రోహిత్‌ డబుల్‌ సఫారీ ట్రబుల్‌ | Rohit Sharma Double Century Against South Africa | Sakshi
Sakshi News home page

రోహిత్‌ డబుల్‌ సఫారీ ట్రబుల్‌

Published Mon, Oct 21 2019 2:42 AM | Last Updated on Mon, Oct 21 2019 6:40 PM

Rohit Sharma Double Century Against South Africa - Sakshi

రాంచీ టెస్టులో భారత్‌కు రెండో రోజే పట్టు లభించింది. తొలి రోజు సెంచరీని డబుల్‌ సెంచరీగా మలచి రోహిత్‌ పలు రికార్డులను కొల్లగొట్టగా, రహానే ఖాతాలో కూడా శతకం చేరింది. జడేజా, ఉమేశ్‌ కూడా తలా ఓ చేయి వేయడంతో భారీ స్కోరుతో భారత్‌ చెలరేగింది. ఆదివారం ఏకంగా 4.67 రన్‌రేట్‌తో భారత్‌ పరుగులు సాధించడం విశేషం. అనంతరం వేసిన ఐదు ఓవర్లలోనే దక్షిణాఫ్రికాను టీమిండియా ఒక ఆటాడుకుంది. 9 పరుగులకే ఓపెనర్లను వెనక్కి పంపి రాబోయే ప్రమాదానికి సంకేతాలు పంపింది. అప్పుడే పొడిబారిన పిచ్‌పై బంతి అష్టవంకర్లు తిరుగుతుండటంతో తడబడుతున్న సఫారీలు ఎంత వరకు నిలబడగలరో చూడాలి. మొదటి రోజులాగే ఆదివారం కూడా వెలుతురులేమి సమస్యగా మారడంతో 63.3 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. 

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ జోరు కొనసాగుతోంది. మ్యాచ్‌ రెండో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జుబేర్‌ హమ్జా (0 బ్యాటింగ్‌), డు ప్లెసిస్‌ (1 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 497 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (255 బంతుల్లో 212; 28 ఫోర్లు, 6 సిక్సర్లు) టెస్టు కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ నమోదు చేయగా.... అజింక్య రహానే (192 బంతుల్లో 115; 17 ఫోర్లు, 1 సిక్స్‌) శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 267 పరుగులు జోడించారు. రవీంద్ర జడేజా (119 బంతుల్లో 51; 4 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీ సాధించాడు. సఫారీ బౌలర్లలో లిండేకు 4 వికెట్లు దక్కాయి.  

రోహిత్‌ అదే జోరు...
ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 117తో బ్యాటింగ్‌ కొనసాగించిన రోహిత్‌ శర్మ రెండో రోజు కూడా చక్కటి షాట్లతో అలరించాడు. సఫారీ పేసర్లు అతనిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇన్‌గిడి వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను 199 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత అతను మరింత వేగంగా ద్విశతకం దిశగా దూసుకుపోయాడు. 179 పరుగుల వద్ద పీట్‌ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా చేసిన ఎల్బీ అప్పీల్‌ను అంపైర్‌ తిరస్కరించాడు.

డు ప్లెసిస్‌ రివ్యూ చేసినా ఫలితం ప్రతికూలంగా రావడంతో రోహిత్‌కు మరో అవకాశం దక్కింది. నోర్జే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో 190ల్లోకి చేరుకున్న ‘ముంబైకర్‌’ లంచ్‌ సమయానికి 199 వద్ద నిలిచాడు. విరామం తర్వాత పీట్‌ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికి భారీ సిక్సర్‌ బాదడంతో రోహిత్‌ డబుల్‌ సెంచరీ పూర్తయింది. అదే ఓవర్లో అతను మరో సిక్స్‌ కొట్టాడు. అయితే మరో నాలుగు బంతుల తర్వాత ఈ అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది. రబడ బంతిని హుక్‌ షాట్‌ ఆడబోయిన రోహిత్‌ ఫైన్‌ లెగ్‌ బౌండరీ వద్ద క్యాచ్‌ ఇచ్చాడు.  

రాణించిన జడేజా...
తొలి రోజు 83 పరుగులతో అజేయంగా నిలిచిన రహానేకు ఆదివారం సెంచరీ చేరుకోవడానికి  ఎక్కువసేపు పట్టలేదు. ముగ్గురు పేసర్ల ఓవర్లలో ఒక్కో ఫోర్‌ కొట్టిన అతను ఆ తర్వాత నోర్జే బౌలింగ్‌లో కవర్‌ పాయింట్‌ దిశగా సింగిల్‌ తీసి 169 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2016 తర్వాత స్వదేశంలో రహానే సెంచరీ చేయడం ఇదే తొలిసారి. శతకం సాధించిన కొద్ది సేపటికే లిండే బౌలింగ్‌లో కీపర్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానే పెవిలియన్‌ చేరాడు.
.
లిండేకు ఇది తొలి టెస్టు వికెట్‌ కాగా, క్లాసెన్‌కు తొలి క్యాచ్‌. మరోసారి ఆరో స్థానానికి ప్రమోట్‌ అయిన జడేజా తనదైన శైలిలో చకచకా పరుగులు సాధించాడు. సాహా (24)తో కలిసి ఆరో వికెట్‌కు 47 పరుగులు, అశి్వన్‌ (14)తో ఏడో వికెట్‌కు అతను 33 పరుగులు జోడించాడు. 118 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా ఎప్పటిలాగే ‘కత్తి సాము’ సంబరాలు చేసుకున్నాడు. అయితే తర్వాతి బంతికే అతను వెనుదిరిగాడు.  

దక్షిణాఫ్రికాకు సంకటం...
ప్రత్యర్థి భారీ స్కోరు ఎదురుగా కనిపిస్తుండగా ఈసారైనా కొంత మెరుగైన ప్రదర్శన కనబర్చాలని బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రాత ఏమీ మారలేదు. వెలుతురులేమితో ఆట ఆగిపోవడానికి ముందు సాగిన ఐదు ఓవర్లలోనే జట్టు బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఎల్గర్‌ (0)ను షమీ అవుట్‌ చేయగా, ఉమేశ్‌ వేసిన తర్వాతి ఓవర్లో డి కాక్‌ (4) వెనుదిరిగాడు. తొలి టెస్టు ఆడుతున్న నదీమ్‌ రెండు ఓవర్లు కూడా మెయిడిన్‌గా వేయగా... హమ్జా, డు ప్లెసిస్‌ కలిసి తడబడుతూ 22 బంతుల్లో ఒక పరుగు చేసి ఎలాగో ఆట ముగించగలిగారు.

రికార్డుల వరద...
ఆదివారం వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన రోజు... తాజా సిరీస్‌లో రోహిత్‌ శర్మ తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పుడు బ్యాటింగ్‌ శైలి, దూకుడులో వీరూతో పోలికలు మొదలయ్యాయి. భవిష్యత్‌ సంగతేమో కానీ ప్రస్తుతానికి మాత్రం రోహిత్‌ తన సీనియర్‌ను మరపించాడు. రాంచీ టెస్టులో సిక్సర్‌తో డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నప్పుడైతే సరిగ్గా అందరికీ సెహ్వాగే గుర్తుకొచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీ మార్క్‌ను కూడా సిక్సర్‌తోనే అందుకున్నాడు. తాజా డబుల్‌తో రోహిత్‌ అనేక చెప్పుకోదగ్గ ఘనతలు నమోదు చేశాడు.

►4సచిన్, సెహ్వాగ్, క్రిస్‌ గేల్‌ తర్వాత టెస్టులు, వన్డేల్లోనూ డబుల్‌ సెంచరీ సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్‌ రోహిత్‌.

►1ఒకే సిరీస్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌ డబుల్‌ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. వైజాగ్‌లో మయాంక్, పుణేలో కోహ్లి ద్విశతకాలు సాధించారు. అయితే 1955–56లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు డబుల్‌ సెంచరీలు నమోదైనా...వీటిలో రెండు వినూ మన్కడ్‌ చేయగా, మరొకటి పాలీ ఉమ్రీగర్‌ సాధించాడు.  

►99.84స్వదేశంలో రోహిత్‌ బ్యాటింగ్‌ సగటు. 18 ఇన్నింగ్స్‌లలో అతను 6 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో 1298 పరుగులు చేశాడు. సొంతగడ్డపై కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్‌              సగటుల జాబితా తీసుకుంటే ఆ్రస్టేలియా దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ (98.22)కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.

►529ఈ సిరీస్‌లో రోహిత్‌ చేసిన పరుగులు. గావస్కర్‌ (3 సార్లు), సెహ్వాగ్, వినూ మన్కడ్, బుద్ది కుందేరన్‌ తర్వాత ఒకే సిరీస్‌లో 500కు పైగా పరుగులు చేసిన ఐదో భారత ఓపెనర్‌ రోహిత్‌. అయితే 3 టెస్టుల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లి (610), సెహా్వగ్‌ (544), గంగూలీ (534) తర్వాత రోహిత్‌ నాలుగో స్థానంలో నిలవగా, వీవీఎస్‌ లక్ష్మణ్‌ (503) ఐదో స్థానంలో ఉన్నాడు.

ఉమేశ్‌ మెరుపులు...
6, 6, 0, 1, 6, 0, 6, 0, 6, అవుట్‌... ఉమేశ్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ జోరు ఇది. 10 బంతులు ఆడిన అతను ఏకంగా 31 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్సర్లు ఉన్నాయి. లిండే వేసిన తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాదిన అతను పీట్‌ ఓవర్లో సింగిల్‌ తీశాడు. లిండే తర్వాతి ఓవర్లోనే మిగతా మూడు సిక్స్‌లు కొట్టిన ఉమేశ్‌... అదే ఓవర్‌ చివరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అవుటయ్యాడు. ఇది ఉమేశ్‌కు టెస్టుల్లో అత్యధిక స్కోరు.  

‘లేదంటే ఏదో జరిగిపోయేది’
ఓపెనర్‌గా ఆడటం నాకు దక్కిన మంచి అవకాశం. దానిని సమర్థంగా వాడుకోవడం నాకు ఎంతో అవసరం. లేదంటే ఏదో జరిగిపోయేదే.ఆ విషయం నాకు తెలుసు. నా గురించి మీడియా మొత్తం ఎంతో రాసి పడేసేది. ఇప్పుడు నాలుగు మంచి మాటలే రాయగలరు. బ్యాటింగ్‌ చేసేటప్పుడు మనకు రికార్డుల గురించి తెలియదు. అయితే భవిష్యత్తులో నేను ఆడటం ఆపేసిన తర్వాత ఈ రికార్డుల గురించి తెలుసుకుంటా.

‘ఓపెనర్‌గా మూడు టెస్టులే ఆడాను. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల గురించి అతిగా ఆలోచించడం లేదు. విదేశాల్లో ఓపెనింగ్‌ చేసినా ఆట మూలసూత్రాలు ఒక్కటే. ఏ బంతిని ఆడాలి, దేనిని వదిలేయాలో అర్థం చేసుకోవాలి. విదేశీ సిరీస్‌లు నాకు పెద్ద సవాల్‌లాంటివని తెలుసు. దాని కోసం సిద్ధంగా ఉన్నా’             
–రోహిత్‌ శర్మ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement