విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన ఐదో ఆటగాడు... రంజీ ట్రోఫీ ఫైనల్లో సచిన్ తర్వాత రెండు సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు... ఇలాంటివేవీ సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ కెరీర్‌కు కావాల్సిన ఊపునివ్వలేకపోయాయి. బలహీనమైన బ్యాటింగ్ టెక్నిక్ కారణంగా రోహిత్ టెస్టు కెరీర్ ఎప్పుడూ సాఫీగా సాగలేదు. 27 టెస్టుల్లో 3 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు చెప్పుకోదగ్గ ఘనత కాదు. టెస్టుల్లో గుర్తుంచుకోదగ్గ, విలువైన ఇన్నింగ్స్ ఏదీ అతను ఆడలేదు. ‘నా కెరీర్ ఇప్పటికే సగం ముగిసింది. మిగిలిన సమయంలో నేను ఎంపికవుతానా, లేదా అంటూ ఆలోచిస్తూ కూర్చోలేను. ఇప్పుడు ఆ దశ దాటిపోయాను. నేను చేయగలిగిందే చేస్తాను’ అని గత ఏడాది టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు 32 ఏళ్ల వయసులో అతనికి కొత్త పాత్రలో, కొత్త అవకాశం లభించింది. ప్రస్తుతానికైతే అతను దీనిని సమర్థంగా వాడుకున్నాడు.
రోహిత్ శర్మ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో మూడుసార్లు ఓపెనింగ్ చేశాడు. అయితే ఆ మూడు మ్యాచుల్లోనూ చివరి రోజు ఆట, అప్పటికే ఫలితం ‘డ్రా’గా తేలిపోయిన సమయంలో చేసిన ఓపెనింగ్‌లే. ఈ నేపథ్యంలో విశాఖ మ్యాచ్ అతని కెరీర్‌కు కీలకంగా మారింది. ఇప్పటికే పలు కారణాలతో అతను జట్టులో స్థిరంగా లేడు. 2016 నుంచి రోహిత్ టెస్టు బ్యాటింగ్ సగటు 53గా ఉంది. అయినా సరే భారత్ ఆడిన గత 40 టెస్టుల్లో అతను 11 మాత్రమే ఆడగలిగాడు. ఇక స్వదేశంలో ఓపెనర్‌గానూ విఫలమైతే అతని కెరీర్ ముగిసిపోయేదే. కానీ అతను పట్టుదలగా, తనను తాను నిరూపించుకోవాలని నిలబడ్డాడు. ఇందుకోసం తనకు సుపరిచితమైన షాట్లనే అతను నమ్ముకున్నాడు. కానీ డిఫెన్స్ విషయంలో జాగ్రత్త పడ్డాడు. బ్యాక్‌ఫుట్‌పై డ్రైవ్ చేయడం, స్పిన్నర్లపై ఎదురు దాడి, కాస్త నిలదొక్కుకోగానే ముందుకు దూసుకొచ్చి భారీ షాట్లు ఆడటం అలాంటివే. రబడ బౌలింగ్‌లో తన రెండో బంతికే బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా కొట్టిన చూడచక్కటి డ్రైవ్‌తో రోహిత్ ఆట మొదలైంది.
ఆ తర్వాత మహరాజ్, పీట్ బౌలింగ్‌లో కొట్టిన సిక్సర్లు అభిమానులను అలరించాయి. అర్ధసెంచరీ దాటిన తర్వాత అతని బ్యాట్‌నుంచి మరికొన్ని చూడచక్కటి షాట్లు జాలువారాయి. తనదైన శైలిలో పుల్ షాట్‌లు కొట్టిన తీరు ఆకర్షణీయంగా అనిపించింది. పీట్ వేసిన ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదడంతో 90ల్లోకి చేరుకున్న రోహిత్‌కు శతకం చేరేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ముత్తుసామి ఓవర్లో సింగిల్‌తో 154 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. వన్డేలు, టి20ల లాగే రోహిత్ జోరును ఆపడం సఫారీ బౌలర్ల వల్ల కాలేదు.రోహిత్ ఇన్నింగ్స్ చూడగానే ఠక్కున చాలా మందికి సెహా్వగ్ గుర్తుకు రావడం సహజం. మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా మారి అనేక విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన సెహ్వాగ్‌తో ఈ దశలో పోలిక అనవసరం.
నిజానికి సెహ్వాగ్ తొలి బంతి నుంచే విరుచుకు పడేవాడు. అతని దృష్టిలో మంచి బంతులు అనేవే లేవు. బౌలర్ ఎవరైనా, 90ల్లో ఉన్నా దేన్నయినా బాదడమే అతని పని. కానీ రోహిత్ అలా చేయలేదు. ఓపెనర్‌గా తన వికెట్‌కు విలువ నిచ్చాడు. ఆరంభంలో ఫిలాండర్, రబడలాంటి బౌలర్లను గౌరవిస్తూ జాగ్రత్తగా ఆడాడు. నిలదొక్కుకున్న తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో కూడా నెమ్మదిగా ఆరంభించి స్పీడు పెంచే తత్వం రోహిత్‌ది. ఈ రకంగా చూస్తే సెహ్వాగ్‌తో పోలిక అక్కడే ముగిసిపోయింది. భారత్‌లో ఎవరైనా ఆడగలరు, విదేశాల్లో తెలుస్తుంది అంటూ విమర్శలు కూడా వస్తాయి కానీ ప్రస్తుతానికి రోహిత్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సెంచరీ రెండో రోజు ఎంత వరకు వెళుతుందనేది ఆసక్తికరం.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (బ్యాటింగ్) 84; రోహిత్ శర్మ (బ్యాటింగ్) 115; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (59.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 202. బౌలింగ్: ఫిలాండర్ 11.1–2–34–0, రబడ 13–5– 35–0, మహరాజ్ 23–4–66–0, పీట్ 7–1–43–0, ముత్తుసామి 5–0–23–0
►4 రోహిత్ టెస్టు కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ. ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్. ధావన్, పృథ్వీ షా తమ అరంగేట్రం టెస్టులోనే ఈ ఘనత సాధించారు.
►6 భారత్‌లో రోహిత్‌కు ఇది వరుసగా ఆరో 50+ స్కోరు. అతను వరుసగా 82, 51, 102, 65, 50, 115 స్కోర్లు నమోదు చేశాడు.
►1 ఓపెనర్‌గా వచ్చి మూడు ఫార్మాట్‌లలో (టి20, వన్డే, టెస్టు) సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ రోహిత్. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్. రోహిత్‌కంటే ముందు గేల్, బ్రెండన్ మెకల్లమ్, గప్టిల్, దిల్షాన్, అహ్మద్ షెహజాద్,వాట్సన్, తమీమ్ ఇక్బాల్ ఇలా చేశారు.
►22 టెస్టుల్లో కోహ్లి టాస్ గెలవడం ఇది 22వసారి. ఇందులో భారత్ 18 సార్లు గెలిచి, మూడుసార్లు ‘డ్రా’ చేసుకుంది.
►3 దక్షిణాఫ్రికాపై తొలి వికెట్‌కు భారత్‌కిది మూడో డబుల్ సెంచరీ భాగస్వామ్యం. గతంలో గంభీర్–సెహ్వాగ్ (218; కాన్పూర్‌లో 2004); సెహా్వగ్–వసీమ్ జాఫర్ (213; చెన్నైలో 2008) ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment