శుభారంభం... శుభసూచకం... స్థానం మారితేనేమి సత్తా ఉంటే ఎక్కడైనా చెలరేగిపోగలనని రోహిత్ శర్మ నిరూపించాడు. పడుతూ లేస్తూ సాగిన ఆరేళ్ల టెస్టు కెరీర్‌లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు వచి్చన అవకాశాన్ని ‘హిట్‌మ్యాన్’ రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. అచ్చం వన్డే శైలిలోనే అలవోకగా పరుగులు సాధించిన అతను తనకే సాధ్యమైన రీతిలో చూడచక్కటి క్లాసిక్ షాట్‌లతో సెంచరీ సాధించి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు.
రోహిత్‌కు మయాంక్ అమూల్య ప్రదర్శన తోడవడంతో తొలి టెస్టులో మొదటి రోజే భారత్‌కు పట్టు లభించింది. భయపెడుతూ వచ్చిన వాన చివరకు ఆటకు అడ్డుగా నిలవడంతో ఆఖరి సెషన్‌లో ఆట సాధ్యం కాలేదు. లేదంటే మరింత భారీ స్కోరుకు అవకాశం ఉండేది. టాస్ ఓడిపోవడంతోనే దిగాలుగా ముఖం పెట్టిన దక్షిణాఫ్రికా కెపె్టన్ డు ప్లెసిస్ మానసిక స్థితి ఆ తర్వాత రోజంతా ప్రతిఫలించింది. సిరీస్‌లో రాబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో అతనికి చూపించింది.
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సొంతగడ్డపై రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయించాలనుకున్న టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయోగం సఫలమైంది. అనుకూల స్థితిలో, ఆకట్టుకునే ఆటతో అతను భారత్‌కు దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో శుభారంభం అందించాడు. ఇక్కడ వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఓపెనర్లు చెలరేగడంతో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (174 బంతుల్లో 115 బ్యాటింగ్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ (183 బంతుల్లో 84 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా క్రీజ్‌లో ఉన్నారు. 59.1 ఓవర్లు శ్రమించినా దక్షిణాఫ్రికా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.
ఆడుతూ పాడుతూ...
మొదటిసారి జత కట్టిన ఓపెనర్లు మయాంక్, రోహిత్ చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి రెండు ఓవర్లలో చెరో ఫోర్ కొట్టి ప్రత్యర్థి ప్రధాన బౌలర్లపై చెలరేగేందుకు సిద్ధమని చూపించారు. ఇదే జోరు ఆ తర్వాత తొలి రోజు మొత్తం కొనసాగింది. ఈ క్రమంలో ఒకటి, రెండు సార్లు ఉత్కంఠభరిత క్షణాలు ఎదుర్కొన్నా దాని వల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదు. వీరిద్దరి సాధికారిక బ్యాటింగ్ ముందుకు సఫారీ బౌలర్లు చేతులెత్తేశారు. టెస్టులో రోహిత్ శర్మపైనే అందరి దృష్టీ నిలవగా... మరో ఎండ్‌లో మయాంక్ కొన్ని చూడచక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. లంచ్‌కు ఒక ఓవర్ ముందు రోహిత్ అర్ధసెంచరీ పూర్తయంది.
పెరిగిన దూకుడు...
రెండో సెషన్‌లోనైతే భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో చూడముచ్చటైన ఇన్‌సైడ్ అవుట్ సిక్సర్‌తో మయాంక్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత పీట్ ఓవర్లో మయాంక్ రెండు ఫోర్లు బాదడంతో భాగస్వామ్యం 150 పరుగులు దాటింది. కొద్ది సేపటికే రోహిత్ శతకం పూర్తయింది. ఆ తర్వాత కూడా ఇద్దరు బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడటంతో ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయి ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. చివరకు వర్షం వారికి కాస్త తెరిపినిచి్చంది. దక్షిణాఫ్రికా ప్రధాన స్పిన్నర్ కేశవ్ ఒక్కడే 23 ఓవర్లు వేసి భారం మోసినా ఫలితం దక్కకపోగా... రెండో స్పిన్నర్ పీట్ భారత బ్యాటింగ్ దెబ్బకు కుదేలయ్యాడు.
30.5 ఓవర్లు పోయాయి...
మ్యాచ్ ప్రారంభమైన సమయంలో ఎలాంటి వర్షసూచన కనిపించలేదు. మంచి ఎండ కాయడంతో ఆట సజావుగా సాగింది. రెండో సెషన్ చివరకు వచ్చేసరికి ఒక్కసారిగా మబ్బులు పట్టి పరిస్థితి మారిపోయింది. క్షణాల వ్యవధిలోనే చీకట్లు అలముకోవడంతో మధ్యాహ్యం 2 గంటలకే ఫ్లడ్‌లైట్లు వేశారు. అయితే అదీ ఎక్కువ సేపు సాగలేదు. రెండో సెషన్ చివరి ఓవర్ (30వ)లో ఫిలాండర్ ఒక బంతి వేయగానే చినుకులు మొదలయ్యాయి. దాంతో ఐదు నిమిషాలు ముందుగా టీ విరామం ప్రకటించారు. కానీ ఆ తర్వాత వాన జోరు పెరగడంతో ఆటగాళ్లు మళ్లీ మైదానంలోకి రావాల్సిన అవసరం లేకుండా ఆట రద్దయింది. మొత్తం 59.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
ముత్తుసామి అరంగేట్రం...
దక్షిణాఫ్రికా తరఫున ఈ మ్యాచ్‌తో స్పిన్ ఆల్‌రౌండర్ సెనురన్ ముత్తుసామి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. డర్బన్‌లో ఉండే ముత్తుసామి పూర్వీకులు తమిళనాడులోని చెన్నైకి చెందినవారు. తమ ఇంట్లో దక్షిణ భారత సాంప్రదాయాలు పాటిస్తారని అతనే స్వయంగా చెప్పుకున్నాడు. వారి బంధువులు ఇప్పటికీ కొందరు నాగపట్టణంలో ఉన్నారు. భారతీయులు ఎక్కువగా ఉన్న డర్బన్‌లో తాము గుళ్లూ గోపురాలకు వెళుతుంటామని, ఇంట్లో యోగా చేయడం కూడా రొటీన్‌లో భాగమని ముత్తుసామి అన్నాడు. భారత పర్యటనకు ఎంపికైనప్పుడు తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారని, ఇది ప్రత్యేకమైన పర్యటన అని అతను వ్యాఖ్యానించాడు. జట్టులోని మరో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా భారత మూలాలు ఉన్నవాడే.
నా ఆటకు ఓపెనింగ్ సరిపోతుంది. ఎంచక్కా ప్యాడ్లు కట్టుకొని ఇన్నింగ్స్ ఆరంభించవచ్చు. అదే ఐదు లేదంటే ఆరో వరుసలో బ్యాటింగ్‌కు దిగడానికి నిరీక్షించాల్సి ఉంటుంది. అలాగని అక్కడ బ్యాటింగ్ చేయలేనని కాదు... ఓపెనింగ్‌లో అయితే తాజాగా కొత్తబంతిపై బాగా ఆడొచ్చు. బౌలింగ్ ఎవరు చేస్తారో కూడా తెలుస్తుంది. ఆ బౌలర్‌కు సర్దే ఫీల్డింగ్ మీదా అవగాహన ఉంటుంది. కాబట్టి గేమ్‌ప్లాన్ సులభంగా అర్థమవుతుంది. రెడ్‌బాల్ క్రికెట్‌లో ఓపెనింగ్ భిన్నమైందే. అయినప్పటికీ మానసికంగా సిద్ధమై, సాంకేతికంగా పరిణతి సాధించాలి. రెండేళ్లక్రితమే టెస్టుల్లో నా ఓపెనింగ్‌పై చర్చ జరిగింది. గత వెస్టిండీస్ పర్యటనలో నాకు స్పష్టంగా చెప్పారు కూడా! దీంతో నేను అన్ని రకాలుగా సిద్ధమయ్యాను.
– రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment