహిత్ 434 పరుగులు చేశాడు. అజహరుద్దీన్ (1996–97 సిరీస్‌లో 388 పరుగులు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు.
►టెస్టుల్లో అరంగేట్రం చేసిన 296వ భారత క్రికెటర్‌గా జార్ఖండ్ ప్లేయర్ షాబాజ్ నదీమ్ గుర్తింపు పొందాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ కోహ్లి చేతుల మీదుగా నదీమ్ క్యాప్‌ను అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment